ఆనాటి సభలో శ్రీకృష్ణదేవరాయలు ప్రజా సమస్యల గురించి మహామంత్రి తిమ్మరుసుతోను, ఇతర రాజోద్యోగులతోను చర్చిస్తున్నారు.
ఇంతలో ద్వార పాలకుడు- పొరుగు రాజ్యంనుంచి ఒక మల్లయోధుడు వచ్చాడన్న వార్త తెచ్చాడు. తక్షణమే అతడిని లోపలికి పంపమని చెప్పారు రాయలవారు.
మల్లయోధుడు సభలోకి ప్రవేశిస్తునే రాయలకు నమస్కరించి, ‘మహాప్రభూ! మీ ఆస్థానంలో నాతో పోరాడే మల్లయోధుడు ఉంటే పిలిపించండి. ఇంతవరకు నేను వివిధ రాజ్యాలకు చెందిన మల్లయోధులందరినీ ఓడించాను. ప్రతిచోటా విజయలక్ష్మి నన్ను వరించింది. ఇక మీ మల్లయోధుడు నాతో తలపడి గెలిస్తే నేను అతడి కాలి క్రిందుగా దూరిపోతాను. అందుకతను సాహసించకపోతే గెలుపు నాదేనని ఒప్పుకుంటూ నాకు జయపత్రం ఇచ్చి పంపించండి!’ అన్నాడు గర్వంగా.
ఆ మల్లయోధుడి శక్తి సామర్ధ్యాలు రాయలవారు ఇంతకు ముందే విని ఉన్నారు. తమ ఆస్థాన మల్లుడు అతడిని జయించలేడని ఆయనకు తెలుసు. తాను పోరాడి గెలవగలడు కాని రాజుగా అది తగిన పని కాదు. ఏం చెప్పాలో రాయలవారికి వెంటనే తోచలేదు.
పరిస్థితి గమనించిన తిమ్మరుసు కలగచేసుకుని, ‘మల్లయోధాగ్రేశ్వరా! మా మల్లయోధుడు అనుకోకుండా పొరుగు రాజ్యానికి వెళ్లాడు. అతడు రాగానే తప్పక మీ కోరిక తీరుస్తాం. అంతదాకా మా ఆతిధ్యం స్వీకరించండి!’ అని ఉండేందుకు ఓ గది ఏర్పాటు చేయించాడు.
సభ ముగిసే సరికి మధ్యాహ్నమైంది. తిమ్మరుసు రాయలతో మాట్లాడి, ఆ పూట ఆయన పక్కనే మల్లయోధుడికి భోజనం ఏర్పాట్లు గావించాడు.
వారు ఇరువురూ భోజనం వడ్డించిన కంచాల వద్ద కూర్చున్నారు. అన్నీ వడ్డించారుగాని నెయ్యి లేదక్కడ. మల్లయోధుడు నెయ్యి తెస్తారేమోనని ఎదురు చూస్తున్నాడు. ఈలోగా రాయలవారు కంచాల ముందుంచిన నువ్వులు చేతిలోకి తీసుకుని వాటిని గట్టిగా నలపగా వచ్చిన నూనెను పదార్ధాల్లో వేసుకున్నారు.
ఇక లోపల్నుంచి నెయ్యి రాదని గ్రహించిన మల్లయోధుడు తను కూడా ఆయనలా చెయ్యాలని ఒకటి రెండుసార్లు ప్రయత్నించి విఫలుడయ్యాడు. అప్పుడు రాయలవారు అతడి అరచేతిలో నువ్వులు పోసి, తన అరచేతితో గట్టిగా రుద్దాడు. నువ్వుల నూనెతోపాటు మల్లయోధుడి చెయ్యి చిట్లి రక్తం వచ్చింది.
అది చూసి కృష్ణదేవరాయలు, ‘అరె, చేతులింత సున్నితంగా ఉంటే మా మల్లయోధుడితో మీరేం పోరాడగలరు? అతనితో ఎంతమాత్రం పనిలేదు. మా ఆస్థానంలో మల్లయుద్ధంలో శిక్షణ పొందుతున్న యువకుల్లో ఎవరైనా గాని మిమ్మల్ని ఇట్టే మట్టి కరిపించగలరు. రక్తం కక్కించగలరు. మీరు పోరాటానికి సిద్ధమేనంటే అందుకు ఏర్పాట్లు చేస్తాను’ అన్నారు నవ్వుతూ.
ఏమనుకున్నాడో మల్లయోధుడు రక్తం వస్తున్న అరచేతి వంక ఓ మారు చూసుకుని, మారు మాట్లాడకుండా భోజనం వద్దనుంచి లేచి తలవంచుకుని గబగబ బయటకు వెళ్లిపోయాడు.
తన హోదాకు, రాజ్య ప్రతిష్టకు ఏమాత్రం భంగం కలగకుండా యుక్తితో ఆ మల్లయోధుడి గర్వమణచిన తిమ్మరుసును ఎంతగానో ప్రశంసించారు శ్రీకృష్ణదేవరాయలు. *
శ్రమ విలువ
---------
స్ఫూర్తి
---------
-మల్లాది వెంకటకృష్ణమూర్తి
స్కూల్ నించి వచ్చిన సనంద్ తల్లిని భయంగా అడిగాడు.
‘నాన్న ఇంట్లో ఉన్నారా?’
‘లేరు. ఏం?’
‘ఐతే నా ప్రోగ్రెస్ కార్డు మీద నువ్వు సంతకం చెయ్యి’
సనంద్ తల్లి దాని మీద సంతకం చేసింది. ఐతే వాడికి తక్కువ మార్కులు వచ్చిన సంగతి గమనించాక అడిగింది.
‘మార్కులు ఇంత తక్కువ వచ్చాయే? నాన్నకి చెప్తా నుండు’
‘వద్దమ్మా ప్లీజ్. నాన్నకి చెప్పకు. ఈసారి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను’ సనంద్ బతిమాలాడు.
ఐనా ఆవిడ ఆ సంగతి రాత్రి ఇంటికి వచ్చిన తన భర్తకి చెప్పింది.
‘సనంద్! ఇవాళ నీకు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారట కదా? నీ ఫ్రెండ్ రణధీర్ తండ్రి చెప్పాడు. ఏదీ తీసుకురా చూస్తాను.’ తన భార్య మాట పోకూడదని రణధీర్ తండ్రి మీద వేసాడాయన.
సనంద్ మనసులో భయపడుతూనే తన స్కూల్ బేగ్ తెరచి ప్రోగ్రెస్ కార్డుని తెచ్చి చూపించాడు.
సగటున ముప్పై ఏడు శాతం వచ్చింది. హిందీలో మరీ తక్కువ మార్కులు వచ్చాయి. సనంద్ తండ్రిది కోప్పడే స్వభావం కాదు. తప్పులని గ్రహించి సవరించుకునేలా వివరించే స్వభావం.
‘ఆ గోడకి కొట్టిన మేకుని చూశావా?’ కొడుకుని అడిగాడాయన.
తలెత్తి కేలండర్ వేలాడే మేకుని చూసి తలూపి చెప్పాడు సనంద్.
‘చూశాను నాన్నా’
‘దాని ఖరీదు ఎంతో తెలుసా? రూపాయి. దాన్ని చేయడానికి ఖర్చయిన ముడి ఇనుము ఖరీదు పావలా కూడా ఉండదు. దాన్ని మేకుగా మార్చేసరికి దాని ఖరీదు నాలుగింతలైంది. ఆ ఇనుముతో మేకు బదులుగా ఇంజక్షన్ సిరంజ్ సూదులని చేస్తే అప్పుడు ఒక దాని ఖరీదు ఏభై రూపాయలకు పెరుగుతుంది. అదే ఇనుముని వాచ్‌లోని స్ప్రింగ్‌గా చేస్తే అప్పుడు దాని ఖరీదు మూడు వందల ఏభై రూపాయలు అవుతుంది. ఈ పెరుగుదల ఎందుకో తెలుసా? ఆ ఇనుము ఎక్కువసేపు అగ్నిలో ఉండి, బాగా సాగదీయబడి, తర్వాత సుత్తితో కొట్టబడి పాలిష్ చేయబడటంతో అది అత్యధిక ఉపయోగాన్ని ఇస్తుంది. ఇలాగే విద్యార్థి కూడా విద్యార్థి దశలో అధికంగా శ్రమపడి చదివితేనే పెద్దయ్యాక మంచి ఉద్యోగం చేయగలడు. ప్యూన్ ఉద్యోగం చేసేవాడు ఎయిత్‌క్లాస్ చదువుతాడు. అలాగే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేస్తే కానీ ఎవరూ సైంటిస్ట్ అయ్యే పై చదువులకు వెళ్లలేరు. కాబట్టి విద్యార్థి దశలోనే ఉత్సాహంగా శ్రమ పడటం నేర్చుకోవాలి. లేదా మేకులా విలువలేని వాడుగా ఉండిపోవాల్సి ఉంటుంది.’
శ్రమ విలువ తెలుసుకున్న సనంద్ ఆ తర్వాత ఎన్నడూ తక్కువ మార్కులు తెచ్చుకోలేదు. కష్టపడి చదవాలని అతనికి గోడకి ఉన్న మేక కనపడ్డప్పుడల్లా గుర్తుకు తేసాగింది.
*
మంటకు కాగితం మండదు
----------
చేసి చూద్దాం
------------
-సి.వి.సర్వేశ్వరశర్మ
ఒక కాగితం కప్పును తయారుచేసి అందులో నీరు పొయ్యాలి. ఇప్పుడు ఈ కాగితం కప్పును మంటపై ఉంచితే కాగితం మండదు. కాని కాగితపు కప్పులోని నీరు మరుగుతుంది. కాగితానికి అందుతున్న వేడిని దానిలోని నీరు వెంటనే గ్రహించి కాగితానికి వేడి మిగల్చకుండా చేస్తుంది. అందుకే కాగితం మంట వేడికి కాలిపోదు.
ఇప్పుడు మీకు ఇచ్చిన కాగితాన్ని మంటతో వెలిగించాలి. తమాషా ఏమిటంటే మంట మండుతుంది. కాని కాగితం కాలదు. ఇలా ఎందుకు జరిగిందని అనుమానం వస్తుంది. మీకు ఇచ్చిన కాగితం ఆల్కహాలులో ముంచి బయటకు తీసిన కాగితం.
ఈ కాగితాన్ని జాగత్తగా వెలిగించడం వలన దాని మీద వున్న ఆల్కహాలు ఆవిరి కాబడి అది మంటగా మండిపోతుంది. కాగితం కాలదు. ఎందుకంటే కాగితం మండేందుకు కావలసిన ఉష్ణోగ్రత కంటే ఆల్కహాలు మండేందుకు కావలసిన ఉష్ణోగ్రత బాగా తక్కువ.
ఈ ప్రయోగం మరొక విధంగా కూడా చేసిచూద్దాం. ఒక కార్డు బోర్డు ముక్క తీసుకోవాలి. దాని మీద కర్పూరం ఉంచాలి. ఇప్పుడు కర్పూరాన్ని వెలిగిస్తే అది పెద్ద మంటతో మండుతుంది కాని కార్డుబోర్డు మండదు. దీనికి కూడా కారణం వాటి జ్వలన ఉష్ణోగ్రతలలో తేడా ఉండడమే.