విశాఖపట్నం, ఆగస్టు 4: సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖలో ఉద్యమం ఉద్ధృత రూపం దాల్చింది. ఉద్యమకారులు విజయవాడ వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను ఎన్‌ఎడి కూడలి వద్ద, తిరుమల, బొకారో ఎక్స్‌ప్రెస్‌లను దువ్వాడ స్టేషన్ వద్ద నిలిపివేశారు. ఎయులో ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించిన విద్యార్థి జెఎసి ప్రతినిధులు లగుడు గోవిందరావు, ఆరేటి మహేష్, బి.కాంతారావు, సురేష్ కుమార్ తదితరుల ఆరోగ్యం క్షీణించడంతో కెజిహెచ్‌కు తరలించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే, జెఎసి ప్రతినిధులు మాత్రం దీక్ష విరమించేందుకు నిరాకరించారు. కెజిహెచ్‌లోనే దీక్ష కొనసాగిస్తున్నారు. వీరిని వైద్య, ఆరోగ్య మంత్రి కోండ్రు మురళీ ఆదివారం రాత్రి పరామర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయడం తనకు పెద్ద విషయం కాదన్నారు. తాము ఇప్పటికీ సమైక్యాంధ్రకే కట్టుబటి ఉన్నామన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు చేసిన నినాదాలతో కెజిహెచ్ హోరెత్తింది. ఆ తర్వాత ఎయు పూర్వ విద్యార్థులు సమాఖ్య, ఎయు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రిలే నిరాహార దీక్షలకు సన్నద్ధమయ్యారు. వర్శిటీ క్యాంపస్‌లో భారీ ర్యాలీ నిర్వహించి సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అంతకు ముందు ఎయు గాంధీ విగ్రహం వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ప్రతినిధుల దీక్షాశిబిరాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి పార్లమెంటేరియన్ తిలక్ సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఇది విదేశీ కుట్ర
సమైక్యంగా ఉన్న రాష్ట్రంలో సోనియాగాంధీ విభజన చిచ్చు రగిల్చారని వైఎస్సార్ పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు ఆరోపించారు. తెలుగు ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకోవడం వెనుక విదేశీయత స్పష్టంగా కన్పిస్తోందని ఆయన ఆరోపించారు.
విజయనగరం జిల్లాలో శిరోముండనాలు..
విజయనగరం: సమైక్యాంధ్ర ఉద్యమ నినాదాలు.. రాస్తారోకోలు... మానవహారాలు.. శిరోముండనంతో నిరసనలు.. రిలే నిరాహార దీక్షలతో విజయనగరం జిల్లా హోరెత్తుతోంది. పట్టణంలోని ఎత్తు బ్రిడ్జి వద్ద టిడిపి ఆధ్వర్యంలో వంటావార్పు, మానవహారం, ఆటాపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ మామిడి అప్పలనాయుడు నేతృత్వంలో సమైక్యావాదులు శిరోముండనం చేసుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. మయూరి కూడలి వద్ద మోటారు యూనియన్ కార్మికులు రాస్తారోకో, మానవహారం నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. కస్పా స్కూల్ వద్ద ఉపాధ్యాయ సంఘాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. చీపురుపల్లి, ఎస్.కోట ప్రాంతాల్లో కాంగ్రెస్, ఐకాసా ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.
వంటావార్పును ప్రారంభిస్తున్న టిడిపి నేత అశోకగజపతిరాజు