ఆళ్లగడ్డ, ఆగస్టు 6: సమైక్యాంధ్ర కోసం మంగళవారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని నారీలోకం కదంతొక్కింది. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రపై చేపడుతున్న కార్యక్రమాలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి. జెఏసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీలో నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది, పాఠశాల విధ్యార్ధులు, నారుూబ్రాహ్మణులు, గ్రామసేవకులు, కార్మికులు, జీవిత బీమా సంస్థ ఏజెంట్లు, తదితరులు తహశీల్దార్ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా కిలోమీటరు పోడవునా యుపిఏ అధినేత్రి సోనియా డౌన్‌డౌన్, మన్మోహన్‌సింగ్ డౌన్‌డౌన్ అంటూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో శునక మహారాజుకు సోనియా అని పేరు వున్న స్లిప్పులు అంటించి ర్యాలీ వెంట ఊరేగించారు. ఈ కార్యక్రమంలో జెఏసి నాయకులు దస్తగిరిరెడ్డి, వరప్రసాదరెడ్డి శ్రీ రాఘవేంధ్రా బిఈడి కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రమైన అహోబిలంలో సమైక్యాంధ్ర కోసం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అహోబిల క్షేత్రానికి దర్శనార్ధం వచ్చిన ఇండోనేషియా దేశస్తులు జరుగుతున్న కార్యక్రమాలను తెలుసుకొని ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా చేశారని సమైక్యాంధ్రగా వుంచాలని ఫ్లే కార్డులు చేతబట్టి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ బివి నరసయ్య, ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్, మాలోలా మఠం మేనేజర్ బద్రీనారాయణ, ఆలయ సిబ్బంది, గ్రామప్రజలు పాల్గొన్నారు. బత్తలూరులో: మండలంలోని బత్తలూరులో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విధ్యార్థులు, గ్రామస్థులు సమైక్యాంద్ర కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారికి ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచి పోయాయి. చివరగా దిష్టిబొమ్మలను దగ్దం చేశారు.
నందికొట్కూరులో...
నందికొట్కూరు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్రను కోరుతూ పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక పటేల్ సెంటర్‌లో ధర్నా చేపట్టారు. ట్రాన్స్‌కో ఎడి హరిశ్చంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో ఉద్యోగులు కార్యాలయం నుంచి కెజి రహదారిపై నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్యవైశ్యసంఘం, జెఎసి ఆధ్వర్యంలో కూడా సమైక్యాంధ్ర ఆందోళనలు కొనసాగాయి. విశ్రాంత ఉపాధ్యాయురాలు శోభారాణి భద్రకాళి రూపంలో టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చిత్రపటాన్ని శూలంతో అంతంచేసి నిరసన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పటేల్‌సెంటర్‌లో వాసవీమాత అలంకరణలో సమైక్యవాదాన్ని విన్పించారు.
బేతంచెర్లలో...
బేతంచెర్ల : రాష్టవ్రిభజన ప్రకటనను నిరసిస్తూ బేతంచెర్ల సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం ఆర్యవైశ్యులు, బ్రహ్మణులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర మంత్రులకు ప్రజా ప్రతినిధులకు పిండా ప్రదానం చేశారు. రాష్టవ్రిభజన ప్రకటనతో సీమాంధ్రలో ఆగ్నిగుండంలా ప్రజల ఆవేదన రగులుతుంటే చేతకాని దద్దమ్మలా సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు వ్యవహరించడాన్ని నిరసిస్తూ సమైక్యవాదుల ఆధ్వర్యంలో బ్రహ్మణులు పాత బస్టాండ్ నందు బతికున్నా చచ్చిన వారితో సమానంగా భావించి పిండా ప్రదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు సుబ్బారెడ్డి, వెంకట్రాముడు, నారాయణలతో పాటు ఆర్యవైశ్యులు గుండా జగన్, జగదీశ్, వెంకటశెట్టి, ఆశ్వర్దనారాయణ, బ్రహ్మణ ప్రముఖులు సుజాత శర్మ, డాక్టర్ శ్రీకాంత్, అన్నారావు, కృష్ణారావు, రామయ్య, రామ్ శర్మ, శ్రీనివాసులు అధిక సంఖ్యలో సమైఖ్యావాదులు పాల్గొన్నారు.
బేతంచెర్లలో...
బేతంచెర్ల: రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుండి 7 రోజులుగా బేతంచెర్ల సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో ఎడతెరిపి లేని ఉద్యమం కొనసాగుతుంది. విద్యార్థులతో ప్రారంభమైన సమైఖ్యాంద్ర ఉద్యమం జనర్నలిస్టు యూనియన్, ఎంఆర్‌పిఎస్, మాల మహనాడు, జీపు ఆటో డ్రైవర్ల యూనియన్ కుల సంఘాలు వివిధ రాజకీయ పార్టీలతో ఉద్యమం రోజురోజు ఓ వినూత్న రీతిలో సాగుతువుంది.
డోన్‌లో....
డోన్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మంగళవారం డోన్‌లో విద్యార్థిలోకం కదంతొక్కింది. సమైక్యాంద్రకు మద్దతుగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఇచ్చిన పిలుపుమేరకు పట్టణంలోని సిద్దార్థ, శ్రీసుధ, ఒనైరో, జ్యోతి, వాసవి, శాంజో, సార్క్, విజ్ఞాన్, సరస్వతి విద్యామందిర్, నలంద, సర్వేపల్లి రాధాక్రిష్ణ, లిటిల్ ప్లవర్, సెయింట్ జోసఫ్‌తో పాటు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పాటు సాయిశ్రీ డిగ్రీ, బిఇడి కళాశాల, వైష్ణవి డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థులు డోన్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు చేసిన నినాదాలతో పట్టణ పురవీధులు హోరెత్తిపోయాయి. కెసిఆర్ డౌన్‌డౌన్, చెట్టుమీద కొంగ, సోనియా దొంగ, సమైక్యాంధ్ర వర్థిల్లాలి, రాష్ట్ర విభజన వద్దు, సమైక్యాంద్ర ముద్దు అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు దద్దరిల్లిపోయాయి. ఎస్కేపి హైస్కూలు నుంచి ప్రారంభమైన ర్యాలీ పాతబస్టాండ్, ఇందిరాగాందీ చౌక్, పాతబస్టాండ్, రైల్వేగేట్లు, పాతపేట నుంచి జెఎసి శిబిరానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్థుల నుద్దేశించి సాయిశ్రీ విద్యాసంస్థల అధినేత సాయిరామ్, వైష్ణవి డిగ్రీ కళాశాల గౌరవాధ్యక్షులు తూర్పు జయ ప్రకాష్‌రెడ్డి, సిద్దార్థ కళాశాల అధినేత క్రిష్ణారెడ్డి, శ్రీ సుధ విద్యా సంస్థల అధినేత వేణుగోపాల్‌లు ప్రసంగించారు. ఈనెల 7వ తేదినుంచి 11వ తేది వరకు విద్యాసంస్థలకు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వలసల రామక్రిష్ణ, కొచ్చెర్వు విక్రమసేనారెడ్డి, బొబ్బల శివరామిరెడ్డి, చిట్యాల మద్దయ్య గౌడు, మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న విద్యార్థుల విన్నూత్న ప్రదర్శనలు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విద్యార్థిలోకం తలపెట్టిన నిరసన ర్యాలీలో విద్యార్థులు చేసిన విన్నూత్న ప్రదర్శనలు పట్టణ వాసులను ఎంతో ఆకట్టుకున్నాయి. అంతేగాక శ్రీక్రిష్ణ దేవరాయలు, భరతమాత, తెలుగుతల్లి, అల్లూరి సీతరామరాజుల వేషదారణలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగానిలిచాయి.
సమ్మెకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ ఉద్యోగులు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.
లేఖలు వెనక్కి తీసుకోండి
కర్నూలు, ఆగస్టు 6: రాష్ట్ర విభజనకు అనుకూలంగా తెలుగుదేశం, వైకాపా ఇచ్చిన లేఖలను ఏ క్షణాన వెనక్కి తీసుకుంటే ఆ క్షణాన విభజన ప్రక్రియ ఆగుతుందని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపకులు, మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. చంద్రబాబు, జగన్ ఇచ్చిన లేఖలే రాష్ట్ర విభజనకు కీలకంగా మారాయని అన్నారు. వారు లేఖలు వెనక్కి తీసుకున్నా విభజన ఆగనిపక్షంలో తన ఆస్తి రాసిస్తానని ఆయన సవాల్ విసిరారు. కర్నూలులో మంగళవారం విలేఖరులతో మంత్రి మాట్లాడుతూ 1956 నుంచి ఇప్పటి వరకు రాయలసీమకు జరిగిన నష్టం ఏ ప్రాంతానికీ జరగలేదన్నారు. అయినా బాధను దిగమింగుకుంటూ తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. గత 57 సంవత్సరాలుగా రాయలసీమకు న్యాయం, సహాయం చేసే వారే కరువయ్యారని వాపోయారు. తెలంగాణవారు ప్రత్యేక రాష్ట్రం బూచిచూపి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుపెడితే అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చినప్పటికీ వారు సంతృప్తి చెందకుండా భారీ ఎత్తున అభివృద్ధి సాధించి ఇప్పుడు విడిపోతున్నారని అన్నారు. రాజీవ్, ఇందిరాగాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా సోనియా బాధపడుతున్నారన్నారు. దీంతో రాయలసీమ, ఆంధ్రావారు ఏం చెప్పినా వినే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి సమస్యలు పరిష్కరించిన తరువాతే విభజన గురించి ఆలోచించాలని ఆయన డిమాండ్ చేశారు.
వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కర్నూలు, ఆగస్టు 6: వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేసిన సమయంలో కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఎస్పీ డా.కె.రఘురామిరెడ్డి చెప్పారు. వర్షాకాలం పూర్తయ్యేవరకు ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వర్షాకాలంలో లోతుట్టు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంగళవారం ఓక ప్రకటనలో తెలిపారు. అధిక వర్షాలు కురిసిన సందర్భంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు, అక్కడ నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు పోలీసు సిబ్బందితో గస్తీఏర్పాటు చేస్తామని, అయా లోతట్టు ప్రాంతాల్లో వర్తషపునీటి ఉద్ధృతి, నీటిస్థాయి తదితర విషయాలను వైర్‌లెస్ సెట్ ద్వారా జిల్లా స్పెషల్ బ్రాంచ్ కార్యాలయానికి చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో ప్రజలు భయాంధోళనలనకు గురికాకుండా వారికి పోలీసుశాఖ తమ వంతుగా కర్తవ్యంగా ముందు జాగ్రత్త చర్యలను చేపడుతుందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇన్‌చార్జీలుగా నియమించిన సిబ్బంది వర్షాలు అధికంగా కురిసిన సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న నీటిమట్టం, అక్కడి పరిస్థితులను జిల్లా స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలోని కంట్రోల్ రూంలో పనిచేసే సిబ్బందికి చేరవేయాలన్నారు. వర్షాకాలంలో ముందస్తు చర్యలు పాటించడం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా అధికార యంత్రాంగం ఎదుర్కోనేందుకు అవకాశం ఉంటుందని, ఈ విషయం గుర్తించి అందరూ జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నేడు పతాంజలి యోగా సమితి ధర్నా
కర్నూలు టౌన్, ఆగస్టు 6: తెలంగాణకు వ్యతిరేఖంగా బుధవారం పతాంజలియోగా సమితి ఆధ్వర్యంలో సమైక్యాంద్రకు మద్దతుగా జాతీయ రహాదారిపై వెంకటరమణ కాలనీ దగ్గర ఉదయం 7నుండి యోగాద్వారా ధర్నాలు చేపడుతామని పతాంజలి సమితి అద్యక్షులు వీరత్న ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలోతెలిపారు. ఈకార్యక్రమానికి అందరు పాలొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ సైనిక సంఘం అధ్యక్షుడిగా శేషిరెడ్డి
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఆగస్టు 6: నగరంలోని కర్నూలు మాజీ సైనిక సంఘం కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శుల ఎంపికలకు ఎన్నికలు జరిగాయి. ఆ సంఘం అధ్యక్షుడిగా పి.శేషిరెడ్డి, కార్యదర్శిగా కె.దేవ విష్ణుమూర్తిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి మనోహార రాజు తెలిపారు. ఎన్నికైన అభ్యర్థులకు డిక్లరేషన్ పత్రాలను అందజేశారు. ఈ కమిటీ 3 సంవత్సరాలపాటు కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఈ నెల 15వ తేదిన జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలల్లో మాజీ సైనికులందరు పాల్గొనాలని కోరారు.
రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేస్తే ఊరుకోం
కల్లూరు, ఆగస్టు 6: రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాటం చేబుతామని టిడిపి నాయకులు మల్లెల పుల్లారెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర విభజనను నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, కేంద్ర రాష్ట్ర మంత్రులకు సోనియాతో రాష్ట్రంపై మాట్లాడే ధైర్యం లేదన్నారు. ఇప్పటికైన ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులకు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైన వుందన్నారు. ఏక పక్ష నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలను విభజించ లేరని క్రిష్టియన్ ఎంప్లాయిస్ గాస్పెల్ ఫెలోషిప్ కన్వీనర్ రత్నం అన్నారు. మంగళవారం క్రైస్తవ సోదరుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనను క్రైస్తవులు వ్యతిరేకిస్తున్నారని, తెలంగాణ ఏర్పడితే సీమ ప్రజలకు సాగు, తాగు నీరు లేక అనేక ఇబ్బందులు పడుతారని, విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుబడే ప్రమాదం వుందని అన్నారు. అలాగే విద్యుత్ కష్టాలతో సీమ చీకటిలో వుంటుందని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాలకే సిపిఎం కట్టుబడి ఉంది
కల్లూరు, ఆగస్టు 6: మొదటి నుండి భాషా ప్రయుక్త రాష్ట్రాలకే సిపిఎం కట్టుబడి వుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కల్లూరు సిపిఎం కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘకాలంగా సమస్యను నానపెడుతూ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ప్రకటించిందని దీనికి యుపిఎ పక్షాలు కూడా ఆమోదం తెలపడం, బిజెపి కూడా మద్దతు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడం అన్న భావన సీమాంధ్రలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. సిపిఎం పార్టీగా సమైఖ్యాంధ్రకు కట్టుబడి భాషా ప్రయుక్త రాష్ట్రాలకే సంఘీభావంగా పార్టీ వుందన్నారు. రాష్ట్రాల అధికారాలు, నిధుల విషయంలో సరైన వాటా న్యాయం జరగాలంటే జాతీయ, భాష ప్రాతిపధికనే బలంగా వుండాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు సోమన్న, సుధాకరప్ప, ఆనంద్, రాజు, భాస్కర్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ప్రతిభా పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం
కర్నూలు స్పోర్ట్స్, ఆగస్టు 6: జాతీయ ప్రతిభా పరీక్ష లెవల్-1కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు తెలిపారు. 2013-14 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు, ఐసిఎస్‌ఇ, సిబిఎస్‌ఇ సిలబస్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గతంలో 8వ తరగతి విద్యార్థులు ఎన్‌టిఎస్‌ఇ, ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన వారు పరీక్షకు అర్హులన్నారు. ఈ పరీక్షలో మెంటల్ ఎబిలిటీ , ల్యాంగ్వెజ్ కంప్రహెన్సివ్ టెస్టు, అప్టిట్యూడ్‌లో మ్యాధ్స్, సైన్స్, సోషల్ అబ్జెక్టుల్లో వుంటుందని అన్నారు. విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.100 డిడిని ది సెక్రటరీ, ది కమీషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఎపి, హైదరాబాద్ పేరిట ఎస్‌బిహెచ్/ఎస్‌బిఐలో మాత్రమే ఈ నెల 31వ తేదిలోగా తీయాలని అన్నారు. విద్యార్థుల నామినల్ రోల్స్ సెప్టెంబర్ 2వ తేదిలోగా డిఇవో కార్యాలయంలో సమర్పించాలని అన్నారు. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బిఎస్‌ఇఎపి.ఓఆర్‌జి, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎన్‌సిఇఆర్‌టి.ఎన్‌ఐసి.ఇన్ వైబ్ సైట్‌లో పొందవచ్చన్నారు.
కుట్రలో భాగమే రాష్ట్ర విభజన
నందికొట్కూరు, ఆగస్టు 6, స్వార్థ రాజకీయ నాయకుల కుట్రలో భాగమే రాష్ట్ర విభజన జరిగిందని వైకాపా నాయకులు కోకిల రమణారెడ్డి, ఐజయ్య అన్నారు. స్థానిక వైకాపా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత కేవలం రాహుల్‌గాంధిని ప్రధానమంత్రి చేయడానికి రాష్ట్ర విభజనకు పూనుకుందన్నారు. ప్రత్యేక రాయలసీమ అంటూ కొందరు ప్రజలను మభ్యపెడుతూ అక్రమంగా సంపాదించిన వేల కోట్ల ఆస్తులు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అధికారంలో ఉన్ననాడు గుర్తుకు రాని రాయలసీమ నేడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. రాయల తెలంగాణ అంటూ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోనియాను కోరడం కేవలం పదవిని కాపాడుకోడానికి తప్ప మరొకటి కాదన్నారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు విగ్రహాలు కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. తెలంగాణ ఏర్పాటువాదులు విగ్రహాలు కూల్చినపుడు ఎందుకు స్పందించలేదన్నారు. తెలుగు వారంతా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉండి ఉద్యమ తీవ్రతను పెంచాలని వారు కోరారు.
ఘనంగా చౌడేశ్వరిదేవి పూజలు
పట్టణంలోని కెజి రహదారి పక్కనే వెలసిన చౌడేశ్వరి ఆలయంలో మంగళవారం దేవీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు, కుంకుమార్చన, ఆకుపూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. దేవాలయ కమిటీ నాయకులు మాజీ సర్పంచ్ చింతా నాగయ్య, దేశెట్టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో పలు పూజా కార్యక్రమాలు జరిగాయి.
రాష్ట్రాన్ని విభజిస్తే ఉతికి ఆరేస్తాం
కర్నూలు స్పోర్ట్స్, ఆగస్టు 6:రాష్ట్రాన్ని విభజిస్తే ఉతికి ఆరేస్తామని ఎపి రజక ఐక్యసేవా సమితి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ సందర్భంగా సమితి ప్రధాన కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ తెలుగు జాతిని విభజించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని తక్షణమే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మద్దిలేట్టి, మధు, రంగ, బీసన్న, రాజు, జోషి, రామకృష్ణ పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర కోరుతూ మిన్నంటిన ఆందోళనలు
ఆదోని, ఆగస్టు 6: ఆదోనిలో మంగళవారం సమైక్యాంధ్ర ఉద్యమం మ రింత తీవ్రరూపందాల్చింది. జెఎసి ఆ ధ్వర్యంలో ఆదోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కా లేజీ మైదానం నుంచి ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్‌రెడ్డి, రాచోటి రామయ్య, కాం గ్రెస్ నాయకులు విట్టారమేష్, నసీరుద్దీన్‌పటేల్, బసవరాజుస్వామి, నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, ప్రసాద్, గోపాల్‌రెడ్డి, భూపాల్ చౌదరి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు రజీనికాంత్‌రెడ్డి, రమేశ్వర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, వలిబాషా, ప్రసాద్, నాగేంద్రప్ప, రామకృష్ణ, రంగన్న, విరుపాక్షి, యాసిన్, విజయలక్ష్మి, చంద్రశేఖర్, ప్రిన్సిపల్ సుధాకర్, తదితరుల ఆధ్వర్యంలో భారీ మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ విబిఎస్ కూడలికి చేరుకుని రాస్తారోకో చేశారు. అనంతరం బంగారు వ్యాపారుల దుకాణాలు మూసివేసి బంగారు దుకాణాల వీధి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ అబ్దుల్‌ఖాదర్, సంఘం నాయకులు కేఎం రహిమ్, ది లిప్, తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం రాస్తారోకో చేశారు. ఏఎన్‌ఎం కార్యకర్తలు, సిబ్బంది కూడా ర్యాలీ నిర్వహించి విబిఎస్ కూడలిలో రాస్తారోకో చేశారు. ఆరోగ్య కార్యకర్తలు చాలా మంది చంటిబిడ్డలతో ఆం దోళనలో పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగులు పెద్దఎత్తున మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు తెలుగుజాతిని విడదీసిన ద్రోహులంటూ నాయకుల వ్యంగ్య చిత్రాలతో బ్యానర్లు పట్టుకుని ఆందోళన చేశారు.