శ్రీకాకుళం, జూలై 31: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ముగిసాయి. తుది విడతగా టెక్కలి డివిజన్‌లో 12 మండలాల్లో బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్నిచోట్ల 11 గంటల సమయానికే ఓటర్లు పూర్తిస్థాయిలో వారి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా వృద్ధులు, వికలాంగులే పోలింగ్ కేంద్రాలకు హాజరై అధిక శాతం ఓటింగ్‌లో పాల్గొన్నారు. డివిజన్‌లో 81.60 శాతం పోలింగ్ నమోదైంది. డివిజన్‌లో మొత్తం 5.38 లక్షల ఓటర్లకు గాను 3,63,138 మంది ఓటర్లుతమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కేంద్ర సహాయమంత్రి కిల్లి కృపారాణి టెక్కలి వంశధార కాలనీలో గల పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకోగా స్థానిక ఎమ్మెల్యే కొర్ల భారతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఎన్నికల తీరుతెన్నులను పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులను అప్రమత్తం చేసి సూచనలు అందించారు. అలాగే టెక్కలి ఆర్డీవో విశే్వశ్వరరావు పలు కేంద్రాలను తనిఖీ చేశారు. 364 పంచాయతీల్లో 79 ఏకగ్రీవం కాగా, 285 సర్పంచ్ స్థానాలకు గాను 734 మంది అభ్యర్థులు, అలాగే 1362 వార్డుమెంబర్లకు గాను 2,871 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పోలింగ్ శాతం గత రెండు డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే కాస్త తగ్గిందనే చెప్పాలి. తుది సమరానికి ముందే తెలంగాణ అంశంపై కేంద్రం తీసుకున్న నిర్ణయం స్థానిక ఎన్నికలపై పడిందనే చర్చ సాగుతోంది. జలుమూరులో అత్యధికంగా 90.63 శాతం పోలింగ్ నమోదు కాగా ఇచ్ఛాపురంలో 71.04 పోలింగ్ శాతం అత్యల్పంగా నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి డివిజన్‌లో మండలాల వారీగా పరిశీలిస్తే...మందస మండలంలో 78.55 శాతం, టెక్కలిలో 85.05, కవిటిలో 76.34, కోటబొమ్మాళిలో 87.04, సంతబొమ్మాళిలో 87 శాతం, కంచిలిలో 81.57 శాతం, నందిగాంలో 87, పలాసలో 81.01, వజ్రపుకొత్తూరులో 74.09, సోంపేటలో 75.83 శాతం పోలింగ్ నమోదైంది. టెక్కలి డివిజన్‌లో అత్యధికంగా సమస్యాత్మక ప్రాంతాలున్నప్పటికీ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. వజ్రపుకొత్తూరు మండలం బెండి పోలింగ్ స్టేషన్ సమీపంలో సి.పి.ఎం జెండా ఉండడం ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని, దానిని తీసివేయాలని ఎస్సై శాంతారాం స్థానికులను ఆదేశించగా వారు తిరస్కరించారు. టెక్కలి మండలం రావివలస పోలింగ్‌కేంద్రం వద్ద ఉదయం నుంచి ఓటర్లు తక్కువగా కనిపించారు. కోటబొమ్మాళికి చెందిన గంగపున్నమ్మ(80) తన ఓటుహక్కును వినియోగించుకోవడం కనిపించింది. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి డివిజన్లకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకున్నారు.
సిక్కోల్ ‘పంచాయతీ’లో
కాంగ్రెస్ ముందంజ
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూలై 31: ఏడేళ్ల అనంతరం జరిగిన పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ తమ హవాను చాటుకుంది. మూడు విడతలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 445 మంది విజయం సాధించగా, దేశం పార్టీ 374 పంచాయతీలు, వైకాపా 170 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొదటి విడతలో 115, రెండో విడతలో 158, మూడో విడతలో 172 సర్పంచ్ పదవులను దక్కించుకుని తమ హవా చాటుకుంది. అయితే, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా బలం పుంజుకుని, తరువాత దిగజారి రెండోస్థానానికి పరిమితం కాగా, వైకాపా మూడో స్థానానికే పరిమితం కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ మొదటి విడతలో 149 స్థానాలను, రెండో విడతలో 126 స్థానాలను, మూడో విడతలో 99 స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు దక్కించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకొర ఫలితాలే అందిపుచ్చుకోవడంతో జగన్ అభిమానులు అంతర్మథనానికి గురవుతున్నారు. ఈ పార్టీ మొదటి విడతలో 57 స్థానాలు, రెండో విడతలో 71, మూడో విడతలో 42 స్థానాల్లో సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.
పంచాయతీ పోరుకు ప్రధాన పార్టీలు దూరంగా ఉన్నట్టుగా వ్యవహరించినప్పటికీ, తెరవెనుక స్థానిక పట్టుకోసం ముమ్మర ప్రయత్నాలు చేసారు. మనీ, మద్యం ఈ ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించగా, వలస ఓటర్లు కూడా అధికార పార్టీకి అనేక చోట్ల అండగా నిలిచారనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి స్వగ్రామమైన పోలవరంలో ఓటమి చవిచూడగా, మేజర్ పంచాయతీ టెక్కలి సర్పంచ్ కుర్చీ దేశం పార్టీ కైవసం చేసుకోవడంతో ఆమె భంగపాటు తప్పలేదు. రాష్ట్ర మంత్రి కోండ్రు మురళీమోహన్ స్వగ్రామం లావేటిపాలేంలో దేశం ఖాతాలో జమయ్యింది. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి జన్మస్థలమైన కావలి కాంగ్రెస్‌కు వశమైంది. వైఎస్సార్‌సిపీ శాసనసభ ఉపనేత ధర్మాన కృష్ణదాస్ స్వగ్రామమైన మబగాంలో కాంగ్రెస్ మద్దతుదారునికి ఏకగ్రీవం అయ్యింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గంలో గార మేజర్ పంచాయతీ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. జిల్లాలో షర్మిల పాదయాత్ర ప్రభావం రెండు, మూడో విడతల్లో స్థానిక పోరుపై పడలేదు. మూడో విడత పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర విభజన ప్రభావం ఏ మాత్రం చూపకపోవడం గమనార్హం.
వౌన మునులు.. మననేతలు
(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
ప్రజల మనోభావాలకు భిన్నంగా యుపిఎ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సామాన్యులు సైతం తప్పుబడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, డాక్టర్లు , న్యాయవాదులు, ప్రజాసంఘాలు సైతం రోడ్లెక్కి సమైక్యంగా రాష్ట్రాన్ని ఉంచాలని వారి, వారి స్థాయిల్లో ఆందోళనలకు నడుంబిగించారు. బుధవారం జిల్లాలో విద్యాసంస్థల బంద్ పాటించారు. అయితే జనాల్లో ఇంత ఆగ్రహం పెల్లుబికినా రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్న చందంగా రాజకీయ నాయకులు వౌనవ్రతం పాటించడం జనం జీర్ణించుకోలేకపోతున్నారు. నేతల ప్రేక్షకపాత్ర వెనుక ఆయా పార్టీల అధిష్ఠానాలు బెదిరింపులు దాగివున్నాయని పలువురు అనుమానిస్తున్నారు. అయితే ప్రజల ఆకాంక్షల కన్నా, రాజకీయాలే ముఖ్యమా అంటూ పలువురు నిలదీస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం అక్కడి నేతల కున్న తపన, సమైక్యాంధ్ర కోసం మన నేతల్లో ఇసుమంత కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికల్లో అన్ని జిల్లాల కంటే శ్రీకాకుళం జిల్లా పౌరుల తలసరి ఆదాయం అతితక్కువగా ఉందంటూ తేల్చిచెప్పడమే కాకుండా ఉత్తరాంధ్ర మరింత వెనుకబడిందని ఆ కమిటీ కేంద్రానికి నివేదించిన విషయాన్ని కూడా జిల్లాకు చెందిన నేతలు విడమరిచి అధిష్ఠానం వద్ద ఏకరవు పెట్టలేకపోవడం మరింత దౌర్భాగ్యమంటూ సామాన్యులు ఛీకొడుతున్నారు. నదీజలాల వివాదానికి పరిష్కారం చూపే దిశగా సూచన చేయకపోవడం,(మిగతా 2వ పేజీలో)
ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంలో ఇక్కడ నేతలు విఫలమయ్యారని జనం ఆడిపోసుకుంటున్నారు. సమైక్యాంధ్ర సాధించుకుంటామని మంత్రి కోండ్రు మురళీమోహన్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులు పలుమార్లు ఢిల్లీలో మంత్రాంగం నెరిపి గత రెండురోజులుగా నోరు మెదపకపోవడంపై జిల్లా అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకమాండ్ మెప్పు సంపాదించి కేంద్ర క్యాబినెట్‌లో బెర్తును సంపాదించుకున్న కిల్లి కృపారాణి నిన్నటివరకు తాను సమైక్యవాదినే అంటూ గర్జించారే తప్ప..నేడు జరుగుతున్న సమైక్యఉద్యమానికి దూరంగా ఉంటూ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమంటూ తప్పించుకోవడాన్ని సమైక్యవాదులు తప్పుబడుతున్నారు. మరో మంత్రి శత్రుచర్ల జిల్లాలో ఇంత జరుగుతున్నా అతని ఆచూకీ తెలియరావడం లేదు. ఆ పార్టీకి చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమంటూ సెలవివ్వడంపై పౌరులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, మరో మాజీ గుండ అప్పల సూర్యనారాయణ తప్ప మిగిలిన నేతలంతా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కిమిడి కళావెంకట్రావు, కావలి ప్రతిభాభారతి, గౌతు శ్యామ్‌సుందర్‌శివాజీ, ఎర్రన్న వారసుడు రామ్‌మనోహరనాయుడులు మిన్నకుండిపోవడం చర్చకు దారితీస్తున్నది. ఇదిలా ఉండగా సమైక్యాంధ్రయే మా ఊపిరంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాలను సంధించి నేడు నోరుమెదపకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సమైక్యాంధ్రకు కట్టుబడి రాజీనామా చేస్తానని వెల్లడించడమే తప్ప విభజనపై ప్రజలు సాగిస్తున్న ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలియజేసే దాఖలాలు లేవు. అంతేకాకుండా షర్మిల పాదయాత్ర సంబరాల్లో వై.ఎస్. అభిమానులు తీరిక లేకుండా గడుపుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి దూరంగా ఉంటున్నారు. ఇలా మూడు పార్టీల నేతలు విభజనపై మిన్నకుండటం సరికాదని ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబాటు తనాన్ని పారద్రోలే విధంగా ఆయా అధిష్టానాల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుంటే రాజకీయ నేతలు చరిత్ర హీనులుగా మిగులుతారని సమైక్యవాదులంతా హెచ్చరిస్తున్నారు.
రేపు జిల్లా బంద్
శ్రీకాకుళం(కల్చరల్), జూలై 31: ప్రత్యేక తెలంగాణ తీర్మానాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం స్వచ్చంధ బంద్ పాటించాలని సమైక్యాంధ్ర ఉద్యమ వేదిక సమన్వయకర్తలు జామి భీమశంకర్, హనుమంతుసాయిరాంలు పిలుపునిచ్చారు. విద్యా, వ్యాపార, రవాణా, కార్మిక సంఘాలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ సంఘాలు ఈ బంద్‌లో స్వచ్చంధంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర విభజనకు నిరసనగా
రేపు వ్యాపారుల బంద్
పాతశ్రీకాకుళం, జూలై 31 : సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం చేపడుతున్న సిక్కోలు బంద్‌ను జయప్రదం చేయాలని పట్టన వర్తక సంఘం నాయకులు కోరాడ హరగోపాల్ పిలుపు నిచ్చారు. బుధవారం స్థానిక వర్తక సంఘం ఆధ్వర్యం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించడం తగదన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్న పునసమీక్షించుకోవాలన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో వర్తక సంఘం నాయకులు సాంబమూర్తి, దేవరశెట్టి సతీష్, శ్రీను, కామయ్య, నానాజీలు పాల్గొన్నారు.
అంబేద్కర్ యూనివర్సిటీలో
జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ సేవలు
* వైస్ ఛాన్సలర్ లజపతిరాయ్
ఎచ్చెర్ల, జూలై 31: జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థతో అంబేద్కర్ విశ్వవిద్యాలయం త్వరలో ఒప్పందం కుదుర్చుకొని మరిన్ని సేవలు పొందేందుకు ఆ సంస్థ జనరల్ ఎం.వి.రావు అంగీకరించారని వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ తెలిపారు. గత రెండురోజులుగా హైదరాబాద్‌లో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ జనరల్ ఎం.వి.రావుతో పలు అంశాలు చర్చించామని ఆయన వెల్లడించారు. గ్రామీణ వ్యవసాయక ప్రభుత్వ రంగాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ సంస్థ సేవలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అలాగే విశ్వవిద్యాలయంలో ఎం.ఏ రూరల్ డెవలప్‌మెంట్ విభాగంలోని విద్యార్థులకు పలు శిక్షణా కార్యక్రమాలు అందించి తద్వారా మరిన్ని సేవలందుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు, అప్లైడ్ పరిశోధనలు, రూరల్ టెక్నాలజీ వంటి కొత్త కోర్సులను విశ్వవిద్యాలయంలో ఆరంభించేందుకు జనరల్ రావు సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో విశ్వవిద్యాలయాన్ని ఆయన సందర్శిస్తారని ఓ ప్రకటనలో స్పష్టంచేశారు.
టెట్ ఫీజు చెల్లించేందుకు నేడు తుది గడువు
పాతశ్రీకాకుళం, జూలై 31: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) పరీక్షకు దరఖాస్తుచేసుకోదల్చిన అభ్యర్థులకు గురువారం సాయంత్రం 5 గంటల లోగా ఫీజు చెల్లించుకోవాలని డీఈఓ సింగూరి అరుణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే దరఖాస్తుదారులు అదే రోజు రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.