Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విభజనపై ‘అనంత’ నిరసనలు

$
0
0

అనంతపురం, ఆగస్టు 4: అనంతపురం జిల్లాలో రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా ర్యాలీలు, ప్రదర్శనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సోనియాగాంధీ, కెసిఆర్‌ల శవయాత్రలు, దిష్టిబొమ్మ దహనాలు జరుగుతున్నాయి. నగరంలో ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి సర్కిల్, క్లాక్‌టవర్ కూడళ్లలోబ్రాహ్మణుల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర హోమం నిర్వహించారు. ఆటో, జెసిబి యూనియన్ల ఆధ్వర్యంలో జెసిబిలు ఆటోలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనల్లో వికలాంగులతోపాటు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బత్తలపల్లి మండలానికి చెందిన మల్లీశ్వరి అనే విద్యార్థిని రాష్ట్ర విభజన వల్ల భవిష్యత్తు అంధకారమైపోతుందంటూ ఆత్మహత్య చేసుకుంది. మడకశిరలో రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తల్లి పెద్ద కర్మకు హాజరైన పలువురు నేతల వాహనాలను సమైక్యాంధ్ర ఉద్యమకారులు ధ్వంసం చేశారు. రాజీవ్ విగ్రహంపై రాళ్లు రువ్వారు. వివిధ పార్టీల నేతలను అడ్డుకున్నారు. తాడిపత్రిలో విద్యార్థి జెఎసి నేత రాజశేఖరరెడ్డి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొత్తచెరువు మండలానికి చెందిన బోయ చంద్ర విభజనకు నిరసనగా విషం తాగాడు. రోడ్డు పైనే సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ పడిపోయాడు.
ఎంపి అనంతను అడ్డుకున్న విద్యార్థులు
ఎస్‌కె యూనివర్శిటీకి వెళ్లిన అనంతపురం ఎంపి అనంత వెంకటరామిరెడ్డిని నిరసనకారులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర సభలో పాల్గొన్న ఉపాధ్యాయ, విద్యార్థి జెఎసిలకు సంఘీభావం తెలపడానికి వెళ్లిన ఆయనను ఎంపి గోబ్యాక్ అంటూ తిప్పి పంపేశారు. జిల్లాలో ఐదవ రోజు కూడా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడ్డాయి.
విద్యార్థి ఆత్మహత్యాయత్నం
హిజ్రాల ఆధ్వర్యంలో ధర్నా
గుంటూరు: గుంటూరు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా వివిధ సంఘాలు, పార్టీలు, సమైక్యాంధ్ర, విద్యార్థి జెఏసిలు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరు నగరంలో సమైక్యాంధ్ర హిజ్రాల జెఏసి ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించి, స్థానిక శంకర్‌విలాస్ సెంటర్‌లోని ఓవర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు తమ ఆస్తులను కూడబెట్టుకునేందుకే తెలంగాణ ప్రత్యేక ఉద్యమం చేపట్టారని, అవసరమైతే భిక్షాటన చేసైనా నగదు ఇస్తామని, రాష్ట్రాన్ని విడదీయవద్దని హిజ్రాలు వేడుకున్నారు. అలాగే సమైక్యాంధ్ర జెఏసి, విద్యార్థి జెఏసి ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక లక్ష్మీపురంలోని మధర్‌థెరిస్సా విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటుచేసి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈక్రమంలో బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఇమ్రాన్ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో విద్యార్థి జెఏసి నాయకులు, గుంటూరు పశ్చిమ డిఎస్పీ వెంకటేశ్వరావు అడ్డుకున్నారు.
తెనాలి డివిజన్‌లో..
సమైక్య జెఏసి ఆధ్వర్యంలో గత ఐదురోజులుగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం ఆదివారం కూడా కొనసాగింది. వివిధ రాజకీయ, విద్యార్థి, స్వచ్ఛంద సంస్థలు, విద్యా, వ్యాపార, మహిళా సంఘాల నాయకులు నిరసన ర్యాలీల్లో పాల్గొని మద్దతు తెలిపారు. ఈసందర్భంగా పట్టణంలోని గాంధీచౌక్, శివాజీబొమ్మ సెంటర్, వీనస్ థియేటర్, అంబేద్కర్ కళాశాల, గంగాణమ్మపేట, బస్టాండ్, చెంచుపేట ప్రాంతాల్లో వివిధ సంఘాల నాయకులు సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో, మానవహారం నిర్వహించారు.
నరసరావుపేట డివిజన్‌లో..
సమైక్యాంధ్రను కోరుతూ నరసరావుపేట డివిజన్‌లో ఆదివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు జరిగాయి. ఈమేరకు సోమవారం పట్టణ కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు, టిడిపి ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఆపార్టీ నాయకులు ప్రకటించారు.
హోరెత్తించిన చిన్నకార్ల ర్యాలీ
మచిలీపట్నం: సమైక్యాంధ్ర ఉద్యమం ఆదివారం కూడా పెద్దఎత్తున కొనసాగింది. పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. మచిలీపట్నంలో వందలాది చిన్నకార్లతో ర్యాలీ నిర్వహించారు. కెసిఆర్, సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్రైవర్లందరూ మూకుమ్మడిగా హారన్‌లు మోగించటంతో పట్టణం దద్దరిల్లింది. అలాగే గుడివాడలో ఆటో, బైక్, మినీ వ్యాన్‌ల ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు పట్టణంలో ఉన్న వాహనాలన్నీ ర్యాలీలో పాల్గొనటంతో రోడ్లు కిక్కిరిసాయి. జగ్గయ్యపేటలో రంగవల్లులతో రోడ్లను తీర్చిదిద్ది సమైక్యాంధ్రను పరిరక్షించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉద్యోగులు ఉద్యమంలో భాగస్వాములు కావటంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమాన్ని ఉరుకులు పెట్టిస్తోంది.
అందరి నోటా...సమైక్యగళం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో అన్నివర్గాలు కలిసి సమైక్యంగా ముందుకు కదులుతుండటంతో రోజు రోజుకు ఉద్యమ తీవ్రత పెరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని విభజిస్తే సహించేది లేదంటూ నినదిస్తున్నారు. ఆదివారం కూడా జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, రోడ్లపై వంట వార్పులు కొనసాగాయి. ఏలూరులో జూట్‌మిల్లు కార్మికులు పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అలాగే వసంతమహల్ సెంటరులో శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రహదారిపై వంటావార్పు నిర్వహించారు. ఫైర్‌స్టేషన్ సెంటరులో ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జంగారెడ్డిగూడెంలో ద్విచక్ర వాహనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని బోసుబొమ్మ సెంటరులో విద్యార్ధులు, సమైక్యవాదులు మానవహారం నిర్వహించగా, జడ్పీ ఉన్నతపాఠశాల వద్ద యువకులు ఆశ్వారావుపేట రహదారిపై వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్తు ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ శాంతిహోమం నిర్వహించారు.
తూ.గో.జిల్లాలో..
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా జరిగింది. ఈనెల 6న కార్యకలాపాలను స్తంభింపజేయనున్నట్టు కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. జిల్లా కేంద్రం కాకినాడలోని కల్పన సెంటర్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద సోనియాగాంధీ, కెసిఆర్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి పిండ ప్రదానం చేశారు. నగరంలోని జగన్నాథపురం వంతెన వద్ద సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. సోమవారం పెద్ద ఎత్తున బంద్‌కు ఉద్యోగ జెఎసి పిలుపునిచ్చింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం అన్ని పెట్రోల్ బంకులు మూసివేయాలని పెట్రోలియం డీలర్లు నిర్ణయించారు.

అనంతపురం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లింలు, గుంటూరులో ఆత్మాహుతికి ప్రయత్నించిన విద్యార్థి ఇమ్రాన్

విద్యార్థిని ఆత్మహత్య.. మరో ఇద్దరి ఆత్మహత్యాయత్నం.. ఐదు వాహనాలు ధ్వంసంనలు
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>