దైత్యరాజు ఆదేశాన్ని గౌరవించి, కుంభనికుంభులు ఏతెంచి రావణుడికి తలలు వాల్చి నమస్కరించారు. వాళ్లకి రాక్షస యోధుల్ని తోడు ఇచ్చి సమరభూమికి పంపాడు. రావణుడి ఆజ్ఞ తలదాల్చి యూపాక్షుడు, శోణితాక్షుడు, కంపనుడు, ప్రజంఘుడూ కూడా కుంభనికుంభుల వెన్ను తాకి వారి వెంట వెళ్లారు. వానరులను జయించి రావలసిందని మరికొందరు రక్కస జోధుల్నికూడా పంపించాడు.
ఆ రాక్షసులు గజములు, అశ్వములు రథాలతోపాటు ఉద్ధతులై కదనానికి కదలివచ్చారు. పరిఘలు, గదలు, పట్టిసాలు, శూలాలు, ప్రాసాది ఆయుధాలే కాక, కరవాలాలు, కుంతాలు, ముద్గరాలు, భిండివాలాలు, శరాలు, శరాసనాలు ధరించి ఉరుశక్తితో దనుజసేనాతతులు, నడచి ఏ తెరజొచ్చారు. రాక్షసవీరులు జండాలు ఎగురవేసి రెపరెపలాడిస్తూనూ, హయముల్ని పరిగెత్తించుకొంటూనూ, గజాలను ఉరికించుకొంటూనూ, కరవాలాలు ఝళిపించుకొంటూనూ, సింహగర్జనలు కావిస్తూ వచ్చి పడ్డారు. ఆ రక్కసులు తాల్చిన భూషణాల కాంతి పుంజాలు ఆకసాన్ని అంటుతున్నాయి.
అగణిత తూర్య ధ్వనులు దిక్కుల నిండుతున్నాయి. ఆ రాక్షసుల కోలాహలం- ప్రళయకాలాంతంలోని వాయు సంఘాలు వినీల మేఘ పటలాన్ని విరియించే చందాన లంకానగరమంతా కాల్చివేసి, అడ్డమాకలేక విహరిస్తున్న వనచరుల్ని ఉదగ్రులై తాకి నొప్పించి, లంకా నగరపు ద్వారాల దుర్వారులై చరించే వానరుల్ని అవక్ర విక్రములై త్రోలి వెయ్యసాగారు.
అంత వానర యోధుల విరిగి, వీగిపోయి, లంక వెలువడి అరుదెంచజొచ్చారు. ఆ విధంగా వానరులు చెదరిపోయి ఏతెంచడం చూసి, బెదిరిపోకండి, భీతిల్లకండి’’ అంటూ హరిరోముడు, కేసరి మున్నుగాగల వానర యధులు ఆ దానవ సేనతో తలపడి రోష సమగ్రులయి తరువులు, పర్వతాలు తెచ్చి వర్షించగా రాక్షసులు పరిఘలు, ముద్గరాలు, శూల భిండివాలాలు, ఆదిగాగల వరశస్త్రాలతో ఆ తరుగిరుల్ని ముక్కా చెక్కా చేశారు. పిండీగుండా చేసి పారేశారు. వానరులు అధికంగా రుష్టులు అయి తమ వాడి గోళ్లతో రక్కసుల రొమ్ముల్ని చీల్చివేశారు. వాడియైన దంతాలతో చెవులు, ముక్కులు తెగిపడగా కరచారు. పిడికిళ్లతో బలంగా పొడిచారు. ఒక కపివరుడు వచ్చి ఒక రాక్షస భటుణ్ణి పొడవగా, ఆ రక్కసుడు ఆ వానర వీరుణ్ణి తీవ్రంగా గ్రుద్దాడు. ఇంకొక రాక్షసుడు ఏతెంచి ఒక వానరుడిని హతమార్చ చూసి, ఒక కపివీరుడు ఉరవడితో ఆ రాక్షసుణ్ణి సంహరించాడు.
వేరొక దైత్యుడిని ఒక ప్లవంగుడు వచ్చి పట్టుకోవడం చూసి ఆ కపిని ఇంకొక దైత్యుడు ఉద్ధతుడై పట్టుకొన్నాడు. ఒక దనుజుడు ఒక వానరుణ్ణి కయ్యానికి ఆహ్వానించగా ఆ వానరుడు ఆ దైత్యుడితో యుద్ధం చేస్తాడు. ఎడతెగకుండా తరచరులు చెలరేగి ఒక్క పిడికిట ఏడుగురినీ, ఎనమండ్రునీ దానవులను పట్టుకొని నొక్కి చంపారు. దైత్యులు, ప్లవంగులు ఉగ్రులయి సింహనాదాలుకావిస్తూ తుముల సంగ్రామం సల్ప ప్రారంభించారు. ఆ దొమ్మి పోరులో ఇంతింతలుగా మహీరుహాలు, మహీధరాలు, కపుల అంగములు, ధనుజుల అవయవాలు, గజాల దేహాలు, అశ్వాల అవయవాలు, బహువిధ శస్త్రాలు నిండి రణభూమి భీషణమై కానవచ్చింది.
అనంతరం కంపనుడు అంగదుడి ఎదుర్కొని గదాయుధంతో యధాశక్తి కొట్టాడు. అంగదుడు ఆ గదాహతికి నొచ్చి, అంతలోనే మహాక్రుద్దుడై ఒక ఉత్తుంగ శైలంతో కంపనుణ్ణి కొట్టాడు. ఆ శైలరాజం తగిలీ తగలగానే కంపనుడు చూర్ణం చూర్ణం అయిపోయి ధూళిలో కలిసిపోయాడు. అప్పుడు ఆ వాలినందనుడు హర్షంతో దిక్కుల ద్రువ సింహగర్జన కావించాడు. కంపనుడు అంగదుడి చేతిలో మృతుడవడం కని శోణితాక్షుడు మహోగ్రుడై అమోఘాస్త్రాలు కురిపించాడు.
-ఇంకాఉంది