న్యూఢిల్లీ, ఆగస్టు 4: తనను భారతదేశానికి అప్పగించడాన్ని పోర్చుగల్ సుప్రీంకోర్టు భారతీయ అధికారులు నేరస్థుల అప్పగింతకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ రద్దు చేసినందున భారత దేశంలో తనపై వివిధ కేసుల్లో జరుగుతున్న విచారణలను కొట్టివేయాలంటూ అండర్‌వరల్డ్ డాన్ అబూ సలేం చేసుకున్న అభ్యర్థనపై సుప్రీంకోర్టు సోమవారం తన తీర్పును ప్రకటించనుంది. ఒక వేళ నేరం రుజువయిన పక్షంలో సలేంకు మరణ శిక్ష విధించడం కానీ, 25 ఏళ్లకన్నా ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచడం కానీ చేయబోమని అతడి అప్పగింత సమయంలో పోర్చుగల్ ప్రభుత్వానికి హామీ ఇచ్చిన దృష్ట్యా టాడా, పేలుడు పదార్థాల చట్టం కింద అతనిపై పెట్టిన కొన్ని అభియోగాలను తొలగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సిబిఐ తెలియజేసిన తర్వాత తీర్పును తర్వాత ప్రకటిస్తామని గత నెల 9న ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. పోర్చుగల్ కోర్టుకు ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అటార్నీ జనరల్ జిఇ వాహనవతి చెప్తూ,ట్రయల్ కోర్టు సలేంపై మోపిన అదనపు అభియోగాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతిని కూడా కోరారు. దాదాదపు మూడేళ్ల న్యాయ పోరాటం తర్వాత సలేం, అతని గర్ల్ ఫ్రెండ్, సినీ నటి మోనికా బేడీని 2005, నవంబర్ 11న పోర్చుగల్‌నుంచి భారత్‌కు తీసుకు రావడం తెలిసిందే. సలేం ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్నాడు.
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 10 శాతం డిఎ పెంపు?
న్యూఢిల్లీ, ఆగస్టు 4: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యాన్ని ఇప్పుడున్న 80 వాతంనుంచి 90 శాతానికి పెంచుతూ ప్రభుత్వం వచ్చేనెల ఒక ప్రకటన చేయనుంది. పండగల సీజన్‌కు ముందు చేసే ఈ ప్రకటన వల్ల 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, మరో 30 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రాథమిక అంచనాలను బట్టి కరవు భత్యం పెంపు 10నుంచి 11 శాతం దాకా ఉండవచ్చని, ఇది ఈ ఏడాది జూలై 1నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం గత నెల 31న విడుదల చేసిన తాత్కాలిక గణాంకాల ప్రకారం ఫ్యాక్టరీ కార్మికులకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో 11.06 శాతం ఉంది. మామూలు పద్ధతి ప్రకారం అయితే డిఏ పెంపుకోసం ప్రభుత్వం 12 నెలల సగటు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటుంది. ఇది ఈ సారి 10 శాతం దాకా ఉంటుందని, సెప్టెంబర్‌లో దీనిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కానె్ఫడరేషన్ సెక్రటరీ జనరల్ కెకెఎన్ కుట్టి చెప్పారు.