అరుదుగా ఆంధ్రప్రదేశ్‌లో సైకో కిల్లర్స్ గురించిన వార్తలని వింటున్నాం. సైకో కిల్లర్ అంటే అకారణంగా ఎలాంటి సంబంధం లేని వాళ్లని చంపేవాడు. ప్రపంచంలోని అలాంటి తొలి సైకో కిల్లర్ లండన్‌లో 1888లో జీవించాడు. అతని పేరు? ఈనాటికీ ఎవరికీ తెలీదు. అంటే ఆనాటి పోలీసులు అతన్ని కనిపెట్టలేక పోయారు. దాంతో అతనికి ‘జాక్ ది రిప్పర్’ అనే ముద్దు పేరుని పత్రికల వాళ్లు పెట్టారు.
జాక్ ది రిప్పర్ ప్రత్యేకత ఏమిటంటే అతను కేవలం ఆడవారినే చంపేవాడు! అదీ వేశ్యలనే! ఇక వివరాల్లోకి వెళ్తే- లండన్‌లోని ఈస్ట్ ఎండ్ ప్రాంతంలో మొదటి హత్య ఆగస్టు 31, 1888న జరిగింది. మేరిపన్ నికోలస్ వైట్ ఛాపెల్ ప్రాంతంలోని బక్స్‌రోలో నివసించేది. ఆమె పొట్టలో పొడిచి తర్వాత గొంతు కోసి చంపబడింది. ఆ తర్వాత చంపబడ్డ వారి కడుపుల్లోంచి ఆర్గాన్స్‌ని హంతకుడు బయటకి తీయడంతో అతను వైద్యవృత్తిలో ఉన్నవాడని పోలీసులు భావించారు. ఈ హత్య పరిశోధన కొనసాగుతూండగానే మళ్లీ ఎనిమిది రోజుల తర్వాత సెప్టెంబర్ 8న అన్నీ చాప్‌మేన్ అనే ఇంకో వేశ్యని మేరిపన్‌ని చంపిన విధంగా ఎవరో చంపారు. ఈ రెంటి హంతకుడు ఒకరే అని పోలీసులు హత్యా విధానాన్నిబట్టి గ్రహించారు. ఆ తర్వాత కూడా వైట్‌ఛాపెల్ ప్రాంతంలో మరి కొందరు వేశ్యలు చంపబడటంతో వాటన్నింటినీ ‘వైట్ ఛాపెల్ మర్డర్స్’ అనీ, హంతకుడికి ‘వైట్ ఛాపెల్ హంతకుడు’ అని పిలవసాగారు.
మళ్లీ సెప్టెంబర్ 30, 1888న ఆ హంతకుడు ఇద్దరు వేశ్యలని చంపాడు. లిజ్‌స్టైడ్, కేట్ ఎడ్డొలెస్‌లని అదే పద్ధతిలో హత్య చేశాడా అజ్ఞాత హంతకుడు. వేశ్యలకి డబ్బు ఇచ్చి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి హంతకుడు వారిని చంపుతున్నాడని పోలీసులు గ్రహించారు. ఆరు అంగుళాల కత్తిని అందుకు ఉపయోగించేవాడు. రక్తం ధారాళంగా కారడంతో వారు త్వరగా మరణించేవారు.
తామే ఆ హత్య చేశామని డజన్ల కొద్దీ అనామక ఉత్తరాలు పోలీసులకు అందసాగాయి. వారిలో ఒకతను అడ్రస్ ఇవ్వకుండా ‘జాక్’ అని సంతకం చేయడంతో జాక్ ది రిప్పర్ అనే పేరు ఆ హంతకుడికి స్థిరపడింది. రిప్పింగ్ అంటే కోయడం అని అర్థం. రిప్పర్ అంటే కోసేవాడు. దాంతో వైట్ ఛాపెల్ మర్డరర్ అనే పేరు మరుగున పడిపోయి ఇప్పుడు ఆ హంతకుడిని జాక్ ది రిప్పర్‌గా పిలుస్తున్నారు. వరస హత్యలు చేసిన ఆ సీరియల్ కిల్లర్ అక్టోబర్ నెలంతా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతను తిరిగి నవంబర్ 9, 1888న మేరీ జేన్ కెల్లి అనే ఐదో వేశ్యని హత్య చేశాడు. వారి సమాధులని కూడా లండన్‌కి వెళ్లే ఆసక్తిగల పర్యాటకులు చూస్తారు.
ఈ ఐదు హత్యలే కాక జాక్ ది రిప్పర్ చేశాడని భావించే మరో పదమూడు హత్యలు ఏప్రిల్ 1891 దాకా జరిగాయి. డిసెంబర్ 26, 1887న ఫెయిర్ ఫే అనే ఆమెతో మొదలై 24 ఏప్రిల్ 1891న కేరిబ్రూన్ అనే ఆమె హత్యతో అవి ముగిసాయి. కాని పోలీసులు వారి హంతకుడు నిశ్చయంగా జాక్ ది రిప్పర్ అని గట్టిగా నిర్ణయించలేక పోయారు. 1891 తర్వాత ఆ హత్యలు పూర్తిగా ఆగిపోయాయి.
ఆ సమయంలో లండన్‌లోని ఈస్ట్‌ఎండ్‌లో వెయ్యి మంది దాకా వేశ్యలు ఉండేవారు. జార్ చక్రవర్తి పాలించే రష్యా నించి, ఐర్లండ్ నించి అనేక మంది కాందిశీకులు ఇంగ్లండ్‌కి వలస వచ్చి లండన్‌లోని ఈస్ట్‌ఎండ్‌లో నివసించేవారు. అదంతా స్లమ్ ఏరియాగా ఉండేది. అక్కడ జీవించేవారంతా బీదవారే.
మొదటి ఐదు మంది హతురాళ్ల శరీరాలని కత్తితో పొడిచిన విధానం వల్ల హంతకుడికి వేశ్యలంటే కసి ఉండేదని ఆనాటి సైకియాట్రిస్ట్‌లు ఊహించారు. ఒకరి జననాంగంలోకి కత్తిని పొడిస్తే, మరో వేశ్యని 39 సార్లు పొడిచాడు. ప్రతీ సందర్భంలోని సాక్షులు ఇచ్చిన హంతకుడి వర్ణన ఒకేలా లేకపోవడం గమనార్హం. ఆ హత్యలు పగలు, రాత్రి కూడా కొన్ని వేశ్యలు నివసించే సింగిల్ రూంలలో, కొన్ని నిర్మానుష్యమైన రోడ్ల మీద జరిగాయి. ఆనాటి లండన్ అసిస్టెంట్ చీఫ్ కానిస్టేబుల్ (పోలీస్ కమీషనర్) సర్ మెల్‌మేక్ నగైన్ ఆ హత్యలన్నీ ఒకరు చేసినవేనని నిర్ధారించాడు.
హంతకుడు లండన్ వదిలి వెళ్లిపోవడమో, మరణించడమో, ఇంకేదో నేరంలో జైలుపాలవడమో లేదా పిచ్చాసుపత్రిలో చేర్పించడమో జరగడంతో ఆ హత్యలు ఆగి ఉంటాయని ఆయన ఆ రోజుల్లో జాక్ ది రిప్పర్ గురించి రాసిన పుస్తకంలో తెలియజేశాడు. ఆ రోజుల్లో దినపత్రికలు జాక్ ది రిప్పర్‌ని పట్టుకోలేని పోలీసుల అసమర్థతని ఏకిపారేశాయి.
థామస్ బాండ్ అనే పోలీస్ సైకియాట్రిస్ట్ హంతకుడి సైకలాజికల్ ప్రొఫైల్‌ని తయారుచేశాడు. అతను చిన్నప్పుడు తల్లిచేత నిరాదరింపబడటమో లేదా తన తల్లి లేదా అక్కచెల్లెళ్లు వేశ్యావృత్తిని అతనికి ఇష్టం లేకుండా చేయడమో జరగడంతో అతనికి వేశ్యా వృత్తి మీదగల ద్వేషాన్ని లేదా ఆనాటి తన కుటుంబ సభ్యుల మీద గల ద్వేషాన్ని ఈ సత్యల ద్వారా తీర్చుకున్నాడని, అతనికి ఏరోటిక్ మేనియా అనే మానసిక వ్యాధి కమ్ముకోగానే చంపితే కాని మానసిక ఉపశమనం కలగదని పేర్కొన్నాడు. రెలిజయస్ మేనియా గలవారు పరాయి మతస్థులని లేదా తమ మతాన్ని విమర్శించిన వారిని ఎలా చంపుతారో ఇదీ అంతే అని వివరించాడు. ఆ వేశ్యలతో అతను రతిలో పాల్గొనకపోవడానికి కారణం ఆ వృత్తి మీద ద్వేషం, తనకి వరస కాని వారు ఆ వృత్తి చేయడంగా అతను భావించాడు.
ప్రపంచవ్యాప్తంగా జాక్ ది రిప్పర్ వార్తలని దినపత్రికలు ప్రచురించాయి. ఈ హత్యల వల్ల ఈస్ట్‌ఎండ్‌లోని దారుణ జీవన పరిస్థితుల గురించి మీడియా రాయడంతో లండన్ నగర పాలక అధికారులు మేలుకొని శానిటరీని అభివృద్ధి చేసి అక్కడి అధిక జనాభాని వివిధ ప్రాంతాలకు తరలించి తగ్గించారు.
జాక్ ది రిప్పర్ మీద వచ్చినన్ని పుస్తకాలు మరే నేరస్థుడి మీదా రాలేదు. ఇంగ్లండ్‌లో, హాలీవుడ్‌లలో కూడా చాలా సినిమాలు వచ్చాయి. ఇంక కథలయితే చెప్పనవసరం లేదు. వేల కొద్దీ కథలు జాక్ ది రిప్పర్ సైకాలజీ ప్రొఫైల్‌తో వచ్చాయి. లండన్‌లోని మేడమ్ టస్సాడ్స్‌వేక్స్ మ్యూజియంలో జాక్ ది రిప్పర్ మైనపు బొమ్మని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ని తోసిపుచ్చారు. అతనెవరో తెలీదు కాబట్టి ఆ విగ్రహాన్ని ఉంచబోమన్నారు.
నమ్మండి! ఇదినిజం!!
english title:
nammandi idinijam
Date:
Sunday, August 4, 2013