విజయవాడ, ఆగస్టు 5: రాష్ట్ర విభజనపై అధికారపక్ష కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ, యుపిఎ భాగస్వామ్య పార్టీలు ఓ నిర్ణయం తీసుకోవడమే గాక కేంద్ర ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో రాష్ట్ర విభజన ప్రక్రియ ఆరంభమైందంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోడం ఆరంభమైంది. దీనికి తగ్గట్టే తెలుగుదేశంపార్టీ నేతలు విజయవాడ- గుంటూరు నగరాల మధ్య రాజధాని నిర్మాణం జరగాలంటూ పట్టుబడుతున్నారు. అసలు తెలంగాణాలో కెసిఆర్ ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడే విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం జరుగగలదంటూ రియల్‌ఎస్టేట్ వ్యాపారం హుషారుగా సాగింది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో రియల్ వ్యాపారం చతికిలబడింది. ఇదిలా ఉంటే రెవెన్యూ ఉన్నతాధికారులు కొందరు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎంతో గోప్యంగా ప్రభుత్వ బంజరు, అటవీ, దేవాదాయ భూముల రికార్డులను పరిశీలిస్తున్నారని తెలిసింది. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఒక్క కృష్ణా జిల్లాలో అదీ ఒక్క నూజివీడు డివిజన్‌లోనే దాదాపు 15 వేల ఎకరాల దేవాదాయ, అటవీ బంజరు భూములు పెద్దల గుప్పెట్లో ఉన్నాయి. అలాగే గుంటూరు జిల్లాలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట సిమెంటు ఫ్యాక్టరీ భూముల పరిసరాల్లో కనీసం వంద ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందంటున్నారు. పైగా గతంలో గుంటూరు కలెక్టర్లుగా పనిచేసిన కొందరు ఉద్దేశపూర్వకంగానే విలువైన ప్రభుత్వ భూమిని రియల్‌ఎస్టేట్ వ్యాపారులకోసం రహదారి పేరిట ధారదత్తం చేశారు. ఇక కృష్ణా జిల్లాలో ఆరు వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉండగా వీటిల్లో అనేకం కబ్జాకు గురయ్యాయి. ఒకవేళ రాజధాని నిర్మాణం జరగాలంటే ఏదైనా ప్రభుత్వ కార్యకలాపాల కోసం ముందుగా ఈ ఆక్రమణ భూములన్నింటినీ తొలి దశలోనే స్వాధీనపరచుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. ఇక అందరి కళ్లూ నాగార్జున విశ్వవిద్యాలయంపైనే పడ్డాయి. దాదాపు 300 ఎకరాల భూమి అందులో అత్యధిక భవనాలు నిరుపయోగంగా ఉన్నాయంటున్నారు. మంగళగిరి టిబి పాత ఆసుపత్రి ప్రాంగణంలో 214 ఎకరాల భూమి ఉండగా ఇటీవలే అందులో 50 ఎకరాల భూమిని ప్రకృతి వైపరీత్యాల సంస్థకు అప్పగించడం జరిగింది. మిగిలిన భూమి ఖాళీగానే ఉంది. గతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం కూడా పరిశీలించారు. ఇక మరోవైపు కృష్ణాలో గన్నవరం, హనుమాన్ జంక్షన్, అంబాపురం, పాతపాడు ప్రాంతాల్లోనూ, నందిగామ పరిసరాల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పటికే ఊపందుకుంటున్నది. రాజకీయ నాయకులు కొందరు ముందస్తు సమాచారంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో బినామీ పేర్లతో వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేశారనే ప్రచారం సాగుతున్నది. ఏది ఏమైనా సీమాంధ్ర ప్రాంత భూముల ధరలకు రెక్కలొచ్చాయని గన్నవరం ప్రాంతంకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఆదిత్య హౌసింగ్, ఇన్‌ఫ్రా హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిడెట్ సంస్థ డైరెక్టర్ రవిచంద్ర అంగీకరిస్తున్నారు. రాష్ట్ర విభజన అంటూ జరిగితే బందరు పోర్టుకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందనే అభిప్రాయంతో మచిలీపట్నం పరిసరాల్లో మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆరంభమైంది. 2008లో ఒకసారి పోర్టు పేరుతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీనికి శంకుస్థాపన జరిగినా పోర్టు నిర్మాణం కనుచూపు మేరలో కనిపించకపోవడంతో భూముల కొనుగోలుపై భారీగా పెట్టుబడులు పెట్టిన రియల్‌ఎస్టేట్ వ్యాపారులు అప్పులపాలయ్యారు. తాజాగా రాష్ట్ర విభజన పేరుతో మళ్లీ తెరపైకి వచ్చారు. వాస్తవానికి బందరు పరిసరాల్లో కృష్ణా డెల్టా పంట భూములు మినహా మరి ఏ ఇతర భూములూ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలం కాకపోయినా మాగాణి భూములను ప్లాట్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ- బందరు జాతీయ రహదారి పక్కనే ఉన్న భూముల ధరలు కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతున్నదని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇలా పుంజుకునే కొద్దీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణ తీవ్ర విఘాతాన్ని కల్గిస్తుందనే చెప్పాలి. ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి స్థలాభావం వల్ల ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందనే విషయం తెలిసిందే...
సమైక్యాంధ్రతోనే రాష్ట్రం సుభిక్షం
మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 5: సమైక్యాంధ్రతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నాగార్జున పబ్లిక్ స్కూలు అధినేత సుందరరాం అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా సోమవారం పాఠశాల ఆవరణలో విద్యార్థులు ‘సమైక్యాంధ్ర’ ఆకృతిలో ఏర్పడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగుల బైక్ ర్యాలీ
గుడివాడ, ఆగస్టు 5: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గుడివాడ డివిజన్‌లోని ఉద్యోగులు, కార్మికులు పట్టణంలో సోమవారం భారీ ఎత్తున మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక ఏలూర్ రోడ్డులోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద జరిగిన సభలో జేఏసీ జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 56 ఏళ్ళుగా కలిసి ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్భుద్ధితో ఇప్పటికిప్పుడు విడగొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేవలం తెలంగాణాలో కాంగ్రెస్ మనుగడను కాపాడుకోడానికి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని విమర్శించారు. యుపిఎ ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాజకీయేతర జేఏసీతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు మండలి హనుమంతరావు, షేక్ ఫరీద్‌భాషా, జి రాజేంద్రప్రసాద్, విద్యుత్ జేఏసీ నేతలు యు కృష్ణారావు, మోహనరావు, ఒ రాఘవయ్య, ఎల్ రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక మోడల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్లకార్డులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.