ఇదెక్కడి గోలండీ బాబూ.. ఎవరన్నా ఆడియో వద్దు వీడియో ముద్దు అని అంటారుగానీ- అనుకుంటున్నారా? అయినా ఆడియో, వీడియో కలిసి సమైక్యంగా ఉంటే మీకేమయ్యిందీ అంటారా? కరెక్టే. కానీ, వీడియో అన్నివేళలా పనికిరాదు. అలాగే కొన్నిసార్లు ఆడియో పనికి రాదు. ఇదంతా ఎందుకుగానీ, ఏది లేదో అది కావాలి మనకు. ఏమంటారు? అదీ ముఖ్యంగా మనకు తెగ నచ్చేసిన ఓ సూపర్ వీడియో సాంగైతే మరీనూ. ఎందుకంటే, మనం మొబైల్‌గా ఉండేటపుడు, మన మొబైల్ ఫోన్‌లో వీడియోలున్నా చూస్తూ పనిచేయలేం అన్నిసార్లూ. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేపుడు, ఆఫీసులో పని చేసుకునేపుడూ. అదే ఆడియో అయితే, ఎంపి3గా సేవ్ చేసుకుంటే చాలు. కంప్యూటర్లోనూ, మొబైల్‌లోనూ కూడా వినొచ్చు. అది ఐపాడ్ అయినా సరే. లేదూ మీ కొత్త స్మార్ట్ టాబ్లెటైనా సరే. కదా! మనకు ఇంటర్నెట్‌లో ఎన్నో వీడియో క్లిప్స్ ఫ్రీగా తెగ కనిపించేస్తున్నాయి. అందులోనూ, ముఖ్యంగా యూట్యూబ్ లోనైతే మరీనూ. అలా సెర్చిచేసి ఇలా వీడియో క్లిప్ పట్టేయవచ్చు. మరి చిక్కెల్లా ఆ క్లిప్స్‌ను మనం ఎంపి3లుగా మార్చుకోడమే.
అయితే, మా స్నేహితుడన్నట్టు, అన్నిటికో లెక్కుంది (తనకు తిక్క మాత్రం లేదు లెండి). వెబ్‌లో కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి. వాటిని వాడి మనం ఈ వీడియో క్లిప్స్‌ను ఆడియో క్లిప్స్‌గా మార్చి దాచుకుని, వినుకోవచ్చు. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విఎల్‌సి ప్లేయర్ అనేది. ఆ తరవాత ఎంపి3 కన్వర్టర్ అనేది కూడా బాగుంటుంది. అలానే విడియో టు ఎంపి3 అనే సాఫ్ట్‌వేరుంది. విడియో టు ఎంపి3 ఎక్స్‌ట్రాక్టర్ అని కూడా ఒకటుంది. అపెక్స్ వీడియో టు ఎంపి3, డబ్ల్యుఎంఏ, వేవ్ కన్వర్టర్ అనే మరో సాఫ్ట్‌వేరు కూడా ఉంది. ఇవన్నీ మనం మన పీసీలోనో, లాప్‌టాప్ లోనో ఇన్‌స్టాల్ చేసి వాడుకోవచ్చు. ఇవన్నీ ఉచిత సాఫ్ట్‌వేర్‌లే. ఇవికాకుండా ఆన్‌లైన్‌గా మనం వీడియో క్లిప్‌లను ఆడియో క్లిప్స్‌గా మార్చుకోవడానికి వీలునిచ్చే వెబ్ సైటొకటుంది. దాని పేరే ఆన్‌లైన్ కన్వర్ట్ డాట్‌కామ్.
విడియో టు ఎంపి3 సాఫ్ట్‌వేర్ విడియోను ఎంపి3గా మారుస్తుంది. అదే విడియో టు ఎంపి3 ఎక్స్‌ట్రాక్టర్ ద్వారా అయితే ఎవిఐ, ఎంఓవి, ఎంపిజి, ఎంపెగ్, డాట్, ఎంపి4, ఏఎస్‌ఎఫ్ వంటి ఫార్మాటులనూ ఎంపి3లుగా మార్చుకోవచ్చు. అన్నట్టు, విండోస్ మీడియా ఫార్మాట్లైన డబ్ల్యుఎంఏ, డబ్ల్యుఎంవి, వేవ్ వంటి ఫార్మాటులనూ ఎంపి3లుగా మార్చుకోవచ్చు. విఎల్‌సి ప్లేయ్‌లో కూడా చాలా ఫార్మాట్సు సపోర్టు దొరుకుతుంది. ఆన్‌లైన్ కన్వర్ట్ డాట్ కామ్‌లోనూ ఆన్‌లైన్‌గా కన్వర్ట్ చేయడానికి కూడా పైన చెప్పిన ఫార్మాట్లన్నిటికీ సపోర్టు ఉంది. ఇంకా చెప్పాలంటే, ఈ ఆన్‌లైన్ కన్వర్ట్ డాట్‌కామ్‌లో దాదాపు 50 ఫార్మాట్స్‌ను ఎంపి3గా మార్చి పెట్టుకోవచ్చు. కన్వర్ట్ చేసే తతంగం కూడా ఎక్కువేమీ కాదు. వీడియో ఏ ఫార్మాటులో ఉందో దాన్ని ఎంచుకోవడం, ఎంపి3గా మార్చమనే ఆప్షన్ ఎంచుకోవడం. ఆనక కన్వర్ట్ అనే బటన్ ఎంచుకోవడం. అంతే. అంతకన్నా పెద్ద మార్పేమీ ఉండదు.
ఈ సాఫ్ట్‌వేర్ టూల్స్ కావాలనుకునే ఎంపి3 కలెక్షన్ కింగ్స్ ఆయా వెబ్‌సైట్లకు వెళ్లి ఉచితంగా డౌన్‌లోడ్ చేసి వాడుకోవచ్చు. ఇక ఆలస్యం దేనికీ? పని కానివ్వండి.
టెక్ - టాక్
english title:
tek - talk
Date:
Tuesday, September 24, 2013