హైదరాబాద్, ఆగస్టు 4: రాష్ట్ర విభజన తీరు బాగాలేదని నిరసన వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్‌కు ఫ్యాక్స్‌లో పంపారు. అదే విధంగా టిడిపి అధ్యక్షునికి రాజీనామా లేఖ పంపారు. విభజనను స్వాగతిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించిన హరికృష్ణ ఈరోజు రాజీనామా చేశారు. దీంతో టిడిపి సీమాంధ్ర ఎంపిలంతా విభజనపై రాజీనామా చేసినట్టు అయింది. సీమాంధ్రలోని ముగ్గురు లోక్‌సభ సభ్యులు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. హరికృష్ణ ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. అన్ని ప్రాంతాలకు సమ న్యాయం జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ప్రతి తెలుగు వాడిని దిగ్భ్రాంతికి గురి చేస్తోందని అన్నారు. విభజనకు తాను వ్యతిరేకం కాదని, అదే విధంగా టిడిపి సైతం విభజనకు వ్యతిరేకం కాదని అన్నారు. కేంద్రం ఏకపక్షంగా విభజన చేసిందని, విభజన తీరుకు నిరసనగానే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. తెలుగు వారంతా కలిసి ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారని, ఎవరిని అడిగి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనిప్రశ్నించారు. విభజనపై నిర్ణయం తీసుకునే ముందు కేంద్రం అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. విభజనకు వైఎస్‌ఆర్ కారణం అని, సోనియాగాంధీ తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టారని మండిపడ్డారు. తెలుగువారిని విడగొట్టే హక్కు సోనియాగాంధీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఎంతవరకు పరిగణలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. రాజధాని, నీటివాటాలు తదితర అంశాలు తేలిన తరువాతనే విభజన ప్రక్రియ చేపట్టాలని కోరారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద రాజీనామా పత్రంపై సంతకం చేస్తున్న నందమూరి హరికృష్ణ