శ్రీకాకుళం, ఆగస్టు 7: శివారు జిల్లా అయిన శ్రీకాకుళంలో సమైక్యగళం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. వాడవాడలా ఉద్యమం ఊపందుకోవడంతో పలు ప్రాంతాల్లో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. బుధవారం అంబేద్కర్ వర్శిటీ విద్యార్థులు బ్రాహ్మణుల ఆధ్వర్యంలో శాంతిహోమం నిర్వహించారు. అలాగే కేసీఆర్‌కు శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మానవహారం నిర్వహించి హైదరాబాద్ ఏ ఒక్కడి సొత్తుకాదని..ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిదంటూ ఎలిగెత్తారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు వర్శిటీ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ఎన్‌జిఒ నేతలు చౌదరి పురుషోత్తంనాయుడు, హనుమంతు సాయిరాం, బుక్కూరు ఉమామహేశ్వరరావు, జేఏసి ప్రతినిధులు జామి భీమశంకర్రావు, బరాటం లక్ష్మణరావు, సిటిజన్‌ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, సమైక్యాంధ్ర ఫోరం అధ్యక్షులు బలగ ప్రకాష్, వైకాపా నేతలు వరుదు కల్యాణి, కిల్లి రామ్మోహన్‌రావు తదితరులు విద్యార్థులు చేపట్టిన హోమంలో భాగస్వామ్యులై మరింత స్పూర్తిని నింపారు. విద్యార్థులే కాకుండా వ్యాపార, ఉద్యోగ సంఘాలు, వివిధ కమిటీల ప్రతినిధులు, రాజకీయ నాయకులు నిరసనలతో తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. పాతపట్నంలో 20 మంది సమైక్యవాదులు రాష్ట్ర విభజనను తప్పుబడుతూ పిండప్రదానం చేసి శిరోముండనానికి దిగారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి పురోహితుల సాక్షిగా శార్దకర్మలు నిర్వహించి వినూత్న నిరసన వ్యక్తంచేశారు. పారిశ్రామిక వాడైన పైడిభీమవరం, రణస్థలం, కోష్ఠ కూడళ్లలో కూడా స్థానిక యువకులు హైవేపై బైఠాయించి సమైక్యనినాదాన్ని వినిపించారు. దుకాణాలు, వాణిజ్యసంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. రణస్థలం కూడలిలో తప్పిటగుళ్లు కళాకారులు రిలే నిరాహారదీక్ష శిబిరం వద్ద ప్రదర్శన నిర్వహించి సమైక్యవాదుల్లో ఉత్తేజాన్ని నింపారు. జిల్లా కేంద్రంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నైర వ్యవసాయకళాశాల విద్యార్థులు డే అండ్ నైట్ జంక్షన్‌వరకు నిరసనర్యాలీ కొనసాగించారు. జిల్లా పరిషత్ ఉద్యోగులు ఏడురోడ్ల కూడలి వరకు బైక్‌ర్యాలీ సాగించారు. రిమ్స్ వైద్యకళాశాల ఆవరణలో మానవహారం నిర్వహించి సమైక్యవాదానికి జై కొట్టారు. విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్‌లో మేధావి వర్గం ప్రతినిధులతో చర్చావేదిక నిర్వహించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. న్యాయవాదులు చేపడుతున్న దీక్షలు రెండవరోజుకు చేరాయి. మహిళా న్యాయవాదులు వీరికి సంఘీభావం తెలిపారు. అలాగే పశువైద్యాధికారులు కూడా తాముసైతమంటూ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ అతిథి గృహంలో తహశీల్దార్‌లతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు. తహశీల్దార్‌లు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ ఉద్యోగులు పాతబస్టాండ్ నుండి భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. ఎంపిడిఒ కార్యాలయాలన్నీ స్వచ్చంధంగా సెలవు ప్రకటించి సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆ ఉద్యోగులు జై కొట్టారు. నరసన్నపేటలో జేఏసి ఆధ్వర్యంలో పలువురు వౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సంఘీభావం తెలిపారు. అదేవిధంగా రాజాం, పాలకొండ, పలాస, టెక్కలి, ఇచ్ఛాపురం, సోంపేట తదితర ప్రాంతాల్లో సమైక్యవాదులు నిరసనలు వ్యక్తంచేశారు. ఈ ఆందోళనలకు గంటలపాటు వాహనాలు బారులు తీరడం కనిపించింది.
ఇఫ్తార్ పాలిటిక్స్
(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
రంజాన్ మాసంలో రాజకీయ నేతల విందుల సందడి షరామామూలే. అధికార, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా నాయకులూ ఇఫ్తార్ పార్టీలు ఇచ్చేవారే. పబ్లిగ్గా వక్ఫ్‌బోర్డు ఆస్తులను అమ్మకాలు చేసేవారు, పరాయివాళ్లకు పెద్ద మసీదు స్థలాలు, దుకాణాలు లీజులు..గలీజులు చేసే వారుకూడా షేర్వాణీలు వేసి, బుల్లి టోపీ తలకు తగిలించి ఇఫ్తార్ విందులు ఇకిలించుకుంటూ ఇచ్చేవారే. అసలు రంజాన్ సీజను రాగా ఇఫ్తార్ ‘పోటీల’వెగటు మొదలవుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే కాకుండా తాజాగా ఈ సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా కలిసింది. ఎవరి పార్టీకి ఎంత మంది వి.ఐ.పి.లు వస్తే అంత గొప్ప. బిర్యానీలు, కబాబ్‌లు, హాలీమ్ వంటి ఎన్ని రకాలు వడ్డిస్తే అంత గ్రేటు. అందుకేనేమో...యువనేత ఈ సారి ఇఫ్తార్ విందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి హాలీమ్ రప్పించి మరీ పెడుతున్నారు. ఎవరి పార్టీకి మీడియాలో కవరేజీ వస్తే వారు అంతగా మైనార్టీ వర్గాలకు దగ్గరైనట్టు లెక్క. మహ్మదీయుల పర్వదినాల పేరు చెప్పుకుని జోర్థారుగా ఇచ్చే పార్టీలో నూటికి 80 మంది భోక్తలు సాధారంగా ఇతర మతాలవారే అయినా ఫర్వాలేదు. వి.ఐ.పి. ముస్లింలకే తప్ప సామాన్య మహమ్మదీయులకు సహజంగానే ప్రవేశం ఉండదు. ఎక్కడచూసినా ఇఫ్తార్ విందులే. ఆహూతులను ఆకట్టుకోవటానికి ఈ మధ్య కొందరు బడా బాబులు గానా బజానాలు కూడా పెడుతున్నారు. మొత్తానికి సిక్కోల్ రాజకీయాలకు ఇఫ్తార్ విందులు ఇవాళ పెద్ద ఫార్సు. ఒకరిని చూసి ఒకరు, చివరికి - ఇఫ్తార్ విందు ఇవ్వకపోతే మైనార్టీలకు దూరమైపోయారన్ననింద ఎక్కడ వస్తుందోనని భయపడి, రోజుకు మూడు నాలుగు పార్టీల విందులకు కాల్‌షీట్లు ఇచ్చుకునే బిజీ షెడ్యూల్‌ను ఈ సారి రంజాన్ మాసం కల్పించింది! కాని - పరమపవిత్ర రంజాన్ ఉపవాస దీక్షను నాయకాగ్రేసురులందరూ కలిసి విందులారగించే పసందు సందర్భంగా మార్చడాన్ని చూస్తే ముస్లింసోదరులకు ఒళ్ళు మండవచ్చు కూడా. తెల్లవారు జాము మొదలుకుని పొద్దు గుంకేవరకూ మంచినీరు, ఉమ్మినికూడా మింగకుండా దైవ చింతనతో నిష్ఠగా చేసే ఉపవాసాన్ని నాలుగు కర్జూరాలను నోట్లో వేసుకుని నీరు తాగి ముగించి, నెలరోజుల పాటు మహమ్మదీయులు సాగించే దీక్షపేరు చెప్పుకుని సిక్కోల్ నేతలు జల్సా చేయటం పవిత్ర రంజాన్ స్ఫూర్తికి అపచారం కాదా? నిజానికి సర్వమతాలకు స్వాగతించే శ్రీకాకుళం జిల్లాలో మత సామరస్యానికి ఏనాడూ ప్రమాదం లేదు. రాజకీయ నేతలు పుర్రచేతితో ధైర్యం చెబితేగానీ గుండె దిటవు కలగనంతటి దుర్గతి మైనారిటీలకు లేదు. మతాల పేరిట చిచ్చుపెట్టే నిక్షేపరాయుళ్లకు ఇరువర్గాల్లోనూ లోటు లేకపోయినా సామాన్య జన జీవితానికి సంబంధించినంతవరకూ సామరస్యంఅదినుంచీ ఉంది. పట్టణంలో శివారు వీధుల్లో పేద హిందువులు, పేద ముస్లింలు కలిసిమెలిసి బతుకుతునే ఉన్నారు. అందుకు నిదర్శనమే ఇక్కడ జెండాలవీధి, సాయిబులతోట. రంజాన్ పండుగ రోజున ముస్లింల ఇళ్లకు హిందువులు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి పాయసం అరగించటం సర్వసాధారణ దృశ్యం. మత సామరస్యం ఉండేది అక్కడా? లేక పార్టీ ముసుగులో ఓట్లు-సీట్లు కాకులెక్కల కోసం నేతలు ఇచ్చే ఇఫ్తార్ విందుల్లో బిర్యానీల భావనల్లోనా??
సమైక్యాంధ్ర పరిరక్షణకు
నేడు అత్యవసర సమావేశం
శ్రీకాకుళం (టౌన్), ఆగష్టు 7: స్థానిక ఎన్జీవో హోంలో జిల్లా ఎన్జీవో సంఘం, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గురువారం ఉదయం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు వేదిక కన్వీనర్ హనుమంతు సాయిరాం వెల్లడించారు. సమైక్య రాష్ట్ర సాధనే ధ్యేయంగా నిర్వహించే ఈ సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, వైద్య, న్యాయవాదులు, జర్నలిస్టు, కార్మిక, కర్షక సంఘాలు, ఆర్టీసీ, విద్యుత్, ఇంజనీరింగ్, వ్యాపార, ధార్మిక, వృత్తి విద్యా సంస్థల యజమానులు, ఆటో, రిక్షా కార్మిక సంఘాల, యువజన, మహిళా, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు. అదేవిధంగా విద్యార్థి, ఉద్యోగ సంఘాలతో వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
భారీగా బెల్లం ఊట ధ్వంసం
పలాస, మందస, ఆగస్టు 7: నాటుసారా అక్రమతయారీ కేంద్రాలపై స్థానిక పోలీసులు సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు బుధవారం దాడులు చేసారు. అక్రమనాటుసారా కేంద్రాలపై అధికారులకుసమాచారం ఉన్నప్పటికీ తమకు ఏమి పట్టని చందంగా వ్యవహరించడంతో పంచాయతీ ఎన్నికల్లో నాటుసారా ఏరులై పారిన విషయాన్ని ఆంధ్రభూమి వెలుగులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ ఎక్సైజ్ అధికారులు ఈ కథనాలకు కనీసస్థాయిలో స్పందించకపోవడంపై పలు అనుమానాలు రేకేత్తాయి. నాటుసారా తయారీకేంద్రాలపై గత వారం రోజులుగా మందస పోలీసులు హెచ్‌సి మెట్ట విజయకుమార్, ఇంటిలిజెన్స్ హెచ్‌సి కమలాకర్‌లు రెక్కీ నిర్వహించి స్పష్టమైన ఆధారాలు సేకరించారు. దీంతో పలాస ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.త్యాగరాజు, సోంపేట సి ఐ జి.వి.రమణ సంయుక్తంగా రామరాయి సమీపంలోని రిజర్వు ఫారెస్టులో మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 వేల బెల్లం ఊటలను గుర్తించి ధ్వంసం చేసారు. దీనితోపాటు 100 లీటర్ల నాటుసారాను నేలపోశారు. దీని విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని వారు పేర్కొన్నారు. కాగా, పోలీసుల రాకను పసిగట్టిన నాటుసారా తయారీదారులు తమ పెంపుడు కుక్కలను ఉసిగొల్పి సుమారు 9 మంది పరారీ అయ్యారని పోలీసులు చెబుతున్నారు. ఈ దాడుల్లో రామరాయి గ్రామానికి చెందిన సవర అప్పారావు, మాకన్నపల్లి గ్రామానికి చెందిన సైన కృష్ణారావులను పోలీసులు అరెస్టు చేసారు. కాగా నాటుసారా తయారీ కేంద్రాలను చూసిన పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. సుమారు 50 లీటర్లు పట్టే డ్రమ్ములు 100 వరకు ఉండడంతో ఓ కుటీరపరిశ్రమగా సారా కేంద్రం వర్థిల్లుతుండడంపై పోలీసులకు మైండ్‌బ్లాక్ అయ్యాంది.
సన్మార్గంలో పయనిస్తే సత్ఫలితాలు
* విశ్రాంత డిజిపి హెచ్.జె.దొర
ఎచ్చెర్ల, ఆగస్టు 7: సన్మార్గంలో విద్యార్థులు పయనించినట్లయితే సత్ఫలితాలు సాధించగలుగుతారని విశ్రాంత డి.జి.పి హెచ్.జె.దొర సూచించారు. బుధవారం అంబేద్కర్ విశ్వవిద్యాలయం సెమినార్ హాల్‌లో నైతిక విలువలు- ఉన్నత విద్య అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు నిస్వార్ధంగా పిల్లలను తీర్చిదిద్దుతారని, అయినప్పటికీ వృద్ధాప్యంలో వారి పట్ల నిర్లక్ష్యధోరణి వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జాతీయ నేతల జీవితకథల్లో ముఖ్యాంశాలను గ్రహించి మంచి ప్రవర్తనను అలవర్చుకోవాలన్నారు. నాణ్యమైన పుస్తకాలు అధ్యయనం చేసినట్లయితే పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపగలరన్నారు. వైస్‌ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ మాట్లాడుతూ మానవతావిలువలు కాపాడుకునేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణమోహన్, సిడిసి డీన్ తులసీరావు, ప్రిన్సిపాల్ చంద్రయ్య, ఆచార్యులు పి.చిరంజీవులు, కామరాజు, అడ్డయ్య, ఫ్యాకల్టీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటా
జి.సిగడాం/లావేరు, ఆగస్టు 7: రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చినంతవరకు ప్రజల పక్షానే ఉంటానని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు అన్నారు. బుధవారం జి.సిగడాం మండలం నిద్దాం గ్రామం, అలాగే లావేరు మండలం బుడతవలస గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. మంత్రులందరూ సోనియాగాంధీతో చర్చించి బయటకు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమాల తీవ్రతను ఆమెకు వివరించి సమస్య పరిష్కారానికి కృషిచేయాలన్నారు. రాజధాని వల్ల 70 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని, నీటి, విద్యుత్ సమస్యలపై చర్చించకుండా విభజించారని ఆరోపించారు. జిల్లా నుండి సుమారు మూడు లక్షల మంది కార్మికులు హైదరాబాద్‌లో ఉన్నారని, ఈ విభజన వల్ల వారంతా ఉపాధి కోల్పోతారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సంపద ఏ ఒక్కరి సొత్తు కాదని స్పష్టంచేశారు. పల్లె నుండి పట్టణాల వరకు జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలకు తాను మద్దతిస్తున్నానన్నారు. ఆయనతోపాటు దాలినాయుడు, కొమరాపు రవికుమార్, కె.సీతారామరాజు, సూర్యనారాయణ, బి.వెంకటేశ్వరరావు, పైల రామకృష్ణనాయుడు, లావేరు మండలానికి చెందిన దేశం పార్టీ కార్యదర్శి పిన్నింటి మధుబాబు, సర్పంచ్ బుడుమూరు నర్సింహులు, ఉపసర్పంచ్ రౌతు శ్రీనివాసరావులు ఉన్నారు.
విద్యార్థుల ఉద్యమం ఉద్ధృతం
ఎచ్చెర్ల, ఆగస్టు 7: ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా యు.పి.ఏ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై గత ఎనిమిది రోజులుగా అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు వివిధ రూపాల్లో వినూత్న నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం తరగతులు బహిష్కరించి వీరంతా జాతీయ రహదారికి చేరుకొని సోనియా, కేసీఆర్, చిదంబరం, దిగ్విజయ్‌సింగ్‌ల బుద్ధిమారి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని హోమం నిర్వహించారు. పరమశివుడు, సీతారామలక్ష్మణులకు జాతీయ రహదారిపై పురోహితులు సారధ్యంలో హోమం చేపట్టారు. సోనియా డౌన్..డౌన్.., కేసీఆర్ డౌన్..డౌన్.., చిదంబరం, దిగ్విజయ్‌సింగ్ డౌన్..డౌన్..అంటూ నినదించారు. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని, రాష్ట్ర ప్రజానీకం కష్టం రాజధాని అభివృద్ధిలో దాగి ఉందన్న విషయాన్ని యుపిఏ నేతలు గుర్తెరగాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు జాతీయ రహదారిపై యూనివర్శిటీ విద్యార్థులతోపాటు వెంకటేశ్వర, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు రాస్తారోకోలో పాల్గొని హైవేను దిగ్బంధించారు. దీంతో సుమారు ఎనిమిది కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది. అంబులెన్స్ వాహనాలు సైతం ఇందులో చిక్కుకోవడం కనిపించింది. కేసీఆర్‌కు శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసి సమైక్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ తులసీరావు, చంద్రయ్య, చిరంజీవులు, కామరాజు, ఫ్యాకల్టీ సిబ్బంది, నాన్‌టీచింగ్ ఉద్యోగులు, హాస్టల్ వర్కర్లు సమైక్యగళం వినిపిస్తున్నారు.
విభజించే హక్కు సిడబ్ల్యూసీకి లేదు:
మాజీమంత్రి తమ్మినేని
రాష్ట్రాన్ని విభజించే హక్కు సిడబ్ల్యూసీకి ఎవరిచ్చారని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. రాజ్యాంగపరంగా విభజన ప్రక్రియ ఆరంభించకుండా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించి ప్రాంతీయ ద్వేషాలను రెచ్చగొట్టారన్నారు. దిగ్విజయ్‌సింగ్, చిదంబరంలు వారివారి రాష్ట్రాలను విభజించకుండా తెలుగుజాతిని విభజించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బిజెపి నేత నరేంద్రమోడీ సౌరాష్ట్ర విభజనకు కృషిచేయకుండా చిన్న రాష్ట్రాలే మా పార్టీ లక్ష్యమని ఆర్భాటమైన ప్రకటనలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రకటనతో దేశంలో వేర్పాటువాదాలు ఊపందుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత విశ్వవిద్యాలయం విద్యార్థులు సాగిస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి రాజకీయనేతలు, జేఏసి ప్రతినిధులు సంఘీభావం వ్యక్తంచేశారు. తమ్మినేనితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు వరుదు కల్యాణి, కిల్లి రామ్మోహనరావు, ఎన్జీఒ రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తంనాయుడు, సమైక్యఫోరం అధ్యక్షుడు బలగ ప్రకాష్, జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం, బుక్కూరు ఉమామహేశ్వరరావు, సిటిజన్‌ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, జామి భీమశంకర్రావు, బరాటం లక్ష్మణరావు తదితరులు హోమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
మరో ముప్ఫై ఏళ్లకూ సీమాంధ్ర అభివృద్ధి చెందదు
జలుమూరు, ఆగస్టు 7: నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటి ఉన్నతమైన కుటుంబాలను స్వార్ధ రాజకీయాల కోసం నడివీధిలోకి లాగి రోడ్డెక్కించిన ఘనత సోనియాగాంధీకే దక్కిందని మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు విమర్శించారు. బుధవారం తన నివాసం అచ్యుతాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర విభజన చేపట్టారని ఆవేదన చెందారు. హైదరాబాద్ రాజధానిగా ఏర్పడ్డాక సీమాంధ్రుల పెట్టుబడులతో గణనీయంగా అభివృద్ధి చెందిందని అటువంటి నగరాన్ని తెలంగాణకు అప్పగించడం సీమాంధ్రులకు సోనియా అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ఏర్పాటైనా మూడు దశాబ్ధాల కాలం వరకు హైదరాబాద్ అంతటి అభివృద్ధిని తిరిగి చేపట్టలేమని స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని ముక్కలుచేసిన అనంతరం ఈ దేశాన్ని పాకిస్థాన్‌కు సోనియా అమ్మేసినా ఆశ్చర్యపోవాల్సినదేమీ లేదన్నారు. పాలకులు స్వార్ధ రాజకీయాల కోసం అన్నదమ్ములను విడదీసే పరిస్థితి చేపట్టకూడదని, ఇదే నిజమైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయని హెచ్చరించారు.
ఔషధ మొక్కలకు నిలయం భారత్
శ్రీకాకుళం (టౌన్), ఆగష్టు 7: మనదేశం ఔషధమొక్కలకు నిలయంగా నిలుస్తుందని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్.లజపతిరాయ్ అన్నారు. బుధవారం ప్రభుత్వ పురుషుల డిగ్రీకళాశాల రజతోత్సవ భవనంలో నిర్వహించిన జీవవైవిధ్యం, ఔషధమొక్కల పెంపకం జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. ప్రతిప్రాణికి అవసరమైన ఔషధాలను మన ప్రకృతి ప్రసాదించిందని, వాటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రతి ఇంటిలో ఉండే తులసిమొక్క నుండి వేప, మామిడి వంటి ఇంట్లో పెంచుకొనే మొక్కలనేకం రోగాలను నయంచేసే గుణం కలిగి ఉన్నాయన్నారు. మనదేశంలో లభించే ఔషధమొక్కలనుండి ఔషధాన్ని వెలికితీసి విదేశాలు పేటెంట్ పొందుతున్నాయని, వాటిని మనకే సరఫరా చేసి మన ఆర్థ్ధికవ్యవస్థను దెబ్బతీస్తున్నాయన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ బి.పోలీసు మాట్లాడుతూ యుజిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు ద్వారా విద్యార్ధులు చాలా విలువైన మొక్కల నుండి రోగ నిరోధకశక్తి ఉత్పత్తి గురించి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, ఐసిఎఫ్‌ఆర్‌సి సైంటిస్టు ఎన్.రామారావు, విశాఖపట్నం సర్కిల్ కన్జర్వేటర్ ఆప్ పారెస్టు కె.సూర్యనారాయణ, విశ్వవిద్యాలయం డీన్ జి.తులసీరావు, బోటనీ హెచ్‌వోడీ ఎన్.ఎస్.ఎన్.స్వామి పాల్గొన్నారు.
ఆటో బోల్తా..ఒకరి మృతి
నరసన్నపేట, ఆగస్టు 7: మండల కేంద్రంలో దేశవానిపేట వద్ద జరిగిన ఆటో బోల్తా సంఘటనలో ఒకరు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే..బుధవారం సాయంత్రం నరసన్నపేట నుండి పోలాకి అతివేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పోలాకి గ్రామానికి చెందిన పోలాకి శ్రీనివాసరావు(45) మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలవ్వగా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసహాయం అందిస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించామని, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పి.సత్యనారాయణ తెలిపారు.
మర్రివలస విషజ్వరాలు
జి.సిగడాం, ఆగస్టు 7: మండలం మర్రివలస గ్రామంలో ప్రతీ ఇంటా జ్వరాలతో మంచానపడి బాధపడుతున్నారు. బుధవారం ఆ గ్రామాన్ని సందర్శించిన ‘ఆంధ్రభూమి’తో గ్రామ ఉపసర్పంచ్ మహేశ్వరరావు మాట్లాడుతూ గత వారం రోజుల నుండి జ్వరాలు, కీళ్లనొప్పులతో బాధపడుతూ రాజాం, పొందూరు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారన్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.