ఒంగోలు, ఆగస్టు 7: జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమాలు మిన్నంటుతూనే ఉన్నాయి. జిల్లాలో రోజురోజుకు ఉద్యమాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అన్నివర్గాలవారు సమైక్యాంధ్రకే మద్దతు పలుకుతూ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులో మానవహారాలు చేపట్టి చేస్తున్న నినాదాలు హోరెత్తుతున్నాయి. బుధవారం మున్సిపల్ ఉద్యోగులు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి వినూత్నరీతిలో ప్రకాశం జిల్లా చిహ్నమైన ఒంగోలు జాతి గిత్తలతో ప్రదర్శన నిర్వహించారు. ఈప్రదర్శన స్థానిక కార్పొరేషన్ కార్యాలయం నుండి చర్చి సెంటర్‌కు చేరింది. అనంతరం విద్యార్థులు, ఉద్యోగులతో మానవహారాన్ని నిర్వహించారు. ఈ మానవహారంలో మేళతాళాలతో కళాకారులు డప్పులు మోత మోగించారు. మానవహరాన్ని నిర్వహించటంతో ఒంగోలు వన్‌టౌన్ సిఐ, టౌన్ సిఐలు ప్రకాశరావు, సూర్యనారాయణ, ట్రాఫిక్ సిఐ రవి ట్రాఫిక్‌ను నియంత్రించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దఎత్తున మున్సిపల్ ఉద్యోగులు, విద్యార్థులు నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర వర్ధిల్లాలి, కెసిఆర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్ధి జెఎసి ఆధ్వర్యంలో ఒంగోలులోని హెడ్‌పోస్ట్ఫాసును ముట్టడించారు. అనంతరం ఉద్యోగులను బయటకు పంపి హెడ్‌పోస్ట్ఫాసుకు తాళాలు వేశారు. రిమ్స్ వద్ద ఎన్‌జివోలు, రిమ్స్ స్ట్ఫా నర్సులు, మెడికోలు, డాక్టర్ల ఆధ్వర్యంలో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా పలు శాఖలకు చెందినవారు కూడా మద్దతు తెలిపారు. కోర్టు సెంటర్ వద్ద లాయర్లు సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ప్రైవేట్ కాలేజీల ఆధ్వర్యంలో విద్యార్థులు పొట్టిశ్రీరాముల విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ఎన్‌జివో సంఘ చైర్మన్ షేక్ అబ్దుల్ బషీర్, విద్యార్థి జెఎసి కో కన్వీనర్ రాయపాటి జగదీష్ తదితరులు మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో టిఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్ పనిచేసిన కాలంలో చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోవటంతో టిఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. అప్పటి నుండి ఆయన మనుగడను కాపాడుకునేందుకు తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని లబ్ధిపొందారని పేర్కొన్నారు. తెలంగాణ విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో ప్రజా ఉద్యమం వెల్లువెత్తిందన్నారు. దీంతో కెసిఆర్ ఏంచేయాలో అర్ధంకాక పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయా కార్యక్రమాల్లో ఎన్‌జివో సంఘ నాయకులు బండి శ్రీనివాసరావు, బి రాజ్యలక్ష్మి, స్వాములు, వీరనారాయణ, నాగూర్ వలి, ప్రకాష్, మున్సిపల్ ఉద్యోగులు రమేష్, బాబ్జి, నరేంద్ర, మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం
ఒంగోలు అర్బన్, ఆగస్టు 7: స్వాతంత్య్ర వేడులకను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె యాకూబ్ నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని జెసి ఛాంబర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పెరేడ్ మైదానంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డ్వామా, గృహ నిర్మాణ సంస్థ, రాజీవ్ విద్యామిషన్, వ్యవసాయ శాఖలకు సంబంధించిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, మెప్మా శాఖల ద్వారా ఈనెల 15న రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా 50 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను స్వయం సహాయక సభ్యులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 15న సంక్షేమ శాఖల అభివృద్ధి, పురోగతిని తెలియజేసే శకటాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డ్వామా, గృహ నిర్మాణ సంస్థ, వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ , జిల్లా విద్యాశాఖ, రాజీవ్ విద్యామిషన్ శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. స్టాల్స్ ఏర్పాటుచేసే శాఖలు పూర్తి సమాచారాన్ని రెండు రోజుల్లో గృహ నిర్మాణా శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌కు అందజేయాలన్నారు. పోలీస్ పెరేడ్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు జిల్లా విద్యాశాఖాధికారి, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ సమన్వయంతో ఏర్పాటు చేయాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ప్లాస్టిక్ వస్తువులతో తయారు చేసినవి వాడకూడదని, కాగితపు జెండాలు, గుడ్డతో తయారుచేసిన జెండాలు మాత్రమే వినియోగించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె రాధాకృష్ణమూర్తి, ముఖ్య ప్రణాళికాధికారి కెటి వెంకయ్య, స్టెప్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ బి రవి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె సరస్వతి, జిల్లా విద్యాశాఖాధికారి ఎ రాజేశ్వరరావు, లీడ్ జిల్లా మేనేజర్ జెవిఎస్ ప్రసాద్, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ కె పోలప్ప తదితరులు పాల్గొన్నారు.
టిడిపి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
మంత్రి మహీధర్‌రెడ్డి ఉద్యమంలో పాల్గొంటే
ఆయన విజయానికి కృషి చేస్తాం:దివి శివరాం
కందుకూరు, ఆగస్టు 7: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా టిడిపి ఆధ్వర్యంలో బుధవారం కందుకూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పట్టణ పరిధిలోని అంబేద్కర్, ఎన్‌టిఆర్, పొట్టిశ్రీరాములు విగ్రహాలకు శివరాం, టిడిపి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ర్యాలీ ముగింపు సందర్భంగా ఆర్‌డిఓ కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి శివరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి చిత్తశుద్ధితో శాసనసభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటే 2014లో జరిగే ఎన్నికలలో ఆయన గెలుపునకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి లేకుండా, అధిష్ఠానం మాటలకు వత్తాసు పలుకుతూ చిత్తం అనే విధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడో ఇటలీలో జన్మించిన సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజల మనోభావాలను లక్ష్యపెట్టక రాష్ట్రాన్ని విభజించాలని కోరుకోవడం దురదృష్టకరం అని అన్నారు. కర్ణాటకు చెందిన వీరప్పమెయిలీ, కాశ్మీర్‌కు చెందిన గులాంనబీ ఆజాద్, తమిళనాడుకు చెందిన చిదంబరం, మధ్యప్రదేశ్‌కు చెందిన దిగ్విజయ్‌సింగ్‌కు మన రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. అధిష్ఠానం వద్ద పెదవి విప్పలేని నాయకులు రాష్ట్రంలో తమ రాజకీయ ఉనికికోసం డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువరించే సమయంలో నదీజలాలు, విద్యుత్, అప్పులు, రాజధాని తదితర అంశాలపై స్పష్టంగా పేర్కొనకపోవడం వెనుక కాంగ్రెస్ మార్క్ రాజకీయం ఉందని విమర్శించారు. ప్రకటన వెలువరించాము, కత్తులు దూసుకోండనే విధంగా కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలుగుజాతి ప్రజలందరు తెలుగుజాతి ఆత్మగౌరవం కాపాడుకునేందుకు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆర్‌డిఓ టి బాపిరెడ్డికి టిడిపి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధులు గట్టమనేని చెంచురామయ్య, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు నాదెండ్ల వెంకటసుబ్బారావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు తల్లపనేని వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు పొడపాటి వంశీ, టిడిపి నాయకులు కండ్రా హరిబాబు, బెజవాడ ప్రసాద్, ఈదర రమణమ్మ, తానికొండ ఆంజనేయులు, చిలకపాటి మధు, కలవకూరి యానాది, పిడికిటి రఘు, మాజీ కౌన్సిలర్లు మహర్షి శ్రీను, చదలవాడ కొండయ్య, వడ్డెళ్ళ రవిచంద్ర, ముచ్చు వరమ్మ, టిడిపి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, సానుభూతిపరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
‘టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి, బిజెపి, సిపిఐ నిర్వాకం వల్లే
రాష్ట్ర విభజన’
ఒంగోలు అర్బన్, ఆగస్టు 7: తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీల నిర్వాకం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జడా బాల నాగేంద్ర యాదవ్, సూపర్ బజార్ చైర్మన్, తాతా ప్రసాద్, మిరియాల కృష్ణలు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం , వైకాపా, బిజెపి , సిపి ఐ పార్టీల అధినేతలు తెలంగాణా రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేఖలు రాయడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజన చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా రాష్ట్ర విభజనకు పాల్పడిందని, ఆ పార్టీకి చెందిన శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు రోడ్లెక్కి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తరువాత ఆ పార్టీల నేతలు రెండు కళ్ళ సిద్దాంతాలు పాటించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రకు ఐదు లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇవ్వాలని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత పది రోజుల నుండి సీమాంధ్రలో రాష్ట్ర విభజన పట్ల నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీల నేతలు ఉద్యమాల్లో విరివిగా పాల్గొంటున్నారన్నారు. ఉద్యమాల్లో పాల్గొనే రాజకీయ పార్టీల నేతలు ఆ పార్టీల అధినేతల వద్ద తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు ఉద్యమం పట్ల ముందకు రావడం శుభ పరిణామమన్నారు. అన్నీ రాజకీయ పార్టీలు చేసిన తప్పుకు కాంగ్రెస్ పార్టీని నిందించడం, విగ్రహాలు ధ్వంసం చేయడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అధినాయకత్వం వద్ద సీమాంధ్ర ప్రజల నిర్ణయాలను తేల్చి చెప్పడం వలన అధిష్టానం హై లెవల్ కమిటీని వేయడం జరిగిందని, సమైక్య ఆంధ్రప్రదేశ్‌గా ఉంటుందే తప్పా రాష్ట్ర విభజన జరగదన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా గురువారం నుండి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేంత వరకు దీక్షలు చేపడుతామన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతిపక్ష పార్టీలను నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పి కోటయ్య, పి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర ఉమద్యమంతో
ఆర్టీసీకి భారీ నష్టం
నెల్లూరు ఆర్టీసీ ఇడి ఆవేదన
కనిగిరి రూరల్, ఆగస్టు 7: చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఆర్టీసీకి భారీ నష్టం కలుగుతోందని నెల్లూరు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యచంద్రరావు తెలిపారు. బుధవారం స్థానిక ఆర్టీసీ డిపోలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో గత వారం రోజులుగా బస్సులు సరిగా నడవడం లేదన్నారు. ఒంగోలులో కూడా సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా మూడు రోజులుగా బస్సులు నడవడం లేదని ఆయన అన్నారు. కనిగిరి డిపోకు ఈ ఆర్థిక సంవత్సరంలో 75.59 లక్షల ఆదాయం రాగా, అద్దంకి డిపో నష్టాలలో ఉన్నట్లు ఆయన తెలిపారు. 8కోట్ల రూపాయల నిధులతో నెల్లూరు జోన్ పరిధిలోని పలు బస్టాండ్‌లలో వౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జవహర్‌లాల్ పట్టణాభివృద్ధి పథకం కింద 100 బస్సులకు ప్రతిపాదనలు పంపామని, జోన్ పరిధిలో మార్చి చివరన 210 బస్సులు రావాల్సి ఉండగా ప్రస్తుతం 60 బస్సులు మాత్రమే వచ్చాయని ఆయన తెలిపారు. జిల్లాలోని కంభంలో డిపో ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. అనంతరం డిపోలో వివిధ రికార్డులను పరిశీలించి, పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో డిఎం వేణు, తదితర అధికారులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన యువకుడు
మార్కాపురం టౌన్, ఆగస్టు 7: రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైకాంధ్ర కావాలని కోరుతూ మండలంలోని ఇడుపూరు గ్రామానికి చెందిన గంగిరెడ్డి రాజశేఖర్ అనే యువకుడు బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఈసందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, అలాంటి రాష్ట్రాన్ని ఎసి గదుల్లో దర్జాగా కూర్చున్న సోనియాగాంధీ స్వార్ధరాజకీయ కుట్రతో రెండుగా చీల్చి తెలుగువారి మనోభావాలను దెబ్బతీశారన్నారు. విభజన ప్రకటన వెనుకకు తీసుకునేవరకు యువత అలుపెరుగని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర సాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో బిసి సంఘ నాయకులు టివి కాశయ్య, వెంకటేశ్వరరావు, డివైఎఫ్‌ఐ నాయకులు ఏనుగుల సురేష్ పాల్గొని మద్దతు తెలిపారు.
కమిటీలతో కాలయాపన చేయవద్దు
ఎమ్మెల్యే కందుల హితవు
మార్కాపురం, ఆగస్టు 7: సీమాంధ్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కమిటీలు వేసి కాలయాపన చేయవద్దని, సమైక్యాంధ్రగా ఉంచాలని, లేదంటే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హితవు పలికారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుండి ఫోన్‌లో ఈ విలేఖరితో మాట్లాడుతూ, విభజనకు ముందే ఈప్రాంత ప్రజల మనోభావాలు తెలుసుకొని భవిష్యత్తులో వారికి రాబోయే కష్టాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా విద్యార్థులు ఉద్యోగాల కోసం, ఉద్యోగుల సమస్యలు, రైతులకు నీరు, విద్యుత్ సమస్యలాంటివి ఎన్నో ఉన్నాయని, వాటిపై నిర్ధిష్టమైన హామీలు ఇవ్వాలని, లేదా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్ర అగ్నిగుండంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు ప్రజలకు విషయాన్ని తెలియచేయకుండా ఢిల్లీలో కూర్చోవడం మరింత ఆగ్రహానికి గురిచేస్తోందని కందుల అన్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ, విద్యుత్, మున్సిపల్ ఉద్యోగులు నిరవధిక మెరుపు సమ్మెకు నోటీసు ఇవ్వడంతో పాలన స్తంభించిపోయే ప్రమాదం ఉందని, ఈవిషయాన్ని గమనించి ప్రభుత్వం వెంటనే విభజన ప్రకటనను వెనుకకు తీసుకొని ఈప్రాంత ప్రజలతో చర్చించి వారిలో మనోధైర్యం కల్పించి ఇరుప్రాంతాల వారికి ఆమోదయోగ్యమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విద్యార్థి, యువజన, సామాజిక వర్గాలపరంగా ఉద్యమాలు తీవ్రమయ్యాయని, శాసనసభ్యులు నియోజకవర్గాలకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఏకపక్ష నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహావేశాలకు కారణమైందని, వెంటనే విభజన ప్రకటనను వెనుకకు తీసుకొని తిరిగి పునరాలోచించాలని కందుల ప్రభుత్వాన్ని కోరారు.