హెలెన్ కెల్లర్
జీవిత గాథ
రచన: డా.నన్నపనేని మంగాదేవి
వెల: రూ.30
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్
విశాలాంధ్ర బుక్ హౌస్
బాల్యంలో ఏర్పడిన భావాలు భావి జీవితానికి ప్రాతిపదికలు. ‘నిరాశా నిస్పృహలకు తావు ఉండరాదు. సమస్య వచ్చినపుడు క్రుంగరాదు. అనుకోని అవరోధాలు, ప్రకృతి కల్పించిన అవకరాలు అన్నీ అధిగమించి జీవితాన్ని సుగమం చేసుకుంటూ గమ్యం చేరుకోవాలి. చీకటిలో వెలుగును చూడగలిగే ధైర్యం, స్థైర్యం, ఆత్మవిశ్వాసం - ఈ మూడూ మనిషి ఉన్నతికి సోపానాలు’ ఇదీ హెలెన్ కెల్లర్ జీవిత సారం.
ఈ సారాన్ని నీరవమైన నేటి తరానికి అందించాలన్నదే ఈ రచయిత్రి తపన. అయితే దీనికి పాఠకులు బాలలు కనుక ఆ చెప్పడం కేవలం ప్రబోధాత్మకంగానూ, సూక్తి ముక్తావళిగానూ ఉండరాదు. దానికొక విశిష్టమైన, విభిన్నమైన తీరు, తెన్ను ఉండాలి. అప్పుడే అది పసి మనసులలో చెరగని ముద్ర వేయగలుగుతుంది. వారి భావాలను ప్రభావితం చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.
పిల్లల మనసుకు రుచించేది కథ. హెలెన్ కెల్లర్ జీవిత గాథ కాల్పనికమైన కథ కంటే అద్భుతమైనది. అందుకే ఆవిడ జీవితాన్ని బాలలకు వినిపించాలనే ఈ తాపత్రయం!