వేధలు అంటే కనిపించకుండా బాధించే వాస్తు దోషాలు. ఆ శబ్ద విశేషాలను, అర్థాన్ని లోగడ ప్రస్తావించాం. అలాంటి వేధల్లో కొన్ని సహజమైన ప్రకృతి సంబంధమైనవి అంటే వృక్ష వేధ, ప్రవాహ వేధ వంటివి- మరికొన్ని సామాజిక మైనవి అంటే ఇంటి ముందు దేవాలయం ఉండడం వంటివి. ఇటువంటివి మన చేతుల్లో లేవు. కానీ నిర్మాణ సంబంధంగా మనం చేసే కొన్ని పొరపాట్లు వాస్తు శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా జరిగేవి ఉంటాయి. వాటినే నిర్మాణ వేధలు అంటాం. అందులో కొన్ని బుధిర వేధ, బధిరవేధ వంటివి కొన్ని లోగడ ప్రస్తావించాం. ఇప్పుడు ‘ఆయభిన్నవేధ’ అనేదాన్ని గురించి చెప్పుకుందాం.
ఆయభిన్నవేధ అంటే ఆయము సరిగ్గా ఉండకపోవడం-సరిపోక పోవడం-మరి ఇంతకూ ఆయమంటే ఏమిటి అని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఆయము అనే మాటకు శబ్దార్థం సంపాదన. ఆదాయము అని వాస్తు శాస్త్రంలో ఆయము అంటే కలిసి రావడం (అన్ని విధాలా)-ఆయము అనే ప్రత్యేక అంశాన్ని మరోసారి చర్చిద్దాం-ప్రస్తుతం వేధలు అనే అంశంలో భాగంగా ‘ఆయభిన్న వేధ’ గురించి ప్రస్తావించాం. ఈ ఆయ నిర్ణయం అనేది పండితులలో కొన్ని భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వ్యక్తియొక్క నామనక్షత్రం ఆధారంగా నిర్ణయిస్తారు. మరి కొందరు జన్మ నక్షత్రం రీత్యా నిర్ణయిస్తారు. ఇంకా కొందరు వర్గార్వణా పద్ధతిలో నిర్ణయిస్తారు. గమనించిన ఉత్తమ పద్ధతి ఏమిటి అంటే యజమాని యొక్క వంశ నామము యొక్క అక్షర ప్రధానంగా రాశి నిర్ణయము చేసి ఆ ప్రాతిపదికగా నిర్ణయము చేస్తే ఆ ఇంటి వారసులందరికీ అది వర్తిస్తుంది కలిసి వస్తుంది.
ఎందుకంటే ఇంటిపేరు ఎప్పుడూ వారసులందరికీ అదే ఉంటుంది కనుక. ఆ విధంగా వచ్చిన నక్షత్రాన్ని, క్షేత్రీకృత సదము ద్వారా వచ్చిన గృహ నక్షత్రాన్ని సమన్వయపరిచి ఆ ఇంటికి కూడా ఒక చక్కని పేరు నిర్ణయించి ఫలకము వ్రాయించి శుభ ముహూర్తములో ఆ ఇంటి నామకరణము చేస్తే అది అన్ని తరాలకు శుభప్రదంగా కలిసి వస్తుంది.-(ఇంటిపేరు అంటే ఉదా: శ్రీనిలయం-లక్ష్మీ నిలయం - ఇలా)- అనుభావంలో కూడా ఈ పద్ధతి చాలా ఉత్తమ ఫలితాలనిస్తోంది- ఇటువంటి ఆయ నిర్ణయంలో పొరపాటు జరిగితే ‘ఆయభిన్నవేధ’ అంటారు- ఈ దోషం వలన ఇంట్లోని వారికి మనశ్శాంతి లేకపోవడం -లోక విరుద్ధమైన స్వభావాలు కలిగి ఉండడం- ఒక్కొక్కప్పుడు మతి భ్రమణాదులు కలగడం సంభవిస్తుంది. అందుకే ‘ఆయభిన్న వేధ’ రాకుండా చూసుకోవాలి- అన్ని ఆయలూ అందరికీ వర్తించవు.
*
=========
సందేహాలు - సమాధానాలు
ఎస్.బి.రావు, నెల్లూరు టౌన్
ప్ర: నిర్ధారిత యంత్ర ప్రతిష్ఠల ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయా!
సమా: ‘యంత్రము’ అనే మాటకు అర్థం ఒక చిన్న భౌతిక వస్తువులో గొప్ప శక్తి కలిగి ఉండడం -కారులో ఉండే కార్బొరేటర్ ఎంత ఉంటుంది-కాని ఒక గొప్ప వాహనాన్ని పరిగెత్తించగలుగుతుంది ఉష్ణ శక్తి ద్వారా (అంటే పెట్రోలు)- అలాగే వాస్తు యంత్రము ఒక శాస్తబ్రద్ధమైన యంత్ర బీజాక్షర సంపుటి గల్గిన ప్రమాణబద్ధమైన ఫలకము. (రాగి కాని బంగారం కాని ఏదైనా కావచ్చు) ఆ ఫలకాన్ని ఉపాసనా బలము కల మంత్ర శాస్తవ్రేత్త మంత్రశక్తితో పరిపుష్టం చేయాలి (మంత్రా ధనంతు దైవతం) అప్పుడు తప్పకుండా యంత్ర ప్రతిష్ఠలు ఫలిస్తాయి. ప్రతిష్ఠా సమయ సుముహూర్తాలు కూడా ప్రధానమే-
అంకం జగ్గారావు, కొత్తగూడెం
ప్ర: ఉడుము ప్రవేశం
సమా: ఉడుమే కాదు వన్య మృగాలేవీ నగరంలో కాని, ఇళ్లల్లో కాని ప్రవేశించకూడదు-అయితే ఉడుముకు సంబంధించినంత వరకూ కొన్నాళ్లు ఆ ఇల్లు వదిలిపెట్టాలి. వీలు కాకపోతే ఉదక శాంతి చేయించాలి. అయితే కొన్ని వంశాల వాళ్లు ఉడుము ప్రవేశం శుభంగా భావించే వాళ్లు ఉన్నారు. కాని అది శాస్ర్తియం కాదు.
ఎం.తేజేశ్వర్, జహీరాబాద్
ప్ర: వాస్తు శాస్త్రంలో ‘సూక్ష్మంలో మోక్షం’ లాంటి ఉపాయాలున్నాయా?
సమా: ఉన్నాయి! కాని ఆ మోక్షం కూడా సూక్ష్మంగానే ఉంటుంది అని గుర్తుంచుకోవాలి.
ఎస్.జగన్నాథరావు (కరీంనగర్)
ప్రశ్న: జ్యోతిషానికి, వాస్తుకు సంబంధం ఉందంటారా?
సమా: ఉంటుంది. జ్యోతిషంలో దోష గృహావాస యోగం అని కూడా ఒక యోగం ఉంది.
*
వాస్తు విశారద ఉమాపతి శర్మ
ఇం.నెం.16-2-834/బి/1, ఎస్‌బిహెచ్ కాలనీ ఎదురుగా, సైదాబాద్ (శ్రద్ధాబాద్)
హైదరాబాద్ - 500 059.