ఆదోని, ఆగస్టు 4: కర్నూలు జిల్లా ఆదోనిలోని కోతిగట్టులో క్రైస్తవ మతప్రచారాలకులు నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని హిందు ధర్మరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. సమితి రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులు, రాష్ట్ర నాయకులు గౌరయ్య, సత్యనారాయణమూర్తి, శ్రీలంకకు చెందిన బౌద్దబిక్షువు సుమేధస్వామితో కలిసి ఆదివారం కొతిగట్టును సందర్శించారు. అక్కడి బౌద్దరామాలను, ధ్వంసమైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని, హిందూ దేవతల రాతి బొమ్మలను పరిశీలించారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ స్థానిక ప్రజలు కోతిగట్టుగా పిలుచుకునే కొండను క్రైస్తవులు ఆక్రమించుకున్నారని, శిలువలు ఏర్పాటు చేసి రేకులషెడ్లులో ప్రార్థనలు చేయడం చట్టవ్యతిరేకమన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మతప్రచారం కోసం కొండను ఆక్రమించుకోవడం నేరమన్నారు. కొండకు 2000 గజాల దూరంలో బుద్ధుడి విగ్రహాలు, బౌద్దరామాలున్నాయన్నారు. కోతిగట్టు కింది భాగంలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోతిగట్టుపై ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలన్నారు. సామాన్యుల ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే సవాలక్షా నిబంధనలు విధించే విద్యుత్‌శాఖ అధికారులు కోతిగట్టు కొండపై నిర్మించిన అక్రమ నిర్మాణానికి ఏ నిబంధన కింద విద్యుత్ కనెక్షన్ ఇచ్చారని వారు ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొండను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు చర్యలు తీసుకోపోతే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. అవసరమైతే కోతిగట్టు కొండ ఆక్రమణపై న్యాయపోరాటం చేస్తామని హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు స్పష్టం చేశారు.
కోతిగట్టు కొండపై బుద్ధుడి విగ్రహాలను పరిశీలిస్తున్న శ్రీలంక బౌద్ధ
భిక్షువు సుమేధాస్వామి, హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు