భారతీయ తత్వశాస్త్ర దార్శనిక మహర్షులు, సృష్టి తత్వాన్ని, ఒక అలౌకిక పద్ధతిలో సాంకేతిక భాషలో ప్రవచించారు. కారణం ఏమిటంటే అనర్హులకు, స్వార్థ సంకుచిత స్వభావులకు శాస్త్ర రహస్యాలు తెలియకూడదన్న ఉద్దేశంతో అలా చెప్పారు. శస్త్రానికి, శాస్త్రానికి అర్హత, అధికారం తప్పనిసరి. మామూలు భాషలో చెప్పాలంటే లైసెన్స్ తప్పనిసరి. రాక్షస స్వభావం గలవారు వరాలు పొంది లోకకంటకులుగా మారి ప్రజలను పీడించిన కథలు మనకు తెలియనివి కావు.
ఆ సాంకేతిక పద్ధతిలోనే వాస్తు పురుషుని గురించి కథారూపంలో చెప్పారు- ‘రుద్రుడు’ అంధకాసురునితో యుద్ధం చేస్తూ ఉండగా స్వేదబిందువు జారి అదే వాస్తు పురుషునిగా ఉద్భవించాడని కథ. రుద్రుడు అగ్నితత్వానికి ప్రతీక. అంతేకాదు జలకారకాత్వమునకు ప్రతీక. ‘ద్రావయతీతి రుద్రః’ అని వ్యుత్పత్తి. అగ్ని నుండే నీరు జనించినదని, నీటి నుండి పృథ్వి జనించినదని ఉపనిషత్తులు సృష్టి రహస్యాన్ని విప్పి చెప్పాయి.
‘ఆకాశాద్వాయుః నామోరగ్నిః
అగ్నేరాపః ఆద్భ్యః పృథివీ- పృథివ్యా
ఓషధయః - ఓషధీభ్యో అన్నః
అన్నాద్భూతాని జాయంతే’ ఉపనిషత్తు వాక్యాలు.
అంధకాసురుడు అంటే సృష్టికి పూర్వం ఉన్న కాళరాత్రి - యుద్ధం అంటే ఘర్షణ రాపిడి - చీకటికి, రుద్మాత్మయైన అగ్ని తేజస్తత్వానికి రాపిడి జరిగి తద్వారా జలము - ఆ జలము నుండి భూమి. ఆ భూమి నుండి వస్తుజాలము - అదే వాస్తు పురుషుడు ఉద్భవించాడని. ఆ కథలోని శాస్త్ర రహస్యం- అందుకే భూమికి, ‘వసుంధారయతీ వసుంధరా’ అని పేరు. ఇవి అన్ని కూడా అష్టదిక్పాలకులు - అష్టవిధ వస్తువులకూ ఆధారమైన ‘ఇంద్ర, అగ్ని, యమ (నియమ) నిర్రుతి - వరుణ- వాయు, కుబేర, ఈశానులు అధిదేవతలుగా నిర్వచించారు.
వారే వాస్తుకు అధిపతులు.
జ్యోతిష శాస్త్రానికి నక్షత్రాలూ, నవగ్రహాలు, ద్వాదశ రాశులూ ఎలా ప్రధానమో, వాస్తుకు అష్టదిక్పతులూ అధిదేవతలు. అందుకే - ఆగ్నేయంలో అగ్ని (వంటిల్లు), తూర్పు వైపు ముఖము - దక్షిణమున శయన మందిరము - పఠనాలయం. నైరుతి - ఆయుధ మందిరము (క్షత్రియోచిత వృత్తుల వారికి) సామాన్యులకు ఉపకరణాలు రోలు, రోకలి - తదితర సాధనాలు ఆరుబయట కాలకృత్య గృహాలు - ఉండాలన్నారు.
నైరుతి దిశ గురించి మంత్రశాస్త్రంలోనైతే గృహాంతర్భాగ నైరుతిలో (బంధాలు కాదు) నైరుతి దిశగా దిశోన్ముఖుడై జపతపాదులు చేస్తే ఇష్టదేవతా సాక్షాత్కారంగా చెప్పారు. అంతేకాదు గృహాంతర్భాగంలో నైరుతి దిశ ఆధిపత్య స్థానం కనుక గృహ యజమాని శయ్యామందిరం ఉండాలని చెప్పారు. ఇక పూర్తి పశ్చిమం వరుణ దిశ - జలభాండాలు ఉండవచ్చు. భోజనశాల ఉండవచ్చునన్నారు. వాయవ్యం - అంతర్భాగంలోనైతే ధాన్యాగారం - ఆరుబయట ఐతే పశువులు పెంపుడు జంతువులకూ నిర్దేశించారు. ఉత్తరం కుబేర స్థానం ధనాగారం. ఈశాన్యం - గృహాంతర్భాగంలోనైతే దేవపూజా మందిరం - ఆరుబయటనైతే నూతులు - జలాధార వసతులు నిర్దేశించారు. ఇదే స్థూలంగా వాస్తు శాస్త్ర శాస్ర్తియత ఏ పనినైనా శాస్ర్తియంగా చేస్తే శ్రేయస్సు కలుగుతుందని ‘తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ’ అని గీతావాక్యము. ‘లోకులకు అక్షి శాస్తమ్రు’ అని పండితసూక్తి. అంటే లోకులకు శాస్తమ్రు కన్ను వంటిది అని చెప్పారు. వస్తు నిర్మాణంలో వాస్తు శాస్త్రం ప్రధానం. వస్తువు అంటే - ఇల్లు, భవనం, నగరం, ప్రతిమ, శిల్పం మొదలైనవి.
*
సందేహాలు - సమాధానాలు
అజయ్‌కుమార్ గౌడ్ (రామంతాపూర్)
ప్రశ్న: నేను ఇల్లు కట్టుకోవాలంటే లేదా కొనాలంటే ఏ ముఖంగా తీసుకోమంటారు?
జ: సహజంగానైతే నీ పేరు అవర్గముగా తూర్పు దిశ అర్వణము అంటే కుదురుతుంది. కాని వ్యక్తి పేరు కంటే ఇంటి పేరున అర్వణం చూసుకుని దానికి అనుకూలంగా ఇంటికి కూడా ఒక పేరు పెట్టినట్టయితే కుటుంబంలో అందరికీ శుభమవుతుంది.
జి.తిరుపతిరెడ్డి (కంచన్‌బాగ్)
ప్రశ్న: ఇల్లు కట్టుకోవాలంటే ఏ నెలలో ప్రారంభించాలి. దసరా ముహూర్తం బాగుంటుందంటున్నారు. చేయమంటారా?
జ: పూర్తి నూతనంగా కట్టుకునే ఇల్లయితే, ఫాల్గుణ, వైశాఖ, శ్రావణ మాసాల్లో ప్రారంభించటం శ్రేష్ఠం. అశ్వీయుజం, గృహారంభానికి మంచిది కాదు - విజయదశమి క్షత్రియోచితమైన పండుగ.
పి.వీణాకుమారి (న్యూజెర్సీ)
ప్రశ్న: మేము అమెరికాలో ఇల్లు కొనాలనుకుంటున్నాం. వాస్తు నియమాలు వర్తిస్తాయా? వాస్తు ప్రకారంగా ప్లాటు తీసుకుంటే ఏం చేయాలి? ఇల్లు తీసుకుంటే ఏం చేయాలి?
జ: భూప్రపంచంలో ఎక్కడైనా వాస్తు నియమాలు వర్తిస్తాయి. అమెరికాలో కూడా వాస్తు పండితులు లేకపోలేదు. వారిని తీసుకువెళ్లి చూపించండి. లేదంటే దిక్చూచితో దిక్కులు (డిగ్రీలతో సహా) స్పష్టంగా సూచిస్తూ మాప్ పంపించండి.
భాగ్యలక్ష్మి (ఇందూర్)
ప్రశ్న: మేము కొత్తగా ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేశాం. అందరూ బాగానే ఉన్నారు. నాకు మాత్రం ఎందుకో మనశ్శాంతి లేదు. ఇంట్లో లోపం ఉందంటారా? అందరూ నీ వెర్రి అంటున్నారు.
జ: వాస్తు దోషాలలో కొన్ని గృహ యజమానురాలి మీద ప్రభావం చేసేవి ఉంటాయి. చూపుకోవటానికీ, చెప్పుకోవటానికీ ఏ సమస్యా లేకపోయినా మీకు మనశ్శాంతి కరువౌతోంది. అందునా కొత్త ఇంట్లో అంటే గృహ యజమానురాలి మీద ప్రభావం చేసే దోషం ప్రధానంగా ఆగ్నేయంలో ఉండి ఉంటుంది. మంచి వాస్తు పండితునికి చూపించండి.
సిహెచ్.శశి (సికిందరాబాద్)
ప్రశ్న: మాకు ఈశాన్యంలో వంటిల్లు వచ్చింది. ఏం చేయాలి?
జ: వంట ఇంటికి తప్పకుండా ఒక అర అడుగు మందం కడప (గడప) ఏర్పాటు చేయాలి. పొయ్యి పై భాగాన గోడకు ఆగ్నేయ దిశా యంత్రం ప్రతిష్ఠించి ప్రతిరోజూ మొట్టమొదటగా వండిన పదార్థం కొంచెం నివేదన చేసి పొయ్యిలోనే వెయ్యాలి. అలాగే వండిన పదార్థాలు కొంచెం కొంచెం అన్నీ కలిపి ఉదయమే పాలు వేడి చేసినపుడు పాలు - ఆగ్నేయ యంత్రానికి నివేదన చేసి పొయ్యిలో వేయాలి. *