దేశాన్ని పరిపాలించటం అంటే ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. పరిపాలించేవాళ్లు - 24 గంటలూ టెన్షన్ పడుతూండేవారు. పరిపాలనలో ఎక్కడే లోపం జరుగుతే ప్రజలకేం బాధ కలుగుతుందో ఏమో అని!
కానీ ఇప్పుడు స్కూటర్ నడపడమంత ఈజీ అయిపోయింది దేశాన్ని నడపడం -
స్కూటర్‌కి అదివరకు లాగా కిక్ కొట్టాల్సిన అవసరం లేదు. బటన్ స్టార్ట్! అలాగే గేర్స్ వేయాల్సిన అవసరం లేదు - అంతా ఆటోమేటిక్ - దేశాన్ని పరిపాలించడం కూడా అంతే!
అదివరకు లాగా ప్రజాసేవ చేస్తేనే ప్రజలు ఓట్లేస్తారనే సిస్టమ్ పోయింది.
ఓటర్లందరకూ మందూ, మనీ సప్లయ్ చేసి గెలవ్వచ్చు - మళ్లీ అదే మనీతో మిగతా ఎమ్మెల్యేలను కొని సీయం అయిపోవచ్చు. లేదా ఎంపీలను కొని ప్రధానమంత్రి అయిపోవచ్చు.
ఆ తర్వాత దేశాన్ని పరిపాలించటం అంటే - సమిష్టిగా ఆలోచించి దేశానికీ, ప్రజలకూ ఏ పాలసీ మేలు చేస్తుందో డిసైడ్ చేసే సిస్టమ్ కూడా మారిపోయింది.
టెలికామ్ మంత్రికి ఫోనొస్తుంది.
‘సార్ - నేను టెలికామ్ - టుజీ - త్రీజీ- ఫోర్‌జీ - కంపెనీ తరఫున మాట్లాడుతున్నా’
‘మాట్లాడు’
‘మా ఫైల్ మీద సంతకాలు చేయాలి సార్ మీరు’
‘కాష్ ఎంతిస్తావ్?’
‘వెయ్యి కోట్లు సార్’
‘చిల్లర వేషాలేయకు - లక్ష కోట్లు ఇస్తే సంతకం చేస్తా’
‘లక్ష కోట్లు మరీ టూమచ్ సార్’
‘నోర్మూసుకో - ఇదంతా నేనే తింటానా? ప్రధానమంత్రికి వాటా - ఫైనాన్స్ మినిస్టర్‌కి వాటా - మా పార్టీ ఫండ్ కోసం వాటా- అసలు నేను ఈ మంత్రి పదవి కోసం ఎంత ఖర్చు చేశానో తెలుసా నీకు? పది వేల కోట్లు - నీ తాతిస్తాడా ఆ డబ్బు’
‘పోనీ ఇంకో మాట మీరే చెప్పండి సార్’
‘సరే - తొంభై వేల కోట్లు’
‘ఓకే సార్’
ఇక రైల్వే మంత్రి-
‘సార్ - నేనే సార్ - ఒకప్పుడు మీ పిల్లల్ని స్కూలుకి తీసుకెళ్లిన రిక్షావాడిని’
‘ఓ రిక్షావాలా! ఎలా వున్నావోయ్’
‘మీ దయ వల్ల బాగానే ఉన్నా సార్ -మీరు నాకో సాయం చేయాల్సార్’
‘ఏంటది?’
‘మా బామ్మర్ది ఒకడీ మధ్య రైల్వేలో జాయినయ్యాడు సార్. వాడిని రైల్వే బోర్డు చైర్మన్‌గా చేయాలి సార్’
‘నీకేం పిచ్చా? ఆ పోస్ట్ కావాలంటే పదివేల కోట్లు లంచం ఇవ్వాల్సి ఉంటుంది’
‘ఆ! అంత డబ్బా?’
‘ఆ మనీ అంతా నేను తింటానిక్కాదురా! ప్రధానమంత్రి కివ్వాలి - పార్టీ ఫండ్ కివ్వాలి - అయినా అంత డబ్బు తేవడం నీ వల్ల ఎక్కడవుతుందిరా’
‘ఎందుక్కాదు సార్ - మీరెంత అడిగినా ఇవ్వడానికి ఎలక్ట్రికల్ కంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ కంట్రాక్టర్లు, కేటరింగ్ కంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు సార్’
‘అలాగా! అయితే వెంటనే తెచ్చివ్వు - చేసేద్దాం’
‘ఓకే సార్’
ఇంకో కేంద్ర మంత్రి-
‘హలో - కేంద్ర మంత్రి సక్సేనా మాట్లాడుతున్నా’
‘నమస్తే సార్ - మీరు కోరినట్లు మా ప్రైవేటు హెలికాప్టర్స్ - కేదారనాథ్‌కి వెళ్లి అక్కడ చిక్కుబడిపోయిన యాత్రికులను రక్షించడానికి ఒప్పుకుంటున్నాం సార్’
‘గుడ్ మనీ ఎంతిస్తున్నావ్?’
‘అయిదు కోట్లు’
‘పది కోట్లు ఇవ్వాలి’
‘అంత డబ్బిస్తే నేను నా కంపెనీ మూసేయాల్సి వస్తుంది సార్’
‘నీ యిష్టం ఆలోచించి చెప్పు! అయినా ఆ డబ్బెక్కడికీ పోదు బాబూ’
‘నువ్ యాత్రీకుల దగ్గర మనిషికి లక్ష తీసుకో - టికెట్ ఛార్జీ కింద. నీకు లక్ష ట్రిప్పుల గారంటీ ఇస్తా’
‘కానీ ఇది మీ గవర్నమెంట్ కంట్రాక్ట్ తీసుకుంది కద్సార్. మేమెలా ఛార్జ్ ఎలా వసూలు చేస్తాం?’
‘ఎవడి ప్రాణాలు వాడు దక్కించుకోడానికి వాళ్లే ఆఫర్ చేస్తారయ్యా. ఆ డబ్బు నొక్కేశెయ్’
‘ఓకే సార్’ *
హలో ... మైక్ టెస్టింగ్
english title:
hello mike testing
Date:
Sunday, August 4, 2013