‘అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే’ అంటూ కళ్లు మూసుకుని కూనిరాగాలు తీస్తున్న మిత్రుణ్ణి చూస్తుంటే నవ్వొచ్చింది. అయినా నా నవ్వును పెదాలు దాటనీకుండా - ‘ఏమిటా పారవశ్యం?’ అంటూ సోఫాలో కూలబడ్డా.
పారవశ్య భంగమైనట్లు, వేళాపాళా లేకుండా వచ్చానన్నట్లు.. వొకింత కళ్లు చిట్లించి.. తన అసహనం బయటపడకుండా కాస్తంత సర్దుకున్నాడు - నేను సన్నిహితుణ్ణి కాబట్టి. మాటామంతీ అయ్యాక-
‘కూనిరాగాలు తీస్తున్నావ్ సరే.. ఇంతకీ కాదు అనగల ధైర్యం నీకుందా? పోనీ నీ పనులనైనా కొన్నింటిని కాదు అనుకుని చేయకుండా ఉండగలవా?’ అన్నా.
‘వాట్ డు యూ మీన్ అన్నట్టు చూపు పారేసి ‘దేన్నయినా తట్టుకోగల కెపాసిటీ ఉంది’ అన్నాడు.. కాస్త గట్టిగానే.
‘తట్టుకోవడం వేరు.. కాదు అనగలగటం వేరు’ అన్నాను.
ఏ విషయాన్నయినా సీరియస్‌గా తీసుకోకపోవడం నా మిత్రుడి అదృష్టం.. అలాగే తనను సైతం తాను కాదనుకోలేడు.. ఇతరులనూ కాదనలేడు. ఇలా ‘కాదు’ అనక తనకు తానే మంచివాడనని కితాబునిచ్చుకుంటుంటాడు.
తను ‘అవును’ అన్నపుడల్లా గంగిరెద్దు తలాడించినట్లు అనిపిస్తుంటుంది. నోటి వెంట మాట వస్తే చాలు.. మాట ఆగితే చాలు.. తలాడించటం అది నేర్చిన విద్య. దానికి ‘టైమ్ సెన్స్’ ‘సౌండ్ సెన్స్’ ఎక్కువ. దానికామాత్రం కామన్‌సెన్స్ ఉన్నందువల్లనే దాని యజమాని బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాడు. కాని నా మిత్రుడి సెన్స్ మాత్రం అవునుకే పరిమితం కావటంతో ఎప్పటికప్పుడు ఇరకాటంలో పడుతుంటాడు. ఇబ్బంది పాలవుతుంటాడు. ఇంతకీ ‘కాదు’ అనగల నేర్పరితనం నా చిన్ననాటి స్నేహితుడి విషయంలో ఈ జన్మకు అబ్బుతుందన్న గ్యారంటీ లేదు.. నమ్మకమూ లేదు.
నా మిత్రుడనే కాదు - నూటికి తొంభై మంది ‘కాదు’ అంటే తమ అంతస్తు తరిగిపోతుందనుకుంటారు. ‘నో’ అన్నపుడల్లా తాము నెగెటివ్‌గా ప్రతిబింబితమవుతా మనుకుంటారు. నిజానికి ‘కాదు’ అనటంలో ఉన్న ‘సెల్ఫ్ రెస్పెక్ట్’ వారికి తెలిసి రావటం లేదు. ‘కాదు’ అనగలిగి ఆత్మగౌరవాన్ని దక్కించుకోవటమూ అంత తేలిక కాదు.
మనకు మనంగా ‘కాదు’ అనగలగటం, అనుకోగలగటం సెల్ఫ్ డినయల్‌లా అనిపించే సెల్ఫ్ రెస్పెక్ట్. అంతేకానీ కాదు అనటం ఆత్మహత్యా సదృశం అనుకుంటే ఎలా? దాన్ని న్యూనతగా పరిగణిస్తే ఎలా?
మనకు అనేకానేక ఇష్టాలు. ఈ ఇష్టాలన్నీ ఒక విధంగా కోరికలే. ఇష్టాన్ని కాదనుకుంటే కోరికను త్యజించినట్లే - అని అనుకోకూడదు. అయితే కొన్ని ఇష్టాలను కాదనుకోవటం వల్ల మనం మరింత శక్తివంతుల మవుతాం. అంటే కొన్నిటిని నియంత్రించటం వల్ల, కొన్నిటిని దూరంగా ఉంచటంవల్ల, కొన్నిటిపై ఇష్టాన్ని పెంచుకోక పోవటంవల్ల వాటిని ఆ సమయానికి, సందర్భానికి అనవసరాలుగా గుర్తించినట్లే. వాటిని ముఖ్యమైనవి కాదని ముద్ర వేసినట్లే. అంతేకానీ వాటిని నిషేధించినట్లు కాదు.. పైగా జీవితంలో జాగ్రత్త పడుతున్నట్టు! కాలం విలువ తెలిసి వస్తున్నట్లు!!
ఓ పది పనె్నండేళ్ల వరకు మనది తెలిసీ తెలియని ప్రాయం.. అవసరాలు అనవసరాలు అన్న విచక్షణ ఉండదు. పిల్ల చేష్టలతో మారాం చేసి, సాధించేస్తాం. సక్సెస్‌కు అర్థం తెలీకపోయినా గెలిచినట్లు ఫోజు పెడ్తాం. ఆ తర్వాతి ఏడెనిమిదేళ్లు వ్యామోహాల వెంట పడతాం. మనం నీలం షర్ట్ వేసుకుని మిత్రుడు వైట్‌షర్ట్ వేసుకున్నా ఇంటికొచ్చి వైట్ షర్ట్ కోసం అమ్మానాన్నలపై అలుగుతాం. ఉన్న చుడీదార్‌తో వెళ్తే మిత్రురాలు చీరతో వస్తే త్వరలో మనమూ అటువంటి చీరతో ప్రత్యక్షం కావలసిందే! ఇదంతా అసూయ కాదు కానీ పోటీ తత్వం.. సమఉజ్జీలం అనిపించుకోవాలనే మనస్తత్వం. మనకు నచ్చినట్లు ఉంటూ ఇతరాలపై మోజు పెంచుకోవటం ఎందుకు?
మనకు ఇబ్బడిముబ్బడిగా ఇష్టాలుండవచ్చు. అన్ని ఇష్టాలు వ్యసనాలుగా పరిణమిస్తే నష్టం మనకే! కొన్నింటిని కాదనుకోవటమే సెల్ఫ్ డినయల్. ‘కాదు’ అనటం త్యజించటమే. టీవీకి అతుక్కుపోవటమూ, సెల్‌ఫోన్‌కు అంకితమై పోవటమూ ఈనాడు కామన్ అయిపోయిన వ్యసనాలు. ఈ ఇష్టాల్ని వ్యసనాలు అంటున్నందుకు నాకు కామన్‌సెన్స్ లేదని విమర్శించినా ‘నో’ అనగల ధైర్యం నాకుంది. ఎందుకంటే ఈ రెండింటి వల్లా జీవితంలో ఎంత నష్టపోతున్నామో తెలుసు కాబట్టి.. జీవితం ఎంత వెనకబడుతోందో తెలుసు కాబట్టి.
అసలు ఇంటి తెర దేని కోసం.. అలసి సొలసిన మనసు, దేహం కాస్తంత సేద తీరేందుకు. ఎక్కడ ఉన్నా సెల్‌ఫోన్ అందుబాటులో ఉండేదెందుకోసం.. అవసర సమాచారాన్ని జాగు చేయకుండా అవతలి వ్యక్తికి చేరవేయటానికి. అంతే కానీ మనసులను కలుషితం చేసుకోవటానికి ఇంటి తెర అవసరమా? నాడీ వ్యవస్థను దెబ్బతీసే సెల్‌ఫోన్‌లు అవసరం ఎంత వరకు?
కాలజ్ఞానం లేక జీవితాన్ని ఎలా దొర్లించేస్తున్నామో కాస్త ఆలోచిద్దాం. కనీసం ఇప్పటినుండైనా కొన్నిటిని కాదనుకుందాం. సెల్‌ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లోకి పంపిస్తే దానికీ కాస్త కునుకు పడుతుంది. మనకూ నిద్రాభంగం కాదు. స్టడీస్ పరంగా స్టెడీగా ఉండగలుగుతాం. టీవీ ఛానెల్స్ 24 ఇంటు 7 ఆకర్షిస్తున్నప్పటికీ అన్ని ఛానెల్స్ అన్నిటినీ ప్రసారం చేయటం లేదు కదా? కొన్నిటిని ‘నో’ అంటున్నాయి. మనం సైతం కొన్ని ప్రోగ్రామ్స్‌ను నో అనగలిగితే మన ఆలోచనలు వక్రించవు.. దృష్టిమాంద్యం ఏర్పడదు.. అయిన వారిపై అక్కసులు తగ్గుముఖం పడతాయి.
సెల్‌ఫోన్‌ను కాదనుకుని, బుల్లితెరను కాదనుకుని ఇంటర్నెట్ ముందు కూలబడితే టైమ్ పాస్ అవుతుందనుకుంటే జీవితం దానికంతట అదే జరిగిపోతుంటుందే తప్ప మనసైన రీతిన సాగదు. కారణం మనసు స్టక్ అయిపోయింది కాబట్టి. మనసు స్టక్ అయితే మనం సిక్ అయినట్లే!
చివరకు ఫేస్‌బుక్‌కు అడిక్ట్ అయిపోయినా మనం ఎన్నో విధాల మొహం చాటేయవలసి వస్తుంది. ఒకప్పుడు మద్యం ఒక్కటే మనిషిని బానిసను చేసేది. ఇప్పుడు ఆల్కహాల్‌ను మించి కిక్ ఇచ్చే సాధనాలు అనేకాలు. మనం ఇష్టపడుతూ, అవుననుకుంటూ ఆహ్వానం పలుకుతున్న వాటిని సంయమనంతో ‘కాదు’ అనగలిగితే అవి మనసును దాటి హృదయాన తిష్టవేయవు.
వినదగు
english title:
vinadagu
Date:
Sunday, August 4, 2013