హైదరాబాద్, ఆగస్టు 4: రాష్ట్రంలో నెలకొని ఉన్న విపత్కర పరిస్థితితో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారయింది. ఒకవైపు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర కాంగ్రెస్ నేతలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరుతుండగా, సమైక్యాంధ్ర కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలంటూ సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కిరణ్‌కుమార్‌పై తీవ్రమైన వత్తిడి పెంచుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30 న కాంగ్రెస్ అధిష్టానం, యుపిఎ భాగస్యామ్య పక్షాలు ప్రకటన చేసిన తర్వాత రాజకీయ కార్యక్రమాలను, అధికారిక కార్యక్రమాలను క్యాంపు కార్యాలయం నుండే ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి జన్మతః రాయలసీమ (చిత్తూరు జిల్లా) కు చెందిన వారైనప్పటికీ, ఆయన పుట్టిపెరిగింది తెలంగాణ (హైదరాబాద్) లో కావడం వల్ల రెండు ప్రాంతాలతో ఆయనకు అనుబంధం ఉంది. ఈ కారణంగా ఆయన స్పష్టంగా ఏ ప్రాంతానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ విషయంలో కేంద్రం చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూనే, ఈ అంశంపై ముఖ్యమంత్రినుండి పూర్తి సహాయ సహకారాలు కావాలని కోరుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా తాను వ్యతిరేకించే పరిస్థితి లేదని, కేంద్రం అభీష్టం మేరకు నడుచుకుంటానని తెలంగాణ ప్రజాప్రతినిధులతో ఆయన స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణకు అనుకూలంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రికి ముందుగానే తెలిసినప్పటికీ, ఆయన అడ్డుకోలేకపోయారన్న ఆరోపణలు సీమాంధ్రవైపు నుండి వెల్లువెత్తుతున్నాయి. సీమాంధ్ర మంత్రులతో జరిగిన చర్చల సందర్భంగా కూడా ఆయన తన మనసులో మాటను వాళ్ల ముందు ఉంచారు. సోనియాగాంధీ, ఆశీస్సులతోనే తనకు ముఖ్యమంత్రి పదవి లభించిందని, అలాగే సీమాంధ్రకు చెందిన వారిని మంత్రులుగా ఎంపికచేయడంలో సోనియాగాంధీ ఆమోదముద్ర ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నట్టు తెలిసింది. సిఎం క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో చేసిన తీర్మానాలపై సంతకాలు చేసిన విషయాన్ని పిసిసి అధ్యక్షుడు బొత్స ఆదివారం ధృవీకరించారు. ఈ విధంగా సంతకాలు చేయడం వెనుక కాంగ్రెస్‌ను సీమాంధ్రలో కూడా బతికించుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. సీమాంధ్రలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గకుండా ఉండేందుకే శనివారం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశంలో చేసిన తీర్మానంపై సిఎం సంతకం చేశారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పట్ల ఒకవైపు సీమాంధ్రలోనూ, మరోవైపు తెలంగాణాలోనూ ఆదరణ తగ్గలేదని ఇటీవలి పంచాయతీ ఎన్నికలు స్పష్టం చేశాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ధీనంగా ఉంటుందేమోనని జరిగిన ఊహాగానాలకు ప్రజలు తెరదించారు. కాంగ్రెస్‌కు ఆదరణ ఉందని ఎన్నికలు స్పష్టం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్ స్థానాలను అధిక సంఖ్యలో గెలుచుకుని కాంగ్రెస్ ప్రతిష్టను సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇనుమడింపచేశారన్న పేరు వచ్చింది. భవిష్యత్తులో కూడా రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించాలన్నదే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోందని తెలిసింది.
శాంతి, భద్రతల విషయంలో కేంద్రం నుండి ముఖ్యమంత్రిపై వత్తిడి పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని, శాంతి, భద్రతల పరిరక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్రం నుండి స్పష్టమైన ఆదేశాలందాయి. రాజీవ్, ఇందిరాగాంధీ విగ్రహాలపై సీమాంధ్రలో దాడులు జరగడం, విగ్రహాలను కూల్చివేయడం సంఘటనలపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రజల మనోభావాలకు విఘాతం కలగకుండా ఒకవైపు చూస్తూ, ప్రభుత్వ ఆస్తులకు, ఇతరత్రా నష్టం జరగకుండా చూడాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
విపత్కర పరిస్థితిలో ముఖ్యమంత్రి కిరణ్
english title:
m
Date:
Monday, August 5, 2013