‘ఆడవాళ్లల్లో జీనియస్సులుండరా?’ అని అడిగింది శమంత.
ఉలిక్కిపడ్డాను శమంత మాటలకి, ఎందుకంటే - అలాంటి ప్రశ్నని నేను కూడా నాకు వేసుకునేదాన్ని - ఒకప్పుడు! అందుకే వెంటనే జవాబిచ్చేశాను.
‘ఎందుకుండరూ! ఉంటారు. ఆడవాళ్లందరూ జీనియస్సులే. వాళ్లవాళ్ల రంగాల్లో. కానీ.. కానీ..’ మాటలు వెతుక్కోవాల్సి వచ్చింది.
‘నాకర్థమైంది. లింగ వివక్షత.. ఇప్పుడు నాకదే అయింది. నాకు రావలసిన ప్రమోషన్ గణేశన్ కొట్టేశాడు. పైగా వాడు జీనియస్ అన్నారు. అసలు జీనియస్ అంటే ఏమిటీ? నీ నిర్వచనం చెప్పు...’
చిన్నపిల్లలా అనిపించింది శమంత, అలా అడుగుతూంటుంటే.
‘మిగిలిన వాళ్లకన్నా ఎక్కువ సృజనాత్మకత, ఎక్కువ తెలివితేటలు, ఎక్కువ మేధస్సు...’
ఉత్సాహంగా చూసింది.
‘అవునా! సరిగ్గా నేను కూడా ఇదే అనుకున్నాను... కానీ వాడికి ఇంక్రిమెంట్ కూడా నాకన్నా ఎక్కువే.. ఇప్పుడు నేనేం చేయాలి! ఇంకో డిగ్రీ తెచ్చుకోవాలి...’
‘అదేవిటీ.. నీకు పెళ్లి చేయాలని నాన్నగారు అంటున్నారు..’
‘ప్చ్.. సారీ.. ఇంకా చదువుకోవాలి. గణేశన్ ఉత్త బీటెక్. నేను వాడికన్నా మరో డిగ్రీ తెచ్చుకుంటాను.. అంతవరకూ నన్ను వదిలెయ్యి. కెరీర్ ఫస్ట్...’
అన్నట్టుగానే పరీక్ష రాసింది. మంచి బిజినెస్ స్కూల్లో స్కాలర్‌షిప్, సీటు దొరికింది. ఆరేళ్ల అనుభవం ఉంది కాబట్టి పదమూడు నెలలు చదివింది. మంచి గ్రేడ్ వచ్చింది. ఈ పదమూడు నెలలూ కాంపస్‌లోనే ఉంది. మూడు వందల యాభై కంపెనీలు క్యాంపస్‌లో ఇంటర్వ్యూ తీసుకున్నాయి. నచ్చిన ప్యాకేజి ఇస్తున్న కంపెనీలో చేరింది.
కానీ, మళ్లీ అదే పాట.
‘ప్చ్.. ఆడవాళ్ల తెలివితేటల్ని ఎవరూ గుర్తించరు. మా కంపెనీ ఒక్కటే కాదు, అంతర్జాతీయంగానే ఉంది ఈ వివక్షత’
‘ఏవైందీ.. మళ్లీ అన్యాయం జరిగిందా?’
‘అవును. శ్రీ్ధరన్‌ది నాది ఒకటే లెవెల్. వాడికి ఇనె్సంటివ్ అంటూ ఓ పెద్ద పేకెట్ ఇచ్చారు.. మళ్లీ అదే మాట శ్రీ్ధరన్ జీనియస్ అన్నారు. ఆడవాళ్లల్లో జీనియస్‌లు ఉండరన్నట్లుగా చేస్తున్నారు.. నువ్వు చెప్పు, ఆడవాళ్లల్లో జీనియస్‌లుండరా...’
‘ఎందుకు లేరు.. ఉన్నారులే నోబుల్ ప్రైజ్‌లు అందుకున్న ఆడవాళ్లున్నారు. మార్గెరెట్ మిచెల్ ఒక్క నవలే రాసినా, ఆమె మేధావి అనే అంటారు..’
‘ప్చ్. లిటరేచర్ నోబుల్ ప్రైజ్ వేరే. జ్ఞానపీఠ్ అవార్డులు కూడా తీసుకున్న స్ర్తిలున్నారు. కానీ, అది వేరు. ఆడవాళ్లు సహజంగా ఇమోషనల్‌గా ఉంటారు. కబుర్లంటే ఇష్టం. గాసిప్స్ ఎక్కువ. అందుకే దానిలో వచ్చి ఉండచ్చు. కథలల్లడం పుట్టుకతో వచ్చే కళ.. అది వేరు.. అదయినా కూడా, ఏదో కంటితుడుపుగా, ఒకటీ అరా ఇచ్చి, ఇంక గొడవ పెట్టకండి అని అంటున్నారు.. నా బాధ అది కాదు..’
దాని బాధ నాకు అర్థమైంది.
నేనూ ఇలాగే అనుకునేదాన్ని. ఇలాగే ఆలోచించి, ఆలోచించీ అలిసిపోయాను. కానీ.. ఓ చోట కూచుండిపోయాను.
బలవంతంగా నవ్వుని తెచ్చుకున్నాను.
‘రాజకీయాల్లో వాళ్ల గురించి నాకు తెలీదు. డబ్బుండి, వెనకాల అండ ఉంటే, చదువుతో సంబంధం లేకుండా రాజకీయ రంగంలో ఉన్నవాళ్లని జీనియస్‌లని అనచ్చో లేదో నాకు తెలీదు’
‘సరే.. వాళ్ళని వదిలెయ్యి, నువ్వు అనే జీనియస్‌ల గురించి చెప్పు’ అన్నాను తాపీగా శమంతని చూస్తూ.
‘ఇన్ని బహుళ జాతీయ సంస్థలున్నాయి కదా, సీఈఓ లెందులో నయినా ఉన్నారా? ఎక్కడో ఓ కోచ్చర్, ఓ కిద్వాయి, ఓ గుప్తా లాంటి వాళ్లున్నారు. అదయినా, బ్యాంకింగ్ రంగంలోనే కదా. ఒప్పుకుంటావా! నా బాధ ఇదే. ఆడవాళ్లు జీనియస్‌లైనా, మంచి ఫారిన్ డిగ్రీలున్నా గుర్తించడం లేదని. కానీ, నేను నిరూపిస్తాను. నిరూపించుకుంటున్నాను.
ఓ పెద్ద కంపెనీలో, పెద్ద పోస్టుకి చేరుకునేందుకు ప్రయత్నిస్తాను...’
‘నీ ఇష్టం. కానీ, ఆడవాళ్ల డ్రా బ్యాక్ ఎక్కడో తెలుసుకో, ఆమెకున్న బాధ్యతలు. పెళ్లి, సంసారం, పిల్లలు, రోగాలు, ఇవి. దీనికిచ్చిన ప్రాముఖ్యం ఉద్యోగ బాధ్యతలకి ఇవ్వరన్న అభిప్రాయం ఉంది’
‘నాకు తెలుసు. పెళ్లి చేసుకుంటే, పైకి చేరుకోలేనని. అందుకే నేను పెళ్లి చేసుకోను.. నాన్నగారికి చెప్పెయ్యి. ఈ సంగతి...’
మేము బాధపడ్డాం శమంత మాటలకి. నిర్ణయానికి.
కెరీర్, కెరీర్ అన్న శమంత ఓ అబ్బాయిని పరిచయం చేసింది. అర్థమైంది. కెరీర్‌ని కొంచెం పక్కగా పెట్టింది. ఆటోమేటిక్‌గా వచ్చిన ప్రమోషన్‌తో తృప్తి పడిందో లేదో కానీ, జీనియస్, తెలివితేటల గురించి మాట్లాడలేదు.
‘నేనూ - పంకజ్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మా కంపెనీలోనే హెచ్చార్‌లో మేనేజర్‌గా ఉంటున్నాడు..’
‘నీలోని జీనియస్‌ని ఏం చేస్తావ్?’ అని అనాలనుకున్నాను.
ముప్పై మూడేళ్ల శమంత, అంతే వయసున్న పంకజ్‌ని పెళ్లి చేసుకుంది. కంపెనీ పనుల మీద అమెరికా ఓ నాలుగుసార్లు వెళ్లి వచ్చారు. రిక్రూట్‌మెంట్ పేరుతో, ఈ దేశంలోని మెట్రో నగరాలకి పంకజ్ వెళ్తూంటే
తను కూడా వెళ్లిపోయేది. పనిలో ఇదివరకంతటి సీరియస్‌నెస్ లేదనిపించింది.
పెళ్లైన మూడేళ్లకి, ‘పంకజ్ పిల్లలు కావాలంటున్నాడు’ అంది.
సంగతి విన్నాక, అనిపించింది. మార్కెట్ ఎకానమీ, టార్గెట్, మీటింగ్‌లు పడగ్గదిని దాటి బయటికొచ్చేశాయి.
‘మరి... నువ్వు’
‘అదే ఆలోచిస్తున్నాను. సర్వే చేస్తున్నాను.. నీ అభిప్రాయం చెప్పు’
కెరీర్‌ని ఓ పక్కకి పెట్టింది. అందుకే ఆలోచిస్తోంది.
‘చెప్పడానికేవుంది! నీ జీవితాన్ని మార్చేస్తుంది...’
‘అవును. అందరూ అదే అన్నారు. ఇదివరకులాగా, వీకెండ్ పార్టీలు, బయట ఊరికెళ్లడం లాంటివి వుండవు...’
అర్జంటుగా తండ్రి కావాలనుకుంటున్న పంకజ్ కోరికని వ్యతిరేకించలేదు. తీసిపారేయలేదు. స్ర్తిత్వం పైకి వస్తోందన్నమాట.
ఇది వరకు వ్యతిరేకించి, పాత భావాలు అన్న శమంత పెళ్లి చేసుకుంది. పిల్లల గురించి ఆలోచిస్తోంది.
ఇన్నాళ్లూ జీతం, జీవితం ఎలా ఉండాలనుకుందో అలాగే ఉంది. అలా ఉండటం కోసం ఎంతో పెట్టుబడి, ఎన్నో ఏళ్లు పణంగా పెట్టింది.
‘అదొక్కటే కాదు. ఇంకా ఎన్నో...’ అమ్మ హోదాలోని ఇబ్బందులున్నాయి అని చెప్తే వద్దనుకుంటుందా!
ఇన్నాళ్లూ జీవితం ఆమె చెప్పినట్టు వింది. కానీ, ముందు ముందు అలా ఉండదు. చంటి పిల్ల చేతుల్లోకి జీవితం వెళ్లిపోతుంది. రోజూ వారి పనుల్లో కూడా అంతే. ఆఫీసులో బిజీగా ఉన్నప్పుడు పాపాయి ఏడుపు వినిపించినట్లవుతుంది. ఒక్కసారిగా వెళ్లాలనిపించినా, వెళ్లలేక పోవచ్చు. అది ఓ భ్రమ. ఓ ఇన్‌స్టింక్ట్ కావచ్చు. అప్పుడు పాప దగ్గరికి వెళ్తే బావుంటుందనిపిస్తుంది. కొన్నింటి ప్రాముఖ్యత పెరుగుతుంది. కొన్నింటివి తగ్గిపోతుంది. నీకు, పంకజ్, అన్ని విధాలా సాయం చేయాలి. అది కూడా ఆలోచించాలి.
ఇంతవరకు సాధించినది, ఇనే్నళ్ల కష్టం, పడ్డ కష్టం అంతా కూడా పాపాయి పుట్టడం వల్ల వృధా అయిందన్న ఆలోచన రాకుండా చూసుకోవాలి.
అన్నీ కూడా గత రాత్రి వచ్చిన కళలా ఉండిపోతాయేమో అన్న భావం రాకూడదు. ఇంతే కాదు, భార్యాభర్తల సంబంధంలో మార్పులొస్తాయి. మీ ఇష్టాయిష్టాలు, సాధ్యాసాధ్యాలు మధ్య క్లాష్ రాకుండా చూసుకోవాలి. పాజిటివ్‌గా ఉండాలి. ఇక్కడ ఇది వ్యక్తిత్వ వికాసం. దీన్ని నువ్వు చదువుకున్న మేనేజ్‌మెంట్ స్కూళ్లల్లో చెప్పినా, చెప్పకపోయినా, అప్లై చేయాల్సిందే. అంతేకానీ, ఒకరి మీద ఒకరికి ప్రేమ పోయిందనుకోడానికి లేదని తెలుసుకోవాలి.
ఇవన్నీ నా మనసులోనే ఉన్నాయి. చెప్పాలి. చెప్పక తప్పదు.
ఇదివరకులాగా అన్నీ కరెక్ట్‌గా, టైమ్ ప్రకారంగా, ఓ లెక్క ప్రకారంగా జరగవు. అయినా జీవితం ఓ లెక్కల పుస్తకమా? అన్నీ వేసుకున్న స్టెప్పుల ప్రకారంగా చేసేసి, వెనకనున్న ఆన్సర్ చూసుకోవడానికి! జీవితపు పుస్తకంలో, ఎంత జాగ్రత్తగా స్టెప్పులు వేసినా, ఒక్కొక్కసారి వెనక పేజీల్లో జవాబులు దొరకవు. అదిగో అక్కడే డిప్రెషన్, అసంతృప్తి మొదలవుతుంది. అందుకని, అన్నీ ఇదివరకులాగా అనుకున్న ప్రకారంగా జరగకపోవచ్చు... ఈ కోణం అర్థమయ్యేలా చెప్పాలి.
ఓ గుప్పెడు వెంట్రుకలుండే చలివిడి ముద్దలాంటి గుండు ఓ సప్తవర్ణాల ఖజానా. ఆ రంగులు తనని నవ్వుల్లో, చూపుల్లో, చేతల్లో ప్రసరింపజేస్తూ నీకో పంచరంగుల లోకాన్ని సన్నిహితంగా తెస్తాడు.
ఓ కుక్కపిల్లనో, పిల్లి పిల్లనో దగ్గరికి తీసుకెళ్లి ముందు పెడ్తే, ముందు భయపడి, ఆ తర్వాత మళ్లీ మళ్లీ ముట్టుకుని, విజయం సాధించినట్లుగా నవ్వితే, ఆ నవ్వు, నిన్ను ముగ్ధురాలిని చేస్తుంది.
అంతటి స్వచ్ఛమైన నవ్వుని చూడగానే, ఎక్కడలేని ఎనర్జీ కిరణాలు, ఏ ఏంటెన్నా సాయం లేకుండానే నీలోకి వెళ్లిపోతాయి. అది నీకు చైతన్యం ఇస్తుంది.
దొర్లిపోతున్న బంతిని, ఊలు ఉండనో పట్టుకోడానికి చేసే ప్రయత్నం ఓ లగాన్ సినిమా లాంటి ఇన్‌స్పిరేషన్ నిస్తుంది. ఈ స్ఫూర్తికి నువ్వు ఏ వ్యక్తిత్వ వికాసం కోర్సులకి వెళ్లక్కర్లేదు. దాన్ని ఏ బిజినెస్ స్కూల్లో నేర్పించరు.
ఒక్కోసారి ఒంట్లో బావుండదు. కానీ, నువ్వు పట్టించుకోవు. పైగా ఎన్నో విషయాలలో రాజీ పడిపోతావు. అదే అమ్మతనం.
ఒక్కొక్కసారి నీకు బాధ కలగచ్చు. కానీ క్షమించేస్తావు. నీ చిరాకు విసుగుని మర్చిపోతావు. ఆ సమయాన కలిగిన ఫీలింగ్స్‌ని మర్చిపోతావు.
ఒక్కసారి చిన్నపిల్లలా అయిపోతావు. కొత్త నువ్వుగా అయిపోతావు. మరోసారి పుట్టినట్లనిపిస్తుంది.
ఈ స్పందనలు, ప్రతిస్పందనలు నువ్వు అనుకుంటున్న జీనియస్ అనే దాన్ని తనే్నస్తాయి. కానీ అదెక్కడుందో వెతకడానికి ప్రయత్నించవు.
నా మనసులో ఉన్నవన్నీ చెప్పగలనో లేదో అని అనుకున్నా కానీ, చెప్పేశాడు. కొంచెం కొంచెంగా, కానీ, అంతా చెప్పేశాను.
ఓ హోటల్‌లో ఓ మూల కూచుని, భోం చేస్తూ, శమంత అడిగిన దానికి, పిల్లల్ని కనాలా వద్దా అన్న దానికి చెప్పేశాను. నాకు తోచినట్లుగా, నాదైన రీతిలో చెప్పాను.
ఏదో ఆలోచిస్తున్నట్లుగా, ఏ భావం లేకుండా ననే్న చూస్తున్న శమంతని కన్విన్స్ చేశానా లేదా అన్న అనుమానం కూడా వచ్చింది.
ఏదో నలక పడినట్లుగా, రుమాలుతో నా కళ్లు తుడుచుకున్నాను.
శమంత ఆశ్చర్యంగా చూసింది.
కొంచెం సేపటి వరకూ నేనేం మాట్లాడలేదు.
తింటున్న నేను ఒక్కసారి తల ఎత్తి శమంతని చూశాను. శమంత ఇంకా ననే్న చూస్తోంది.
‘కానీ, ఒక్కటి మాత్రం చెప్పగలను.. నీకు ఎప్పటికీ పశ్చాత్తాపం కలగదు. నో రిగ్రెట్స్..’ అంటూ తలని అడ్డంగా రెండు మూడుసార్లు ఊపాను.
శమంత కళ్లల్లో మెరుపు.
‘నీలాగానా...’
అవునన్నట్లుగా తల ఊపాను.
‘్థంక్యూ మమీ.. థాంక్యూ’ అంటూ తన ఎడమ చేతిని నా ఎడమ చేతి మీద వేసి నొక్కింది.
నా అనుభవాలే చెప్పాను.
పిల్లలొద్దు అన్న స్థాయి నుంచి, పిల్లల్ని కనాలా వద్దా అన్న స్థాయికి దిగిన శమంతని కన్విన్స్ చేయగలిగా ననిపించింది.
ఓ తల్లి చేసే నిస్వార్థ యుద్ధం ప్రపంచ చరిత్రలో కానీ, పటంలో కానీ దొరకని యుద్ధం ప్రసవ వేదన గురించి చెప్పలేదు. అది తాత్కాలికం కదా!
శమంత కోసం, అలాంటి వాళ్ల కోసం, జీవన్మరణాల మధ్య యుద్ధం చేస్తూ ఓ జీవిని ఈ లోకంలోకి తెచ్చే అద్భుతమైన సృష్టి కార్యంలో పాలు పంచుకుని, మరో కొత్త తరానికి దారి వేసే ప్రయత్నం చేసే తల్లులందరికీ ప్రశాంత జీవనం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థించాను.
ఆ తర్వాత జీనియస్ అనే మాటని శమంత మర్చిపోయింది. నాకు తెలుసు, నాలాంటి, శమంత లాంటి తల్లులు ఎంతోమంది కొన్ని తరాల నుంచి, యుగాల నుంచి ఉంటున్నారు. రేడియో లాంటి చెవులుంటే, వాటి గురించి వినచ్చు. వీచే గాలి నుంచి, పైనుంచి వాళ్ల అనుభవాలు తేలుతూ, చెవుల్ని తాకుతాయి. ఆడవాళ్లు జీనియస్‌లుగా అవార్డులు ఎందుకు పొందడం లేదో! ఎందుకు సైంటిస్టులు కావడం లేదో! అవి వింటూ, ఓ రెండు కన్నీటి బొట్లు రాల్చచ్చు.
*
గంటి భానుమతి
ని, 205, మే ఫ్లవర్ పార్క్ అపార్ట్‌మెంట్స్,
అన్నపూర్ణ కాలనీ, మల్లాపూర్, హైదరాబాద్ - 500 076.
040-2715 1439.. 8897 64 3009