విశాఖపట్నం, జూలై 31: పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తన పట్టు ఇంకా పదిలంగానే ఉందని తెలుగుదేశం పార్టీ నిరూపించుకుంది. పంచాయతీ పోరులో భాగంగా బుధవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో ఆపార్టీ అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుని ప్రత్యర్థులను ఖంగుతినిపించింది. రానున్న మండల,జిల్లా పరిషత్ ఎన్నికల్లో తమకు ఎదురుండదని సవాలు చేసింది. తొలివిడతంలో మూడోస్థానంతో సరిపెట్టుకున్న తెలుగుదేశం అనూహ్యంగా పుంజుకుని సాధించిన విజయాలు ఆపార్టీ కేడర్‌ను ఆనందంలో నింపింది. అనకాపల్లి డివిజన్ పరిధిలో జరిగిన ఆఖరి విడత ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతాలు కావడం విశేషం. అయితే అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల పరిధిలో తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధిక్యతను చాటుకుంది. అదేవిధంగా యలమంచిలి నియోజకవర్గం పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. మూడో విడత ఎన్నికల్లో చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్, కౌంటింగ్ మొత్తం ప్రశాంతంగానే జరిగింది. డివిజన్ పరిధిలోని ఎన్నికలు జరిగిన 12 మండలాలకు గాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థుళు 10 మండలాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మంత్రి గంటాప్రాతినిధ్యం వహిస్తున్న కశింకోట, యలమంచిలి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న మునగపాక మండలాల్లో మాత్రం ఆపార్టీ కాస్త నిరాశాజనకమైన ఫలితాలు సాధించింది. అనకాపల్లి డివిజన్ పరిధిలో సత్తా చూపుతుందనకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ డివిజన్‌లో వైకాపాకు సీనియర్ లీడర్లు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు నాయకత్వం వహిస్తున్నప్పకీ వారిద్దరి మధ్య నెలకొన్న విబేధాలు ఆపార్టీ పుట్టి ముంచాయి. గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో తెలుగుదేశం, వైకాపాలు దాదాపు సమంగా స్థానాలను గెలుచుకున్నాయి. యలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు జరిగింది. ఇక్కడ వైకాపా మూడో స్థానానికే పరిమితమైంది. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో వైకాపా, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడ్డాయి. మాడుగల నియోజకవర్గంలో వైకాపా తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీనిచ్చినప్పటికీ రెండో స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. ఇక చోడవరం నియోజకవర్గంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ మధ్య పోటీ జరిగినా తెలుగుదేశం పార్టీదే ఆధిక్యమైంది.
దిక్కుతోచని ఎమ్మెల్యేలు
* రాజీనామాలంటూ నమ్మించే ప్రయత్నం
* ఆచూకీలేని మంత్రులు
* ఇళ్ళకే పరిమితమైన టిడిపి నేతలు
* బయటకు రాని బిజెపి, కమ్యూనిస్ట్‌లు
ఆంధ్రభూమి బ్యూరో, విశాఖపట్నం
పాపం అధికార పార్టీ ఎమ్మెల్యేలు. రాష్ట్రం ముక్కలైందన్న బాధ వారిలో ఉందో? లేదో? తెలియదు కానీ, తమ భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళన వారిలో పెరిగిపోయింది. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూ అమ్మలగన్న అమ్మ సోనియా తీసుకున్న నిర్ణయం వీరి ముఖాల్లో నెత్తురుచుక్క లేకుండా చేసింది. ఇళ్ళ నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల గుండెలు గుభేలుమన్నాయి. ప్రస్తుతం వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వైకాపా ఎదుగుతోంది. ఆ పార్టీ ఎలాగూ సమైక్యవాదాన్ని భుజాన వేసుకుంది. దీంతో తమ ఉనికికి ఎక్కడ భంగం వాటిల్లుతుందోనని భయపడిన ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి తమ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పంచకర్ల రమేష్‌బాబు తన పదవికి రాజీనామా చేసినట్టు మంగళవారం అర్థరాత్రి ప్రకటించారు. రాజీనామాను స్పీకరుకు పంపించామని చెప్పారు. తనంతట తానుగానే బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. అప్పటికే వివిధ జెఎసిలు బంద్‌కు పిలుపునిచ్చినా, పంచకర్ల మరోసారి పిలుపునిచ్చి తన ఉనికి చాటుకున్నారు. బుధవారం ఆయన నేరుగా ఆంధ్రా యూనివర్శిటీకి వచ్చి, విద్యార్థులకు మద్దతు పలికారు. ఆయనను ముందు విద్యార్థులు అడ్డుకున్నారు. రాజీనామా లేఖ చూపించమంటూ డిమాండ్ చేశారు. ఎట్టకేలకు పంచకర్ల విద్యార్థులతో మాట్లాడి బయటకు రాగలిగారు. అంతకు ముందు ప్రభుత్వ విప్ ద్రోణంరాజు, ఆతరువాత మళ్ళ విజయప్రసాద్ ఎయుకు వచ్చారు. వారు కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నెలల తరబడి ఉద్యమం కొనసాగుతోంది కదా! ఒక్క రోజు కూడా రోడ్డెక్కి ఉద్యమించని ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు బయటకు రావల్సి వచ్చింది? ఇదే అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలు ఆర్నెల్ల కిందటి నుంచి బహిర్గతం చేసి ఉంటే రాష్ట్రం ముక్కలయ్యేది కాదని జనం అంటున్నారు. బుధవారం యూనివర్శిటీ వద్ద జరిగిన ఆందోళనా కార్యక్రమానికి బయట నుంచి అనేక మంది వచ్చారు. వీరంతా అధికార కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకున్నారు. ఇక జిల్లా మంత్రులైతే అడ్రస్ లేకుండాపోయారు. వారు ఇంకా సమైక్యాంధ్ర కోసం రాజధానుల మధ్యే తిరుగుతున్నారు. ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వారి ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలు రోడ్డెక్కారన్న వాదన కూడా వినిపిస్తోంది. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇళ్ళకే పరిమితమైపోయారు. ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, బిజెపి, లెఫ్ట్‌పార్టీల నాయకులు బయటకు రాలేదు. జెఎసి చేసిన ఆందోళనలకు సరైన నాయకత్వం లేకపోవడం, పోలీసులు కూడా అనేక ఆంక్షలు విధించడం వలన సమైక్య నినాదం అంతగా వినిపించలేకపోయారు. మద్దిలపాలెం వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించడంతోపాటు, అగ్నిమాపక యంత్రాన్ని, వజ్ర టియర్ బులెట్ వాహనాలను అక్కడ మోహరించడంతో సామాన్యులకు అక్కడ ఏంజరుగుతోందనన్న భయం ఏర్పడింది.
కొనసాగుతున్న జూడాల సమ్మె
విశాఖపట్నం, జూలై 31: జూనియర్ వైద్యుల సమ్మె వరుసగా రెండోరోజుకు చేరుకుంది. బుధవారం సమ్మెను కొనసాగించారు. సమ్మెలో భాగంగా జూనియర్ వైద్యులు తమ విధులను బహిష్కరించారు. కేజిహెచ్ ఔట్‌గేట్ వద్ద కొద్దిసేపు నిరసన ప్రదర్శన చేపట్టిన జూడాలు ఆ తరువాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఏ ఒక్కరూ విధులకు హాజరుకాలేదు. దీనివల్ల రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చాలీ,చాలని వైద్యులతో పూర్తిస్థాయిలో వైద్యాన్ని అందివ్వలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పాటు వైద్య సేవలను తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ రాష్టవ్య్రాప్తంగా జూనియర్ వైద్యులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర జూనియర్ వైద్యుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ జిల్లా జూడాల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో భాగంగా జూనియర్ వైద్యుల సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో రెగ్యులర్ డాక్టర్ ఉద్యోగాలనివ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో దీనిని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
చర్చలకు సిద్ధంకండి: సర్కార్
రెండవ రోజుల సమ్మె కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించింది. మరో రెండు రోజుల్లో చర్చలకు పిలుస్తామని, దీనికి సిద్ధంగా ఉండాలంటూ ప్రభుత్వం పేర్కొంది.
వైద్య సేవలు యథాతథం
కేజిహెచ్‌లో అత్యవసర, సాధారణ వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం లేదని కేజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదన్‌బాబు తెలిపారు. తొలిరోజు సమ్మె జరిగిన మంగళవారం 1540 ఔట్ పెషేంట్లు నమోదు కాగా, ఇందులో దాదాపు వంద మంది రోగులు ఆసుపత్రిలో చేరారన్నారు. మిగిలిన వారంతా పలు రకాలైన పరీక్షలు, చికిత్సలు నిర్వహించుకుని వెళ్ళిపోయినవారేనన్నారు. అలాగే బుధవారం కూడా ఇదే స్థాయిలో ఔట్ పెషెంట్లు వచ్చారన్నారు.
జిల్లాలో సైకిల్ ఆధిక్యం
* ఆఖరి విడతలోనూ ‘దేశం’ దూకుడు
* రెండో స్థానంతో సరిపెట్టుకున్న వైఎస్సార్‌సిపి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 31: పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తొలుత తడబడిన తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకుని ప్రత్యర్ధి పార్టీలు బలపరచిన అభ్యర్థులను ఓడించి గెలుపు బావుటా ఎగురవేయడం గమనార్హం. తొలి విడత ఎన్నికల్లో ఆఖరి స్థానంతో సరిపెట్టుకున్న తెలుగుదేశం రెండో విడతలో అనూహ్యంగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ప్రధమస్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన ఆఖరి విడతలో మరింత దూకుడును ప్రదర్శించి జిల్లాలో అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకుని అగ్రస్థానానికి దూసుకెళ్లింది. నాయకత్వం లేమి, నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌ల సమన్వయలోపం ఉన్నప్పటికీ రెండు,మూడు విడతల్లో బాగా పంజుకోవడంతో తెలుగుదేశం ఆధిక్యం గణనీయంగా పెరిగింది. దీంతో వైకాపాను అధిగమించి అగ్రస్థానం దక్కించుగలిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజాదరణ, కేడర్ చెక్కుచెదరలేదన్న వాస్తవం రుజువైంది.
మూడో విడత ఫలితాలు
మొత్తం -- 322
కాంగ్రెస్ -- 89
టిడిపి -- 137
వైకాపా -- 62
ఇతరులు -- 29
5 పంచాయతీల ఫలితాలు రావాల్సి ఉంది.
----------------------------------
మొత్తం పంచాయతీలు -- 902
కాంగ్రెస్ - 235
టిడిపి - 315
వైకాపా - 244
ఇతరులు - 103
5 పంచాయతీల్లో ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది.
------------------------
ఏయులో దీక్షలు
* విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యేలు
విశాఖపట్నం, జూలై 31: సమైక్యాంధ్రకు మద్ధతుగా బుధవారం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చేపట్టిన దీక్షలకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఆయా రాజకీయ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుపై కేంద్రం ప్రభుత్వం చేసిన ప్రకటనకు నిరసనగా ఆంధ్రవిశ్వవిద్యాలయం గాంధీ విగ్రహం వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసి ప్రతినిధులు నిరాహారదీక్ష శిబారాన్ని నిర్వహించారు. బుధవారం ఇది కొనసాగింది. ఈ దీక్షా శిబిరాన్ని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు. దీక్షలో పాల్గొన్న విద్యార్థులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా మార్గం ద్వారానే ఉద్యమం చేపట్టాలన్నారు. అంతే తప్ప టిఆర్‌ఎస్ నేత కెసిఆర్ పంథాలో ప్రభుత్వాన్ని తప్పుపట్టించే విధానాలు సరైందికాదన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ మాట్లాడుతూ తాను రాజీనామా చేసినంత మాత్రాన ప్రయోజనం లేదన్నారు. సమైక్యతకు కట్టుబడి ఉంటూ జేఏసి చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన తరువాత అసెంబ్లీలో సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం పెట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఆ తరువాత దీక్ష శిబిరాన్ని సందర్శించి పరామర్శించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ అసెంబ్లీలో తీర్మానం పెట్టి మెజారిటీ కోసం పార్లమెంటుపై వత్తిడి తీసుకువస్తామన్నారు. మొట్టమొదటిసారిగా సమైక్యాంధ్రకు మద్ధతుగా తానే రాజీనామా చేసినట్టు చెప్పారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణనిస్తానంటూ బిజెపి ప్రగల్భాలు పలికిందని, అలాగే తెలుగు దేశం పార్టీ దీనికి అనుకూలంగా లేఖ రాసిందన్నారు. వీటన్నింటిపై యుపిఏ సర్కార్ తీసుకున్న నిర్ణయం సరైందికాదన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు మాట్లాడుతూ వైఎస్సార్‌సిపి మొదటి నుంచి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని, ప్రత్యేక తెలంగాణాను వ్యతిరేకిస్తుందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ముందుగానే రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికి పంపారన్నారు. కేంద్రంలో యుపిఏ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం ముక్కలుకానుందన్నారు. వైఎస్సార్‌సిపి నాయకులు దాడి వీరభద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రను తీసుకువస్తామని ప్రగల్భాలు పలికిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం చేస్తామని ప్రకటించారని, తక్షణమే తన మాటను నిలబెట్టుకోవాలన్నారు.
దిష్టిబొమ్మల దగ్ధం
సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసి ప్రతినిధులు ఏయు ప్రధాన గేటు వద్ద, అలాగే సాయంత్రం యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధ్రీశ్వరి, ఎంపీ లగడపాటి రాజగోపాల్, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఏయులో వివిధ విభాగాలను సందర్శిస్తూ భారీ ర్యాలీని చేపట్టారు. యువజన జేఏసి రాష్ట్ర కన్వీనర్ ఆడారి కిషోర్‌కుమార్, దీక్షా శిబిరంలో విద్యార్థి జేఏసి ప్రతినిధులు లగుడు గోవిందరావు, కాంతారావు, ఆరేటి మహేష్, సురేశ్‌మీనన్ తదితరులు పాల్గొని ప్రభుత్వ విధానాలను నిరసించారు. శ్రీ కృష్ణ కమిటీ సిఫారసులను సైతం విస్మరించి ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండానే ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా ప్రకటన చేయడంపట్ల నిరసన తెలిపారు.
సమైక్య ఉద్యమం...తీవ్రతరం
* రోడ్డెక్కిన ఉద్యోగ, కార్మిక సంఘాలు
విశాఖపట్నం, జూలై 31: విశాఖ నగరంలో సమైక్యవాదం ఊపందుకుంది. సమైక్య నినాదాలతో హోరెత్తింది. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు కోసం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలని ప్రభుత్వ సంస్థల ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఎలక్ట్రికల్ బిసి ఎంప్లారుూస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇంజనీరింగ్, డిప్లమో, ఎలక్ట్రికల్ ఎస్సీ,ఎస్టీ ఎంప్లారుూస్ అసోసియషన్, ఐఎన్‌టియుసి తదితర సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్)లో ఉద్యోగులు, సిబ్బంది బుధవారం గురుద్వారా జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి సమీపంలోనున్న సంస్థ కార్పొరేట్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా బిసి వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అవసరంలేదని, అయినా ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం విచారకరమన్నారు. దేశంలో చాలా రాష్ట్రాలను విభించాల్సి ఉండగా, వాటిపై దృష్టిపెట్టకుండా సమైక్యంగా ఉండే ఆంధ్ర రాష్ట్రాన్ని విభిజించాలని నిర్ణయించడాన్ని ఆయన వ్యతిరేకించారు. తమ సంస్థకు రూ.800 కోట్లకు పైగా బకాయి చెల్లించాల్సి ఉందన్నారు. బొగ్గు, విద్యుత్, జల వనరులు ఎక్కువుగా తెలంగాణాలోనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
ఇక భీమిలి, అనకాపల్లి జోనల్ కార్యాలయాలు
* స్పెషల్ ఆఫీసర్ల నియామకం
* ఆయా ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 31: నిన్నటి వరకూ అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలుగా ఉండేవి. ఎప్పుడైతే అవి జివిఎంసిలో విలీనమైపోయాయో, జోనల్ కార్యాలయాలుగా రూపాంతరం చెందాయి. అనకాపల్లి జోనల్ కార్యాలయానికి పూర్ణచంద్రరావును స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. అలాగే భీమిలి జోనల్ కార్యాలయానికి డిసిఆర్ సోమన్నారాయణను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. ఒక్కొక్కరికి ఐదుగురు సిబ్బందిని మంజూరు చేశారు. వీరు ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. అలాగే జోనల్ కార్యాలయాలకు గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయాలుగా బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ జివిఎంసిలో ఆరు జోన్‌లు ఉన్నాయి. ఈ రెండూ కలుపుకొంటే ఎనిమిది జోన్‌లు అయినాయి. అలాగే జివిఎంసిలో విలీనమైన పది గ్రామ పంచాయితీలకు గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ సబ్ జోనల్ కార్యాలయాలుగా బోర్డులు తగిలించారు. కమిషనర్ సత్యనారాయణ బుధవారం అనకాపల్లి, భీమిలి జోనల్ కార్యాలయాలను సందర్శించారు. జివిఎంసిలో అమలు జరుగుతున్న అన్న పథకాలను, కార్యక్రమాలు, అలాగే అత్యాధునిక సౌకర్యాలను ఈ జోనల్‌లలో కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
తూర్పు నౌకాదళాన్ని సందర్శించిన
మయన్మార్ కమాండర్-ఇన్ చీఫ్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 31: మయన్మార్ నేవీ కమాండర్ ఇన్ చీఫ్ తురా థిట్ స్వే అతని సతీమణి వాయ్ మార్ మార్ హుతున్, మరో నలుగురు సభ్యులతో కూడిన బృందం తూర్పు నౌకాదళానికి బుధవారం చేరుకుంది. వీరు రెండు రోజులపాటు తూర్పు నౌకాదళాన్ని సందర్శిస్తారు. తూర్ప నౌకాదళ అధికారి అనిల్ చోప్రా వీరికి స్వాగతం పలికారు. తూర్పు నౌకాదళంలోని యుద్ధ నౌకలు, సబ్ మెరైన్‌ల గురించి చోప్రా ఆయనకు వివరించారు.
మంత్రి గంటా ఇలాకాలో దేశం హవా
చతికిలపడిన కాంగ్రెస్
అనకాపల్లి, జూలై 31: మండలంలోని 32 సర్పంచ్ పదవులకు రెండు ఏకగ్రీవం కాగా, బుధవారం జరిగిన 30 పంచాయతీల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. రెండవ స్థానంలో వైఎస్సార్ నిలిచింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించే అనకాపల్లి మండలంలో 11 పంచాయతీల్లో టిడిపి మద్దతుదారులు విజయ దుంధుబి మోగించారు. వైఎస్సార్ సిపి తొమ్మిది స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాలకే పరిమితమైంది. ఇండిపెండెంట్లు మరో నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. మండలంలోని రెండు మేజర్ పంచాయతీల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. తుమ్మపాల మేజర్ పంచాయతీలో తెలుగుదేశం అభ్యర్థి చదరం మహాలక్ష్మినాయుడు ఆధిక్యతలో ఉండగా, కొత్తూరు మేజర్ పంచాయతీలో స్వతంత్య్ర అభ్యర్థి మేడిశెట్టి రాధ 15 ఓట్లమెజారిటీతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. గ్రామాల వారీగా ఎన్నికైన సర్పంచ్‌లు, వారి పార్టీల వివరాలిలాఉన్నాయి. వెంకుపాలెం - ఆడారి అనురాధ(వైఎస్‌ఆర్), తుమ్మపాల - చదరం మహాలక్ష్మినాయుడు(టిడిపి), తగరంపూడి - జామి రాములమ్మ (టిడిపి), సీతానగరం - గంగుపాం రామలక్ష్మి (కాంగ్రెస్), సత్యనారాయణపురం - కోరాడ నూకరత్నం (టిడిపి), పిసినికాడ - దాడి కమల(వైఎస్సార్), రేబాక - మంత్రి జ్యోతి (వైఎస్సార్), సంపతిపురం - నంబారు శ్రీను (కాంగ్రెస్), శంకరం - కరణం లక్ష్మీశ్యామల (టిడిపి), సుందరయ్యపేట - రేఖా అమ్మాజీ (టిడిపి), విజెపాలెం - పూడి చిన్నారావు( టిడిపి), ఆర్‌విపాలెం - రాజేశ్వరి (టిడిపి), పాపయ్యపాలెం - గంగిరెడ్ల గోవింద (కాంగ్రెస్), అక్కిరెడ్డిపాలెం - నారపిన్ని వెంకటలక్ష్మి (వైఎస్సార్), బట్లపూడి - నోట్ల జ్యోతి (వైఎస్సార్), బవులవాడ - మజ్జి లక్ష్మి (టిడిపి), సిహెచ్‌ఎన్ అగ్రహారం - ముమ్మిన పైడిరాజు (కాంగ్రెస్), దిబ్బపాలెం - పీలా శంకరరావు(ఇండిపెండెంట్), గొలగాం - చీకటి రాజు(స్వతంత్య్రం), గోపాలపురం - గొర్లి సూరిబాబు (వైఎస్సార్), కోడూరు - అర్జా ప్రేమకుమార్ (వైఎస్సార్), కొండుపాలెం - భవానీ (కాంగ్రెస్), కుంచంగి - పల్లెల బాబ్జీ (వైఎస్సార్), కూండ్రం - శానాపతి సరోజ (టిడిపి), మామిడిపాలెం - కరణం చిన్నారావు (టిడిపి), మార్టూరు - కరణం కృష్ణ (టిడిపి), మారేడుపూడి - ఈగల నూకరత్నం (వైఎస్సార్)లు గెలుపొందారు.
తెలంగాణపై పునరాలోచించాలి
* డిసిసి అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ
చోడవరం, జూలై 31 : రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయంపై యుపిఎ ప్రభుత్వం పునరాలోచించాలని జిల్లా కాంగ్రెస్ కమి టీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ అన్నారు. బుధవారం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంత వాతావరణంలో సంపూర్ణంగా జరిగింది. ఈ బంద్ సందర్భంగా పట్టణంలోని దుకాణాలన్నీ స్వచ్చందం గా మూసివేశారు. ఉదయం నుండి ముసురుపట్టి వర్షం కురుస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న అభిలాషతో పట్టణంలోని కొంతమంది యువకులు జై సమైక్యాంధ్ర వాల్‌పోస్టర్లను అంటించారు. చోడవరంలో పాన్‌షాపులతో సైతం పలు దుకాణాలను మూసివేసి సమైక్యాంధ్ర వాదాన్ని వ్యాపారులు బలపర్చారు. పట్టణంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద తప్ప మిగిలిన చోట్ల కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. ఆటోలు సైతం తిరగలేదు. అంతకుముందు పట్టణంలోని యువకులు సమైక్యాంధ్ర కోరుతూ స్థానిక కొత్తూరు జంక్షన్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారందరికీ రాష్ట్రం కోరుతూ అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి తగిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన విధంగా స్పందించి తెలంగాణ విభజనపై పునరాలోచన చేయాలని కోరారు. ప్రభుత్వం దీనిపై స్పందించని పక్షంలో ఆందోళన లను ఉద్ధృతం చేయనున్నట్లు సమైక్యవాదులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర కోరుతున్న యువత కోనేటి శ్రీనివాసరావు, టి.ప్రసాద్, సన్యాశిరావు, ఈశ్వరరావు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.
చీటీల పేరుతో టోకరా!
* రూ. కోటితో పరారీ
పాయకరావుపేట, జూలై 31: చీటీలు, స్కీములు, అప్పుల పేరుతో ఓ వ్యక్తి సుమారు కోటి రూపాయలతో పరారైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం బాధితులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పాయకరావుపేటలోని మంగవరం జంక్షన్ సమీపంలో విశాఖ డెయిరీ పార్లర్ నడుపుతున్న గోళ్ళ రవి అనే వ్యక్తి చీటీలు వేయడం, స్కీములు పెట్టడంతో జనాలు విపరీతంగా వచ్చి కట్టారు. చాలామంది అప్పులుగా కూడా ఇచ్చారు. వౌనిక మినీ మనీ ఫైనాన్స్ పేరుతో నెలకు 500 రూపాయల చొప్పున 21నెలలు చెల్లిస్తే అనంతరం 11వేలు చెల్లిస్తానని చెప్పడంతో సుమారు 244మంది స్కీములో చేరారు. వీరందరికి అక్టోబర్‌లో డబ్బులు చెల్లించవల్సి ఉంది. 18 నెలలు కట్టించుకున్నాడు. అలాగే 50 వేల రూపాయలు చీటీలు కట్టిన వారు సుమారు 50మంది ఉన్నారు. చా లామంది వద్ద 50వేల నుంచి ఐదు లక్షల వరకు అప్పులు తీసుకున్నాడని బాదితులు ఆవేదన వ్యక్తం చేశాడు. రవికి చెందిన డెయిరీ పార్లర్ గత కొద్దిరోజులుగా మూతపడి ఉండడంతో అసలు విషయం బయటపడింది. అవసరాలకు ఉపయోగపడతాయని డబ్బులు దాచుకుంటే రవి పరారయ్యాడని బాధితులు జగతా స్వామి, అయినవెల్లి గంగ, జగతా శ్రీను, పారేపల్లి వీరబాబు, జగతా నూకరాజు, నూకల రమణ, పురెడ్డి రమణారెడి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గోళ్ళ రవి తమ్ముడు స్వామి ఇదే విధంగా ప్రజలను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలుచేసి పరారయ్యాడని తెలిపారు. గోళ్ళ రవిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్న ట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై ఎస్సై జి.ప్రేమకుమార్‌ను వివరణ కోరగా మో సపోయిన వారు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.