Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఉవ్వెత్తున విభజన మంటలు

$
0
0

ఏలూరు, జూలై 31: రాష్ట్ర విభజన ప్రకటనతో సమైక్యవాదులు భగ్గుమన్నారు. సమైక్యాంధ్ర ఐకాస ఇచ్చిన పిలుపులోభాగంగా బుధవారం జిల్లావ్యాప్తంగా ఉవ్వెత్తున ఆందోళనలు ఎగిశాయి. రాష్ట్రాన్ని ఎట్టిపరిస్దితుల్లోనూ విభజించడానికి అంగీకరించేది లేదంటూ నినాదాలు చేశారు. ఉద్యమనాయకులు యుపిఎ పైనా, సోనియాగాంధీపైనా నిప్పులు చెరిగారు. ఓట్లు, సీట్ల కోసం సోనియాగాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆందోళనకారులు విమర్శించారు. తెలుగుజాతిని విడదీసి జాతికి తీరని ద్రోహం చేశారని, రాష్ట్ర విభజన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం నుంచి మరింత ఉద్ధృతస్ధాయిలో ఆందోళన నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా విభజనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి మొదలైన ఈ ఆందోళనలు బుధవారం నాటికి తీవ్రరూపం దాల్చాయి. అయితే గురువారం నుంచి వీటిని మరింత తీవ్రతరం చేయనున్నట్లు నేతలు ప్రకటించారు. పలుచోట్ల ఉద్వేగాలు భారీగా లేవటంతో అవి ఆందోళనలపై గట్టి ప్రభావానే్న చూపుతున్నాయి. ఇంతకాలం నాన్చి ఒక్కసారిగా విభజన ప్రకటన వెలువడటంతో జిల్లా ప్రజలంతా తీవ్ర ఆవేదనను, ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈనేపధ్యంలోనే ఆందోళనలను క్రమపద్దతిలో ముందుకు తీసుకువెళ్లేందుకు ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీలకమైన చొరవ తీసుకోగలిగారు. దీంతో అన్నివర్గాల భాగస్వామ్యంతో సమైఖ్యాంధ్ర పరిరక్షణ సమితి ఆవిర్భవించింది. జిల్లా జెఎసి ఛైర్మన్ ఎల్ విద్యాసాగర్‌ను దీనికి కన్వీనర్‌గా నియమితులయ్యారు. సమితి వేదికగా భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించాలని తీర్మానించారు. దీనిలోభాగంగానే గురువారం ఏలూరు బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇదిఇలాఉండగా సమైక్యాంధ్ర ఐకాస 72 గంటల మేర బంద్‌కు పిలుపునివ్వటంతో మొదటిరోజు బుధవారం జిల్లావ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుంచి ఉద్యమకారులు రోడ్లపైకి చేరుకుని ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. విద్యాసంస్ధలు, వాణిజ్యసంస్ధలను స్వచ్చందంగా మూసివేశారు. ప్రభుత్వకార్యాలయాలు, బ్యాంకులు, ఎటిఎం, ప్రైవేటు సంస్ధలు మూతపడ్డాయి. ఏలూరు, తాడేపల్లిగూడెంలలో పలు రైళ్లను ఆందోళనకారులు నిలిపివేశారు. జిల్లావ్యాప్తంగా అన్నిచోట్ల రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. ఈసందర్భంగానే సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పలుచోట్ల పొట్టి శ్రీరాములు విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. అలాగే ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాల కళ్లకు గంతలు కట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఊరేగింపులకు, నిరసన ప్రదర్శనలకు అడ్డులేకుండా పోయింది. అటు విద్యార్ధిలోకం, ఇటు విభిన్నవర్గాలు కలిసి ఆందోళనబాట పట్టడంతో జిల్లా కేంద్రమైన ఏలూరుతోపాటు జిల్లావ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఏలూరులోని ఫైర్‌స్టేషన్ సెంటరులో అరగంటకో నిరసన మాదిరిగా పరిస్దితి మారిపోయింది. ఎక్కడికక్కడ దిష్టిబొమ్మలను దగ్ధం చేయటం, కాంగ్రెస్ పార్టీ జెండాలను దగ్ధం చేయటం వంటివి అనేకం చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు సమైక్యాంధ్ర విషయంలో యుటర్న్ తీసుకున్న అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఇదే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. కేంద్రమంత్రి తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనలు జరుగుతుండగా దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కావూరి వర్గీయులు వారికి ఎదురు ఆందోళన చేయటంతో ఏలూరులో పలు సందర్భాల్లో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యాంధ్ర పేరుతోనే ఈరెండు ఆందోళనలు సాగటం, ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవటం గమనార్హం. అయితే ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు మాత్రం చోటుచేసుకోలేదు. మొత్తంమీద సమైక్యాంధ్ర సెగ తీవ్ర స్ధాయికి చేరుకుంటోంది.

టిడిపిదే హవా
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జూలై 31: పంచాయతీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహన్ని నింపుతున్నాయి. ప్రధాన నాయకులు ఎవరూ ప్రధానపాత్ర పోషించకపోయినా అనూహ్యఫలితాలు రావటంపై ఆ పార్టీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, వైఎస్సార్‌సిపి పార్టీలు ప్రభావం చూపుతాయని భావించిన కొన్ని ప్రాంతాల్లో సైతం టిడిపి మద్దతుదారులు ఆశాజనకమైన ఫలితాలు సాధించటంపై రాజకీయవర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. స్ధానిక నాయకులపై అసంతృప్తితోపాటు ప్రభుత్వ వ్యతిరేకత కూడా టిడిపి బలం పెరగడానికి ఒక కారణంగా వారు పేర్కొంటున్నారు. ప్రధానంగా వస్తున్నా...మీకోసం యాత్ర సందర్భంగా కార్యకర్తల్లో పార్టీ అధినేత కొత్త ఉత్సాహన్ని నింపటంతో వారంతా పార్టీ మద్దతుదారుల గెలుపే ధ్యేయంగా పనిచేయటంతోనే పంచాయితీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధ్యమయ్యాయని భావిస్తున్నారు. మూడు విడతలుగా జరిగిన పంచాయితీ ఎన్నికలలో తొలినుంచి టిడిపి తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రకటన వెలువడగానే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొన్ని నియోజకవర్గాల్లో ముందంజలో నడుస్తూ వచ్చారు. స్ధానిక నాయకులు ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఫలితాలు కొంత ఆశాజనకంగానే ఉంటాయని వారంతా భావించారు. అయితే తాము అనుకున్న దానికన్నా ఎక్కువగానే స్ధానాలు లభించటంతో అటు పార్టీలోను, ఇటు కార్యకర్తల్లోనూ పార్టీకి పూర్వవైభవం వస్తుందన్న ఆశ మొదలైంది. ఇప్పటివరకు వైఎస్సార్‌సిపి పార్టీని చూసి భయపడినవారంతా ఈ ఫలితాలను చూసి అధికార కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని నిరూపితమైందని సంబరపడుతున్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అభివృద్ధి పనులను నమ్ముకుంటూ ముందుకుసాగింది. సంక్షేమ పధకాలు చూసి ప్రజలు ఓట్లు వేస్తారని భ్రమపడింది. ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులైతే అసలు ఎన్నికల సమయంలో నియోజకవర్గాల మొఖం చూడలేదంటే ఆతిశయోక్తి కాదు. మరికొందరు ఇక్కడే ఉన్నా పార్టీ మద్దతుదారుల తరపున ప్రచారం చేసే విషయంలో తగిన ఆసక్తి కనపర్చలేదు. దీంతో ఇప్పుడు నాయకులు తమ నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించుకున్నట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు వైఎస్సార్‌సిపి జిల్లాలో మూడవ స్ధానానికి పరిమితం కావాల్సి వచ్చింది. జగన్ పట్ల సానుభూతి, షర్మిల పాదయాత్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే అత్యధిక స్ధానాలు గెలుస్తామని ఆ పార్టీ నేతలు, శ్రేణులు భావించాయి. కాని ఆశించిన మేర స్ధానాలు దక్కలేదు. టిడిపిని వెనక్కి నెట్టేసి కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్ధిగా వైఎస్సార్‌సిపి నిలుస్తుందని అంతా భావించారు. కాని అలాంటి పరిస్థితి కన్పించలేదు. జిల్లాలో మూడువిడతలుగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో మొత్తంమీద టిడిపి 336 పంచాయితీలను, కాంగ్రెస్ పార్టీ 222, వైఎస్సార్‌సిపి 194, ఇండిపెండెంట్లు 122, సిపిఎం రెండు పంచాయితీలను కైవసం చేసుకున్నాయి. అయితే ఇంకా నాలుగు పంచాయతీల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. తొలి రెండు విడతల్లానే తెలుగుదేశం పార్టీ బుధవారం జరిగిన మూడవ విడతలోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. చివరివిడతలో టిడిపి 58, వైఎస్సార్‌సిపి 52, కాంగ్రెస్ 43, ఇండిపెండెంట్లు 25 స్ధానాలను దక్కించుకున్నాయి.
ప్రశాంతంగా
తుది విడత పోలింగ్
*గుండెపోటుతో ఇద్దరు మృతి
*తాగివచ్చిన పిఒపై వేటుకు సిఫార్సు
ఆంధ్రభూమిబ్యూరో
ఏలూరు, జూలై 31: జిల్లాలోని నర్సాపురం డివిజన్‌లోని 12 మండలాల్లోని పంచాయతీలతోపాటు, గతంలో వాయిదా పడ్డ పోలవరం మండలంలోని అయిదు పంచాయతీలకు బుధవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 182 పంచాయితీలకు, 1335 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా కాళ్ల మండలంలో 90.95శాతం, అత్యల్పంగా పోలవరం మండలంలో 78.84 శాతం ఓట్లు పోలయ్యాయి. అక్కడక్కడ అభ్యర్ధుల అనుచరుల మధ్య వాగ్వివాదాలు మినహా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా నిర్వహించారు. దీంతో మూడు విడతల పంచాయితీ ఎన్నికల ఘట్టానికి బుధవారం నాటితో తెరపడింది. కాగా బుధవారం నాటి పోలింగ్ సందర్భంగా ఓటుహక్కు వినియోగించుకున్న ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు గుండెపోటుతో మృతిచెందటం పెనువిషాదాన్ని మిగిల్చింది. పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామానికి చెందిన కడలి మహలక్ష్మి(62) ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో గుండెపోటుతో మృతిచెందింది. అదే గ్రామానికి చెందిన పేరం రామస్వామి(70) ఓటు వేసి ఇంటికి వెళ్లి భోజనం చేస్తున్న సమయంలో గుండెపోటుతో మృతిచెందారు. ఇక వీరవాసరం మండలం తోలేరులోని 19/5 పోలింగ్ బూత్‌కు ప్రిసైడింగ్ అధికారిగా నియమితులైన ఉపాధ్యాయుడు అడపా సురేష్ మద్యం తాగి విధులకు హాజరుకావటంతో అయన్ని విధులనుంచి తొలగించి అసిస్టెంటు పిఓకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇదేసమయంలో సురేష్‌పై చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టరుకు సిఫార్సు చేసినట్లు తహసిల్దార్ తెలిపారు.
నర్సాపురం డివిజన్‌లోని 12 మండలాల్లో, పోలవరం మండలంలోను ఉదయం 7గంటలకు పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఒంటిగంటకు పోలింగ్ పూర్తయ్యేసరికి డివిజన్‌లో 87.01 శాతం, పోలవరంలో 78.84 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆచంటలో 80.48 శాతం, ఆకివీడులో 87.57శాతం, భీమవరంలో 88.52 శాతం, యలమంచిలిలో 88.20శాతం, కాళ్లలో 90.95శాతం, మొగల్తూరులో 87.13శాతం, నర్సాపురంలో 89.22శాతం, పాలకొల్లులో 87.60శాతం, పాలకోడేరులో 86.49శాతం, పోడూరులో 83.66శాతం, ఉండిలో 86.94శాతం, వీరవాసరం మండలంలో 87.33శాతం, పోలవరం మండలంలో 78.84 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ఒంటిగంటకు ముగించినా కౌంటింగ్ ప్రక్రియ మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక బుధవారం ఒకప్రక్క పోలింగ్ జరుగుతుండగా చాలాచోట్ల బూత్‌ల వద్ద మందుబాబులు నానా హంగామా సృష్టించారు. రాత్రి నుంచి మందు తాగుతూనే ఉండటంతో పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకుని ఓటు వేసేందుకు వచ్చినవారిని అడ్డుకుంటూ, అసభ్యపదాలతో దూషిస్తూ రావటంతో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కొన్నిచోట్ల బుధవారం తెల్లవారుజామున కూడా డబ్బు, తాయిలాల పంపిణి కొనసాగినట్లు సమాచారం. గత రాత్రి ప్రత్యర్ధులు ఓటుకు ఎంత ఇచ్చారో తెలుసుకున్న కొంతమంది అభ్యర్ధులు తాము ఇచ్చింది తక్కువని గుర్తించి మిగిలిన మొత్తాలను తెల్లవార్లు పంచుతూ వచ్చారు. కొన్నిచోట్ల ఓటుకు అయిదువేల రూపాయల వరకు కూడా ముట్టచెప్పారని తెలుస్తోంది. ఇక మహిళలకు అయితే చీర, జాకెట్టు ముక్క, రూపులు, ముక్కుపుడకలు వంటివి పంపిణి చేసారని ప్రచారం సాగుతోంది.

సమైక్య బంద్ సంపూర్ణం

ఏలూరు, జూలై 31 : ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని, విభజిస్తే సహించేది లేదంటూ ప్రజల నిరసనలతో జిల్లా కేంద్రం ఏలూరు హోరెత్తింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్ర జె ఎసి 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బుధవారం ఏలూరులో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రజలు ముఖ్యంగా యువత, విద్యార్ధులు, వ్యాపారులు, పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు యుపి ఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం ఉదయం నుంచే నగరంలో పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, మోటారు సైకిల్ ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు, దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రజల నినాదాలతో నగరమంతా మార్మోగింది. బంద్ కారణంగా నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపింపచేశాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇదే పరిస్థితి నగరంలో అన్ని ప్రాంతాల్లోనూ కనిపించింది. సమైక్యాంధ్ర బంద్ కారణంగా నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, సినిమాహాళ్లు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆర్‌టిసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జూట్‌మిల్లు కూడా తెరచుకోలేదు. స్థానిక మోతేవారితోటలో గల కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయం వద్ద ఎపి ఎన్‌జివో సంఘం నేతలు, వైకాపా నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి కావూరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో కత్తిరాము ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నేతలు అక్కడకు చేరుకుని కావూరికి అనుకూలంగాను, సమైక్యాంధ్రకు మద్దతుగానూ నినాదాలు ప్రారంభించారు. ఈ సమయంలో ఉద్వేగాలు చెలరేగడంతో ఈ రెండు వర్గాల మధ్య తోపులాట నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని విడదీశారు. ఇదే సమయంలో మరింత మంది యువజన కాంగ్రెస్ నేతలు అక్కడకు చేరుకున్నారు. అలాగే వైకాపా నేతలు కూడా భారీ సంఖ్యలో కావూరి క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ వచ్చారు. కొద్దిసేపటికి వైకాపా నేతలు వెనుతిరగడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఏలూరుతోపాటు నగర పరిసర ప్రాంత గ్రామాలైన వట్లూరు, పెదపాడు, చాటపర్రు, మాదేపల్లి, జాలిపూడి, చొదిమెళ్ల, శనివారపుపేట, గవరవరం, సత్రంపాడు తదితర ప్రాంతాల్లో కూడా బంద్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. విద్యార్ధులు ఆయా గ్రామాల్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ర్యాలీలు నిర్వహించారు. సర్ సి ఆర్ ఆర్ కళాశాల డిగ్రీ, పిజి సిబ్బంది సమైక్యాంధ్రకు మద్దతుగా నగరంలో మోటారు సైకిళ్ల ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో సర్ సి ఆర్ ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ వీర్రాజు చౌదరి, అధ్యాపకులు ఎల్ వెంకటేశ్వరరావు, వి వెంకట్రావు, డాక్టర్ సి రవి, ఎన్‌వి ఎస్ ఎస్ పతంజలి, డాక్టర్ డి చంద్రశేఖరరావు, డాక్టర్ కెవి ఎస్ ఆచార్య, డాక్టర్ ఎన్‌వి ఎస్ ఎస్ ప్రసాద్, వి డేనియల్, జివి ఎస్ ఎస్ చంద్రమోహన్, వి రామబ్రహ్మం, కె శివాజీ, వినె్సంట్ పాల్, వివి రమణ, డాక్టర్ కె రామరాజు పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని విభజించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల స్ఫూర్తికి ఇది విఘాతం కలిగించే అంశమని వారు అన్నారు. ఇప్పటికైనా విభజన అంశాన్ని పునఃసమీక్షించి రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని అన్నారు.
సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఏర్పాటు
సమైక్యాంధ్ర సాధించడం కోసం కార్యాచరణ ప్రణాళికలను రూపకల్పన చేసేందుకు బుధవారం సాయంత్రం ఏలూరు బార్ అసోసియేషన్‌లో ఏలూరునకు చెందిన వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, చేతివృత్తులు, ఉద్యోగ, స్వచ్ఛంద సంస్థలు తదితర సంఘాల నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణ కోసం సమైక్యాంధ్ర పరిరక్షణ సమితిని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ గురువారం కూడా నగర బంద్ నిర్వహించాలని సమితి నిర్ణయించింది. సమితి ఛైర్మన్‌గా లాము విద్యాసాగర్, వైస్ ఛైర్మన్‌గా నేరెళ్ల రాజేంద్ర, సభ్యులుగా ఎంబిఎస్ శర్మ, కోనేరు సురేష్‌బాబు, జిల్లెళ్లమూడి నరసింహరావు, కానాల రామకృష్ణ, టి ఆర్ ఆర్ మోహనరావు, కోనే రామ్మోహనరావు, ఎం ఎన్ శ్రీకాంత్, జి ఆనందరావు, వి రామకృష్ణ, డివి కృష్ణారెడ్డి, ఎం రాజేంద్ర, శ్రీనివాసబాబు, జుజ్జువరపు జయరాజులు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పాటించినట్లు ఆ సంఘం అధ్యక్షులు ఎంబి ఎస్ శర్మ తెలిపారు. జిల్లా కోర్టులోని న్యాయవాదులు విధులను బహిష్కరించారు. వై ఎస్ ఆర్ సిపి ఆధ్వర్యంలో మోటారు సైకిల్ ర్యాలీని నిర్వహించారు.
స్థానిక పాతబస్టాండ్ వద్ద నిర్వహించిన ఆందోళనలో టిడిపి నాయకులు అంబికా కృష్ణ, బడేటి బుజ్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాస్తారోకో నిర్వహించి సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వసంతమహల్ సెంటర్ వద్దకు చేరుకుని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. నాయకులు పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్‌బాబు, కొల్లేపల్లి రాజు, విద్యార్ధి సంఘ నాయకులు ఈవని భాస్కర్, దొంతంశెట్టి సాయినాధ్, అడపా సంజయ్, రాపాక దుర్గాప్రసాద్, గుర్రాల సునీల్, వైకాపా నేతలు గంపల బ్రహ్మావతి, మంచెం మైబాబు, మున్నుల జాన్‌గురునాధ్, పొలిమేర హరికృష్ణ, కోలా భాస్కరరావు, గుడిదేశి శ్రీను, ఎన్‌జివో సంఘం నాయకులు ఆర్ ఎస్ హరనాధ్, టి యోగానంద్, కిష్టవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో...
జంగారెడ్డిగూడెం: ఓట్లు, సీట్ల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలోని యు.పి.ఎ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చివేసిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్‌సి పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జంగారెడ్డిగూడెం బంద్ జరిగింది. బంద్ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు స్థానిక ఆర్టీసీ బస్ డిపో నుండి బస్సులు నడపకుండా అడ్డుకున్నారు. బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో చేసారు. యుపిఎ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసారు. వైఎస్‌ఆర్‌సి పార్టీ పిలుపు మేరకు పట్టణంలోని వర్తక, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు మూసి వేసారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న బాలరాజు మాట్లాడుతూ సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని విభజించడం దురదృష్టకరమని, అన్నదమ్ముల్లా అన్ని ప్రాంతాలు కలసి మెలసి ఉన్న రాష్ట్రాన్ని విభజించడం రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఎటువంటి విధి విధానాలు లేకుండా ఏకపక్షంగా, నిరంకుశంగా కాంగ్రెస్ ప్రభుత్వం విభజించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు పరిగణనలోకి తీసుకోకుండా ఓట్లు, సీట్ల కోసం, స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నిలువునా చీల్చి వేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు గుర్తించి విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని, రాష్ట్రం అగ్నిగుండం కాకుండా చూడాలని అన్నారు. రాష్ట్రంలో చిచ్చుపెట్టిన పాపం యుపిఎ ప్రభుత్వానిదేనని, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకే రాష్ట్ర విభజన చేసారని విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సి పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని అణచివేసేందుకే రాష్ట్ర విభజన చేసారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కొమ్ము కాస్తున్నారని, రాష్ట్ర విభజనపై నోరు మెదపడం లేదని బాలరాజు విమర్శించారు. చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం వల్లే రాష్ట్రం విడిపోతుందని ఆవేదన వ్యక్తం చేసారు. సమైక్యవాదులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. నదీజలాలు, సరిహద్దుల సమస్యలు తేలకుండా, ఆంధ్రప్రదేశ్ రాజధాని తేల్చకుండా, విభజన ప్రకటన చేయడం బ్రిటీష్ పాలన తలపిస్తోందని, సోనియా గాంధీ బ్రిటీష్ పాలకుల తరహాలో విభజించి పాలించు విధానంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మనోభావాలు గుర్తించి, విభజన విరమించుకోవాలని డిమాండ్ చేసారు. ఈ ఆందోళనలో వైఎస్‌ఆర్‌సి పట్టణ కన్వీనర్ చనమాల శ్రీనివాసరావు, పార్టీ నేతలు పోల్నాటి బాబ్జి, రావూరి కృష్ణ, బొల్లిన వెంకటేశ్వరరావు, కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, కె.సురేష్‌రెడ్డి, పాశం రామకృష్ణ, పాములపర్తి శ్రీనివాసరావు, కేమిశెట్టి మల్లిబాబు, గూడపాటి రాధాకృష్ణ తదితరులు నాయకత్వం వహించారు.
ముక్కలు చేయడం అన్యాయం:ఉషారాణి
పాలకొల్లు: రాష్ట్రాన్ని ముక్కలు చేయటం అన్యాయమని, తాను ఎప్పుడూ సమైక్యవాదినేనని ఎమ్మెల్యే బంగారు ఉషారాణి అన్నారు. స్థానిక గాంధీబొమ్మల సెంటర్లో బుధవారం సమైక్యాంధ్ర ఉద్యమకారులు నిర్వహించిన రాస్తారోకోలో ఆమె పాల్గొని, సమైక్య వాదానికి మద్దతు పలికారు. అధిష్టానం తెలంగాణాకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ, అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తాను వ్యతిరేకిస్తానన్నారు. సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని కోరగా, ఆమె స్పందిస్తూ పదవికి రాజీనామా చేయటంవల్ల ప్రయోజనం ఉండదని, పదవి ఉంటే అసెంబ్లీలో తన వాదన వినపించే అవకాశం ఉంటుందన్నారు. సమైకాంద్ర ఉద్యమ కన్వీనర్ డాక్టర్ కెఎస్‌పిఎన్ వర్మ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీయటానికి ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకపోవటం రాష్ట్ర ప్రజలను అవమానపరిచినట్లేనన్నారు. పాలకొల్లులో బుధవారం సమైక్య వాదుల పిలుపుమేరకు బంద్ సంపూర్ణంగా జరిగింది. పట్టణంలో ఆందోళనకారులు ర్యాలీ నిర్వహించారు. ఎప్పుడులేని విధంగా యువత ముందుకు వచ్చి మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించటం సమైక్యవాదంపట్ల వారి వాదనను చెప్పారు. తొలుత పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిహెచ్ సత్యనారాయణమూర్తి, ఛాంబర్స్ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణ, మాటూరి నారాయణమూర్తి, గండేటి వెంకటేశ్వరరావు, యు కబర్ది, బొక్కా రమాకాంత్, శిడగం పాపారావు, యడ్ల శివాజీ, చల్లా ఆదినారాయణ, దీప్తి అప్పారావు, ముచ్చర్ల శ్రీరాం, విద్యార్థులు, వర్తకులు, యూత్ ఫ్రెండ్స్ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కాగా గ్రామాల్లో ఎన్నికలకు, ప్రజలకు ఈ బంద్‌తో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

శ్రీవారి దేవస్థానం సూపరింటెండెంట్ సస్పెన్షన్
ద్వారకాతిరుమల, జూలై 31: పంచాయతీ ఎన్నికల్లో స్టేజ్ 2 అధికారిగా నియమితుడై విధుల్లో బాధ్యతా రాహిత్యంగాను, నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు శ్రీవారి దేవస్థానం సూపరింటెండెంట్ సిఎస్ నారాయణను సస్పెండ్ చేస్తూ ఆలయ ఇఒ వేండ్ర త్రినాథరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయనను విధుల నుండి తాత్కాలికంగా తొలగించినట్లు ఇఒ పేర్కొన్నారు. వివరాల ప్రకారం పెంటపాడు మండలం పరిమెళ్ల గ్రామంలో ఈ నెల 23న మొదటి విడతగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నారాయణ స్టేజ్ 2 అధికారిగా విధుల్లో చేరారు. ఎన్నికల సంఘ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఓట్ల లెక్కింపులో బయట వారిని సెల్‌ఫోన్లతో అనుమతించడంతో పాటు చెల్లని ఓట్ల లెక్కింపునకు ఏజంట్లకు అనుమతినిచ్చి లెక్కింపు కేంద్రంలో ఆయన గందరగోళం సృష్టించినట్లు ఏలూరు ఆర్డీవో కె నాగేశ్వరరావు చేపట్టిన విచారణలో తేలింది. దీంతో ఆయన తన నివేదికను ఎలక్షన్ కమిషన్‌కు అందచేశారు. ఎన్నికల విధుల్లో ఆయన నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్లు తేల్చి ఎలక్షన్ కమిషన్ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్ ఆదేశాలను అమలు చేసినట్లు ఇఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.
రైతులపై కిరాయి రౌడీల దాడి: దేహశుద్ధి, పోలీసులకు అప్పగింత
ద్వారకాతిరుమల, జూలై 31: వ్యవసాయ పనులు చేసుకుంటున్న సండ్రగుంట గ్రామ రైతులపై బుధవారం మధ్యాహ్నం కొందరు కిరాయి రౌడీలు దాడి చేశారు. దీంతో భీతిల్లిన రైతులు గ్రామస్థుల సహకారంతో వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి ద్వారకాతిరుమల పోలీసులకు అప్పగించారు. బాధిత రైతులు దాసరి నవీన్, జక్కల ఏసురాజు, దాసరి పోతురాజు, నడవంక చంద్రరావు తదితరులు విలేఖర్లకు తెలిపిన వివరాలిలావున్నాయి. మండలంలో పి కన్నాపురం పంచాయతీ సండ్రగుంటకు చెందిన కొందరు భూమిలేని 20 మంది నిరుపేద రైతులకు పంచాయతీ తీర్మానం ద్వారా ఒక్కొక్కరికి 20 సెంట్లు భూమిని ఇచ్చారు. అయితే ఈ భూమిని వారు అదే గ్రామానికి చెందిన పి మహలక్ష్ముడు అనే వ్యక్తికి గత ఏడాది కౌలుకు ఇచ్చారు. అయితే ఈ ఏడాది రైతులు తామే స్వయంగా వ్యవసాయం చేసుకుంటామని చెప్పి బుధవారం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో తాడేపల్లిగూడెం, బాదంపూడి, నెల్లమిల్లి గ్రామాలకు చెందిన 17 మంది కిరాయి రౌడీలు రైతులపై దాడి చేశారు. దీంతో రైతులు గ్రామస్థుల సహకారంతో వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి ఆటోల్లో ద్వారకాతిరుమల పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి అప్పగించారు. ద్వారకాతిరుమల ఎస్సై పోతరాజు కేసు విచారిస్తున్నారు.
ఓటుహక్కు వినియోగించుకున్న రంపచోడవరం మెజిస్ట్రేట్
వీరవాసరం, జూలై 31: వీరవాసరం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. వీరవాసరం గ్రామానికి చెందిన మెజిస్ట్రేట్ వీరవల్లి గోపాలకృష్ణ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈయన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ తనకు ఓటుహక్కు వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఉన్నా వచ్చి, ఓటుహక్కును వినియోగించుకుంటున్నానని చెప్పారు.

*బంద్ విజయవంతం *నేటి నుండి ఉద్యమం మరింత తీవ్రతరం
english title: 
u

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>