కర్నూలు, జూలై 31: రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ కాంగ్రెస్, యుపిఎ మిత్రపక్షాలు చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం సమైక్యవాదులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. సమైక్యవాదులు ఇచ్చిన బంద్ పిలుపుతో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులతో సహా అన్ని వ్యాపార కార్యకలాపాలు నిల్చిపోయాయి. జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వాహకులు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా, రహదారులపై రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. జిల్లా వ్యాప్తంగా 960 ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. ఆర్టీసీతోపాటు పలు కార్మిక సంఘాలు, ఎపి ఎన్జీవోలు సమైక్య ఉద్యమంలో పాల్గొనడంతో బంద్ సంపూర్ణంగాముగిసింది. జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారులపై బంద్ నిర్వాహకులు నిర్వహించిన ఆందోళన కారణంగా పెద్దఎత్తున ట్రాఫిక్ నిల్చిపోయింది. దీంతో ప్రయాణీలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. సమైక్యవాదులు కర్నూలులో తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నా చేశారు. కాగా ఆత్మకూరు పట్టణంలో బంద్ సందర్భంగా సమైక్యవాదులు మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతలోనే పోలీసులు రంగప్రవేశంచేసి ఆందోళనకారులను చెదరగొట్టడంతో సమస్య సద్దుమణిగింది. కర్నూలులోని మంత్రి టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇళ్ల ముందు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట సమైక్యవాదులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన అనేక సంఘాలు, విద్యార్థి, యువజన, కుల, ప్రజా సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతునివ్వడంతో తెల్లవారుజాము నుంచే బంద్ వాతావరణం కనిపించింది. ఆర్టీసీ కార్మికులు, న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. కాగా సమైక్యవాదులు ఇచ్చిన బంద్‌కు రాయలసీమ ప్రత్యేకవాదులు దూరంగా ఉన్నారు. బంద్ సందర్భంగా వైకాపా నాయకుడు ఎస్వీ మోహనరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని చీల్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి సోనియా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా రాష్ట్ర విభజనపై తీర్మానం చేశారని మండిపడ్డారు. రాష్టవ్రిభజనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చినలేఖ కూడా కారణమని ఆయన ఆరోపించారు. అంతాకలిసి తెలుగువారిని రెండుగా చీల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకోలేక పోయిన మంత్రులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేష్‌లు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్, యుపిఎ తీర్మానం చేసినా తెలంగాణేతర ప్రాంతాల అభివృద్ధికి ఒక్కమాట కూడా చెప్పకుండా సోనియా తెలుగు ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఎన్నికలకు ముందు రాజకీయ దురుద్ధేశ్యంతో చేసిన తీర్మానం ప్రజా సమ్మతం కాదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 1999లోనే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు దివంగత వైఎస్ ఆధ్వర్యంలో తీర్మానంచేసి పంపారని ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ కూడా చెప్తున్నారని వైకాపా నేతలు వాస్తవాన్ని దాచి అబద్దాలు ప్రచారంచేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బంద్ సందర్భంగా విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి స్థానిక రాజ్‌విహార్ కూడలిలో మానవ హారం నిర్మించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్టవ్రిభజన వల్ల విద్య, ఉద్యోగాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం చేసిన రాష్ట్ర విభజన తీర్మానం తక్షణం వెనక్కితీసుకోవాలని లేనిపక్షంలో ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
పంచాయితీల్లో పై‘చేయి’
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జూలై 31: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు సంపూర్తిగా వెలువడ్డాయి. తుది దశకు బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మద్దతుదారులు తమ ఆధిక్యతను చాటుకున్నారు. తుది దశలో ఆదోని డివిజన్ పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 105 పంచాయితీల్లో పాగా వేసింది. వైకాపా 84, టిడిపి 71, వామపక్షాలు, ఇతరులు కలిపి 37 స్థానాల్లో విజయకేతనం ఎగుర వేశారు. ఆదోని డివిజన్‌లో సిపిఎం, సిపిఐ మద్దతుదారులు తొమ్మిది పంచాయతీలు దక్కించుకోవడం విశేషం. మూడు దశల్లో జిల్లా వ్యాప్తంగా 883 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ 365 పంచాయతీల్లో విజయం సాధించగా ఆ తరువాతి స్థానం వైకాపా 262 స్థానాలతో నిల్చింది. మూడవ స్థానంలో తెలుగుదేశం పార్టీ నిలబడి 165 స్థానాలతో సరిపెట్టుకుంది. వామపక్ష పార్టీ మద్దతుదారులు, ఇతరులు 91 స్థానాల్లో విజయం సాధించారు. డివిజన్ల వారీగా పరిశీలిస్తే కర్నూలు రెవెన్యూ డివిజన్‌లో కాంగ్రెస్ మద్దతుదారులు 132, వైకాపా 80, టిడిపి 55, ఇతరులు 32 పంచాయితీలు దక్కించుకున్నారు. నంద్యాల డివిజన్‌లో కాంగ్రెస్ మద్దతుదారులు 128, వైకాపా 98, తెలుగుదేశం 39, ఇతరులు 22 స్థానాల్లో విజయం సాధించారు. ఇక ఆదోని డివిజన్‌లో కాంగ్రెస్ 105, వైకాపా 84, టిడిపి 71, ఇతరులు 37 పంచాయతీల్లో గెలుపొందారు. కాంగ్రెస్ కర్నూలు డివిజన్‌లో ఎక్కువ పంచాయతీలు దక్కించుకోగా వైకాపా నంద్యాల డివిజన్‌లో, తెలుగుదేశం ఆదోని డివిజన్‌లో అధిక పంచాయతీలను గెలుచుకున్నాయి. వామపక్షపార్టీ అభ్యర్థులు కర్నూలు, ఆదోని డివిజన్‌లలోని పంచాయతీల్లో గెలుపొందగా నంద్యాల డివిజన్‌లో ప్రభావాన్ని చూపలేకపోయారు. మూడు దశల్లో జరిగిన ఎన్నికలు పూర్తి కావడంతో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రానున్న శాసనసభ ఎన్నికల్లో కూడా తమకే ఎక్కువ స్థానాలు ఖాయమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఫలితాలకు భిన్నంగా తామే గెలుస్తామని వైకాపా, టిడిపి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తక్కువ పంచాయతీలు దక్కించుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతుండగా తమకు వచ్చిన ఓట్లు ప్రజలు అభిమానంతో వేసినవేనని ఏ పంచాయతీలో కూడా తాము ఓటర్లను ప్రలోభ పెట్టలేదని వెల్లడిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓటర్లను భయపెట్టి, ఓటర్లను ప్రలోభ పెట్టి వైకాపాలు ఎక్కువ స్థానాలు దక్కించుకున్నాయని వారంటున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు ఆమోదించడం వల్లే గ్రామీణ ఓటర్లు తమ అభిమానాన్ని చాటుకున్నారని తాము ఓటర్లను భయపెట్టామని ప్రచారం చేయడం చేతగాని తనమని కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. అలా భయపెట్టి ఓట్లు వేయించుకొని ఉంటే ఇతరులకు అవకాశం లేకుండా చేసే వాళ్లమని పేర్కొంటున్నారు. ఇక వైకాపా నేతలు సైతం తాము పంచాయతీ ఎన్నికలను తీవ్రంగా పరిగణించలేదని ప్రజలు చూపిన అభిమానమేనని వెల్లడిస్తున్నారు. తమ మద్దతుదారుల గెలుపును జీర్ణించుకోలేక ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
తుది విడతలో 81.52శాతం పోలింగ్
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జూలై 31: జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ప్రశాతంగా ముగిసాయి. మూడు విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడంలో అధికార యంత్రాంగం విజయవంతమైంది. తుదివిడతగా బుధవారం ఆదోని రెవెన్యూ డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలు ప్రశాతంగా పూర్తిచేశారు. తుది విడత పోలింగ్ సందర్భంగా ఆదోని డివిజన్‌లోని 17 మండలాల్లో 81.52శాతం పోలింగ్ నమోదైంది. డివిజన్‌లో మొత్తం 297 గ్రామ పంచాయతీలు ఉండగా 35 స్థానాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 262 స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ స్థానాల్లో సర్పంచ్ స్థానాన్ని దక్కించుకోవడానికి 830 మంది పోటీపడ్డారు. పోలింగ్ నిర్వహణకు అధికారులు చేసిన ఏర్పాట్ల ఫలితంగా చిన్నచిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా ముగియడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆదోని డివిజన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం వివరాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయి. ఆదోని 85.89, కౌతాళం 72.47, కోసిగి 76.83, పెద్దకడబూరు 83.41, ఎమ్మిగనూరు 82.98, నందవరం 74.16, మంత్రాలయం 80.12, ఆలూరు 76.02, చిప్పగిరి 81.09, ఆస్పరి 86.57, హోళగుంద 77.36, హాలహర్వి 85.25, పత్తికొండ 81.20, దేవనకొండ 85.14, తుగ్గలి 88.81, మద్దికెర 87.05, గోనెగండ్ల 81.49శాతం నమోదైనట్లు కలెక్టర్ సుదర్శన్ రెడ్డి కర్నూలులో ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా ముగించేందుకు సహకరించిన అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మూడు విడతల్లో పోలింగ్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎస్పీ రఘురామ్ రెడ్డి సైతం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో సైతం పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించడంలో విజయవంతమైన తమ శాఖ అధికారుల, సిబ్బంది కృషిని ఆయన అభినందించారు.
2న కొత్త సర్పంచ్‌లకు బాధ్యతలు
జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన కొత్త సర్పంచ్‌లకు గ్రామ పంచాయితీ పాలకవర్గాలకు ఆగస్టు 2వ తేదీన బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారని కలెక్టర్ సుదర్శన్ రెడ్డి బుధవారం తెలిపారు. ఆ రోజున అన్ని మండలాల అభివృద్ధి అధికారులు సమావేశం నిర్వహించి పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించాల్సిందిగా ఆయన ఆదేశించారు. కాగా పంచాయతీ ఎన్నికల సందర్భంగా అమలులోకి వచ్చిన ఎన్నికల నియమావళి గురువారం నుంచి అమలులో ఉండదని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఆదోని డివిజన్‌లో 84శాతం పోలింగ్
ఆదోని, జూలై 31: ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్లాలో ఉన్న 17 మండలాల్లో ఉన్న 263గ్రామ పంచాయతీలకు 2932 వార్డు సభ్యుల ఎన్నికలు చివరి విడతగా బుధవారం జరిగిన ఎన్నికల్లో చెదురు ముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 84.71శాతం ఓటింగ్ జరిగినట్లు డివిజన్ పంచాయతీ అధికారి ఎస్‌ఎంబాషా తెలిపారు. ఆదోని డివిజన్‌లోని కోసిగి మండలంలో 76.84శాతం ఓట్లు పొలైనట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే హొళగుందలో 77.34, తుగ్గలిలో 88.88, పెద్దకడబూరులో 84.90, మద్దికేరలో 87, కౌతాళంలో 80.39, ఎమ్మిగనూరులో 86.24, హాలహర్విలో 88.20, పత్తికొండలో 81.27, ఆలూరులో 76.17, చిప్పగిరిలో 81.84, ఆస్పరిలో 86.56, దేవనకొండలో 85.51, నందవరంలో 82.80, ఆదోనిలో 85.4, గోనెగండ్లలో 81.49, మంత్రాలయంలో 80.12 శాతం ఓట్లు పొలైనట్లు ఆయన తెలిపారు. డివిజన్ ఎన్నిల అధికారి ఆర్డీఓ రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఆదోని డివిజన్‌లో ఎన్నికలు ప్రశాతంగా జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకే 63 శాతం ఓట్లు పోలైనట్లు ఆయన చెప్పారు. సమాస్యాత్మక గ్రామాలైన దేవనకొండ, పత్తికొండ, తుగ్గలి, మద్దికేర పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ స్వయంగా పరిశీలించారు. ఆర్డీఓ దృష్ఠికి కొంత మంది ఓటర్లు తమకు ఓటరు కార్డు ఉన్న జాబితాలో పేర్లు లేవని ఫిర్యాదు చేశారు. ఎఎస్‌పి రవిశంకర్‌రెడ్డి కోసిగి మండలంలో ఎన్నికలను పర్యవేంచారు. అంతేకాకుండా శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఈశ్వర్ నందవరం, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోసిగిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కేంద్ర ఎన్నికల పరిశీలకులు పార్థసారథి గోనెగండ్ల, ఎమ్మిగనూరు, కౌతాళం మండలాల్లో పర్యవేక్షించారు. ప్రాజెక్టు ఆర్వీఎం పిడి పద్మకుమారి ఆలూరు, చిప్పగిరి మండలాల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎస్సీ కార్పొరేషన్ ఇడి సారయ్య హొళగుంద, హాలహర్వి, ఆస్పరి, ఆదోని మండలల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. స్పెషల్ కలెక్టర్ ఓబులేశు దేవనకొండ, పత్తికొండ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. హంద్రినీవా డిప్యూటీ కలెక్టర్ తుగ్గలి, మద్దికేర మండలల్లో పోలింగ్ కేంద్రాలను, పిడి హరినాథ్‌రెడ్డి మంత్రాలయం, నందవరం మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సిపిఓ ఆనంద్‌నాయక్ పెద్దతుంబళం, ఎమ్మిగనూరు పోలింగ్ కేంద్రాలను డిప్యూటీ కలెక్టర్ సత్యం గోనెగండ్ల మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ప్రత్యేక అధికారులను ప్రతి మండలానికి బాధ్యతలను అప్పగించి ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు అవకతవకలు లేకుండా ప్రశాంతంగా జరగడానికి చర్యలు తీసుకొవడం వల్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఆర్డీఓ రాంసుందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే హొళగుంద మండలంలోని వందవాగిలిలో ఓటు వేసే విషయంలో వైకాపా, కాంగ్రెస్ కార్యకర్తలకు జరిగిన ఘర్షణలో తిమ్మప్ప అనే వ్యక్తికి తలపై తీవ్ర గాయం కాగా అతనిని ఆస్పత్రికి తరలించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గార్లదినె్న గ్రామంలో జరిగిన ఘర్షణలో వైకాపా కార్యకర్తలు కట్టెలతో కానిస్టేబుల్ షేక్షావలిపైనా దాడి చేయడంతో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆయనతోపాటు పాటు ఇద్దరు వైకాపా కార్యకర్తలు రామాంజికి, మరోకరికి తీవ్ర గాయాలు తగిలాయి.
కాంగ్రెస్ విజయ భేరి
ఆదోని డివిజన్‌లో చివరి విడతగా బుధవారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో వైకాపా, మూడవ స్థానానికి టిడిపి పరిమితమైంది. ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఉన్న ఆదోని, ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, దేవనకొండ, గోనెగండ్ల, హాలహర్వి, హొళగుంద, కోసిగి, కౌతాళం, మంత్రాలయం, మద్దికేర, నందవరం, పత్తికొండ, పెద్దకడబూరు, తుగ్గలి, ఎమ్మిగనూరు మండలాల్లో ఉన్న 297 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాల్లో 35 సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవం ఎన్నికలు జరిగాయి. చివరి విడతగా బుధవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు లభించాయి. ఏకగ్రీవ సర్పంచ్ స్థానాలకు కలుపుకుసి కాంగ్రెస్ పార్టీకి 105 సర్పంచ్ స్థానాలు, టిడిపికి 71 సర్పంచ్ స్థానాలు, వైకాపాకి 84 స్థానాలు, సిపిఐ 6 స్థానాలు, సిపిఎంకి 3 స్థానాలు, స్వతంత్రులకు 28 స్థానాలు లభించాయి. దేవనకొండలో కాంగ్రెస్ 18 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే తెలుగుదేశం, వైకాపాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ధీటుగానే పోటీ నిచ్చాయి. సిపిఐ, సిపిఎం తమ ఉనికినీ చాటుకున్నాయి. ఇక స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కువ స్థానాల్లో గెలిచారు. డివిజన్ కేంద్రమైన ఆదోనిలో వైకాపా 13 సర్పంచ్ స్థానాలను గెలుచుకొని ముందంజలో ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఆదోని మండలంలోని 12 స్థానాలు అధికంగా గెలుచుకుంది. అయితే ఎమ్మిగనూరు మండలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలను గెలుచుకొని వైకాపా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి సవాలుగా నిలిచింది. పత్తికొండలో టిడిపి 8 స్థానాలు గెలుచుకొని ముందంజలో ఉంది. ఆలూరులో కూడా తెలుగుదేశం పార్టీ ముందంజలో నిలిచింది. హాలహర్వి మండలం కాంగ్రెస్ తమ పట్టు నిలబెట్టుకుంది. కాని డివిజన్ మొత్తం తీసుకుంటే 105 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచింది. డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ తమ పట్టును నిలుపుకుంది.
సమైక్య ఉద్యమ సెగలు
డోన్, జూలై 31: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ బుధవారం డోన్‌లో జెఎసి ఆధ్వర్యంలో తలపెట్టిన ఉద్యమాలు రగిలాయి. కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి, పిఎసి చైర్మన్ కెయి క్రిష్ణమూర్తిలు రాజీనామాలను డిమాండ్ చేస్తూ పట్టణంలోని వారి నివాసాలను ఆందోళనకారులు ముట్టడించారు. అంతేగాక ప్రైవేట్ స్కూలు యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నింటిని స్వచ్ఛందంగా మూసివేశారు. విద్యాసంస్థలన్నింటికి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి ఉద్యమంలో తమ వంతు భాగస్వామ్యులయ్యారు. యువకులు జాతీయ రహదారిపై రాస్తారోకోను నిర్వహించి నిరసన చేపట్టారు. బేతంచెర్ల క్రాస్‌రోడ్డు, చిగురమానుపేట తదితర ప్రాంతాల్లో స్వచ్చందంగా వాహన యజమానులు రోడ్లకు అడ్డంగా ట్రాక్టర్లు, ఆటోలను అడ్డంగాపెట్టి తమ నిరసనను చేపట్టారు. కొన్నిచోట్ల వాటిని తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జెఎసి గౌరవాధ్యక్షులు మహేష్‌కన్నా, అధ్యక్షులు పామయ్య, కోశాదికారి ఆలా శ్రీ్ధర్, కాలేషాల ఆధ్వర్యంలో సోనియా గాంధీ దిష్టిబొమ్మను శవయాత్రచేపట్టి గాంధీ విగ్రహం ముందు కాల్చివేశారు. అదేవిధంగా యుపిఎ దిష్టిబొమ్మను పాతబస్టాండ్‌లో దగ్ధంచేశారు. అనంతరం డోన్ ఎమ్మెల్యే, కెయి క్రిష్ణమూర్తి ఇంటికి వెళ్లినిరసన చేపట్టారు. ఇంటి ఆవరణలోకి చొరబడి రాజీనామా చేయాలని జెఎసి నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే పోటీగా మరి కొంతమంది కోట్ల రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. దీంతో ఏమి జరుగుతుందోనని ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తర్వాత ఆందోళన కారులు కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించారు. కేంద్ర మంత్రి కోట్ల రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి టిజి, ఎంపిలు ఎస్పీవై రెడ్డి కూడ తమ పదవులను త్యజించాలని నినదించారు. అంతేగాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మవరం సుబ్బారెడి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించి ఆందోళనలో భాగస్వామ్యులయ్యారు. రాష్ట్ర జెఎసి పిలుపుమేరకు సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేపడదామని, నిస్వార్థంతో ఉద్యమంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు కాలేషా, చంద్ర, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు అన్వర్, వెంకటేశ్వర్లు గౌడు, ఆర్యవైశ్య సంఘ నాయకులు ఓం ప్రకాష్, కోట్రారజని, మాకం అనిల్ తోపాటు ఆర్‌ఎంపి వైద్యులు, సిద్దార్థ స్కూళ్లు, వైష్ణవి డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
కోట్ల, కెయిలు రాజీనామా చేయాలి
రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో విఫలమైన కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పిఎసి చైర్మన్, డోన్ ఎమ్మెల్యే కెయి క్రిష్ణమూర్తిలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మవరం సుబ్బారెడ్డి, మాజీ ఎంపిపి శ్రీరాములులు డిమాండ్ చేశారు. పట్టణంలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. సమైఖ్యాంద్రను కాపాడటంలో వారు విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నారని తెలిసినా కేంద్ర మంత్రి కోట్ల ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. గతంలో రాష్ట్రాన్ని విభజిస్తే పదవికి, పార్టీలకు రాజీనామా చేస్తానని చెప్పిన కోట్ల ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదన్నారు. కోట్ల, కెయిలు ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలి పోతారని, భవిష్యత్‌లో ప్రజాగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నా నేతల్లో ఎలాంటి చలనం లేకపోవడం విడ్డూరంగా వుందన్నారు. అదే విధంగా రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో పబ్బం గడుపుకుంటున్న మంత్రి టిజి వెంకటేష్ కూడ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన కోట్ల, టిజిల అసమర్థత వల్లే విభజన జరిగిపోయిందని ఆరోపించారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు మల్లెంపల్లె రామచంద్రుడు, కొత్తకోట దేవేంద్ర రెడ్డి, రఘురాం, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఇవ్వాలి
కర్నూలు ఓల్డ్‌సిసీ, జూలై 31: రాష్ట్రాన్ని ఉంచితే సమైక్యంగా ఉంచాలని లేనియేడల గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఇవ్వాలని రాయలసీమ ఐక్యవేదిక బుధవారం డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలోని రవీంద్ర టాలెంట్ పాఠశాలలో రాయలసీమ ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐక్యవేదికక అధ్యక్షులు, సుబ్బయ్య, కార్యదర్శి విక్టర్ ఇమ్మానియేల్ పాల్గొని మాట్లాడుతూ కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను ప్రకిటించిందని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ కూడ తన నివేదికలో తెలంగాణ కంటే సీమ ప్రాంతం చాలా వెనుకబడి ఉందని స్పష్టం చేసిందని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. ఇప్పటికే సీమ ప్రాంతాల్లో ఉపాధిలేక ఇతర రాష్టల్రకు కూలీలు వలసలు వెలుతున్నారని అన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి అక్కర లేదని, సమైక్యాంధ్రగా ఉంచండి లేదా గ్రేటర్ రాయలసీమగా చేసి కర్నూలును రాజధానిగా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజకీయ నాయకులు రాజీనామచేసి ఉంటే ఇలా జరిగేది ఉండేది లేదని అన్నారు. రాయచూరు, బళ్ళారి, గిద్దలూరు, కంభం, మార్కపురం కలిపి గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న 108 ఉద్యోగుల సమ్మె
కర్నూలు టౌన్, జూలై 31: సమస్యల సరిష్కారం కొరకు 108 ఉద్యోగస్థులు చేట్టిన సమ్మె బుధవారం నాటికి 13 వరోజుకు చేరింది. ఈ సందర్భంగా 108 జిల్లా అద్యక్షులు కిరణ్‌కుమార్ మట్లాడుతూ న్యాయమైన డిమాండ్లకోసం 13 రోజులుగా 108 ఉద్యోగులు సమ్మెచేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం శోచనీయమైన్నారు. ఈకార్యక్రమంలో శివశంకర్ రెడ్డి, పార్థు, రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూ.కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం వాయిదా
కర్నూలు ఓల్డ్‌సిటీ, జూలై 31: ఆగస్టు 1వ తేదిన జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెట్, ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న జూనియల్ కళాశాల ప్రిన్సిపాళ్ళ సమావేశం జరగాల్సిన ఉండగా సమైక్యాంధ్ర బంద్ కారణంగా వాయిదా వేసినట్లు ఇంటర్మీడియేట్ విద్యామండలి ఆర్‌ఐఓ పరమేశ్వరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి సమావేశం ఎప్పుడు జరపాలనే త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యములలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ సమావేశం వాయిదాను గమనించాలని ఆయన కోరారు.
సీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి
కర్నూలు ఓల్డ్‌సిటీ, జూలై 31: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును ప్రకటించిన తరుణంలో రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆదర్శ ఆటోవర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ భౌగోళికంగా సీమ చిత్ర పటంలో బళ్ళారి, ప్రకాశం ప్రాంతాలను కృష్ణదేవరాయల పాలన సాగించిన ప్రాంతాలను ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకులు నిర్లక్ష్యంవల్ల గతంలో మన కర్నూలు నుండి రాజధానిని హైదరాబాదుకు తరలించడం జరిగిందని అన్నారు. ఇప్పటికైన రాజకీయ నాయకులు మేలుకోని సీమ రాష్ట్రం సాధించుకునే వరకు పోరాటం సాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
సమైక్యాంధ్ర బంద్‌కు ఆర్యవైశ్య సంఘం మద్దతు
కర్నూలు ఓల్డ్‌సిటీ, జూలై 31: అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి సంపాదించిన సమైక్యాంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేయడాన్ని నిర్ణయాన్ని నిరసశిస్తు బుధవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నగరంలో కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు టిఎస్.విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో చేస్తున్న సమైక్యాంధ్రకు బంద్‌కు కర్నూలు జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండ్రస్ట్రీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి బుధవారం వాణిజ్య వర్గాలందరు బంద్ పాటించాలనితీర్మానం చేసింది.రాష్ట్రాన్ని రెండు ముక్కలుచేసి విదేశీ బుద్దిని ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ చూపింని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక విశే్వశ్వరయ్య సర్కిల్ వద్ద సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలి
ఆదోని, జూలై 31:ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని కోరుతూ విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు ఆదోనిలో ఊరేగింపు నిర్వహించి రాస్తారోకో చేశారు. జిల్లా కోకన్వీనర్ శ్రీనివాస్ ఆచారి, పవన్, సంతోష్, జగదీష్, తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోరుతూ గురువారం విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. బంద్‌కు ప్రజలు, రాజకీయ నాయకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.
గార్లదినె్నలో కానిస్టేబుల్‌పై దాడి
* ఇద్దరు వైకాపా కార్యకర్తలకు గాయాలు
ఎమ్మిగనూరు, జూలై 31: పంచాయతీ ఎన్నికల్లో భా గంగా ఎమ్మిగనూరు మండలంలోని గార్లదినె్నలో పో లింగ్ పూర్తి అయిన తరువాత బ్యాలెట్ బాక్స్‌ల విషయంలో వాదోప వాదాలు జరిగి వైకాపా కార్యకర్తలు పోలీసులపై కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో రూరల్ కానిస్టేబుల్ షేక్షావలి గాయపడ్డారు. ఇదే దాడిలో వైకాపా కార్యకర్తలు రామాంజి, మాదన్నలు గాయపడడంతో వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అలాగే మల్కాపురం, కందనాతి గ్రామాల్లో చెదురు మదురు సంఘటనలు జరిగాయి.
రాష్ట్ర విభజనకు నిరసనగా రాస్తారోకో
ఎమ్మిగనూరు, జూలై 31:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అదిష్థానం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా బుధవారం ఆర్టీసీ జేయేసి నాయకులు ఆచారి, నవాజ్, గోపాల్, సాహెబ్, బాషాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ డిపో రోడ్డులో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. సోనియా డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ప్రశాంతంగా పోలింగ్
గోనెగండ్ల, జూలై 31:గోనెగండ్ల మండలంలో బుధవారం జరిగిన గ్రామ పంచాయతీలు ఆయా గ్రామాల్లో ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోనెగండ్ల మండలంలో 20 గ్రామ పంచాయతీల్లో ఐదు ఏకగ్రీవం కాగా, మొత్తం 39,184 మంది ఓట్లు ఉండగా 31,934 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81.49శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. మండలంలో గోనెగండ్ల, లింగందినె్న, ఎర్రబాడు, హెచ్.కైరవాడి గ్రామాల్లో టిడిపి మద్దతుదారులు గెలుపొందారు. ఐరన్‌బండ, బి. అగ్రహారం, అలువాల, పెద్దమర్రివీడు, పెద్దనెలటూరు, వేముడోగు గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా, చిన్నమర్రివీడు, నెరడుప్పల గ్రామాల్లో వైకాపా అభ్యర్థులు సర్పంచ్‌గా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా గంజహళ్లి, పుట్టపాశం గ్రామాలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు.
హాలహర్విలో కాంగ్రెస్‌దే హావా
హాలహర్వి, జూలై 31:హాలహర్వి మండలంలో బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 15 పంచాయతీలకుగాను ఐదు ఏకగ్రీవం కాగా మిగిలిన 10 సర్పంచ్ ఎన్నికల్లో నాలుగు కాంగ్రెస్ పార్టీ, మూడు స్వతంత్ర అభ్యర్థులు, రెండు వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. వీటిలో కాంగ్రెస్ తరుపున గుళ్యూం రాజశేఖర్‌రెడ్డి, బాపురం చెనమ్మ, చింతకుంట చంద్ర, సిద్దాపురం రంగప్ప, స్వతంత్ర అభ్యర్థులు నాగరత్నమ్మ, హాలహర్వి ఎం. రంగమ్మ, నెట్రవట్టి బసప్ప, వైకాపా తరుపున కామినేహాల్ నాగరత్నమ్మ, ఎంకె. పల్లినాగమ్మ, టి.సాకిబండ సర్పంచ్‌గా విజయం సాదించారు. మండల ఎన్నికల అధికారి నాగేశ్వరరావు, తహశీల్దార్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.
నందవరంలో వైకాపా హావా
నందవరం, జూలై 31:నందవరం మండలంలో వైకాపా అభ్యర్థిలు పులచింత వీనా, ఇహ్రీంపురం మద్దమ్మ, కనకవీడు రుతమ్మ, మిట్టసోమాపురం లింగన్న, పెద్దకొత్తిలి విరుపాక్షిరెడ్డి,కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ, నదికైరవాడి రత్నమ్మ, పొనకలదినె్న నాగమ్మ, నాగలదినె్న ప్రభాకర్‌లు గెలుపొందారు.
గవర్నర్ రోశయ్య పర్యటన రద్దు
నంద్యాల అర్బన్, జూలై 31:కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర ప్రకటన జరిగిన వెంటనే కోస్తాంధ్రలో ఉద్యమాలు ఊపందుకోవడంతో మంగళవారం సాయంత్రం నుంచే నిరసన జ్వాలలు మిన్నంటాయి. నంద్యాల పట్టణంలో ఆగస్టు 1న రోశయ్య పర్యటన రద్దయినట్లు అధికారులు తెలిపారు. నిరసనలు, రాస్తారోకోలు, బంద్‌లు నిర్వహిస్తుండడంతో పర్యటన రద్దుచేసినట్లు జిల్లా కేంద్రం నుంచి సమాచారం అందినట్లు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.
జెన్‌కో ఉద్యోగి పదవీ విరమణ
శ్రీశైలం, జూలై 31: శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు బుధవారం పదవీవిరమణ చేశారు. జెన్‌కో ట్రాన్స్‌పోర్టు డివిజన్ కార్యాలయం వద్ద ఎస్‌ఇ రాంబాబు ఆధ్వర్యంలో సిబ్బంది, తోటి ఉద్యోగులు ఘనంగా శాలువలతో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంస్థలో పనిచేసిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎపి జెన్‌కో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సిర్రా జాన్ విక్టర్, ప్రధాన కార్యదర్శి రామయ్య, కోశాధికారి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సరఫరా వేళల్లో మార్పులు
మహానంది, జూలై 31: మహానంది మండలంలో వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ సమయాన్ని మార్పు చేసినట్లు మహానంది ట్రాన్స్‌కో ఎఇ ప్రభాకర్‌రెడ్డి బుధవారం తెలిపారు. గ్రూప్-ఎ ఉన్న గాజులపల్లె, కృష్ణనంది, ఎల్లావత్తుల, గోపవరం గ్రామపరిధిలో ఉన్న విద్యుత్ మోటార్లకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజామున 1గంట వరకు, గ్రూప్ -బిలో ఉన్న బుక్కాపురం, పుట్టుపల్లె, పచ్చర్ల, గాజులపల్లె గ్రామాల్లో ఉన్న మోటార్లకు తెల్లవారుజామున 3గంటల నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నాం 4గంటల నుండి 8గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. అలాగే వ్యవసాయ బోర్లకు కేపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ మార్పులు నేటి నుంచి అమలులోకి వస్తాయన్నారు.
సమైక్యాంధ్ర కోరుతూ ఆందోళన
చాగలమర్రి, జూలై 31: చాగలమర్రిలో బుధవారం సమైక్యాంద్రకు మద్దతుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. గ్రామంలో రాష్ట్రాన్ని విభజించడాన్ని నిరసిస్తూ ర్యాలీ చేశారు. కర్నూలు-చిత్తూరు 18వ జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేశారు. ప్రధాని, సోనియాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో ఎస్‌టియు జిల్లా అధ్యక్షులు శివశంకర్, మండల అధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శి సంజీవరెడ్డి, పిఆర్‌టియు నాయకులు ఆంజనేయరెడ్డి, వౌళాలి, నజీర్‌అహమ్మద్, జిల్లా నాయకులు రవీంద్రారెడ్డి, యుటిఎఫ్ నాయకులు బాలకృష్ణ, జాని, ఆర్యవైశ్య సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంద్ర కోరుతూ ర్యాలీ
మహానంది, జూలై 31: మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో బుధవారం సమైక్యాంద్రను కోరుతూ విద్యార్థులు ర్యాలీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరిబాబు, కరస్పాండెంట్ చక్రపాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తమ్మడపల్లెలో విగ్రహాల ధ్వంసం
మహానంది, జూలై 31: మహానంది మండలం తమ్మడపల్లె ఇంజవాణి చెరువు వద్ద నూతనంగా నిర్మిస్తున్న గంగమ్మ దేవాలయంలో కుమారస్వామి, దుర్గా అమ్మవారు, ద్వారపాలకుల విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు బుదవారం తెల్లవారుజామున ధ్వంసం చేసినట్లు గ్రామాస్థులు గుర్తించారు. ఆలయ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యదర్శి కాసుల వెంకటేశ్లర్లు, మహానంది పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.