ఇటీవల మధ్య ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాన్ని తాకిన సూపర్ టైఫూన్ ‘హైయాన్’ కనీవినీ ఎరుగని నష్టాన్ని కలుగజేయడమే కాదు, వేలాది మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంది కూడా! ప్రకృతి విలయానికి తల్లడిల్లిపోయిన ఫిలిప్పీన్స్ దుస్థితిని గమనించిన అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి, పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అదించింది. ఫిలిప్పీన్స్‌కు సుదూర తీరాల్లో ఉన్న దేశాలు కూడా మానవతా దృక్పథంతో తక్షణమే స్పందించినప్పటికీ, పక్కనే ఉన్న చైనా ఏమాత్రం పట్టించుకోకపోవడం విచిత్రం. కేవలం లక్ష డాలర్ల ఆర్థిక సహాయాన్ని మాత్రం అందించి మిన్నకుండిపోయింది. హైయాన్ టైఫూన్ మిగిల్చిన పెనువిషాదంతో పోలిస్తే, పొరుగునే ఉన్న అతిపెద్దదేశం అందించాల్సిన సహాయం కాదిది. చైనా వైఖరిపట్ల ప్రపంచ దేశాలనుంచి తీవ్రస్థాయి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ సహాయాన్ని 1.64 మిలియన్ డాలర్లకు పెంచి చేతులు దులుపుకుంది. ఇది కూడా ఈ ప్రాంతంలోని దేశాలు అందించిన సహాయంతో పోలిస్తే, సముద్రంలో ఒక నీటిబిందువు వంటిది మాత్రమే నంటే అతిశయోక్తి లేదు. జపాన్ పదిమిలియన్ డాలర్ల సహాయం అందించగా, దక్షిణ కొరియా ఐదుమిలియన్ డాలర్లు, ఇండొనేసియా రెండు మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించాయి. ఇక ఆస్ట్రేలియా ఏకంగా 28 మిలియన్ డాలర్లు అందించింది. భౌగోళికంగా ఫిలిప్పీన్స్‌కు చాలా దూరంలో ఉన్న దేశాలు కూడా పెద్ద మొత్తంలో సహాయక ప్యాకేజీలు ప్రకటించాయి. బ్రిటన్ 32 మిలియన్ డాలర్లు, యూరోపియన్ కమిషన్ 11 మిలియన్ డాలర్లు సహాయం ప్రకటించాయి. ఫిలిప్పీన్స్‌కు వ్యూహాత్మక భాగస్వామిగా వ్యహరిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా 10 మిలియన్ డాలర్ల సహాయం అందించింది. ఫిలిప్పీన్స్ దగ్గరలో లేకున్నా భారత్ పెద్దమొత్తంలో సహాయక సామగ్రి, సహాయక సిబ్బందిని, తుపాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న టక్లోబాన్‌కు పంపింది. ఇక చివరిగా అమెరికా కూడా 20 మిలియన్ డాలర్లు ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చింది.
ప్రకృతి విపత్తుకు తీవ్రంగా విలవిలలాడుతున్న ఫిలిప్పీన్స్‌కు సహాయం చేయడానికి ప్రపంచ దేశాలనుంచి ఉదారంగా అంత పెద్ద మొత్తంలో సహాయం అందుతుండగా, పొరుగునే ఉన్న చైనా అంటీముట్టకుండా నలుగురిలో వేలెత్తి చూపించుకునే మాదిరిగా వ్యవహరించడంలో అర్థమేంటి? చైనాకు హృదయం లేదా? తన సరిహద్దున ఉన్న అతిచిన్న దేశమైన ఫిలిప్పీన్స్ పట్ల ఆవిధంగా బాధ్యతారాహిత్యంతో చైనా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? అసలు చైనా నియంత్రణలో ఆసియా...ప్రపంచ క్రమంలో ఏవిధమైన అనుభవాలను పొందబోతున్నది? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం లేకున్నా, క్రమంగా బలీయమైన శక్తిగా రూపొందుతున్న చైనా తాను వ్యతిరేకించే దేశాలపట్ల ఎంతటి తీవ్రమైన వైఖరి అనుసరిస్తుందో...అనుసరించబోతున్నదో తెలియజెప్పేందుకు ఫిలిప్పీన్స్ ఉదంతం ఒక దృష్టాంతంగా మిగిలిపోతున్నది.
ఫిలిప్పీన్స్ విషయంలో రవ్వంత మానవతా దృక్పధాన్ని కూడా ప్రదర్శించని చైనా..గతంలో ఆసియా ప్రాంతంలో పెను విపత్తులు సంభవించినప్పుడు సహాయం అందించడంలో అందిరికంటే ఎంతోముందుండేది. ఆర్థిక సహాయం అందించడంలో ఏమాత్రం వెనుకాడేది కాదు. అందువల్ల సహాయం అందించకపోవడమనేది చైనా సహజ స్వభావం కాదని స్పష్టమవుతోంది. కానీ ఫిలిప్పీన్స్ విషయంలోనే ఎందుకీ వివక్ష? దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలను హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ అతలాకుతలం చేసినప్పుడు, చైనా పెద్ద మొత్తంలో 40 మిలియన్ డాలర్ల మేర సహాయం అందించి, విపత్తు ధాటికి విలవిలలాడుతున్న దేశాలకు ఆపత్సమయంలో నేనున్నానన్న భరోసా ఇచ్చింది. అదేవిధంగా 2005లో భూకంపం కారణంగా పాకిస్తాన్ తీవ్ర కష్ట నష్టాలకు గురైనప్పుడు, చైనా 20 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అదించింది. దీనే్న సగర్వంగా ప్రకటించింది కూడా. అంతేకాదు 2011లో సంభవించిన సునామీ, భూకంపం కారణంగా జపాన్ కోలుకోలేనంతటి నష్టానికి గురైంది. జపాన్‌ను తన చారిత్రక శత్రువుగా చైనా పరిగణిస్తుంది. అటువంటి జపాన్‌కు కూడా 10 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది!
ఇక అసలు విషయానికి వస్తే...దక్షిణ చైనా సముద్రంలోని చిన్న ద్వీపంపై, చైనా-్ఫలిప్పీన్స్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చైనా విధానకర్తలకు ఫిలిప్పీన్స్‌పై క్రమంగా ద్వేషభావం ఏర్పడి స్థిరపడిపోయింది. అదీకాకుండా దక్షిణాసియా దేశాలపట్ల చైనా అనుసరిస్తున్న దూకుడు వ్యవహారశైలిని ఫిలిప్పీన్స్ ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. ఇక వియత్నాంకు కూడా స్పార్ట్లే ద్వీపాల విషయంలో చైనాతో వివాదం కొనసాగుతోంది. కానీ అంతటి వివాదం ఉన్నప్పటికీ ఫిలిప్పీన్స్ మాదిరిగా అంతర్జాతీయ వేదికలపైకి ఈ సమస్యను తీసుకెళ్ళే స్థాయికి వియత్నాం వెళ్ళలేదు. మరి అదే ఫిలిప్పీన్స్, ఐక్యరాజ్య సమితి కనె్వన్షన్ కింద అంతర్జాతీయ ట్రిబ్యునల్‌లో, చైనాకు వ్యతిరేకంగా ఫిర్యాదు దాఖలు చేసింది. సహజంగానే ఇది చైనాకు ఇబ్బంది కలిగించే పరిణామం. తాను అంతర్జాతీయ చట్టాలకు లోబడే వ్యవహరిస్తున్నానని, వాటిని గౌరవిస్తున్నానంటూ చైనా పైకి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ, తన ప్రయోజనాలు ముడిపడివున్న అంశాల్లో మాత్రం వాటిని ఏమాత్రం ఖాతరు చేయదు.
అతిచిన్న దేశమైన ఫిలిప్పీన్స్‌పై చైనా అనుసరిస్తున్న బెదిరింపు వ్యవహార శైలిని ‘క్యాబేజ్ స్ట్రాటిజీ’ (క్యాబేజీ వ్యూహం),గా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి మేజర్ జనరల్ ఝాంగ్ ఝావోఝాంగ్ అభివర్ణించారు. క్యాబేజీ చుట్టూ ఉండే పొరలను ఒక్కటొక్కటిగా తొలగించిన మాదిరిగా ఫిలిప్పీన్స్‌తో వివాదం కొనసాగుతున్న ద్వీపాలను చైనా తన యుద్ధ నౌకలు, నిఘా పరికరాలు, మత్స్యకారుల బోట్ల సహాయంతో చట్టుముడుతూ క్రమంగా వాటిని స్వాధీనం చేసుకోవడానికి ముందుకెళ్ళడమే ఈ వ్యూహం.
2012లో స్కార్‌బోరోగ్ షోల్‌ను ఆక్రమించుకున్న చైనా అక్కడ అడ్డుకట్టలను నిర్మించి, ఫిలిపినో పడవలను,నౌకలను అక్కడకు రాకుండా అడ్డుకుంటోంది. ఆవిధంగా చైనా తన క్యాబేజీ వ్యూహాన్ని రుచిచూపిస్తోంది. దీన్నిబట్టి చూస్తే చైనా అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తుందని, మంచి పొరుగు దేశంగా కొనసాగుతుందన్న ఆశలను వమ్ము చేసింది. చైనా అనుసరిస్తున్న ‘‘చిన్న పనుల ద్వారా ఇబ్బందులకు లోను చేసే’’ యుక్తులు, ఆగ్నేయాసియా దేశాల్లో ఆందోళనకు కారణభూతమవుతున్నాయి. అంతేకాదు దాని వివక్షాపూరిత వైఖరి, హైయాన్ సూపర్ టైఫూన్ బాధితులకు సహాయం చేయడాన్ని రాజకీయం చేయడం, వంటివి పరిశీలిస్తే చైనా విదేశాంగ విధానాన్ని అనుమానించాల్సి వస్తున్నది. ఎందుకంటే గత సెప్టెంబర్‌లో తనకు సన్నిహిత దేశమైన పాకిస్తాన్‌లో భూకంపం సంభవించి ఐదువందల మంది మరణించినప్పుడు, ఐదుమిలియన్ డాలర్ల విలువైన సరఫరాలను ఆ దేశానికి చేరవేసింది. మరి పాక్‌లో సంభవించిన విపత్తు, నేటి ఫిలిప్పైన్స్ ఎదుర్కొంటున్న పెను విషాదంతో పోలిస్తే చాలా తక్కువ!
చైనా అనుసరిస్తున్న విధానాలపై పూర్తి అవగాహన కలిగిన జోషువా కుర్లాన్‌ట్జిక్ అభిప్రాయం ప్రకారం...‘‘1990 దశకం, 2000 తొలినాళ్ళ కాలంలో చైనా అనుసరించిన విధానానికి, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి చాలా తేడా ఉంది. ముఖ్యంగా దారుణమైన విపత్తుకు అతలాకుతలమై, ఆపన్నహస్తంకోసం ఎదురుచూస్తున్న ఫిలిప్పీన్స్ పట్ల అది అనుసరించిన వ్యవహారశైలి దీన్ని మరింతగా స్పష్టం చేసింది. అప్పట్లో ఆగ్నేయాసియా దేశాల పట్ల ఉదార వైఖరితో వ్యవహరిస్తూ, విభేదాలను కనీసస్థాయికి తగ్గించేందుకు కృషి చేసేది. కానీ నేడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నం.’’ ఇటీవల చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్, ఇరుకుపొరుగు దేశాలనుంచి స్నేహ సహకారాలను కోరుతున్నామంటూ ప్రకటించారు. పొరుగు దేశాలతో మంచి సంబంధాల వాతావరణం నెలకొనేలా కృషి చేయాలని తమ దేశ ఉన్నతస్థాయి దౌత్యవేత్తలను నెల రోజుల క్రితం ఆయన ఆదేశించారు. అంటే ఆయన ఉద్దేశం..పొరుగు దేశాలతో మూడు కొలతలతో కూడి, బహుళ అంశాల దృక్కోణంతో, ప్రదేశానికి, కాలానికీ అతీతమైన వ్యవహారశైలి కొనసాగించాలనా?
ఆపదలో చిక్కుకున్న ఫిలిప్పీన్స్‌కు సహాయం చేయకుండా..మానవతా కోణంలో చైనా సహాయం అందించే అవకాశాన్ని కోల్పోయింది. కేవలం తన జాతీయవాదం ముసుగులో, పొరుగు దేశాన్ని ఎప్పటికప్పుడు పెద్ద భూతంగా ప్రచారం చేస్తూ వచ్చిన చైనా, ఇప్పుడు ప్రాంతీయ నాయకత్వ లక్షణాన్ని కోల్పోయింది. ముఖ్యంగా తీవ్ర సంక్షోభంలో మునిగిపోయి ఉన్న తరుణంలో! ఆగ్నేయాసియా దేశాల్లో వౌలిక సదుపాయాలను, నిర్మాణ పనులు, వనరులను వెలికి తీయడం వంటి కార్యకలాపాలను, చైనా కేవలం తనకు లాభదాయకంగా ఉన్నప్పుడు మాత్రమే చేపడుతుంది. అంటే చైనా కేవలం స్వలాభాపేక్షకు, ఇతర దేశాలను దోపిడీ చేయడానికి మాత్రమే ముందుకు వస్తుంది. ఎప్పుడైతే చేసిన పనికి ప్రత్యక్ష లేదా పరోక్షంగా లాభం లేనప్పుడు, లేక ఫిలిప్పైన్స్ మాదిరిగా రాజకీయంగా విభేదించే దేశమైనప్పుడు చైనా వైఖరి పూర్తిగా నిర్లక్ష్యంతో కూడి ఉంటుంది.
ప్రస్తుతం చైనా ప్రభుత్వ అనుకూల మీడియా ప్రచారం విచిత్రంగా ఉంది. ఫిలిప్పీన్స్‌లో హైయాన్ సూపర్ టైఫూన్ కలిగించిన విధ్వంసాన్ని అవకాశంగా తీసుకొని, జపాన్-అమెరికాలు తమ సైన్యాలను చిన్నగా ఆ దేశంలోకి ప్రవేశపెడతాయని, ఆవిధంగా అమెరికా అనుసరించబోయే ఆసియా ‘‘కేంద్ర’’ విధానానికి శ్రీకారం చుట్టడం మొదలవుతుందంటూ ప్రచారం సాగిస్తున్నాయి. మానవతా దృక్పథంతో ఫిలిప్పీన్స్‌కు అందించే సహాయం వెనుక ఆ దేశాల ప్రధాన ఉద్దేశం అదేనంటూ చైనా మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురిస్తున్నాయి. కానీ చైనా అనుసరించే విధానం ఇదేనన్నది మాత్రం సుస్పష్టం.
హైయాన్ టైఫూన్ తర్వాత, చైనా కేవలం అధిపత్య రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తుందని, మానవతాపరంగా దాన్ని ఏమాత్రం నమ్మడానికి వీల్లేదన్న సత్యం సుస్పష్టమైంది. మరి అటువంటప్పుడు, ముల్లులా బాధిస్తూ, ఎల్లవేళలా హానిచేయాలన్న మనస్తత్వాన్ని కలిగివుండి, ఆధిపత్యపే పరమావధిగా పనిచేసే చైనాను...ఆసియా ఎందుకు ఆమోదించాలి?
ఫీచర్
english title:
china policies
Date:
Friday, November 29, 2013