Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమైక్య ప్రకటన వచ్చేవరకూ దీక్ష

$
0
0

చిత్తూరు, ఆగస్టు 4: రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ చిత్తూరు ఎమ్మెల్యే సికె బాబు చేపట్టిన నిరాహార దీక్ష ఆదివారం సాయంత్రానికి 96గంటలు (నాలుగు రోజులు) పూర్తయ్యింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ, సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్పు వచ్చేంతవరకూ దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. తన దీక్షను భగ్నం చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. చిత్తూరులో న్యాయవాదులు చేస్తున్న దీక్ష ఆదివారం నాటికి నాలుగోరోజుకు చేరుకుంది. ఇదిలావుండగా తిరుపతి ఆర్ అండ్‌బి అతిథిగృహంలో సమావేశమైన కాంగ్రెస్ నేతలు, శాప్స్ నేతలు తిరుపతి ఎంపి డాక్టర్ చింతామోహన్‌ను ఎంపి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు చేస్తే సమస్య పరిష్కారం కాదని, తనతో కొంతమంది వస్తే ప్రధానితో మాట్లాడిస్తానని చెప్పారు. ఆందోళనకారుల ర్యాలీలు, మానవహారాలతో తిరుపతి హోరెత్తింది. చంద్రగిరి మండల ఐక్య కార్యాచరణ సమితి నేత సురేష్ నేతృత్వంలో ఆదివారం కొన్ని వందల మంది చంద్రగిరి కోటను ఎక్కి జాతీయ జెండాతో నిరసన తెలిపారు.
ప్రకాశం జిల్లాలో..
ఒంగోలు: ప్రకాశంజిల్లాలో 5వ రోజు కూడా ఉద్యమం కొనసాగింది. ఒంగోలు లోని శ్రీప్రతిభ కాలేజీ వద్ద సమైకాంధ్ర విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో ఆదివారం యుపిఏ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రాస్తోరోకో నిర్వహించారు. దీంతో ఒంగోలు వైపు నుండి కర్నూలు వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయ.
నెల్లూరులో భారీ ర్యాలీ
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం విస్తరిస్తోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలందరితోపాటు అధికార కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎంఎల్‌సి కూడా ఇప్పటికే సమైక్యగళంతో తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. గత నాలుగు రోజులుగా విద్యాసంస్థలన్నీ మూసివేశారు. మరో రెండురోజులపాటు విద్యాసంస్థల బంద్ కొనసాగనుందనే ప్రకటనలు వెలువడ్డాయి. ఎన్‌జిఓలు విధులకు దూరంగా వ్యవహరిస్తామంటూ కూడా ప్రకటించారు. విద్యార్థి సంఘాల నేతృత్వంలోనే కీలకంగా నిర్వహిస్తున్న ఈ ఉద్యమం దశలవారీగా ఉద్యోగవర్గాలకు ఎగబాకింది. నగర శివారు ప్రాంతంలోని ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు క్రికెట్ ఆటతో వాహనాల రాకపోకలను గంటల తరబడి అడ్డుకున్నారు. జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో టిడిపి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నగరంలోని స్థానిక విఆర్‌సిసెంటర్ నుండి గాంధీబొమ్మ మీదుగా నర్తకిసెంటర్‌లోని ఎన్‌టిఆర్ విగ్రహం వరకు సాగింది.

నేడు కడప జిల్లా దిగ్బంధం
ఆర్టీసీకి రూ. 12 కోట్ల నష్టం
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఆగస్టు 4: కడప వైఎస్సార్ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం పరాకాష్టకు చేరుతోంది. రాజీవ్, ఇందిరాగాంధీ విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటి వరకు పట్టణాలు, నియోజకవర్గం, మండల కేంద్రాలకు పరిమితమైన ఉద్యమం గ్రామస్థాయికి చేరింది. దీనితో గ్రామీణులంతా తిండీతిప్పలు మానేసి రోడ్డెక్కుతున్నారు. రైతులు ఎడ్ల బండ్లతో రోడ్లపైకి వచ్చి నిరసనలో పాల్గొంటున్నారు. రోడ్లపైనే వంటావార్పు చేపట్టడంతో ఇళ్లకు వెళ్లడం లేదు. సోమవారం నుండి జిల్లా వ్యాప్తంగా ఎన్జీవోలు విధులు బహిష్కరించి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ విడిచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసిన తెరాస అధినేత కెసిఆర్‌ను జైలుకు పంపే వరకు నిద్రపోయేది లేదని న్యాయవాదులు శపథం చేశారు. నాలుగురోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదుల్లో సీనియర్లంతా ఇప్పుడు న్యాయశాస్త్రాలను తిరగేస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. టిడిపి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా దిగ్బంధానికి సన్నాహాలు చేస్తున్నారు. రాత్రి నుండే ఆందోళనకారులు జిల్లా సరిహద్దులకు చేరిపోయారు. విభజన నిర్ణయంపై పునరాలోచన జరిగే వరకు దిగ్బంధం సాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. జమ్మలమడుగులో బ్రాహ్మణ సంఘాలన్నీ కలిసి భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇదిలావుండగా సోమవారం కేంద్ర మాజీమంత్రి ఎ సాయిప్రతాప్, రాష్ట్ర మాజీమంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. విభజన నిర్ణయం ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదన్నారు. విభజన నిర్ణయం తీసుకుంటారని పార్టీలోనూ ప్రభుత్వంలోనూ భాగస్వాములమైన తమకు కనీస సమాచారం ఇవ్వకపోవడం ప్రజాప్రతినిథులను అధిష్ఠానం చులకన చేయడమేనన్నారు. విభజనపై పునరాలోచన చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆంధ్రులంతా ఉమ్మడిగా అభివృద్ధి చేసుకున్న రాజధాని హైదరాబాద్ విషయంలో యుపిఏ ప్రభుత్వం విచక్షణతో ఆలోచించాలన్నారు.
కిరణ్, బొత్స పదవులు వదిలి
ఉద్యమంలోకి రావాలి : డిఎల్
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఆగస్టు 4: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడే సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని మాజీమంత్రి, కడప వైఎస్సార్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మైదుకూరు, కడప ప్రాంతాల్లో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయం రెండు నెలల క్రితమే ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులకు తెలుసన్నారు. దీనిపై తనకు స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ కేంద్రంపై వారిద్దరికీ ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదనే ఉద్దేశ్యంతో నోరుమెదపలేదన్నారు. తెలంగాణ నేతలు ప్రత్యేక తెలంగాణతో పాటు హైదరాబాద్‌ను కోరడంలో అర్థం లేదన్నారు. హైదరాబాద్ తెలుగువారందరి సొత్తన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం సమైక్యవాదుల వాణిని వినిపించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సిఎం, పిసిసి చీఫ్ సమైక్యాంధ్రుల అభిప్రాయాలను అధిష్ఠానానికి వినిపించడంలో విఫలమయ్యారన్నారు. విభజనపై అధిష్ఠానం పునఃపరిశీలించాలన్నారు. తెలంగాణ సమస్య ఇప్పటిది కాదన్నారు. ప్రజాసంక్షేమం కోసం పాటు పడే పార్టీలు అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. విభేదాలు సృష్టించి రెచ్చగొట్టే పార్టీలు మనుగడ సాగించలేవన్నారు. సమైక్యాంధ్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కిరణ్, బొత్స తమ పదవులకు రాజీనామా చేసి అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలన్నారు.

మంత్రులతో కెవిపి రహస్య మంతనాలు!
హిందూపురం, ఆగస్టు 4: మంత్రి రఘువీరారెడ్డి తల్లి నరసమ్మ వైకుంఠ సమారాధన కార్యక్రమానికి హాజరైన మంత్రులతో కెవిపి అరగంట పాటు రహస్య మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు, పర్యటనశాఖ మంత్రి వట్టి వసంతకుమార్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యేలు కన్నబాబు, సుధాకర్ దాదాపు అరగంట పాటు ఓ గదిలో రహస్య మంతనాలు సాగించారు. రాష్ట్ర విభజన అనివార్యమయితే హైదరాబాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని వీరు నిర్ణయంచినట్లు తెలుస్తోంది.
బాలికపై అత్యాచారం
కారంచేడు, ఆగస్టు 4: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన శనివారం అర్ధరాత్రి ప్రకాశంజిల్లా కారంచేడులో జరిగింది. ఎస్‌ఐ షేక్ నసీజ్ బాష తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని వేజార గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలికను కారంచేడుకు చెందిన ఒకరు గత నాలుగేళ్లుగా పెంచుకుంటున్నాడు. సాయంత్రం ఆమె బజారుకు వెళ్లి తిరిగి వస్తుండగా గాదె గోపి అనే యువకుడు ఆమెను నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఏడుస్తూ జరిగిన విషయాన్ని ఆ బాలిక పెద్దలకు చెప్పటంతో వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. నిందితుడు గోపిపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టి బాలికను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. గోపి పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలను నియమించామని సిఐ చెప్పారు.

ఎమ్మెల్యే సికె బాబు స్పష్టీకరణ
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>