‘‘పోనీ, ఇద్దరూ మాతోపాటు రావచ్చుగా. హనీమూన్ అక్కడే సరదాగా గడపవచ్చు. తర్వాత మీ ఇష్టం’’
‘‘లేదు మామయ్యగారూ! నేనూ కిరణ్ హంపీ వెళ్తున్నాం’’.
‘‘హనీమూన్‌కా?’’ ఓ వ్యంగ్యాస్త్రం సంధించాడు అల్లుడిమీద...
‘‘ఇద్దరిమధ్యా మాటల యుద్ధం ఆపేసింది కిరణ్మయి.’’
‘‘హంపీ ఫెస్టివల్‌కి రమ్మని హోమ్ డిపార్ట్‌మెంట్ ఇదివరకే ఆయనకి ఇన్విటేషన్ పంపించారు హోమ్ మినిస్టర్ వస్తున్నారు.’’
‘‘ఆ మాట ముందే చెబితే, మేమూ వచ్చేవాళ్ళం. ఫ్లైట్ బుక్కయిపోయింది, ఇప్పుడెలా?’’
మృత్యుంజయరావు నాటకీయంగా చేతులు గాలిలో ఆడించి తన నిస్సహాయత ప్రకటించుకున్నాడు. ఆయన దృష్టి వ్యాపారంపైనే లగ్నం అయ్యింది. ఈనెల రోజుల్లో వ్యాపారం బాగానే దెబ్బతినిందాయె. తనూ హంపీ వెళ్లదలచుకుంటే, అమెరికా ప్రయాణం వాయిదా వేసుకోవచ్చు.
‘‘మీరు వెళ్లండి నాన్నా! వీలు చూసుకుని మేమే వస్తాం’’ కిరణ్మయి తండ్రికి సర్ది చెప్పింది. మృణాళినికి నాల్రోజులు కూతురుతో గడపాలని, ఎంచక్కా కాపురం చేయటం చూడాలని వుంది. భారతనారి కదా, భర్తకు ఎదురు చెప్పటనికి తనకి ధైర్యం చాలటంలేదు.
‘‘పోనీ నేనుండిపోతాను, టికెట్ కాన్సిల్ చేయించండి’’ అన్నది మృణాళిని ధైర్యం చేసి చివరికి.
నాన్నగారి మనస్తత్వం కిరణ్మయికి బాగా తెలుసు. అందుకే అన్నది, ‘‘అమ్మా! ఇప్పుడు నువ్వు ఇక్కడ వుండి నాకు చేయగలిగింది ఏమీ లేదుగా, పరీక్షలయ్యేదాకా నేను హాస్టల్లో వుండాలి.’’
‘‘అవును అత్తయ్యగారూ! మేం కాపురం మొదలెట్టక మీరు నేరుగా ఢిల్లీకి వచ్చేయండి’’ చెప్పాడు ప్రత్యగాత్మ.
అందరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం రాగానే ఎవరి పనిలో వాళ్లు లీనమైపోయారు. పిల్లా పాపా లేని రాయ్ దంపతులకు ప్రత్యగాత్మ తరఫున పీటల మీద కూర్చోటం, పెళ్లి కూతురు వాళ్ల సత్కారాలు అందుకోవటం గొప్ప సరదాగా అనిపించింది. వైజాగ్‌లోని అనాథాశ్రమం పిల్లలందరికి విందు భోజనం పెట్టటానికి ప్రత్యగాత్మ కిరణ్మయి పయనమయ్యారు.
***
తలమీద పాగా పెట్టుకుని పీటల మీద కూర్చోటానికి ప్రత్యగాత్మ రాగానే, కిరణ్మయి నవ్వు ఆపుకోలేకపోయింది.
‘‘చుప్! నవ్వుతూ కూచోకు. కాస్త తలవంచుకో’’ ప్రక్కనే వున్న వార్తిక హెచ్చరిక చేసింది- ఆ సీను తలచుకున్నప్పుడల్లా తనకి నవ్వు ఆగటంలేదు. ఏకాంతంలో ఈ కాంతుడి ప్రక్కన కూచున్న కిరణ్మయి తలచుకుని మళ్లీ నవ్వింది.
‘‘జోకేమిటో!’ అన్నాడు ప్రత్యగాత్మ.
పర్సులో పెట్టుకున్న ఓ ఫొటో తీసి చేతికిచ్చింది. వార్తికతో చెప్పి ప్రత్యేకంగా ఈ ఫొటో తీయించింది కిరణ్మయి.
‘‘అర్థమైంది. పెళ్లికూతురు సిగ్గుతో తలవంచుకోకుండా, సిగ్గులేకుండా పెళ్లికొడుకును చూస్తున్నది. ఫెమినిస్టులకు పోస్టు చెయ్యి. ఎన్‌లార్జ్ చేయించి పత్రిక మొదటి పేజీలో వేయిస్తాను’’ అన్నాడు ప్రత్యగాత్మ ఫొటో తిరిగి ఇస్తూ.
‘‘మీరు మరీను’’ అన్నది కిరణ్మయి ముసిముసిగా నవ్వుతూ.
‘‘నవ్వుతూనే వున్నారుగా, ఎవరూ లేరు. చెప్పేయ్. కడుపు ఉబ్బితే కష్టం. నీతో షేర్ చేసుకుంటాను- ఆ జోక్ ఏమిటో’’
ఇంతవరకూ బయటపెట్టని రహస్యాన్ని ప్రత్యగాత్మ చెవిలో చెప్పేసింది.
ఓంనమశ్శివాయ - ఓంకార నాదం హంపీ విరూపాక్షంలో రోజూ వినిపిస్తూనే వుంటుంది. ఒకనాటి అందాలనగరం హంపీ... అందులో అనుమానం లేదు. గుర్రం దిగి ఠీవిగా నీవైపు నడుస్తూ ‘‘దేవీ! నేను, ఇంకా గుర్తుపట్టలేదా?’’ అని అడిగిన ఆ వీరుడు ఎవరు? తలపాగా, ఉంగరాల ముంగురులు, నడుముకు వేళ్లాడుతున్న ఖడ్గం, పంచకల్యాణి దిగి చురుకైన చూపుతో చురకత్తిమీసం దువ్వుతూ నవ్వుతూ దగ్గరికి వచ్చి ఇలా చెయ్యి పట్టుకున్నాడని కళ్లు పెద్దవి చేసి కించిత్తు ఈర్ష్యపడేలా వర్ణించింది ప్రత్యగాత్మకి-
ఇలా జరిగింది కలలో అన్న విషయం మాత్రం కావాలని దాచింది కిరణ్మయి. మగబుద్ధి- అదే మేల్ సైకాలజీ- ఎలా వుంటుందో తెలుసుకోవటానికి.
‘‘ఏడీ ఆ ద్రోహి! వాణ్ణి చంపేస్తా, నరికేస్తా’’ప్రత్యగాత్మ అలా రియాక్ట్ అయితే చూడాలని వుంది కిరణ్మయికి.
‘‘కలగని వుంటావు’’ ప్రత్యగాత్మ పెదవి విరిచేసరికి కిరణ్మయి ఉడుక్కున్నది.
‘‘మగాళ్లంతా ఒకటే. నిజం చెప్పినా నమ్మరు’’
‘‘నాకు తెలుసులే’’ అన్నాడు ప్రత్యగాత్మ.
‘‘నా గురించి ఏం తెలుసు?’’
‘‘నువ్వు ఓ కలల రాణివని, పగలే వెనె్నల చూస్తావని’’ అయితే మేడం ప్రత్యగాత్మకు అంతా చెప్పేసిందని కిరణ్మయికి అర్థమైపోయింది. తను నిజం తెలుసుకోవటానికి పిఎల్‌ఆర్ ఇష్టం లేకపోయినా, ఒప్పుకున్నదని తన కోసం గొప్ప త్యాగం చేసిందని తన భర్త తెలుసుకోవాలని కిరణ్మయి ఆరాటం’’.
ఏడ్పించటానికి ప్రత్యగాత్మ కూడా వౌనంగా వుండిపోయాడు.
డాల్ఫిన్ హోటల్ దగ్గరికి వచ్చేసింది కారు. భుజాన చెయ్యి వేసి ‘‘చూడు కిరణ్. ఇది చాలా సింపుల్.
- ఇంకాఉంది