ప్రకృతినుండి మహత్తత్త్వం అహంకారం, బుద్ధి, మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు పంచభూతాలు అనే చతుర్వింశతి తత్త్వాలు ఆవిర్భవించాయి. ఉపాధులన్నింటిలో మనుష్యుని ఉపాధి ఉత్తమోత్తమమైనది. ఆత్మదీప్తి ప్రకాశం కలిగిన మనుష్యులు తక్కిన జంతువులవలె క్షుత్సిపాలనతో తృప్తి చెందక యుక్తాయుక్త వివేకం, ఆత్మకల్యాణ జ్ఞానం, తన్మారానే్వషణ మొదలైన సాధనలతో మోక్షాన్ని సాధించగలుగుతున్నారు. సాధనాలు జడములైనప్పటికీ సాధకుడు వీటితో కార్యసిద్ధి పొందవచ్చును. పంచభూతాలనుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. భూమి పంచభూతాలలో ఒకటోది. పూర్వకర్మననుసరించి జీవులకు ఈశ్వరుడే ఆయా దేహాలు ప్రసాదించి వాటి జీవనానికి అవసరమైన రీతిగా ప్రవర్తింపజేస్తాడు. అటువంటి పశుపక్ష్యాదులెన్నో భూమిపై నివసిస్తున్నాయి. మానవులు భూమిని దున్నుతారు. బావులు చెరువులు కోనేర్ల కోసం భూమిని త్రవ్వుతారు. అయినప్పటికీ భూదేవి ఓర్పు వహించి జీవులకు సస్యాలు ఆశ్రమము ఇచ్చి పోషిస్తుంది. ఇన్ని జీవులనుండి తనకెంత బాధ కలిగినా చలించక, తన ధర్మాన్ని తాను అనుసరిస్తోంది. అలాగే పూర్వకర్మవలన ప్రేరేపింపబడిన సకల భూతాలవలన పీడించబడినా, జ్ఞాని ప్రేమ ఓరిమితో సహకరించి ధర్మ మార్గమునుండి చలించకుండా ధైర్యం వహించి ఉండాలని భూమినుండి మనం నేర్చుకోవాల్సి ఉంది.
గృహ ఆలయాది నిర్మాణాలకు కావలసిన రాళ్లను ప్రసాదించడమేగాక, పరమార్థాన్ని కూడా మానవులకు ప్రసాదించగల ఎన్నో పవిత్ర తీర్థాలకు నిలయాలు పర్వతాలు. పర్వతం సకల జీవుల శ్రేయస్సు కొరకు మాత్రమే ఉంటుంది. రెండవది జలము- జలం సర్వజీవులకు దాహం తీరుస్తుంది. వాటి దేహాలకు శుచి, ఆరోగ్యం, చల్లదనమూ ఇస్తుంది. వృక్షాలను సస్యాలనూ పోషిస్తోంది. అన్ని జీవులకూ అంత మేలు చేస్తున్నా, తాను మాత్రం నమ్రతతో పల్లమైన ప్రాంతాలలోనే నిలుస్తుంది. అలాగే మానవుడు తన్నాశ్రయించిన వారి హృదయ దేహ తాపాలను తొలగించి రక్షిస్తూ వినమ్రుడై ఉండటం నేర్చుకోవాలి. పంచభూతాలలో మూడవది వాయువు- వివిధ వస్తువుల శీత ఉష్ణ శుచి అశుచి సుగంధ దుర్గంధాలతో సంబంధం లేకనే అనాసక్తుడై వాటిమధ్య సంచరిస్తాడు. తాత్కాలికంగా వాటిచేత ప్రభావితుడైనట్లు కనిపించినా మరుక్షణమే తన సహజ నైర్మల్యంతో ఎల్లెడలా సంచరిస్తాడు. మనం కూడా ఇంద్రియ విషయాలు అనుభవమవుతున్నా సుఖ దుఃఖాది ద్వంద్వాలతో తగుల్కొనక హృదయం వాక్కులకు అనుక్షణం సంభవించే విక్షేపాలను తొలగించుకోవడమే జీవితలక్ష్యంగా భావించాలి.
నాల్గవది ఆకాశం- అప్పుడప్పుడు ఆకాశం- మేఘాలు, ధూళి సంధ్యారాగాల చేత ప్రభావితమైనట్లు కనిపించినా అది సహజంగా దేనికీ అంటనిది. మనం కూడా కాలగతిలో సృష్టించబడిన త్రిగుణాల వికారమైన దేహానికి దానివలన కలిగిన మనోవికారాలకు అంటీ అంటనట్లు ఉంటూ, ఆకాశంలా స్వచ్ఛంగా ఉండాలని తెలుసుకోవాలి. పంచభూతాలలో ఐదవది అగ్ని. అగ్ని దేవుడు ఒకప్పుడు విశేషాగ్నిగా ప్రజ్వలిస్తాడు. ఒకప్పుడు నివురుగప్పి మందంగా వెలుగుతాడు. మరొకప్పుడు రాపిడివల్లనే ప్రకటమయ్యే అగ్ని తత్త్వంగా వస్తువులలో సూక్ష్మంగా దాగి ఉంటాడు. అట్టి సామాన్య అగ్ని మథనం చేత విశేషాగ్నిగా ప్రకటమై, యజ్ఞం చేసే వారి పూర్వపాపాలను హరించి రానున్న కర్మ దోషాలను నివారించడం కోసం ఎవరినుండైనా సరే హవిస్సును గ్రహిస్తాడు. కానీ తాను మాత్రం వారి పాపాల చేత అపవిత్రుడు గాకనే వారి పాపాన్ని దేహిస్తాడు. అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ, కట్టెను చేరినప్పుడు ఆ రూపం భాసిస్తుంది. అలాగే ఆత్మ కూడా వివిధ దేహాలలో తాదాత్మ్యం చెంది, ఆయా రూపాలలో కన్పిస్తుంది. కానీ ఆ ప్రతీక వాస్తవమైనది కాదు. అగ్ని తత్త్వజ్ఞానాన్ని మానవులు గ్రహించాలి. ఇలా ఈ పంచభూతాల ఆదర్శాలను మాత్రమే గాక ప్రకృతిలోని ప్రతి వస్తువు కూడా మనకు గురువై మార్గనిర్దేశం చేస్తోంది.
మంచిమాట
english title:
p
Date:
Monday, August 12, 2013