వెంకటేశ్వర్రావు తన ఫ్లాట్‌లోంచి ఉదయానే్న బయటకు వచ్చాడు.. ఆఫీసు స్పెషల్ మీటింగ్ వుంది... లిఫ్ట్‌లోంచి కిందకు దిగుతూ అనుకున్నాడు. వాచ్‌మెన్ కారు తుడిచాడో లేదో.. అసలే నిన్న వాన పడింది..సెల్లార్ లోకి వచ్చేవరకు ఆదే ఆలోచన. కారు తుడిచేవుంది. హమ్మయ్య అనుకున్నాడు. కార్లో కూర్చుని పెట్రోలు మీటర్ చూసాడు. ఫరవాలేదు. కానీ పోయించాలి. ఇంత ఉదయానే్న తను వెళ్లే రూట్లో ఏ బంక్ వుంటుంది? అదే ఆలోచన కాస్సేపు. నగరంలో ఉదయానే్న ట్రాఫిక్ ప్రారంభమైపోయింది. సిగ్నల్ పడింది..తొంభై సెకన్ల్లు.. టెన్షన్.. ఆఫీసు కొలీగ్‌కు ఫోన్ చేసాడు. లిఫ్ట్ చేయలేదు. లేచాడా.. లేవలేదా.. మీటింగ్‌కు అటెండ్ అవుతాడా.. కాడా.. అదో టెన్షన్.
ఇలా టెన్షన్ల జాబితా..రాసుకుంటూ పోతే..మన రాష్ట్రంలో సముద్రతీరమంత పొడవు. జీవితం వేగవంతం అయిపోయింది. ఆధునిక జీవనం అక్కర్లేనన్ని టెన్షన్లను ప్రసాదిస్తోంది. దీని ఫలితంగా...ఆధునిక జీవితంలో అసహనం పెరిగిపోతోంది. కొద్ది నిమిషాలు కూడా ఓపిక పట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఫోన్ కాల్‌కు ఆన్సర్ రాకుంటే అసహనం.. సిగ్నల్ టర్న్ తీసుకోకుంటే ఇబ్బంది.. ఎదుటివాడు సైడ్ ఇవ్వకుంటే ఆగ్రహం.. పెట్రోలు బంక్‌లో మన ముందు రెండు బళ్లుంటే టెన్షన్.. ఎటిఎమ్‌లో కార్డు పెట్టి, స్క్రీన్‌పై మెనూ వచ్చేలోగా టెన్షన్.. ఆర్‌ఎసి క్లియర్ అవుతుందో అవదో.. వెబ్‌సైట్ ఓపెన్ అయ్యేలోగా చిరాకు..
ఇవన్నీ ఆధునిక జనజీవనంలో నిత్యకృత్యాలయ్యాయి. చిత్రమేమిటంటే, ఆధునిక వ్యాపార సామ్రాజ్యం దీన్ని కూడా క్యాష్ చేసుకుంటోంది. అతి తక్కువ కాలంలో బూట్ అయ్యే కంప్యూటర్లు, అతి స్పీడ్‌గా స్పందించే స్మార్ట్ ఫోన్‌లు, ఇలా మనకు మరింత వేగాన్ని అలవాటు చేసేస్తున్నారు. అపరిమితమైన వేగానికి అలవాటు పడిపోతున్నాం.. ఆ వేగంలో పడి కొట్టుకుపోతున్నాం.. ఎక్కడ కాస్త ఆలస్యమైనా టెన్షన్ పడిపోతున్నాం.
***
‘అత్తా కోడళ్ల సవాల్’ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అయిపోవడంతో ప్రకటనలు మొదలయ్యాయి. అప్పటి వరకు మరో చానల్‌లో సీరియల్ కోసం వెతుకుంటే మధ్యలో వార్తల చానల్స్‌లో రోడ్డు ప్రమాదాల వార్తలు కనిపించగానే సుశీల మనసు ఏదో కీడు శంకించింది. టీవిలో పడిపోయి ఆయనతో అనవసరంగా గొడవ పడ్డాను. మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. ఒక్కసారి పలకరిస్తే కానీ మనసు కుదుట పడేట్టుగా లేదు అనుకుని ఫోన్ చేసింది. రింగవుతోంది కానీ ఎంత సేపటికి ఫోన్ ఎత్తలేదు. మరో రెండు సార్లు ప్రయత్నించిన తరువాత సుశీలకు గుండె దడ మొదలైంది. టెన్షన్ పెరిగిపోయింది. ఇష్టమైన సీరియల్ చూడలేక పోతోంది. ఒక చోట కుదురుగా ఉండలేకపోతోంది. టెన్షన్ పెరిగిపోయింది. తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. నువ్వేం భయపడకు నేను ప్రయత్నిస్తాను అని చెప్పాడు. సుశీల మళ్లీ ఫోన్ చేసింది. రింగవుతోంది ఎత్తడం లేదు. టెన్షన్ దాటి ఏడుపు దశకు చేరుకుంది.
***
ఆఫీసులో మీటింగ్‌లో ఉన్న రమేష్‌లో మెల్లగా టెన్షన్ మొదలైంది. సైలెంట్ మోడ్‌లో ఉన్న సెల్ ఫోన్‌ను చూశాడు. అప్పటికై సుశీల ఆరుసార్లు ఫోన్ చేసింది. ఆ తరువాత వాళ్ల తమ్ముడు చేసిన రెండు మిస్డ్ కాల్స్ కనిపించాయి. ఇన్ని సార్లు ఫోన్ చేశారంటే ఏదో జరిగే ఉంటుందనుకున్నాడు. సీరియస్‌గా మీటింగ్ జరుగుతోంది. లాభాలు పడిపోయి, సమస్యల్లో కూరుకున్నామని, ప్రతి ఒక్కరూ శ్రద్ధతో పని చేస్తే తప్ప మార్కెట్‌లో నిలబడలేమని బాస్ చెబుతున్నాడు. ఆయన మాటలు చెవికి ఎక్కేట్టుగా లేదు. ఏదో జరిగే ఉంటుంది లేకపోతే ఇన్ని సార్లు ఎందుకు ఫోన్ చేస్తారు అని రమేష్ తనలో తానే అనుకున్నాడు. మధ్యలో సెల్‌ఫోన్ ఎత్తి మాట్లాడితే బాస్ తో తంటా... అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తి లాభాలు తగ్గినా దానికి నేను ఈ సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడడమే కారణం అన్నట్టు నామీద ఎగిరిపడతాడు. తప్పదు ఎలాగైనా మీటింగ్ అయ్యేంత వరకు ఓపిక పట్టాలి అనుకున్నాడు. కానీ తన వల్ల కావడం లేదు. ఏమై ఉంటుంది? పిల్లల స్కూల్ బస్సు, సుశీల ఆరోగ్యం, వాళ్ల తమ్ముడి పరిస్థితి... రకరకాల ఊహలు మదిలో మెదులుతూ టెన్షన్ పెరిగిపోయింది. బాస్ ఉపన్యాసాన్ని పిచ్చి చూపులు చూస్తూ వింటున్నాడు.
***
రమేష్ నుంచి కాల్ రాగానే సుశీల ఒక్క క్షణంలోనే ఎత్తి బోరు మంది. రమేష్‌కు అర్థం కాలేదు. ఏమైంది అని టెన్షన్‌గా అడిగాడు. గంట సేపటి నుంచి ప్రయత్నిస్తున్నాను ఫోన్ ఎందుకు ఎత్తలేదు అంటూ ఫోన్‌లోనే ఏడ్చేసింది. తాను ఫోన్‌లో మాట్లాడుతుండగానే సుశీల తమ్ముడు ఆఫీసుకు వచ్చాడు. మీటింగ్ ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయానని రమేష్ చెప్పడంతో సుశీల ఊపిరి పీల్చుకుంది. ఎవరికీ ఏమీ కాలేదని తెలిశాక ఇద్దరి టెన్షల్ గాలిలో కలిసిపోయింది. హాయిగా నవ్వుకున్నారు.
***
ఆధునికి మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఊహించని ప్రగతి సాధించాడు. గత కాలం మనుషులు కలలో కూడా ఊహించని ఎన్నో సౌకర్యాలు మన తరం అనుభవిస్తోంది.
సాంకేతిక పరిజ్ఞానం అందించిన సుఖ సంతోషాలు విషయం ఎలా ఉన్నా ఈ తరం సౌకర్యాలే కాదు ఏ తరం ఊహించి ఉండని మానసిక సమస్యలు సైతం ఎదుర్కొంటోంది.
మనిషి, టెన్షన్ అనేది ఇప్పుడు అవిభక్త కవలలుగా కలిసిపోయాయి. ఒకరిని వీడి ఒకరు ఉండలేరు. చిన్న పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు, విద్యావంతులు, కూలీలు, మేధావులు, ఎవరైనా కావచ్చు టెన్షన్‌తోనే కాపురం చేస్తున్నారు, టెన్షన్‌లోనే జీవించేస్తున్నారు. దేశంలో సొంతిళ్లు ఉన్న వాళ్లు ఎంత మందున్నారో కానీ నీ టెన్షన్ అనే సొంతిళ్లు లేని వారు కనిపించరు.
హోంవర్క్ పూర్తి చేయగలనా? లేదా? అని ఐదేళ్ల కానె్వంట్ బుజ్జికి టెన్షన్. కానె్వంట్ చదువుకే లక్ష రూపాయల ఖర్చా ... బాబోయ్ అమ్మాయి పెద్దయ్యేసరికి చదువు ఖర్చు, పెళ్లి ఖర్చు భరించగలనా? అని బుజ్జి తండ్రికి 20 ఏళ్ల తరువాత వచ్చే పెళ్లి గురించి ఇప్పటి నుంచే టెన్షన్.
టెన్త్‌లో ఎన్ని మార్కులొస్తాయో, ఇంటర్‌లో ఏ గ్రూపు తీసుకోవాలి. మార్కులెన్ని వస్తాయో, మంచి ర్యాంక్ రాకపోతే అమ్మో తలుచుకుంటేనే భయమేస్తోంది. అన్నీ టెన్షన్‌లే. .... ఈ టెన్షన్ భరించ లేక లేని రోగాలు తెచ్చుకుంటున్నారు. చదువు ధైర్యాన్ని ఇస్తుందనేది పాత నమ్మకం. ఇప్పుడు చదువుల పోటీ టెన్షన్‌కు గురి చేస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది. కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ చదివే విద్యార్థులు చదువుల టెన్షన్, మార్కుల పోటీ తట్టుకోలేక ప్రాణాలు విడవడం రోడ్డు ప్రమాదాలంటే నిత్య కృత్యం అయిపోయాయి.
నిజంగా జీవితం ఇంత సమస్యాత్మకంగా మారిందా? మనం అలా మార్చుకుంటున్నామా?
చెట్టు ముందా విత్తు ముందా? అంటే ఏం సమాధానం వస్తుంది ఇదీ అంతేనేమో! పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే పోటీ పడాల్సిందే. పోటీ ఉన్నప్పుడు టెన్షన్ ఉంటుంది? టెన్షన్‌తో పాటు వచ్చే సమస్యలు వచ్చి పలకరిస్తాయి. ఇదో విష సర్కిల్.
ప్రపంచంలో ఓ బుల్లి దేశం భూటాన్. అతి పేద దేశం కానీ ప్రపంచంలో కెల్లా సంతోషంగా ఉన్న దేశం వారు ఎవరూ అనే సర్వే జరిపితే ఈ చిన్ని దేశానికి మొదటి స్థానం లభించింది. జపాన్ సంపన్న దేశం, శక్తివంతమైన దేశం కానీ ఆ దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ. సంపద మాత్రమే సంతోషాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వలేదని ఈ రెండు దేశాలు చాటి చెబుతున్నాయి.
ఒకప్పుడు మన దేశం చివరకు తిండి గింజల కోసం కూడా ఇతర దేశాలపై ఆధారపడేది. ఇప్పుడు మరో రెండు దశాబ్దాల్లో ప్రపంచంలో చైనా, ఇండియా టాప్‌గా నిలుస్తాయని అంటున్నారు. నిజమే మనం వేగంగానే అభివృద్ధి చెందుతున్నాం కానీ మన మానసిక సమస్యలు అంత కన్నా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు మొదలయ్యే పిల్లల టెన్షన్ కానె్వంట్‌లో చేరాక వృద్ధి చెందడం ప్రారంభించి, ఒక్కో తరగతి మెట్టు ఎక్కుతున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. ఎంసెట్ నాటికి పేలిపోయే స్థాయికి టెన్షన్ చేరుకుంటుంది. ఆ తరువాత నాలుగేళ్లు ఇంజనీరింగ్ కాలేజ్. ఐటి కంపెనీలో ఉద్యోగం అక్కడ మళ్లీ జీవితంలో ఎప్పుడూ చూడనంత గొప్ప టెన్షన్ వచ్చి పలకరిస్తుంది. ఈ టెన్షన్ చూశాక ఇన్నాళ్లుమనం అనుభవించింది కూడా ఒక టెన్షనేనా? అనే జ్ఞానమూర్తులుగా మారిపోతారు ఐటి కంపెనీల్లో చేరాక.
మంచి జీతాలు, ఏటేటా బోనస్‌లతో పాటు బోలెడు టెన్షన్ వచ్చి పడిపోతుంది.
***
సకాలానికి ప్రాజెక్టు పూర్తి చేయగలనా? లేదా? అదో టెన్షన్... పూర్తి చేసినా మెప్పించగలనా? అబ్బో ఆలోచిస్తేనే బుర్ర వేడెక్కుతోంది. ఇంతలో భార్య పిలుపు మాటా మాటా పెరిగింది... ఇద్దరూ ఐటి ఉద్యోగులే... ఇద్దరికీ మంచి జీతాలు. .... నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. నీ ఉద్యోగం నీకెంత ముఖ్యమో నా కెరీర్ నాకూ అంతే ముఖ్యం మాటా మాటా పెరిగింది. చెరో గదిలో నిద్ర...
ఒకే బెడ్‌రూం భార్యాభర్తలను భరించగలదు కానీ వీరిద్దరితో పాటు మరో రెండు టెన్షన్ శరీరాలు అంటే మొత్తం నలుగురు. ఇద్దరి కోసం నిర్మించే బెడ్‌రూంలు సహజంగానే నలుగురికి సరిపోవు కదా? వారిద్దరి జీవితాల్లో అడ్డుగీత, అడ్డుగోడ కట్టేస్తుంది టెన్షన్...
***
రెడ్ లైట్ కనిపించగానే వాహనాలన్నీ ఆగిపోయాయి. ట్రాఫిక్ పోలీస్ ఉండడంతో కుమార్ తానూ బైక్‌కు బ్రేక్ వేయక తప్పలేదు. మనసులోనే మొత్తం వ్యవస్థను బండ బూతులు తిట్టుకుంటున్నాడు. 33... 32... 18 సిగ్నల్స్ వద్ద ఇంకెన్ని సెకన్లు నిలబడాలో చూపిస్తోంది. 18 ఇంకా పద్దెనిమిది సెకన్లు నిలబడాలా?అని కుమార్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఆఫీసుకు టైమ్‌కు వెళ్లాలి అతనిలో టెన్షన్ పెరిగిపోతుంది. ఇంకా నాలుగు సెకన్లు ఉండగానే బైక్‌ను పరిగెత్తించాడు. ఎదురుగా అంతే టెన్షన్‌తో వస్తున్న మరో బైక్‌ను ఢీకొనబోయి క్షణాల్లో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అసలే టెన్షన్ దానికి తోడు తప్పిన ప్రమాదం మరింత టెన్షన్‌లో పడేసింది.
టైంకు టిఫిన్ కట్టి ఉంటే పది నిమిషాల ముందే బయలు దేరేవాణ్ణి ఈ టెన్షన్ ఉండేది కాదు అనుకుని ఇంట్లో వాళ్లను గుర్తు చేసుకుని తిట్టుకున్నాడు.
లిఫ్ట్‌లో అందమైన కొలిగ్ కనిపిస్తే చిరునవ్వుతో పలకరించాలని అనిపించినా టెన్షన్ ముఖంలో కనిపిస్తూనే ఉంది. దాంతో ఆ అందగత్తె కుమార్‌ను అసలు చూడనట్టుగానే ముఖం ఎటోవైపు పెట్టుకుంది. ఇది తనను అవమానించడంగానే భావించిన కుమార్‌కు ఆమె అలా ఎందుకు చేసిందనే ఆలోచన కొత్త టెన్షన్ తెచ్చి పెట్టింది.
***
ప్రభుత్వ కార్యాలయానికి పని మీద వెళ్లిన అభినయ్‌కు బాంబులు పెట్టి అందరినీ లేపేస్తే బాగుండు అన్నంత కోపంగా ఉంది. తండ్రి పెన్షన్ ఫైల్ కోసం వెళితే అటువెళ్లమని ఇటు వెళ్లమని తిప్పుతున్నారు.
ప్రపంచంలోని ఏ విషయం గురించైనా గూగుల్ సెర్చ్‌లో క్షణాల్లో వెతికే అభినయ్‌కు ఇలా రోజుల తరబడి తిరగడం అస్సలు నచ్చడం లేదు. టెన్షన్ తట్టుకోలేక పోతున్నాడు. కోపంతో అరిచేస్తున్నాడు. ఇతను కోపంగా అరుస్తుంటే వాళ్లేమో ఇది మాకు మామూలే అన్నట్టుగా తమ పనిలో తాము మునిగిపోవడం మరింత టెన్షన్....
నిజంగా ప్రతి దానికి మనకు ఇంత టెన్షన్ అవసరమా?
టెన్షన్ వల్ల మనలోని శక్తి హరించుకుపోయి కావాల్సిన పని మరింత ఆలస్యం అవుతుంది కానీ ఏమైనా ప్రయోజనం ఉంటుందా?
* ప్రపంచాన్ని జయించాలనుకునే వారికి సైతం ముందు తనపై తనకు నియంత్రణ అవసరం.
* చదువు కావచ్చు ఉద్యోగం కావచ్చు చేసే పని చిత్తశుద్ధితో వంద శాతం అంకిత భావంతో చేద్దాం. ఫలితం ఎలాగైనా రావచ్చు మన కృషి మనం చేద్దాం అనుకుంటే టెన్షన్ ఉంటుందా?
* మనం ఏం చేయగలమో దాన్ని నిజాయితీగా చేయాలి.
* భవిష్యత్తు బాగుండాలని నిజమే కానీ ముందు ప్రజెంట్‌లో జీవించడం నేర్చుకోవాలి.
* మనసు, శరీరం రిలాక్స్‌డ్‌గా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
* పరాజయం కలిగినంత మాత్రమే అదే జీవితానికి ముగింపు అని ఇక భవిష్యత్తు లేదు అనే నిరాశ అవసరం లేదు.
* సంతోషంగా ఉండడం గురించి మన మైండ్‌కు మనం శిక్షణ ఇస్తే ప్రతి దానిలో అది సంతోషాన్ని వెతుక్కుంటుంది.
* నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. సాధ్యమైనంత వరకు అందరితో బాగుండేందుకు ప్రయత్నిద్దాం.
* అప్పు చేసి ఆడంబరాలకు పోతే జీవితంలో టెన్షన్ తట్టుకోలేం. నిరాడంబరంగా ఉందాం.
* మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ అవసరం.
* మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం కానీ, మనసు చెప్పిన మాట వినడం అలవాటు చేసుకుంటే బెటర్.
* మనసు మీద ఆలోచనల మీద నియంత్రణ సాధించాలి.
* మార్పు అనివార్యం. దీనిని అంగీకరించి, ప్రయోజనకరమైన మార్పుకు మనసును సిద్ధం చేసుకోవాలి.
* ఒక పాత్రలో వేడి నీళ్లు పోస్తే ముందు పాత్ర లోపలి భాగం వేడెక్కుతుంది. తరువాత పాత్ర బయట కూడా వేడిగా ఉంటుంది. అలానే మన మెదడులోకి నెగెటివ్ ఆలోచనలు పంపిస్తే, మన బుర్ర నెగెటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఆ తరువాత మన చుట్టు పక్కల వాతావరణం కూడా అలానే మారుతుంది. అందుకే నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉందాం.
* వివాదాలకు దూరంగా ఉండాలి. ఒకరి వైఖరి నచ్చకపోతే పక్కకు తప్పుకోవడం ఉత్తమం కానీ వివాదాలు అనవసరం.
ముందు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా జీవిద్దామని మనసును సిద్ధం చేసుకుంటే అదే అలవాటుగా మారుతుంది.
*
వెంకటేశ్వర్రావు తన ఫ్లాట్‌లోంచి ఉదయానే్న బయటకు వచ్చాడు..
english title:
t
Date:
Sunday, August 11, 2013