ముంబయి, ఆగస్టు 5: ముంబయి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెన్సెక్స్ సోమవారం 18 పాయింట్లు లాభపడడంతో ఎనిమిది రోజుల నష్టాలకు బ్రేక్ పడినట్లయింది. ఐసిఐసిఐ బ్యాంక్, ఐటిసి, రిలయన్స్ కంపెనీల స్టాక్స్‌కు కొనుగోలు మద్దతు లభించడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూల ధోరణులు ఏర్పడడంతో దేశీయ మార్కెట్ కూడా అదే ధోరణిలో సాగింది. గత ఎనిమిది సెషన్స్‌లో 1,139 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ సోమవారం 18.24 పాయింట్ల లాభంతో 0.10 శాతం పెరిగి 19,182.26 వద్ద ముగిసింది. ఇదే విధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ఇండెక్స్ నిఫ్టీ 7.50 పాయింట్లు వృద్ధి చెంది 0.13 శాతం పెరిగి 5,685.40 వద్ద ముగిసింది. గత వారంగా మార్కెట్ 3 శాతం క్షీణించడంతో ప్రాథమికంగా బలంగా ఉండే కంపెనీల స్టాక్స్ ఆకర్షణీయంగా తక్కువ ధరకు లభిస్తుండడంతో మదుపరులు వాటి కొనుగోలు పట్ల మొగ్గు చూపారు. కాగా ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణులు నెలకొనగా, ఐరోపా మార్కెట్ గరిష్టంగా ప్రారంభం కావడంతో సెంటిమెంట్‌కు మద్దతు ఇచ్చినట్లయింది. గత వారం దాదాపు 74 శాతం క్షీణించిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ స్టాక్ ఈ వారం 30.88 శాతం లాభపడింది. ఇలా ఉండగా, బిఎస్‌ఇ ఇండెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 18 లాభాలతో ముగియగా, 12 నష్టాలను చవిచూసాయి. ఐటిసి, కోల్ ఇండియా, స్టెరిలైట్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హీరో మోటార్ కార్పొరేషన్, ఐసిఐసిఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనీలివర్ స్టాక్స్ లాభపడ్డాయి. మరో వైపు బిహెచ్‌ఇఎల్ నికర లాభం క్షీణించడంతో ఆ కంపెనీ స్టాక్ 19.08 శాతం నష్టపోయింది. మెటల్ రంగం 2.67 శాతం, బ్యాంకింగ్ ఇండెక్స్ 0.97 శాతం, ఐటి 0.90 శాతం, ఎఫ్‌ఎంసిజి 0.58 శాతం లాభపడింది. మరో వైపు క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 3.58 శాతం, పవర్ ఇండెక్స్ 1.02 శాతం క్షీణించింది.
* 18 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
english title:
market rises
Date:
Tuesday, August 6, 2013