‘టిప్’ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మేటర్- ఇచ్చేవాడికీ, తీసుకునేవాడిక్కూడా టెన్షన్.
ఇచ్చేవాడికి ఎంతివ్వాలీ - ఎంతిస్తే ఆ టిప్పు సుల్తాన్ హాపీగా ఫీలవుతాడు - ఎంతిస్తే మనకు నష్టం - అనేది ఇచ్చేవాడి టెన్షన్.
‘ఈ పెద్దమనిషి - కంజూసా, లిబరలా, ఎంత టిప్పివ్వడానికి అవకాశం ఉంది? ఎక్కువ టిప్ రాల్చడానికి ఇంకా ఎక్స్‌ట్రా సర్వీస్‌లు ఏమేం చేయాలీ?’ అనేది టిప్పు సుల్తాన్ టెన్షన్.
‘టిప్పులు వసూలు చేయటం ఎలా?’ అనే సబ్జెక్ట్ మీద ఒక సెమినార్ జరిగింది.
దానికి టిప్పు సుల్తాన్‌లు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
కేవలం టిప్పుల ద్వారా కోట్లు సంపాదించి ‘టిప్పు భవన్’ అన్న పేరుతో 26 అంతస్తుల బిల్డింగ్ కట్టించిన టిప్సీచందర్ సింగ్ ఆ సెమినార్‌కి అధ్యక్షత వహించాడు.
‘బ్రదర్స్ - టిప్ అనేది మన జన్మహక్కు - మనం ఎక్కడ పని చేసినా సరే. కస్టమర్స్‌కి సకల మర్యాదలు చేయడం ద్వారా మనం టిప్ సంపాదించుకుంటున్నాం గానీ అడుక్కోవటం లేదన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి’
ప్రతి టిప్పు సుల్తాన్ ముందు నేర్చుకోవలసింది - చిరునవ్వుతో సర్వీస్ చేయటం.
ఇంట్లో ఎన్ని సమస్యలున్నా డ్యూటీలో కస్టమర్ వచ్చేసరికి అద్భుతంగా చిరునవ్వులు చిందించాలి.
‘అయితే మనం అదంతా టిప్ కోసం చేస్తున్నామన్న విషయం కస్టమర్‌కి తెలీకూడదు.’
‘నేనెప్పుడూ ఇంతే సార్ - బై బర్త్ నేనిలాగే చిరునవ్వుతో పుట్టానని మా పేరెంట్స్ ఎప్పుడూ అంటూ ఉంటారు’ అని చెప్పకుండానే కస్టమర్‌కి చెప్పాలి.
అసలు కస్టమర్ ఆనందం కోసమే నువ్వు బ్రతుకుతున్నట్లు ఫీలింగ్ కలుగజెయ్యాలి. అప్పుడు నీకు పెద్దపెద్ద టిప్‌లకు కొదవ వుండదు’
‘కానీ సార్ - ఇవన్నీ ఎంతగా చేస్తున్నా కొంతమంది - అతి దారుణంగా అడుక్కునేవాడికిచ్చినట్లు - టిప్ - తక్కువ మొత్తాల్లో ఇస్తున్నారు సార్’
‘అవును. మన దేశంలో అలాంటి వారే ఎక్కువ. అలాంటి వారిని నువ్ సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి నీ రికార్డులో పెట్టుకో. వాడు రెండోసారి వచ్చినప్పుడు వాడిని చిత్రహింసలకు గురి చేసెయ్. అయితే నువ్వదంతా కావాలని చేస్తున్నట్లు వాడికి తెలీకూడదు’
‘అదెలా సార్ చేయటం?’
‘వాడు నీకు కేవలం పది రూపాయలే టిప్ ఇచ్చాడనుకో- వెంటనే వాడి టిప్ వాడికి రిటర్న్ ఇచ్చేసెయ్’
‘నేను టిప్‌లకు వ్యతిరేకం సార్ - అయామ్ హాపీ వితవుట్ టిప్స్’ అని చెప్పెయ్’
‘కానీ అలా చెప్తే వాడు జన్మలో ఇంక టిప్ ఇవ్వడు కద్సార్’
‘అందుకే ఇంకో ట్రిక్ ప్లే చేయాలి’
‘ఏమిటి సార్ అది’
‘బయటకెళ్లేటప్పుడు వాడికి వినబడీ వినబడనట్లు గొణగాలి’
‘ఏమని?’
‘కనీసం యాభై అయినా టిప్ ఇవ్వాలని తెలీదు - నా కొడుకులకి’ అనాలి’
‘కానీ వాడు మేనేజ్‌మెంట్‌కి కంప్లెయిన్ చేస్తే’
‘కామన్‌సెన్సున్న వాడెవడూ చేయడు. ఎందుకంటే వాడి పరువే పోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కార్పొరేట్ కస్టమర్స్ మాక్సిమమ్ టిప్ ఇస్తారు. కనుక వాళ్లనే సర్వీస్‌కి ఎంచుకో. ఎందుకంటే వాడెంత టిప్ ఇచ్చినా. వాడి అబ్బ సొమ్మేం కాదది - కంపెనీది’
‘కానీ లేడీస్‌తోనే ఎక్కువ ప్రాబ్లెమ్ సార్ - వాళ్లే పరమ నికృష్టమైన టిప్ ఇస్తారు’
‘అది లేడీ సైకాలజీ. అందుకని మనం ఎప్పుడూ లేడీస్‌ని టిప్ అడక్కూడదు. వాళ్ల భర్తల్నే అడగాలి. అది కూడా వాళ్లు పక్కన లేనప్పుడు’
‘వండర్‌ఫుల్ అయిడియా సార్. మాకు ఎక్కువ టిప్ సంపాదించే క్లూస్ ఇవ్వండి సార్’
‘మీరు ఎక్కువగా పెళ్లికాని యువతీ యువకులనే ఎంచుకోండి. ఉదాహరణకు వాళ్లు హోటల్ రూమ్‌లో దిగారనుకోండి’
‘వాళ్లు పెళ్లి కాని వాళ్లని ఎలా తెలుస్తుంది సార్’
‘రూమ్‌లో దిగ్గానే ఆమె మేకప్ చేసుకోవటం మొదలుపెడుతుంది. అతనేమో కిటికీల కర్టెన్స్ అన్నీ మూసేస్తూంటాడు. డోర్ బోల్ట్‌కి ‘డోంట్ డిస్టర్బ్’ బోర్డు తగిలిస్తాడు. అదే గుర్తు’
‘ఓకేసారి - అప్పుడేం చేయాలి మేం?’
‘వీలైనంత సేపు ఆ గది నుంచి బయటకు వెళ్లకుండా ఫ్రిజ్ సరి చేస్తున్నట్లూ, వాటర్ అందుబాటులో ఉంచుతున్నట్లు.. కూల్‌డ్రింక్స్ ఫ్రిజ్‌లో ఉన్న విషయం - ఇలా టైమ్ వేస్ట్ చేస్తూంటే ఆ మగ కస్టమర్ మన చేతిలో అయిదొందల నోటు పెట్టి ‘ఇంక చాలు - వెళ్లిపో’ అంటాడు.
అందరూ తప్పట్లు కొట్టారు.
*
హలో... మైక్ టెస్టింగ్!..... సరదా సంగతులకు సెటైర్ తాలింపు
english title:
t
Date:
Sunday, August 11, 2013