మచిలీపట్నం, ఆగస్టు 7: కృష్ణా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తింది. ఉయ్యూరు, కైకలూరు పట్టణాల్లో బంద్ పాటించి నిరసన తెలిపారు. రాజకీయ పార్టీలతో పాటు అన్ని సంఘాలు కదలి రావటంతో రోడ్లు కిక్కిరిశాయి. పాఠశాలల విద్యార్థులు కదం తొక్కారు. ఉయ్యూరులో రైతులు ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించేందుకు చేసే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్లపై వంటా వార్పు, దిష్టిబొమ్మల దగ్ధం, డప్పులు, డ్యాన్స్‌లతో ఉయ్యూరు పురపాలక సంఘం హోరెత్తింది. అనంతరం జరిగిన సభలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను బుట్ట దాఖలు చేసి ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు. ఉయ్యూరు పట్టణం అంతా ఆందోళన కారులతో కిక్కిరిసింది. అలాగే కైకలూరులో కూడా బంద్ పాటించి ఏలూరు రోడ్డును దిగ్భందించారు. వంటావార్పు, ర్యాలీలు, సభలు నిర్వహించారు. మచిలీపట్నంలో అన్ని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రోడ్డెక్కారు. అన్ని వీధులు విద్యార్థుల ర్యాలీలతో కళకళలాడాయి. ప్రధాన రహదారుల్లో సమైక్యాంధ్ర రంగ వల్లులు తీర్చిదిద్దారు. ఇజ్రాలు పాటలు పాడుతూ కదం తొక్కారు. పురపాలక సంఘానికి చెందిన అన్ని పాఠశాలల విద్యార్థులు కదిలి రావటంతో పట్టణమంతా యువజనుల హడావిడి కనిపించింది. మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఈ ర్యాలీలను ముందుండి నడిపించారు. యానాదులు డప్పులు, డ్యాన్స్‌లు, విచిత్ర వేషధారణలతో అదరగొట్టారు. పట్టణానికి చెందిన ఒకరు అరగుండు గీయించుకుని నిరసన తెలిపారు. కంచర గాడిద ఫొటోకు కెసిఆర్ బొమ్మను అంటించి రిక్షాపై ఊరేగించారు. గుడివాడలో ఎన్‌జివోల బైక్ ర్యాలీ, బార్ అసోసియేషన్ మానవహారం, మున్సిపాలిటీ ఉద్యోగుల వంటా వార్పు, ఎలట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాన రోడ్డుపై కబాడీ ఆట తదితర కార్యక్రమాలు నిర్వహించారు. నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు, కంచికచర్ల, తిరువూరు, పెడన, అవనిగడ్డ, పామర్రు, మోపిదేవి, చల్లపల్లి ఇలా అన్ని మండలాల్లో రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు తదితరుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేశారు.
సత్వర న్యాయం
న్యాయ వ్యవస్థ లక్ష్యం
- జిల్లా జడ్జి చక్రధరరావు
మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 7: ప్రతి ఒక్కరికీ సత్వర న్యాయం అందించడమే న్యాయ వ్యవస్థ లక్ష్యమని జిల్లా జడ్జి జి చక్రధరరావు చెప్పారు. కృష్ణా విశ్వవిద్యాలయం కళామందిరంలో బుధవారం న్యాయ సేవాధికార సంస్థ, కృష్ణా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ శిక్షణ, పునశ్చరణ తరగతుల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చక్రధరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సమానమేనన్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా త్వరిత గతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక చట్టాలను అమలులోకి తెచ్చిందన్నారు. సివిల్, క్రిమినల్, లోక్ అదాలత్, ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థి దశ నుండే న్యాయపరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మద్య వర్తిత్వ రాజీ మార్గాల ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమవుతాయని, వాణిజ్య, వ్యక్తిగత సంబంధాలకు విఘాతం కలగదన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెంకయ్య మాట్లాడుతూ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో న్యాయ సంబంధ విషయాలపై ప్రత్యేక కోర్సును ప్రారంభించనున్నట్లు తెలిపారు. చట్టాలపై ముద్రించిన పుస్తకాలను తెలుగులోకి అనువదించి విశ్వవిద్యాలయం వెబ్‌లో ఉంచుతామన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డా. సిఎం వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జిలు చిన్నంశెట్టి రాజు, రామ్‌గోపాల్‌రావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కేశవాచార్యులు, డా. ఎన్‌ఎడి పాల్, న్యాయవాదులు, ఆంధ్ర, కృష్ణ విశ్వవిద్యాలయాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.
అనివార్యంగా మారిన అవనిగడ్డ అసెంబ్లీ పోలింగ్
అవనిగడ్డ, ఆగస్టు 7: స్థానిక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోటీలో ముగ్గురు అభ్యర్థులు ఉండటంతో పోటీ అనివార్యమైంది. ప్రధాన అభ్యర్థిగా ఉన్న తెలుగుదేశం అభ్యర్థి అంబటి శ్రీహరిప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం చేయటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ కారణంగా తెలుగుదేశం అభ్యర్థి అంబటి శ్రీహరిప్రసాద్‌తో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు చిలకలూరిపేటకు చెందిన రావు సుబ్రహ్మణ్యం, కోడూరు మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన సైకం రాజశేఖర్‌లు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ కారణంగా అంబటి శ్రీహరిప్రసాద్‌కు సైకిల్ గుర్తు కేటాయించగా రావు సుబ్రహ్మణ్యంకు సీలింగ్ ఫ్యాన్, శైకం రాజశేఖర్‌కు కప్పుసాసర్ గుర్తును ఎన్నికల అధికారి జి రవి కేటాయించారు. ఉదయం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ పార్టీ ఎంపి కె నారాయణరావు, శాసనసభ్యులు దేవినేని ఉమా, బచ్చుల అర్జునుడు, కొనకళ్ళ బుల్లయ్య తదితరులు ఇక్కడే మకాం చేసి శత విదాలా ఏకగ్రీవానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. వేణుగోపాలపురానికి చెందిన శైకం రాజశేఖర్ అందుబాటులో లేకపోవటంతో చివరి క్షణం వరకు నిరీక్షించిన ఎన్నికల అధికారి ఇక ఎన్నికల ప్రక్రియకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన దివి సమాచార్ సంపాదకులు తుర్లపాటి రామ్మోహనరావు నామినేషన్‌లు ఉప సంహరించుకోవటానికి కొత్త తరహాలో హాజరయ్యారు. ఆయన వంటిపై కాగితాన్ని అంటించుకుని రాష్ట్రాన్ని విభజించిన సోనియా గాంధి పోకడలకు నిరసనగా నామినేషన్ విరమించుకుంటున్నట్లు ఆ కాగితంపై ముద్రించాడు. తోడికోడలు మేనకా గాంధితో సఖ్యతగా లేని సోనియాకు సమైక్యత గురించి ఏమి తెలుస్తుందని కూడా వంటిపై ముద్రించాడు. అనంతరం ఎన్నికల అధికారి ఎదుట నామినేషన్ ఉప సంహరించుకున్నాడు.
రోజు రోజుకూ తీవ్రవౌతున్న సమైక్య పోరు !
నూజివీడు, ఆగస్టు 7: సమైక్య ఆంద్ర కోరుతూ వివిధ వర్గాల ప్రజలు చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు సమైక్య ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. బుధవారం నాడు నూజివీడు డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులు, సిబ్బంది సమైక్య ఆంధ్రా కోరుతూ పురవీధులలో ప్రదర్శన చేశారు. అనంతరం చిన్నగాంధీబొమ్మ సెంటరులో ధర్నా చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. స్థానిక మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల, త్రివిధ పాఠశాల, శ్రీ సత్యసాయిబాలభారతి విద్యాసంస్థ, కృష్ణా విశ్వవిద్యాలయం పిజి కేంద్రం విద్యార్థులు స్థానిక చిన్నగాంధీబొమ్మ సెంటరులో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా విభజిస్తుందో చూస్తామని హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ ఉద్యోగులు మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఉద్దేశించి చేసిన కెసీఆర్ వాఖ్యలు ప్రజాస్వామ్యబద్దంగా లేవని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు విజయకుమారి, గౌస్‌బాష, శ్రీనివాసరావు, భవానీ, మురళీ, నాగాంజనేయులు, సునీల్, సువర్ణకుమారి, సంయుక్త కార్యచరణ కమిటీ ప్రతినిధులు పగడాల సత్యనారాయణ, పివి కుమార్, త్రివిధ శ్రీనివాసరావు, సాంబశివరావు, మంగరాజు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ప్రజలకు తీరని ద్రోహం
* మాజీ వ్యవసాయశాఖా మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
ఉయ్యూరు, ఆగష్టు 7: రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఆషామాషీ నివేదిక ఇవ్వలేదని, దానిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో వెల్లడించాలని మాజీ వ్యవసాయశాఖా మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండు చేశారు. పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు, కళాశాలల, పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు, కెసిపి కార్మికులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, వర్తక, వాణిజ్య సంస్థలు, కుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమైక్యాంధ్ర మద్దతు ర్యాలీ అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తన కొడుకు రాహూల్ గాంధీని ప్రధానమంత్రి చేసే ఉద్దేశ్యంతోనే సోనియా గాంధీ రాష్ట్ర విభజనపై అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రం మొత్తం పర్యటించి చక్కని నివేదిక తయారు చేసిందని, సవివరంగా ఆరు సూచనలు చేసిందని తెలిపారు. ఆ సూచనలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తెలంగాణా ప్రకటించి తెలుగు ప్రజలకు తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనలో అన్ని రాజకీయ పార్టీల పాపం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి జరిగిన పరిణామాలను ఉద్యమకారులకు వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శ్రీమతి ఇందిరాగాంధీ చేసిన కృషి అభినందనీయమన్నారు. అవగాహనా లోపంతో ఆమె విగ్రహాలను ధ్వంసం చేయడం తగదన్నారు. వచ్చిన ప్రతీ ముఖ్యమంత్రీ వెనుకబడిన ప్రాంతమంటూ తెలంగాణా అభివృద్ధికి పాటుపడ్డారని, అభివృద్ధిలో సీమాంధ్ర కంటే తెలంగాణ ముందంజలో ఉందని, దీనిని శ్రీకృష్ణ కమిటీ తేటతెల్లం చేసిందన్నారు. ఇప్పటికైనా శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంటు ముందు చర్చకు వచ్చేలా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, మంత్రులు కృషి చేయాలన్నారు. సీమాంధ్రలో రగిలిన ఉద్యమం వెనుక ఏ రాజకీయ శక్తీ లేకపోవడాన్ని కేంద్రం గుర్తించాలని, అనాలోచిత నిర్ణయాలను తిరిగి సమీక్షించి, సముచిత నిర్ణయం ప్రకటించకుంటే ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుందని హితవు పలికారు. సభకు కెసిపి చక్కెర కర్మాగారాల ముఖ్య కార్యనిర్వహణాధికారి జి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ సాగునీరు, విద్య, ఉపాధి సౌకర్యాలు తెలంగాణ విడిపోతే సీమాంధ్రలో సంభవిస్తాయని అన్నారు. సభలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు యార్లగడ్డ నాగేశ్వరరావు, లైన్స్‌క్లబ్ అధ్యక్షుడు ఖలీల్ రహమన్, ఇన్నర్‌వీల్ క్లబ్ అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
బందరులో హోరెత్తిన సమైక్యాంధ్ర ఉద్యమం
* ర్యాలీలు, ప్రదర్శనలతో కిక్కిరిసిన ప్రధాన రహదారులు * రంగవల్లులతో తీర్చిదిద్దిన రహదారులు
మచిలీపట్నం (కోనేరుసెంటరు), ఆగస్టు 7: పట్టణంలో సమైక్యాంధ్ర ఉద్యమం బుధవారం హోరెత్తింది. ర్యాలీలు, ప్రదర్శనలతో ప్రధాన రహదారులు కిక్కిరిశాయి. వివిధ పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థినులు రోడ్లపై సమైక్యాంధ్ర రంగవల్లులు తీర్చిదిద్దారు. సమైక్యాంధ్ర ముద్దు రాష్ట్రాన్ని విడదీయొద్దు అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు మార్మోగాయి. యానాదులు విచిత్ర వేషధారణలతో నృత్యాలు చేస్తూ ఆకర్షించారు. రిక్షాపై కంచర గాడిద బొమ్మకు కెసిఆర్ చిత్రపటాన్ని అమర్చి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. హిజ్రాలు కెసిఆర్ బావయ్యా.. రావయ్యా.. అంటూ చిందులు వేశారు. మున్సిపల్ కార్మికులు, వివిధ సంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సంఘం నాయకులు అర్ధనగ్న ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో అన్ని శాఖల గ్రంథాలయ ఉద్యోగులు, రిటైర్డ్ గ్రంథాలయ సంస్థ ఉద్యోగులంతా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రొండి కృష్ణయాదవ్, జాయింట్ యాక్షన్ కమిటీ మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం నుండి లక్ష్మీటాకీసు సెంటరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీటాకీసు సెంటరులోని డా. అంబేద్కర్ విగ్రహానికి, జిల్లా కోర్టు సెంటరులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రొండి కృష్ణయాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కన్వీనర్ ఐవివి రామారావు మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణా అన్నదమ్ముల్లా కలిసి ఉంటే అభివృద్ధి చెందుతుందని, కొంత మంది స్వార్ధ ప్రయోజనాలు కోసం తెలుగు వారిని విడదీయటం మంచి పద్దతి కాదన్నారు.