రాజమండ్రి, ఆగస్టు 4: రాష్ట్ర విభజనంటూ జరిగితే హైదరాబాద్‌ను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంచాలని లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఎంపి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆదివారం రాత్రి రాజమండ్రి చేరుకున్న ఆయన సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లు అసలు పార్లమెంటులో పాస్ కాదన్నారు. ఒక వేళ చర్చల ద్వారా విడిపోవాల్సి వస్తే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్నదే తన ప్రతిపాదన అన్న ఆయన రాష్ట్ర విభజన ఉద్యమాల్లో ఇదే ఆఖరి ఉద్యమం కావాలన్నారు. కాగా, విభజనంటూ జరిగితే మూడు రాష్ట్రాలను ఏర్పాటుచేయాలని, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ రాష్ట్రాలను ఏర్పాటుచేసి, మూడు రాష్ట్రాలకు కూడా హైదరాబాద్‌నే రాజధానిగా ఉంచాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ రాజధాని అంటే సరిపోదని, త్వరలో హైదరాబాద్ ఉద్యమం కూడా మొదలవుతుందన్న ఉండవల్లి.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం జరగకుండా పార్లమెంటులో తీర్మానం ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. 1972-73 జై ఆంధ్ర ఉద్యమాల్లో మనం ప్రత్యేక రాష్ట్రంగా రాజధానిని ఏర్పాటుచేసుకునే ప్రయత్నంలో ఉన్నపుడు, హైదరాబాద్ ఎంపిలు మనల్ని బతిమాలి హైదరాబాద్‌లో కలుపుకున్నారని ఉండవల్లి పేర్కొన్నారు. అందువల్లే అప్పటి కన్నా ఇపుడు హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందన్నారు. శ్రీకృష్ణ కమిషన్ నివేదికలో ఇలాంటి అనేక వాస్తవాలు ఉన్నాయని, కానీ పార్లమెంటు ముందు ఆ నివేదికను ఎందుకు ఉంచలేదో చెప్పాలని పార్లమెంటు సమావేశాల్లో అడగాలని తాను భావించానన్నారు. తెలంగాణ కావాలని కెసిఆర్ ఒక పక్క అడుగుతూ, మరోపక్క మనల్ని పొమ్మని తన్నుతున్నాడన్నారు. ఈ విషయం ఇతర రాష్ట్రాల వారికి తెలియదని, తెలిసేలా మనం చెప్పలేకపోయామన్నారు. తెలంగాణ ఏర్పడుతోందంటే ఎక్కువ భయపడేది కెసిఆరేనన్నారు. అయినా రాజధాని ఉన్న ప్రాంతానికి చెందిన వారు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమం చేయటం ఇదే తొలిసారన్నారు. ఇంత వరకు వచ్చిన తరువాత ఎవరు ఎంత అభివృద్ధి చెందారో లెక్కలు తేల్చుకోక తప్పదన్నారు. అయినా 60ఏళ్ల పాటు హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకుని, ఎంతో అభివృద్ధి చేసుకున్న తరువాత ఎలా వదులుకుంటామని, ఎవరో వెళ్లిపోవాలంటే ఎలా వెళ్లిపోతామని ఉండవల్లి ప్రశ్నించారు. హైదరాబాద్, రాయలసీమ అన్ని పరిష్కారాలు ఇప్పుడే జరగాలన్నారు. ఎవరెన్ని చెప్పినా అంతిమ విజయం మనదేనని ఉండవల్లి చెప్పారు.
కెసిఆర్ వంటి వారికి తగిన బుద్ధి చెప్పటానికి, ఆంధ్రప్రాంతానికి చెందిన వారికి కూడా వాటా ఉన్న హైదరాబాద్‌పై అందరికీ సమాన హక్కు ఉండటానికి, స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు దేశానికి హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలన్నారు. తెలంగాణ ఏర్పాటుతో దేశంలో 17రాష్ట్రాల్లో ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఉద్యమాలు తారాస్థాయికి చేరాయన్నారు.
..............
రాజమండ్రిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న ఉండవల్లి
విభజనంటూ జరిగితే మూడు రాష్ట్రాలు చేయాలి రాజమండ్రి ఎంపి ఉండవల్లి
english title:
h
Date:
Monday, August 5, 2013