చీరాల, ఆగస్టు 2: ఆంధ్రరాష్ట్రాన్ని స్వార్థ రాజకీయాల కోసం రెండు ముక్కలు చేసి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తాకట్టుపెట్టాయని డిసిసి అధ్యక్షులు, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దుయ్యబట్టారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, ఆంధ్ర రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శుక్రవారం మండల పరిధిలోని దేశాయిపేటనుంచి భారీ ర్యాలీతో చీరాల వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం ముక్కోణపు పార్కు సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. అమరజీవి సాక్షిగా వేలాదిమంది ప్రజలముందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, చీరాల శాసనసభ్యత్వానికి తమ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష చేసి సాధించిన రాష్ట్రాన్ని రెండుగా విభజించి తెలుగుజాతికి ఉనికిలేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిగా మద్రాసు, అక్కడినుంచి కర్నూలు, తదనంతరం హైదరాబాద్‌కు, ఇప్పుడు మరొకచోటికి మారుస్తూ తెలుగుజాతిని సంచారజాతులుగా మార్చిన ఘనత మన రాజకీయ పార్టీలకే దక్కుతుందన్నారు. అయిదు దశాబ్ధాలపాటు రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ను రక్తం ధారపోసి అద్భుతంగా నిర్మించుకుంటే అతి కొద్దిమంది స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించటం ఎంతవరకు సమంజసమన్నారు. సీమాంధ్రలోని పార్టీలు ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయటం కన్నా ఘోరం మరొటి లేదన్నారు. దక్షిణ భారతదేశంలో ఎంతో గొప్పచరిత్ర కలిగిన ఆంధ్రరాష్ట్రం నేడు సంచారజాతిగా మారి తమ ఉనికిని కాపాడుకోలేక రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర నుంచి ఉన్నత పదవులలో ఉన్న సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రులు జెడి శీలం, పురంధ్రీశ్వరి, పనబాక, చిరంజీవి, కావూరి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబునాయుడు రాష్ట్రం విడిపోవటానికి కారకులని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటి తరపున తాను పోటీ చేస్తానని లేని పక్షంలో తాను పోటీ చేయనని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ బి జైసన్‌బాబు, మార్పు గ్రెగోరీ, మాదిగాని గురునాధం, సలగల దేవదానం, కంకణాల స్వతంత్రరావు, పులిపాటి బాబూరావు, శీలం శ్యామ్, గవిని వేణు, డేవిడ్, ఆమంచి స్వాములు తదితరులు పాల్గొన్నారు.
వెలుగొండ ప్రాజెక్టు నీటి సమస్యపై పరిష్కారం చెప్పరా..?
* సమస్యలపై చర్చించనందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా
* మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం, ఆగస్టు 2: నెల్లూరు, కడప, ప్రకాశంజిల్లా పరిధిలో రైతుల ఆశాజ్యోతి అయిన వెలుగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపుపై విభజన సమయంలో చర్చించనందుకు నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మిగులుజలాలు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందని, ప్రస్తుతం విభజన జరిగి మిగులు జలాలను తెలంగాణకు తరలిస్తే ఈ ప్రాంతభూములు ఎడారులుగా మారి రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారని, విభజన సమయంలో ఈప్రాజెక్టుకు కూడా జాతీయహోదా కల్పించి ఉంటే బాగుండేదని, ప్రకటించనందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థుల, ఉద్యోగుల, విద్యుత్ పంపిణీలో కూడా ఎలాంటి చర్చ చేయకుండా ఓట్లు, సీట్ల కోసం ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని ఆయన అన్నారు. తన రాజీనామాను శాసనసభ స్పీకర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు.
‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’
మార్కాపురం, ఆగస్టు 2: గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు అందచేయనున్నట్లు విలేఖరికి తెలిపారు. ప్రజాభిష్టం మేరకు రాష్ట్ర విభజనను నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నానని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన కోరారు. రైతుల, విద్యార్థుల, ఉద్యోగుల సమస్యలతోపాటు రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయని, ఈ సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర విభజన చేయడంతో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.
సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లిన అద్దంకి
అద్దంకి, ఆగస్టు 2: ప్రత్యేక తెలంగాణా ప్రకటించి కాంగ్రెస్ చారిత్రాత్మిక తప్పిదం చేసిందని అద్దంకి మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శుక్రవారం అద్దంకి పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థినీ, విద్యార్థులు వేలాదిగా సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ అద్దంకి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం మొదలుకుని గాంధీబొమ్మ సెంటరు, భవానీసెంటరు మీదగా ఆర్‌టిసి బస్టాండ్ వరకు ర్యాలీ ప్రదర్శన చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. వేలాదిమంది విద్యార్థినీ, విద్యార్థులు అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ తెలుగుజాతిని విడదీయడం ద్వారా చారిత్రాత్మక తప్పుచేసిందన్నారు. సమైక్యాంధ్రకు పాటుపడిన పొట్టి శ్రీరాములు, నందమూరి తారకరామారావు ఆత్మ క్షోభిస్తాయన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి సమైక్యాంధ్రకు మద్దతు పలకడం ద్వారా తెలుగువారందరికీ ఆత్మీయుడయ్యాడన్నారు. రాష్ట్రంలో నీటి వాటాలు, భూపంపిణీ, ఆర్ధిక లావాదేవీలు ఏమి చెప్పకుండా, తెలుగువారి అభిప్రాయాలు సేకరించకుండా ఏకపక్షంగా తెలంగాణా నిర్ణయం ప్రకటించడం వారి దౌష్టికానికి నిదర్శనమన్నారు. రాత్రికిరాత్రే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన యుపిఎ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ కనుమరుగవుతుందన్నారు. సమైక్యాంధ్రను నిలబెట్టుకునేందుకు ఆంధ్రులంతా ఐక్యంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణా నిర్ణయాన్ని విరమించుకొని, సమైక్యాంధ్రను కొనసాగించేంత వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో పలు విద్యాసంస్థల నిర్వాహకులు సాంబశివరావు, హనుమంతరావు, లక్ష్మీనారాయణ, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
చీరాలలో...
చీరాలరూరల్ : సమైక్యాంధ్రకు మద్దతుగా చీరాల పట్టణం ర్యాలీలు, మానవహారాలు, దిష్టిబొమ్మ దగ్ధం, శవయాత్రలతో శుక్రవారం హోరెత్తింది.
తూర్పురెడ్డి సంఘం ఆధ్వర్యంలో
స్థానిక విఠల్‌నగర్ నుంచి తూర్పురెడ్డి కాపు సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా తప్పెట్లతో పట్టణంలో ర్యాలీ చేశారు. అనంతరం గడియారస్తంభం సెంటర్, ఆర్‌టిసి బస్టాండ్ వద్ద మానవహారం చేశారు. తదనంతరం గడియారస్తంభం సెంటర్ వద్ద సోనియాగాంధీ, కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో పి రాము, లక్ష్మణ్, భోగిరెడ్డి, కామయ్య తదితరులు పాల్గొన్నారు.
బైక్ ర్యాలీ
మేడికొండ మనోహర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముక్కోణపు పార్కు సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఆర్‌వోబి మీదుగా పేరాల వెళ్ళి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
సమైక్యాంధ్ర కోసం న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ప్రాంగణం నుంచి గడియారస్తంభం సెంటర్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం మానవహారంగా ఏర్పడి సోనియా, యుపిఎ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు సమర్పించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా నారుూబ్రాహ్మణ సేవాసమితి
పట్టణంలోని నారుూబ్రాహ్మణ సేవా సమితి సభ్యులు తమ దుకాణాలను మూసివేసి సమైక్యతకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం గడియారస్ధంభం సెంటర్, బస్టాండ్ వద్ద మానవహారాలు చేశారు. కార్యక్రమంలో చీరాల, ఈపూరుపాలెం, కొత్తపేట, జాండ్రపేట, పేరాల ప్రాంతాలకు చెందిన వారు పాల్గొన్నారు.
శ్రీ వాణి, భారతి విద్యాసంస్థలు ర్యాలీ
స్ధానిక శ్రీ వాణి, భారతి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు వందలాదిమంది సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. సోనియా డౌన్ డౌన్, కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో పట్టణం మారుమోగింది. ఈ సందర్భంగా పురవీధులలో ర్యాలీ నిర్వహించి గడియారస్తంభం సెంటర్ వద్ద మానవహారంగావించారు.
సమైక్యాంధ్ర కావాలి
- యువత డిమాండ్ -
మద్దిపాడు, ఆగస్టు 2 : ఆంధ్ర రాష్ట్ర విజభనను వ్యతిరేకిస్తూ మద్దిపాడులోని కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, యువకులు హైవేపై అరగంట పాటు రాకపోకలను నిలుపుదల చేసి రాస్తారోకో నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణా ప్రకటనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణాను ప్రకటించడం వలన ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములును అవమానపరిచినట్లుగా వారు విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రా ఎంపిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హైవే మీద విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, మెహర్ ప్రసాద్, పవన్, నాగేశ్వరరావు, తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.