మూఢమి, శూన్య మాసంలో పెళ్లిచూపులు చూడవచ్చా? మనం ఏ కార్యం చేసినా గణపతిని ఆరాధించి పెద్దలు, వేద పండితుల ఆశీస్సులు తీసుకొని ప్రారంభించడం మన సంస్కృతి మనకు నేర్పిన పాఠం. రోజువారీ కార్యక్రమాల విషయంగా ఒక వేళ ఈ నియమం పాటింపక పోయినా ప్రతి విశేష కార్యములలోనూ పై నియమం పాటింపవలసినదే అనేది భారతీయ వాదన. విఘ్నములు పోగొట్టువాడు కావున గణపతిని అర్చించడం, పెద్దలు పూజ్యుల నుండి స్వస్తి మంగళ వాచకములు ఆశీఃపూర్వకంగా తీసుకొని ప్రారంభిస్తే అంతా శుభం కలుగుతుంది అనేది ఒక గట్టి నమ్మకం. మంచి పొందేవాడు పై మంచి పనులు తప్పక చేస్తాడు. అలాంటిది జీవితకాల బంధాలకు సంబంధ మైన వివాహం విషయంలో మంచి చూసి ప్రారంభించాలి. సంబంధం తెలిసి దాని ప్రయత్నంలో ప్రారంభంలో ఈ విధంగా గణపతిని పూజ్యులను పూజించి వెళ్లుట శ్రేయస్కరం. పూర్వకాలామృతం.
‘అదౌస్వేప్సిత దేవతాం గ్రహగణం సంపూజ్యకర్తుస్తదా - తారాచంద్ర బలాన్వితే శుభదినే లగ్నే శుభేవాసరే’ అని చెప్పారు. దేవతలను గ్రహగణములను పూజించి తారాచంద్ర బలములతో కూడి శుభదిన శుభలగ్న శుభ వారములలో జ్యోతిశ్శాస్తవ్రేత్తలను సంప్రదించి వధూవరుల జాతక వివరాలు చూపి ప్రయత్నాలు ప్రారంభించమని చెప్పారు. మరి తారాబలం కూడిన శుభ దినంలోనే మాటలాడమని చెప్పారు కదా! ఇక ఆషాఢం, భాద్రపదం, పుష్యమాసాలు, మూఢమి దినములు శుభముకు పనికిరావు కదా. అందువలన ఈ మూఢమి వంటి రోజులలో పెండ్లి చూపులు చూడరాదు. దానికి ఒక పెద్ద కారణం ఉంది. వధూవరులు ఇరువురు మొదట చూసుకున్న సమయం మంచిది కాకపోతే ఆ ప్రభావం జీవితాంతం వెంబడిస్తుంది. శాస్త్రంతో పనులు చేద్దాం అనుకుంటే శాస్త్రం చెప్పినవి అన్నీ చేయాలి. అలాగ చేయకపోతే సమస్యలు రాగలవు. సరే ఇక మనం యాంత్రిక జీవనంలో వున్నాం సమయం చాలా అరుదుగా కుదిరే సందర్భాలలో మూఢమి వంటివి వస్తే ఏమి చేయాలి అనే ప్రశ్న అందరినీ బాధిస్తుంది. అందుకే శాస్తజ్ఞ్రులయిన పెద్దలు అనుభవం మీద కొన్ని విశేషాలు తెలియజేశారు. అది ఏమిటి అంటే దేవాలయం దైవసన్నిధి.కి దోషం వుండదు కావున వధూవరులను మొట్టమొదట ఏదేని దేవాలయంలో చూసుకునేలాగ చేయుట అనంతరం వారి గృహమందు కలియుట ద్వారా మూఢమి దోషం ఉండదు అని చెబుతారు. ప్రతి విషయంలోనూ దైవ సన్నిధిలో చేయుటకు విశేషం అని వింటున్నాం కదా.
అలా మంచి సమయం కుదరని వారు ఆషాఢంలోనే ఒక మంచిరోజు (ఉన్నంతలో) మంచి వారం తారాబలం కుదిరిన రోజున దైవసన్నిధిలో దేవాలయంలో పెళ్లిచూపులు చూసుకోవడం ద్వారా దుష్ఫలితాలు రావు అని పండితులు చెబుతారు. వధువు తరఫు పెద్దలు వరుని చూచుటకు, వరుని తరఫు పెద్దలు వధువును చూచుటకు ఆషాఢ, భాద్రపద, పుష్య, మూఢమి దోషాలు పట్టింపు కాదు. ఈ మధ్య చాలా అపహాస్యమైన పద్ధతి నడుచుచున్నది. అది ఏమనగా మంచి రోజులలో ఒక సంబంధం చూసేస్తే, తరువాత వాటికి మంచి రోజులతో పట్టింపు లేదు అని. అది తప్పుడు వాదన. ప్రతి ప్రయత్నంలోనూ మంచి రోజులు చూసుకోవడం తప్పనిసరి. ఎన్ని సంబంధాలు చూసినా మంచి రోజులకే ప్రాధాన్యం ఇచ్చి శాస్త్ర వాక్యం పాటించిన వారు జీవితాంతం సుఖపడతారు. శాస్త్ర వాక్యములు వాటి పరమార్థం పూర్తిగా తెలుసుకోకుండా మనకు తోచిన మాటలు చెప్పడం సమంజసం కాదు. శాస్త్ర వాక్యాలు లేదా పెద్దల మాటలు తెలుసుకొని చర్చించుకోవడం ద్వారా శాస్త్ర గౌరవం కాపాడినవారవుతారు. తద్వారా ఆచరించిన వారు సుఖపడతారు. *
కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి,
నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012
సందేహాలు - సమాధానాలు
వి.ఆంజనేయులు (తెనాలి)
ప్రశ్న: 18.3.72. సమయం 14.55. రాబోవు కాలం ఎలాగ ఉంటుంది?
జ: ప్రస్తుతం రాహు దశ నడుచుచున్నది. రాహువు సప్తమంలో ఉన్నప్పుడు పుట్టిన వారికి మానసిక వత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మేష రాశి వారికి రాహువు బలంగా లేదు. రోజూ దుర్గా ఆరాధన చేయండి. ఇది కాకుండా మిగిలిన వృత్తి, ఆరోగ్య, ఆర్థిక విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది.
లక్ష్మీకాంతం (హైదరాబాద్)
ప్రశ్న: ఏప్రిల్ 11, 1991. ఉ.8.30 ఇల్లు అమ్ముడు పోతుందా?
జ: 2014, జూలై 3 వరకు బుధ చంద్ర నడుచుచున్నది. అనుకూల గ్రహచారమే. అందువలన మీకు మనస్సంకల్ప సిద్ధి ఉంటుంది. అయితే ఆరోగ్యం బహు ప్రమాదకరం అవుతుంది. మీది వృషభ లగ్నం. కన్యారాశి. రోజూ శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయండి.
కృష్ణారావు (అనంతపురం)
ప్రశ్న: 17.1.1992. సా.5.20. వివాహకాలం ఎప్పుడు?
జ: 2014 జనవరి నుండి గురుదశ ప్రారంభం. మీ అమ్మాయికి రాహుకేతు దోషం ఉన్నది. రోజూ నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయండి. 2014 జూన్ దగ్గరలో వివాహం నిశ్చయం. కుజదోషం ఉన్నది అయితే మీరు అడిగిన విధంగా ఆమె భవిష్యత్తు చాలా బాగుంటుంది. మంచి సంబంధం వస్తుంది.
శ్రీనివాసులు (హైదరాబాద్)
ప్రశ్న: 6.8.1968. నా భవిష్యత్తు ఎలా ఉంది?
జ: మీది ధనూరాశి. మీకు రాబోవు 2014 నవంబర్‌కు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అయితే మిగిలిన గ్రహచారం పరిశీలిస్తే మీ అభివృద్ధి లోటు ఉండదు. శ్రమ, వత్తిడి ఎక్కువవుతాయి. ఇవి తొలగాలి అంటే రోజూ ‘శ్రీరామ శ్చరణం మమ’ అంటూ ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేయండి. పనులు వేగం పెరుగుతాయి. ఇది పెద్దలు సూచించే నివారణ మార్గం.
శేఖర్ (విజయవాడ)
ప్రశ్న: మార్చి 12, 1966. సా.4.00 వ్యాపారం ఆర్థికంగా బాగుంటుందా?
జ: 2013 ఏప్రిల్ వరకు శు-గురు బాగా ఇబ్బందికరమైన కాలం నడిచింది. అయితే రాబోవు కాలం 2014 నవంబర్ వరకు మంచి మార్పులకు అవకాశం ఉంది. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది.
వి.జానకి (రాజమండ్రి)
ప్రశ్న: ఆగస్టు 4, 1974 ఉ.6.45 రాబోవు దశలు ఎలా ఉంటాయి?
జ: సింహలగ్నానికి లాభంలో శని శుక్రులు ఉండగా ప్రస్తుతం శని దశ ప్రారంభమైంది. అంతేకాక 2017 వరకు గ్రహచారం అనుకూలమే కానీ 2018 నుండి ఇబ్బందులు రాగలవు. శివారాధన చేయండి. ఆర్థిక అంశాలు అనుకూలమే. వృత్తి చికాకులు, ఆరోగ్య చికాకులు రాగలవు.
బాలకృష్ణ (కర్నూలు)
ప్రశ్న: 3.1.1958. ఉ.7.45. విజయవాడ. ఆర్థిక వృద్ధి ఎలాగ ఉంటుంది?
జ: రాబోవు 2015 నుండి గోచార శని వృషభ రాశి బాగా లేదు. మీకు శని రవి శని చంద్ర అంతర్దశలో సంఘంలో గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయి కానీ ఆర్థికంగా సాధారణ స్థాయిగా ఉంటుంది. సంతానం అభివృద్ధిలో ఉంటారు. తద్వారా కుటుంబ సౌఖ్యం బాగుంటుంది.
ప్రశ్న: 26.8.1970. 22.50. వివాహం ఎప్పుడు?
జ: 10.6.2012 నుండి శని గురు అనుకూలమైన కాలం. లగ్నంలో శని వివాహం ఆలస్యం చేయడానికి కారకుడు. అయితే శని, గురు వివాహ భాగ్యం అనుకూలమే.
*
కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి,
నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.