Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విఫలమైన లోక్‌సత్తా ప్రయోగం

$
0
0

ఐదు రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో అందరి దృష్టి ఢిల్లీపైనే ఉంది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ రాష్ట్రం ఎన్నికల ఫలితాల పట్ల అంతా ఆసక్తిగా చూస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం పురుడు పోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుండడమే దీనికి ప్రధాన కారణం. అవినీతికి వ్యతిరేకంగా జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఉద్యమించిన సమయంలో కెజ్రీవాల్ తెరపైకి వచ్చారు. అంతకు ముందు వివిధ ఉద్యమాల్లో ఆయన ఉన్నా జన్‌లోక్‌పాల్ ఉద్యమ సమయంలోనే ఎక్కువగా యువత దృష్టిని అకట్టుకున్నారు.
డెబ్బయ అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఐతే కాంగ్రెస్ లేదంటే బిజెపి, ఒకసారి నువ్వు మరోసారి నేను అన్నట్టుగా ఎన్నికలు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఢిల్లీ ఎన్నికలను మూడు ముక్కలాటగా మార్చేసింది. వివిధ సర్వేల్లో దాదాపుగా ఈ మూడు పార్టీలకు సమానంగా సీట్లు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఆమ్ ఆద్మీ అయితే కింగ్ మేకర్ లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడాది వయసు పార్టీ, దానికి నాయకత్వం వహిస్తున్న కెజ్రీవాల్ యువకుడే. ఒక ఉద్యోగి. ఢిల్లీ ప్రయోగం విజయవంతం అయితే ఆ ప్రభావం కచ్చితంగా దేశ వ్యాప్తంగా కనీసం మహానగరాల్లోనైనా కనిపిస్తుంది. ముఖ్యంగా మహానగరాల్లో కొత్త తరం రాజకీయాల్లోకి రావచ్చు.
ఒకప్పుడు మన రాష్ట్రంలో లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్‌పై యువతలో ఇలాంటి అభిప్రాయమే ఉండేది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎఎస్ అధికారిగా కీలక స్థానంలో ఉన్న జయప్రకాష్ నారాయణ్ బాబు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే లోక్‌సత్తా పేరుతో తొలుత ఒక సంస్థను స్థాపించి పాలనా సంస్కరణలపై పలు సదస్సులు నిర్వహించి తరువాత 2006లో రాజకీయ పార్టీగా మార్చారు. విద్యావంతులైన యువత, మధ్యతరగతి ముఖ్యంగా భాగ్యనగరంలో జయప్రకాశ్‌పై ఇలాంటి ఆశలే అప్పుడు కనిపించాయి. ఇంకా అప్పుడు నియోజక వర్గాల పునర్విభజన జరగలేదు.
చంద్రబాబుకు ఏ మీడియా, ఏ సామాజిక వర్గం మద్దతు ఇచ్చిందో, జెపికి అదే వర్గం మద్దతు పలికింది. చంద్రబాబు రాజకీయాల్లో విఫలం అయితే బాబుకు ప్రత్యామ్నాయంగా జెపిని ఆ వర్గం మీడియా ప్రోత్సహిస్తోంది అనే ప్రచారం లోక్‌సత్తా పార్టీ ఏర్పడినప్పుడు బలంగా జరిగింది. ఈ ప్రచారంలో నిజానిజాలు ఎలా ఉన్నా, లోక్‌సత్తాకు మాత్రం ఆ వర్గం నుంచి బ్రహ్మాండమైన ప్రచారం లభించింది. అదే ఢిల్లీలో చూస్తే ఆమ్ ఆద్మీకి ఏదో ఒక వర్గం మీడియా కాకుండా మొత్తం మీడియా నుంచి మద్దతు లభిస్తోంది. లోక్‌సత్తాకు ఆ వర్గం ప్రచారం చివరకు వారికే నష్టం కలిగించింది. ఐటి ఉద్యోగులు, విద్యావంతులు, మధ్యతరగతి వర్గాల మద్దతు సాధారణంగా టిడిపికి ఉంటుంది. టిడిపికి చెందిన వీరిలో కొంత మంది 2009లో హైదరాబాద్‌లో లోక్‌సత్తావైపు మొగ్గు చూపారు. దాంతో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్‌కు ప్రయోజనం కలిగింది. స్వల్ప మెజారిటీతో 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి హైదరాబాద్‌లోని సీట్లు దోహదం చేశాయి.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత విశే్లషించుకున్న టిడిపి కంగుతిని, లోక్‌సత్తాపై దాడి మొదలు పెట్టింది. చంద్రబాబుతో పాటు కింద స్థాయి నాయకుల వరకు తనపై విమర్శల దాడి మొదలు పెట్టడంతో జెపి ఉక్కిరి బిక్కిరయ్యారు. చివరకు లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ్ సైతం టిడిపికి చేరువయ్యారు.
తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం ప్రకటించగానే స్వాగతం పలుకుతూ తన అభిప్రాయం వెల్లడించిన జయప్రకాష్ నారాయణ్ ఆ తరువాత ప్లేటు ఫిరాయించారు. సమన్యాయం జరిగేంత వరకు విభజనపై ముందడుగు వేయవద్దని బాబు చెప్పినట్టుగానే జెపి చెబుతున్నారు. విభజన, సమైక్యంపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. కానీ సాంప్రదాయ పార్టీలు అని ఇంత కాలం ఇతర పార్టీలను విమర్శిస్తూ వచ్చిన జెపి ఇప్పుడు వాటినే ఆదర్శంగా తీసుకోవడం విశేషం.
లోక్‌సత్తా ఆవిర్భవించి ఏడేళ్లయిన సందర్భంగా జెపి మాట్లాడుతూ కూకట్‌పల్లిలో ప్రజలు లోక్‌సత్తాకు ఎందుకు ఓట్లు వేశారు, మిగిలిన ప్రాంతాల్లో ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. గెలిచిన చోట తమ చరిష్మా పని చేసిందని, ఓడిన చోట అభ్యర్థుల లోపం అని ఏ పార్టీ నాయకుడైనా చెప్పే మాటనే జెపి చెప్పారు.
నిజానికి కూకట్‌పల్లిలో గెలుపులో సైతం సాంప్రదాయ రాజకీయాలు పని చేశాయి. 2009లో టిఆర్‌ఎస్, టిడిపి పొత్తు పెట్టుకున్నాయి. కొత్తగా ఏర్పడిన కూకట్‌పల్లి నియోజక వర్గంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి స్థిరపడిన వారే ఎక్కువ. వీరిలో టిడిపికి అండగా నిలిచే సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉంది. అయితే ఈ నియోజక వర్గంలో టిడిపి పోటీ చేయకుండా టిఆర్‌ఎస్‌కు కేటాయించారు. సాంప్రదాయంగా టిడిపికి ఓటు వేసే ఈ వర్గం మొత్తం జెపికి అండగా నిలిచింది.
ఆ తరువాత మున్సిపాలిటీ వార్డులు సైతం లోక్‌సత్తా గెలుచుకోలేక పోయింది. రాష్ట్ర విభజన నిర్ణయం తరువాత మారిన పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంది. లోక్‌సత్తా వల్ల ఒకటి రెండు శాతం ఓట్లు కోల్పోవడం కన్నా ఒక సీటు ఇవ్వడం లాభసాటి బేరం అని టిడిపికి తెలుసు.
ఐఎఎస్ అధికారిగా ఎంతో పాలనానుభవం సైతం ఉన్న జెపి లోక్‌సత్తా ప్రయోగం రాష్ట్రంలో విఫలం అయినట్టే. అదే ఢిల్లీలో కెజ్రీవాల్ మాత్రం మధ్యతరగతిలో, యువతలో ఆశలు రేకెత్తిస్తున్నారు. కెజ్రీవాల్ అధికారంలోకి రాకపోవచ్చు కానీ కచ్చితంగా ఢిల్లీ అసెంబ్లీలో ప్రభావం చూపిస్తారు. ఏడేళ్ల ప్రస్థానంలో జెపి రాజకీయ నాయకునిగా సామాన్యులకు చేరువ కాలేకపోయారు. ఒక వర్గం మద్దతు పొందిన జెపి చివరకు ఏడేళ్ల ప్రస్థానంలో ఆ వర్గం మద్దతు సైతం కోల్పోయారు.

సబ్ ఫీచర్
english title: 
lok satta
author: 
- బుద్దా మురళి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>