విజయనగరం, జూలై 31: సమైక్యాంధ్రాకు మద్దతుగా న్యాయవాదులు బుధవారం తమ విధులను బహిష్కరించారు. బుధవారం జిల్లా కోర్టు వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి సోనియా, యూపీఏ ప్రభుత్వం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రామ్మోహనరావు, ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, రాష్ట్ర బార్ అసోసియేషన్ సభ్యుడు కెవిఎన్ తమ్మన్నశెట్టిలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తాము విధులను బహిష్కరించినట్టు పేర్కొన్నారు.
ఈ నెల 29 నుంచి 2వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సమైక్యాంద్ర వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు వివరించేందుకే తాము రోడ్లపై బైఠాయింపు, ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు.
‘సమైక్యాంధ్ర తీర్మానం ప్రకటించాలి ’
సమైక్యాంధ్ర తీర్మానం వెంటనే ప్రకటించాలని చేయాలని కోరుతూ ఎపి ఎన్జీవో సంఘం, రెవెన్యూ ఉద్యోగుల సంఘం, ఉపాధ్యాయులు రాస్తరోకో నిర్వహించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ వద్ద సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు స్వచ్చందంగా విధులు బహిష్కరించి రావాలని కోరారు. దీనికి అన్ని శాఖల నుంచి ఉద్యోగులు కలసికట్టుగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా 3తెలంగాణా వద్దు.. సమైక్యాంధ్ర ముద్దు2 అంటూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ గేటు బయట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభూజీ మాట్లాడుతూ తెలంగాణా నేతల స్వార్ధం కోసం సమైక్యాంధ్ర లేకుండా నీరుగార్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు.
అందుకు ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని కోరారు. సిడబ్ల్యుసి కోర్ కమిటీలో తెలంగాణా ప్రకటనపై నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని ఎపి రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధి శ్రీనివాసరావు అన్నారు. ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా ఇటువంటి ప్రకటన చేయడం వల్ల దురదృష్టకరమన్నారు. రాష్ట్రం విడిపోతే నీటి వనరులు, విద్యుత్ ఇతర సమస్యలు ఉత్పన్నమవుతాయని రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధి సత్యనారాయణ అన్నారు.
ఈ కార్యక్రమంలో బంగారునాయుడు, రమాదేవి, యూటీఎఫ్ నేత అల్లూరి శివవర్మ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ జంక్షన్ వద్ద దాదాపు 40 నిమిషాలపాటు రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
జామిలో..
జామి, : మండలంలోని సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్‌ను నిర్వహించారు. ఈ బంద్‌లవో వందలాది మంది విద్యార్ధులు ఉపాధ్యాయులు వైఎస్సార్ సిపి, టిడిపి నాయకులు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. తెలంగాణా వద్దు సమైక్యమే ముద్దుంటూ నినాదాలు చేస్తూ సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహణ పరిచారు. అనంతరం జామి బస్టాండు వద్దమానవహారంగా ఏర్పడి కొంత సేపు ట్రాఫిక్‌ను నిర్భందించారు.వ్యాపారులు, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్‌కు మద్దతుగా సెలవు ప్రకటించారు. వైఎస్సార్ సిపి నాయకులు బండారు పెదబాబు, దేశం పార్టీ నాయకులు చుక్క సూర్యనారాయణ మాస్టారు, బివి రమణారావు, ఆంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వాక గొవింద, తన అనుచరులు బంద్‌ను శాంతియుతంగా నిర్వహించి రాష్ట్రం విభజన వలన కలిగిన నష్టాలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
విద్యార్ధుల
మానవహారం
డెంకాడ, : సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ రహదారిపై విద్యార్ధులు బుధవారం మానవహారం నిర్వహించారు. మండలంలోని అక్కివరం జంక్షన్‌లో అలాగే జోన్నాడ జాతీయ రహదారిపై సుమారు 500 మంది విద్యర్ధులతో భారీ మానవహారం నిర్వహించారు. అలాగే డెంకాడ, పూసపాటిరేగ, మండలాల్లో కూడా కార్మికులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీ ఎత్తున 55వ నెంబర్ జాతీయ రహదారికి చేరుకుని కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసారు.
సమైక్యాంధ్రకు మద్దతగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, యుపిఎ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు నినాదాలు చేసారు. తెలుగు యువత అధ్యక్షులు కంది సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మెంటాడలో..
మెంటాడ, : మండల కేంద్రమైన మెంటాడలో బుధవారం సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో, బంద్ నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు సుమారు మూడు గంటలపాటు ట్రాఫిక్ స్థంబించింది. ఈ కార్యక్రమంలో దేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటిస్తూ పురవీధుల్లో తెలంగాణా వద్ద సమైక్యాంధ్ర ముద్దు అని నినాదాలు చేస్తున్నారు. ఆ ర్యాలీలో గ్రామానికి చెందిన యువకుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా సోనియా గాంధీకి దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు పార్టీ నాయకులు, యువకులు, విద్యార్దులు పాల్గొన్నారు.
నిరసనల వెల్లువ
చీపురుపల్లి, : తెలంగాణా రాష్ట్ర ఏర్పటుపై సిడబ్ల్యుసి నిర్ణయాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులు విద్యార్ధులు నిరసన వ్యక్తం చేసారు. స్థానిక మూడు రోడ్ల జంక్షన్ వద్ద బుధవారం విద్యార్ధులు, పలు పార్టీల నాయకులు ధర్నా చేసి తహశీల్ధార్ వినతిపత్రం అందజేసారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో విద్యా సంస్థలు వ్యాపార వర్గాలు బంద్ పాటించాయి. ఈ కార్యక్రమంలో దేశం పార్టీ నేతలు రౌతు కామునాయుడు, అడ్డారి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
దత్తిరాజేరులో...
సమైక్యాంధ్రకు మద్దతుగా మండలంలో 35 గ్రామ పంచాయతీల్లో ప్రాధమిక పాఠశాలతోపాటు ఉన్నత పాఠశాలలు మూసి వేసి, ఉపాధ్యాయులు, విద్యార్ధులు బంద్ చేసారు.
మండల పరిషత్ కార్యాలయం, తహశీల్ధార్ కార్యాలయం, ఐకెపి కార్యాలయంతోపాటు, ఎంఆర్‌సి భవన కార్యాలయ సిబ్బంది కూడా బంద్‌కు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్ధులు, ర్యాలీ నిర్వహించి, సమైక్యాంగా ఉండాలని పలు నినాదాలు చేసారు. సమైకాంధ్ర తోనే అభివృద్ధ సాధ్యమని నినదించారు.
రాష్ట్ర విభజనపై నిరసనల హోరు
విజయనగరం (్ఫర్టు), జూలై 31: రాష్ట్ర విభజన బాధాకరంగా ఉందని జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో పలు చోట్ల ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఈ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్‌నాయకులు, కార్యకర్తలు గంటస్తంభం, ఎన్‌సిసి ధియేటర్, రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర చోట్ల రాస్తారోకో నిర్వహించారు. తెలుగుదేశంపార్టీకి తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించినందునే కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. తెలుగుదేశంపార్టీలు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగువారంతా సమైక్యంగా ఉండాల్సిన తరుణంలో రెండు రాష్ట్రాలుగా విడిపోవడం బాధాకరంగా ఉందన్నారు కాంగ్రెస్‌నేతలు జిల్లాకు బంద్‌కు పిలుపుఇవ్వడంతో పట్టణంలో వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూతపడ్డాయి. అలాగే ఆర్టీసీ బస్సులు పాక్షికంగా తిరిగాయి. రాష్ట్ర విభజనకు మనస్థాపం చెందిన కాంగ్రెస్ కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను), పార్టీకాంగ్రెస్‌నాయకులు పిళ్లా విజయకుమార్, యడ్ల ఆదిరాజు పాల్గొన్నారు.
‘రాష్ట్ర విభజన దుర్మార్గపు చర్య’
విజయనగరం (కంటోనె్మంట్): రాష్ట్ర విభజన ఒక దుర్మార్గపు చర్యయని, ఇది తెలుగు జాతికి మాయని మచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనకు నిరశనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనపై పెనుమత్స మాట్లాడుతూ తెలుగు జాతిని విడదీసిన అపఖ్యాతి యుపిఎ చైర్మన్ సోనియాకు దక్కుతుందని విమర్శించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసమే ఒక కుటుంబలా ఉండే తెలుగు ప్రజలను విడగొట్టారని, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి కాదని అన్నారు. వైకాపా జిల్లా యువజన అధ్యక్షుడు అవనాపు విజయ్, జిల్లా ప్రచార విభాగం కన్వీనర్ గొర్లె వెంకటరమణ తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయనగరం (్ఫర్టు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సమైక్యాంధ్ర జెఎసి జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో బుధవారం బంద్ జరిగింది. పలు చోట్ల ప్రధాన కూడళ్లల్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసి నాశనం చేయాలనుకోవడం చాలా దురదృష్టకరమన్నారు. సీట్లు, ఓట్లు కోసం కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ద్విజయ్‌సింగ్, టిఆర్‌సి నేత కెసిఆర్, ప్రొఫెసర్ కోదండరామ్ చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులైన మంత్రులు, ఎం.పి., ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా కాలయాపన చేస్తున్నవారికి గట్టిబుద్ధి చెబుతామన్నారు. విభజన ప్రకటన వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్‌ను సీమాంధ్రలో పూర్తిగా భూస్థాపితం చేస్తామని అప్పలనాయుడు హెచ్చరించారు. విద్యార్ధి, కార్మిక సంఘాలు, రాజకీయపార్టీల నాయకులు పాల్గొన్నారు.
కొండ్రాజుపాలెంలో అగ్ని ప్రమాదం
భోగాపురం, జూలై 31 : మండలంలోని కొండ్రాజుపాలెం గ్రామంలో బుధవారం తెల్లవారు ఝామున అగ్ని ప్రమాదం సంబభివించడంతో 148 ఇళ్లు దగ్ధమయ్యాయి. 250 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. దుస్తులు, సామగ్రి అన్ని కాలి బూడిద కావడంతో రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే తహశీల్దార్ రాజేశ్వరి, ఆర్‌ఐ పిట్టా అప్పారావు అలాగే రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి ఆస్తినష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఆర్డీవో రాజకుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన పరిస్థితిలని అడగా ముందుగా అదే గ్రామానికి చెందిన వాసుపల్లి కడుపోడు ఇంటిలో మంటలు బెలరేగాయని రాత్రి సమయం కావడంతో గాలికి గ్రామం అంతా పాకి అన్ని ఇళ్లు దగ్ధమయ్యాయని బాధితులులు ఆర్డీవోకు వివరించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం నుండి సహాయం వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. అగ్నిమాపక వాహనం సంఘటన స్థలానికి ఆలస్యంగా రావడంతో ప్రమాదం మరింత ఎక్కువైందని గ్రామస్తులు అంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామని ఆయన తెలిపారు.
ఇరు వర్గాల మధ్య కొట్లాట
డెంకాడ, జూలై 31 : మండలంలోని డి.తాళ్లవలస గ్రామంలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలు కాగా ఎనిమిది మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కధనం ప్రకారం కాంగ్రెస్ వర్గానికి చెందిన అట్టాడ ముసలినాయుడు మరో వర్గానికి చెందిని అట్టాడ త్రిమూర్తులు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి అభ్యర్ధిగా పోటీ చేశారు. వారిలో ముసలి నాయుడు విజయం సాధించడంతో కొంత మంది తమకు వ్యతిరేకంగా పని చేసారని కాంగ్రెస్ వర్గం వారు నిలదీయడంతో ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకుని కర్రలతో ఘర్షణ పడ్డారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
గొట్లాంలో కాంగ్రెస్, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ
బొండపల్లి, జూలై 31 : మండలం పరిధిలోని గొట్లాం గ్రామంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మద్దతుదారులు ఘర్షణకు తలపడడంతో గ్రామంలో సాయుధులైన పోలీసులను కాపలాగా నియమించారు. స్థానిక సబ్ ఇన్స్‌పెక్టర్ డిడి నాయుడు కథనం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఆటో ఎక్కుతున్న తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు చేయి చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. అదే రోజు రాత్రి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ మద్దతుదారుల ఇళ్లపై దాడి జరిపారు. అంతకు ముందు రహదారిపై తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు మహంతి రమణ, తాళ్లపూడి ఆదికృష్ణ, సిగడం శ్రీనులపై కాంగ్రెస్ మద్దతుదారులు దాడి జరపడంతో గాయపడ్డారు. గాయపడిన ముగ్గురు విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు గాయపడ్డారు. సిడగం బంగారమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరపుతున్నారు.
పట్టణంలో పోలీసు బలగాల కవాతు
విజయనగరం (కంటోనె్మంట్), జూలై 31: రాష్ట్ర విభజన నేపధ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ పటిష్టబందోబస్తు ఏర్పాట్లు చేసింది. బుధవారం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు బంద్‌కు పిలునివ్వడంతో ముందు జాగ్రత్త చర్యగా పట్టణంలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ కార్తికేయ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించి సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద నుంచి ట్యాంక్‌బండ్ రోడ్డు, కోట, మూడు లాంతర్లు, మెయిన్ రోడ్డు, గంటస్తంభం మీదుగా తిరిగి బాలాజీ కూడలి మీదుగా ఆర్టీసి కాంప్లెక్స్ వరకు కేంద్ర ప్రత్యేక పోలీస్ బలగాలతోపాటు స్థానిక పోలీసులతో కలిసి కవాతు నిర్వహించారు. అనంతరం మయూరి కూడలికి చేరుకుని అక్కడ నుంచి నిఘా ఏర్పాట్లను ఎస్పీ పర్యవేక్షించారు. పట్టణంలో ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేయడంతోపాటు ఆయా ప్రాంతాల్లో డిఎస్పీ, సిఐ స్థాయి అధికారులును బందోబస్తు పర్యవేక్షకులుగా నియమించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై దాడులు నిర్వహించకుండా పోలీస్ హెచ్చరికలు జారీ చేశారు.
సమైక్యవాది ప్రాణాలు బలిగొన్ని విభజన
గంట్యాడ, జూలై 31 : తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ప్రకటనను జీర్ణించుకో లేకపోయిన ఒ సమైక్యవాది పురుగు మందు తాగి సమైక్యాంధ్ర కోసం తన ప్రాణాలను తీసుకున్నాడు. ఆది నుంచి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటూ వచ్చిన, పోలీసు శాఖలో హోంగార్డ్‌గా ఉద్యోగం చేస్తున్న ఈ మండలం తాటిపూడి గ్రామానికి చెందిన తమటాపు శ్రీనివాసరావు (35) సమైక్యాంధ్రకు మద్దతుగా పురుగు మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా అపస్మారక స్థితిలో ఉన్న అతడిని చికిత్స నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఆదివారం మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి శ్రీనివాసరావు భార్య పార్వతీదేవి పోలీసులకు చేసిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. తాటిపూడి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు విజయనగరం పోలీస్ ఈగల్ మోబైల్ టీమ్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. గతంలో ఇతడు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని చురుకైన మాత్రను పోషించాడు. ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణా ప్రకటనను శనివారం మధ్యాహ్నం టీవిలో సూచిన శ్రీనివాసరావు మనస్తాపం చెంది రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారంటూ తన ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు భార్య పార్వతీదేవి పేర్కొంది. తెలంగాణా తనకు ఇష్టం లేదని, పాపను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయిన తన భర్త పురుగు మందు తాగి తిరిగి ఇంటికి చేరుకున్నారన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరిలించగా పరిస్థితి విషమంగా ఉంచడంతో విశాఖ కెజిహెచ్‌కు ఆసుపత్రి వర్గాలు తరలించినట్లు ఆమె తెలిపారు. ఆదివారం ఉదయం తన భర్త మృతి చెందినట్లు విలేఖర్లకు తెలిపారు. శ్రీనివాసరావు భార్య పార్వతీదేవి చేసిన ఫిర్యాదు మేరకు విజయనగరం డిఎస్పీ కృష్ణప్రసన్న, రూరల్ సిఐలు, గంట్యాడ, ఎస్సైలు తాటిపూడి వెళ్లి శ్రీనివాస్ మృతి సంఘటనపై దర్యాప్తు నిర్వహించారు. శ్రీనివాసరావు మృతి విషయమై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. శ్రీనివాసరావు ఆత్మశాంతి కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులతోపాటు, సమైక్యవాదులు పాఠశాల విద్యార్ధులు, యువకులు, యువజన సంఘాలు కోటారుబిల్లి జంక్షన్‌లో మానవహారం ఏర్పడి నివాళులర్పించారు.
నిరసన జ్వాలలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 31: సమైక్యాంధ్ర ఉద్యమకారుల నిరసన గళం మిన్నంటింది. సమైక్యాంధ్ర కోసం ఒక హోంగార్డు తన ప్రాణాలను బలిదానం తీసుకోగా, మరో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమైక్యాంధ్రను కొనసాగిస్తామని సిడబ్ల్యుసి ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ముద్దు.. తెలంగాణా వద్దు అంటూ నినాదాలు చేశారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సమైక్యాంధ్ర కోసం నిరసన ధ్వనులు విన్పించాయి. పలు చోట్ల సోనియా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వివిధ ప్రాంతాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఎమ్మెల్యే రాజన్నదొర, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభ్రదరావు తమ పదవులకు రాజీనామా చేశారు. జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గంట స్తంబం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. రాష్ట్రాన్ని విడగొట్టడం బాధాకరంగా ఉందన్నారు. టిడిపి తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించినందునే సిడబ్ల్యుసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. తెలుగు భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని అమరజీవి పొట్టి శ్రీరాములు ఆనాడు ప్రాణత్యాగం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సమైక్యాంధ్రాకు మద్దతుగా జిల్లాలో పాఠశాలలు, వ్యాపారులు దుకాణాలు మూసి సమైక్యాంధ్రకు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావుతోపాటు కాంగ్రెస్ నాయకులు పిళ్లా విజయకుమార్, యడ్ల ఆదిరాజు తదితరులు పాల్గొన్నారు. సాలూరులోని ఎమ్మెల్యే రాజన్నదొర సమైక్యాంధ్ర కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బోగాపురంలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, సీతానగరంలోని ఎమ్మెల్యే జయముణి అక్కడ సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో వైకాపా జిల్లా కన్వీనర్ పి.సాంబశివరాజు నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ విధంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మానవహారం, ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
రాజన్న రాజీనామా
సాలూరు,: రాష్ట్ర విభజనకు నిరసనగా ఎమ్మెల్యే రాజన్నదొర బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ ఎన్.మనోహార్, పి.సి.సి. అధ్యక్షులు బొత్స సత్యనారాయణకు పంపించారు. కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం తెలంగాణా ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించడం అన్యాయమన్నారు. అసెంబ్లీలో తెలంగాణా తీర్మానాన్ని ఓడిస్తామన్నారు. సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే రాజన్నదొర నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీలు చేశారు. ఎమ్మెల్యే నివాసం నుంచి ప్రధాన రహదారుల గుండా నిరసన ర్యాలీ చేపట్టారు.