భారతదేశానికి ప్రధానమంత్రే అవసరం లేదని మన్మోహన్‌సింగ్ రుజువు చేశారు. అంతర్జాలంలోని సామాజిక అనుసంధాన వేదికలపై విస్తృత ప్రచారంలో ఉన్న వ్యాఖ్య ఇది. విశ్వాసం, విధేయతల్ని రంగరించి పోతపోసిన వ్యక్తిగా మన్మోహన్‌సింగ్ సోనియా కుటుంబం పట్ల ఎంతటి భక్తిప్రపత్తులను కలిగి ఉన్నా నిరభ్యంతరమే కానీ, ఈ దేశానికి తాను ప్రధానినని, ఆ పదవికి సమున్నత గౌరవం ఉందన్న సంగతినే విస్మరించడం అత్యంత శోచనీయం. నేరాభియోగాలు రుజువైన ప్రజాప్రతినిధుల్ని కాపాడేందుకు అత్యవసర ఆదేశం జారీ వ్యవహారమంతా రాహుల్‌గాంధీకి తెలియంది కాదు. రాష్టప్రతి ఈ విషయమై అభ్యంతరం వ్యక్తీకరించడంతో రాహుల్ ఆర్డినెన్స్‌ను చెత్త కాగితంతో పోల్చి, దాన్ని చించి పారేయాలని వీధి నాటకాన్ని రక్తికట్టించారు. ముఖ్యమంత్రి అంజయ్యను పర్యటనకు వచ్చిన రాజీవ్ ఎలా అవమానించారో తెలియనిదెవరికి? తమ మాటలకు సై అనే అంధ విధేయుల్ని అందలమెక్కించి, వారిపై స్వారీచేసి, తమ అతిశయాన్ని ప్రదర్శించడం మన ప్రజాస్వామ్యంలో ఉన్న ఘోర నియంతృత్వం. పదవీ గౌరవమే కాదు, వ్యక్తిగత ప్రతిష్ఠ, నైతిక ధృతి మచ్చుకు కూడా కానరాని మన్మోహన్‌సింగ్‌లాంటి నేతలున్నంతకాలం రాహుల్ వంటి పోకడలకు కొదవెందుకుంటుంది!
- పట్టెం వెంకట నాగేశ్వరరావు, చెరుకుపల్లి
సమస్యలు పరిష్కరించండి
అన్నదమ్ములు విడిపోయేటప్పుడు, ఇద్దరికి యిల్లు, భూములు, ఇతర ఆస్తులు సక్రమ పంపకం జరిగితేనే విడిపోతారు. రాష్ట్ర విషయంలో ఇంత తొందరగా అధిష్ఠానం నాలుగుగోడల మధ్య పరిష్కారంచేస్తే సరిపోదు. సీమాంధ్రలో పరిస్థితులు చూసి ఆమోదయోగ్యమైన పద్ధతిలో విడిపోవాలి. అసలు విడిపోవడమే అసందర్భం. సమైక్యంగా ఉండటం అందరికి మంచిది. కొందరు వ్యక్తులు ఆశలవల్ల విభజన సమస్య వచ్చింది. విభజనవల్ల లాభాలేమిటో అధిష్టానం గాని, దాన్ని కోరే వ్యక్తులు గాని వివరించాలి. ముందు వరదలు, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలు రెండు ప్రాంతాలను పీడిస్తున్నాయి. వాటిని పరిష్కరించి వరద బాధితులను, రైతులను ఆదుకొని, తరవాత రాష్ట్ర విభజన విషయంలో ఆలోచిస్తే మంచిది. అన్ని పార్టీల నాయకులు ప్రజలపై ప్రేమ ఉంటే ఈ సమస్యలపై దృష్టిసారిస్తే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే కోపాగ్నికి బలి అవుతారు.
- ఈశ్వర్, ప్రొద్దుటూరు