హిందూపురం, ఆగస్టు 4: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆదివారం అనంతపురం జిల్లాలో సమైక్య సెగ తగిలింది. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం తొలిసారి హైదరాబాద్ వీడిని ముఖ్యమంత్రికి సమైక్యాంధ్రుల నుంచి నిరసన ఎదురైంది. సిఎం డౌన్ డౌన్, సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ సమైక్యవాదులు నినాదాలు చేశారు. మంత్రి రఘువీరారెడ్డి తల్లి నరసమ్మ వైకుంఠ సమారాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి కిరణ్‌కుమార్‌రెడ్డి బెంగళూరు నుండి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఆదివారం సాయంత్రం 4.50 గంటలకు అనంతపురం జిల్లా నీలకంఠాపురం చేరుకున్నారు. అనంతరం మంత్రి ఇంట్లో దాదాపు 20 నిమిషాల సేపు చర్చలు జరిపారు. బయటకు రాగానే పెద్దఎత్తున మీడియా ప్రతినిధులు సిఎంతో మాట్లాడేందుకు ప్రయత్నించగా చేతులు ఊపుతూ వాహనం వైపు వెళ్లిపోయారు. హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు వాహనం ఎక్కుతూ దూరంగా ఉన్న ప్రజలను చూసి చేతులు ఊపుతుండగా ఒక్క పెట్టును సమైక్యవాదులు నినాదాలు చేశారు. సిఎం డౌన్ డౌన్, కెసిఆర్ డౌన్‌డౌన్, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, సమైక్యాంధ్ర జిందాబాద్, సమైక్యాంధ్ర వర్ధిల్లాలి అంటూ అంటూ జనం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హెలిప్యాడ్ వరకు రోడ్డుకు ఇరువైపుల బారికేడ్ల ఆవల ఉన్న యువకులు, మహిళలు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. అయినా ముఖ్యమంత్రి నవ్వుకుంటూ ముందుకు వెళ్లిపోయారు.
విపక్షాల వైఖరి వల్లే విభజన
రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విభజించవద్దని సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ, యుపిఎ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని రాష్ట్ర మంత్రులు కొండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు కారకులైన చంద్రబాబు, వెంకయ్యనాయుడు, నారాయణను సీమాంధ్ర వాసులు అడ్డుకోవాలని, వారి ఫ్లెక్సీలు, చిత్రపటాలు, దిష్టిబొమ్మలు తగులబెట్టాలని పిలుపునిచ్చారు. త్వరలో హైదరాబాద్‌లో జరిగే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ బహిరంగ సభను సమైక్యవాదులందరూ అడ్డుకోవాలన్నారు. ఒకటి, రెండు రోజుల్లో సీమాంధ్ర స్టీరింగ్ కమిటీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. మరోమారు ఢిల్లీ వెళ్లి సీమాంధ్ర ప్రజల మనోభావాలను వివరిస్తామన్నారు. అవసరమైతే సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం పదవులను కూడా వదులుకుంటామని స్పష్టం చేశారు.
కర్నూలులో ఆగని సమైక్య జ్వాల
కర్నూలు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం కూడా ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయ. కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. జర్నలిస్టులు రాజ్‌విహార్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. రజక సంఘం యువకులు గాడిదల మెడలో ప్లకార్డులు తగిలించి తెలుగుతల్లి విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట, న్యాయవాదులు కృష్ణదేవరాయలు విగ్రహం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. డాక్టర్ ప్రసాద్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. జిల్లాలో అన్ని బస్సు డిపోల నుంచి ఒక్క బస్సు కూడా రహదారిపైకి రాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమైక్యవాదులు