పుణె, ఆగస్టు 5: బజాజ్‌కు చెందిన చకన్ ప్లాంట్‌లో సమ్మె విరమణకు బజాజ్ ఆటో చీఫ్ రాజీవ్ బజాజ్ సోమవారం వారం రోజుల గడువు ఇచ్చారు. ఈలోగా అక్కడి యాజమాన్యం, యూనియన్లు సమ్మె సమస్యను పరిష్కరించుకోకుంటే అక్కడి నుంచి ఉత్పత్తి కార్యక్రమాన్ని తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు. వారంలోగా సమస్యను పరిష్కరించుకోలేకపోతే యాజమాన్యం ఉత్పత్తి పనులను వేరే తరలించక తప్పని పరిస్థితి ఎదురవుతోందని ఆయన తెలిపారు. కనుక సమ్మెను విరమించాల్సిందిగా బజాజ్ ఆటో మేనేజింగ్ డైరక్టర్, చీఫ్ ఎగ్జిక్యుటివ్ రాజీవ్ బజాజ్ సిబ్బందిని కోరారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ‘ఇక్కడ సమస్య వారంలో తీరకుంటే ఇక్కడ ఉన్న ఉత్పత్తి సామర్ధ్యంకలో కనీసం 50 శాతాన్ని ఔరంగాబాద్, పంత్‌నగర్ ప్లాంట్లకు తరలించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇందుకోసం ఈ విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకువెళ్దామని భావిస్తున్నాను. అయితే చకన్‌లో అన్ని సౌకర్యాలను మూసివేయం. ఎందుకంటే ఇక్కడ ఆర్ అండ్ బి వ్యవస్థ ఉంది’ అని అన్నారు. ఇప్పటికే అమ్మకాలు దెబ్బతిన్నాయని, ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఇలా కొనసాగించే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. జూన్ 25 నుంచి పూణెలోని చకన్ బజాజ్ ప్లాంట్‌లో కార్మికులు సమ్మె చేస్తున్నారు. వేతనాలు పెంచాలని, ఇఎస్‌వోపి ద్వారా ప్రతి కార్మికునికి 500 షేర్లను ఇవ్వాలని, తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. ‘ఇంతకాలం ఓపిక పట్టాం. ఇక కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు.
* బజాజ్ చీఫ్ రాజీవ్ వెల్లడి
english title:
bajaj
Date:
Tuesday, August 6, 2013