న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటి రంగంలో నియామకాలు 17 శాతం తగ్గి 1,50,000 మందికి ఉద్యోగాలు లభించవచ్చునని నాస్కామ్ అంచనా వేసింది. వివిధ సంస్థలలో పెరిగిన ఆటోమేషన్‌కు తోడు పోటీ అంతగా లేకపోవడం ఇందుకు కారణమని భావిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. 108 బిలియన్ డాలర్ల ఐటి, ఱటియేతర సేవల రంగం 3 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. ‘ఈ ఏడాది 150,000 నుంచి 180,000 నియామకాలు ఉండవచ్చు. కిందటేడు 180,000 నియామకాలు జరిగాయి’ అని నాస్కామ్ అధ్యక్షుడు సోమ్ మిట్టల్ చెప్పారు. నియామకాల పరిస్థితి గురించి ప్రశ్నించగా, తాత్కాలిక, కింది స్థాయి పనుల్లో ఆటోమేషన్ పెరిగింది. సామర్ధ్యం గల నిపుణుల నియామకాలే ఉండవచ్చు. గతంలో ఉద్యోగ నియామకాల్లో సంస్థల మధ్య పోటీ 20 శాతం ఉండగా ఈ సారి 14-15 శాతానికి తగ్గింది. నియామక విధానాల్లో మార్పు చోటు చేసుకోడంతో ప్రాంగణ నియామకాలు కూడా తగ్గుతున్నాయి. కిందటేడాదిలాగే ప్రాంగణ నియామకాలు 60 శాతం ఉండవచ్చు. ఇప్పుడు చాలా సంస్థలు సాంకేతిక నైపుణ్యం కంటె సాఫ్ట్ స్కిల్స్, లీడర్ షిప్ క్వాలిటీ గల అభ్యర్థుల నియామకాలపైనే దృష్టి పెట్టారు’ అని ఆయన అన్నారు. మూడేళ్ల కిందట సాంకేతిక నైపుణ్యంపై 80 శాతం దృష్టి ఉండేదని, ఇప్పుడు కేవలం 40 శాతం సాంకేతిక నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాఫ్ట్ స్కిల్స్, సామర్ధ్యాన్ని చూస్తున్నారని మరో నిపుణుడు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ నెలల్లో నాలుగు ఐటి కంపెనీల నియామకాలు 60 శాతం తగ్గాయి. ఈ త్రైమాసికంలో ఆ నాలుగు కంపెనీలు 4,100 మందిని నియమించారు. కిందటేడు 10,900 మందిని నియమించారు.
* ఈ ఆర్థిక సంవత్సరానికి నాస్కామ్ అంచనా
english title:
it
Date:
Tuesday, August 6, 2013