నానో కాలమ్
ఓ స్కూలు లంచ్ టైమ్‌లో పిల్లలు అంతా క్యూలో కదులుతున్నారు. అక్కడ టేబుల్ పై బోలెడు ఆపిల్ పళ్లు కుప్పగా పోసారు. అక్కడ ఓ బోర్డు కూడా వుంచారు..‘ఒక్కొక్కరు ఒక్కటే తీసుకోండి..మీరు ఎన్ని తీసుకుంటున్నదీ దేవుడు చూస్తున్నాడు’ అని దానిపై రాసి వుంది. ఆ తరువాత పక్కనే టేబుల్ పై చాక్లెట్లు ఉంచారు. అక్కడే బోర్డు లేదు. ఓ ఆకతాయి కుర్రాడు, కాగితం తీసుకుని ఇలా రాసి పెట్టాడు.. ‘ఎన్నికావాల్సినా తీసుకోండి.. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఆపిల్ పళ్లనే చూస్తున్నాడు’
1970ల్లో
ఇక్కడ ఇంజనీర్ గారి ఇల్లెక్కడ..
అలా వెళ్లి కుడిపక్కకు తిరిగి, తిన్నగా సాగితే, మూడో ఇల్లే.
2013
ఇక్కడ ఇంజనీర్ గారి ఇల్లెక్కడ
అరె.. ఏ ఇంజనీర్.. ఇక్కడ ఇంటికి ఒకరున్నారు.
ఓ అమెరికన్ చనిపోయి నరకానికి వెళ్లాడు. అక్కడ దేశానికో నరకం వంతున వుంది. అయితే ఎవరికి ఏ దేశం కావాలంటే దాన్ని ఎంచుకోవచ్చు. సరే, దేశాభిమానంతో అమెరికా నరకం దగ్గరకు వెళ్లి శిక్షల గురించి వాకబు చేసాడు.
‘ఆ ఏముందీ, ముందు కరెంటు కుర్చీలో కూర్చోబెట్టి షాకులిస్తారు. ఆ తరువాత మేకులు గుచ్చిన పరుపుపై పడుకోపెడతారు. అదయిన తరువాత, యమభటులు వచ్చి, నానా హింస పెడతారు’ అని వివరించారెవరో.
సరే అని మిగిలిన నరకాల దగ్గర కూడా అడిగాడు. ఇంచుమించు అవే శిక్షలు చెప్పారు. మరికొంచెం ముందుకు వెళ్తే, ఇండియన్ నరకం కనిపించింది. పైగా బారెడు క్యూ కూడా వుంది. ఏమిటి సంగతి, తేలికైన శిక్షలు వేస్తున్నారా అని విచారిస్తే, అక్కడా అవే శిక్షలని తెలిసింది. మరెందుకు ఇంత క్యూ అని క్యూరియాసిటీతో అడిగిస్తే, అక్కడున్న వాడొకడు చెప్పాడిలా..
ఇక్కడ ఎలక్ట్రికల్ చైర్ మరమ్మతులో వుంది.
పరుపులో గుచ్చిన మేకులు ఎవరో దొంగిలించారు.
ఇక పనిచేసే భటులు, వచ్చి, రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోతారు. లేదంటే పడుకుంటారు.
అప్పుడర్థమైంది క్యూ ఎందుకు అంత వుందో.
***