లేహ్/న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఇటీవలి కాలంలో జమ్మూ, కాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలోకి వరసగా పలు ర్లు చొరబడిన చైనా ఇప్పుడు భారతీయ సైన్యం సరిహద్దుల్లో తమ భూభాగంలోపల సైతం గస్తీ నిర్వహించడాన్ని సైతం అడ్డుకునే చర్యలకు పాల్పడుతోంది. గత వారం చోటు చేసుకున్న సంఘటనతో చైనా సైనికుల దుందుడుకు చర్య వెలుగులోకి వచ్చింది. గత వారం లడఖ్ ఉత్తర ప్రాంతంలోని ట్రేడ్ జంక్షన్ ప్రాంతంనుంచి వాస్తవాధీన రేఖ వెంబడి ఎగువ పర్వత ప్రాంతాల్లో 14 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న రెండు సైనిక పోస్టుల వద్దకు భారతీయ సైన్యం గస్తీని చేపట్టినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ, తేలిక పాటి వాహనాలు ఎక్కి వచ్చిన చైనా సైనికులు భారతీయ సైనికులను ఆపివేసినట్లు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. అంతేకాదు, ఇది చైనా భూభాగమని, ముందుకు వెళ్లడానికి వీల్లేదని తెలిపే ఒక బ్యానర్‌ను కూడా చైనా సైనికులు గస్తీ బృందానికి చూపించారని ఆ వర్గాల తెలిపాయి. తమ సైనిక కేంద్రాల వద్ద ఉన్న భారత గస్తీ బృందాన్ని ఆపేటప్పుడు చైనా సైనికులు కాస్త దుందుడుకుగానే ప్రవర్తించినట్లు కూడా వారు తెలిపారు. ఈ సైనిక పోస్ట్‌లు భారత భూభాగంలోపలే ఉన్నట్లు కూడా వారు స్పష్టం చేసారు.
ఈ ఏడాది ఏప్రిల్‌నుంచి ఇప్పటివరకు భారత గస్తీ బృందం 21 సార్లు ఈ సరిహద్దు సైనిక కేంద్రాల వద్దకు బయలుదేరగా, రెండు సార్లు మాత్రమే తమ యాత్రను పూర్తి చేయగలిగిందని వారు చెప్పారు. చైనా సైన్యం ఒక అబ్జర్వేషన్ పోస్ట్‌ను కూడా నిర్మించిందని, అది భారతీయ సైనికుల కదలికలపై నిఘా పెట్టి, భారత గస్తీ బృందం బయలుదేరడానికి సిద్ధపడగానే మధ్యలోనే ఆపేసి వెనక్కి పంపించేస్తున్నారని కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని చుషుల్‌లో జరగబోయే తదుపరి సరిహద్దు సైనికాధికారుల సమావేశంలో లేవనెత్తనున్నట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి. కాగా, గత ఏప్రిల్‌లో దాదాపు 21 రోజుల పాటు ఇరు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తతకు కారణమైన దెప్సంగ్ బల్జె, దౌలత్ బేగ్ ఓల్డి ప్రాంతంలో కూడా చైనా మిలిటరీ వాహనాలు కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయని, అయితే ఈ వాహనాలు కనిపించిన వెంటనే ప్రధానంగా ఐటిబిపి జవాన్లతో కూడిన భారత సైన్యం భారత భూభాగంలో చైనా వాహనాలు స్వేచ్ఛగా తిరగడాన్ని అడ్డుకున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖపై చైనా వైపున దెమ్‌చోక్ ఫుక్చే సెక్టార్‌లో చైనా ఒక టవర్ నిర్మాణం చేపడుతుండడంపై కూడా ఇంతకు ముందు జరిగిన ఇరు దేశాల సైనికాధికారుల సమావేశంలో అభ్యంతరాలు లేవనెత్తినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కల్నల్ వాంగ్ జున్ జియాన్ నేతృత్వంలో పాల్గొన్న చైనా బృందానికి 1993లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందానికి ఈ నిర్మాణం వ్యతిరేకమని భారత బృందం స్పష్టం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం వాస్తవాధీన రేఖ వద్ద ఏ దేశం కూడా నిర్మాణాలు చేపట్టకూడదు. అయితే అది ఆ ప్రాంత ప్రజల కోసం నిర్మిస్తున్న వాతావరణ కేంద్రమని చైనా వాదించడమే కాకుండా భారత సైన్యం సైనిక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ ప్రత్యారోపణ చేసింది. అయితే పిఎల్‌ఏ దళాలు తరచూ భారత భూభాగంలోకి చొరబడుతున్నాయని బ్రిగేడియర్ సంజీవ్ రాయ్ నేతృత్వంలోని భారత బృందం చైనాకు స్పష్టం చేసిందని కూడా ఆ వర్గాలు తెలిపాయి.
భారత భూభాగంలో గస్తీని సైతం అడ్డుకుంటున్న పిఎల్‌ఏ చైనా భూభాగమంటూ వెనక్కి పంపేస్తున్న వైనం
english title:
l
Date:
Monday, August 5, 2013