రాష్ట్ర విభజన వివాద ప్రకంపనలకు చలించకుండా రాష్టర్రాజధానిలో జీవ వైవిధ్య ప్రాంగణాలు-బయో డైవర్సిటీ పార్క్స్-ఏర్పాటు కావడం, కీకారణ్యాలలోని వృక్షాలు వీటిల్లో పెరగడం ప్రముఖంగా ప్రచారమవుతున్న మహా విషయం! క్రికెట్ ఆట స్థలం ఏర్పాటు చేయడానికై తిరుమల ఆనుకుని ఉన్న ముప్పయి ఎకరాలలోని వేలాది చెట్ల నరికి వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొడవళ్లు, గొడ్డళ్లు నూరుతుండడం పెద్దగా ప్రచారానికి నోచుకోని వ్యవహారం! జాతీయ హరిత పరిరక్షణ వ్యవహారాల న్యాయమండలి-నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్-కి చెందిన మదరాసులోని రక్షణ క్షేత్ర ధర్మాసనం వారు తమంత తాముగా పరిగణించి ఈ చెట్ల నరికే కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం పచ్చదనానికి ఊరట కలిగిస్తున్న పరిణామం! ఒకవైపున అడవులను ధ్వంసం చేయడం మరో వైపున నగరాలలో ‘పార్క్’లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం-ఈ విధానం వల్ల ప్రభుత్వం హరిత సమతుల్య స్థితిని రక్షిస్తోందన్న భ్రాంతి కలగడానికి గొప్ప అవకాశం ఉంది. జంట మహానగరాల పరిధిలో పదమూడు జీవ వైవిధ్య ప్రాంగణాలు ఏర్పడిపోతున్నట్టు తెలుసుకున్నవారు ‘‘అబ్బో ఎంతటి విశాలమైన వనాలో’’ అని ఆశ్చర్యపోవచ్చు! కానీ ధ్వంసవౌతున్న వనాలతో పోల్చినప్పుడు ఈ వైవిధ్య ప్రాంగణాల విస్తీర్ణం ‘మరుగుజ్జు’లో శత సహస్రాంశం!! జంటనగరాలలో అతి పురాతన జీవజాల పరిరక్షణ ప్రాంగణం కూడ ఒకటి ఏర్పడుతోందట! ఈ ‘అతి ప్రాచీన’-జురాస్సిక్-పార్క్‌లో పదిహేను కోట్ల ఏళ్ల క్రితం జీవించిన ‘రాక్షసి బల్లులు’, ‘పిశాచి పిల్లులు’వంటి మహా కాయ జీవుల-డైనోసార్స్-ను ప్రదర్శిస్తారట! అవి ఇప్పుడు ప్రాణంతో లేవు కనుక వాటి నమూనాల ఊహా శిల్పాలను ఏర్పాటు చేస్తారు కాబోలు! ఇటువంటి ఊహాశిల్పాలు ఇదివరకే ‘జంతు వృక్ష మహా ప్రాంగణాలలో ఉన్నాయి కదా! మళ్లీ ఎందుకంటే ఇరవై ఐదు జాతుల అతి ప్రాచీన మహా కాయ జీవుల ఊహా విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేయడానికి...ఈ నమూనాల మధ్యలో వివిధ రకాల మొక్కలను కూడ పెంచుతారట!! ఇలా ‘జురాస్సిక్’-ఇరవై ఒక్క కోట్ల సంవత్సరాల గతానికీ, పదునాలుగు కోట్ల సంవత్సరాల గతానికీ మధ్యకాలం నాటి జీవజాలం-ప్రదర్శన ప్రాంగణం ఏర్పడడం కూడ భాగ్యనగర పచ్చదనాన్ని పెంచడానికి దోహదం చేస్తుందట! ఈ ప్రదర్శన ప్రాంగణంలోను, పదమూడు జీవ వైవిధ్య ప్రాంగణాలలోను నల్లమల, తిరుమల వంటి అడవులనుంచి సేకరించి తెచ్చిన అనేక రకాల మొక్కలను చెట్లను పెంచుతారట! ఆ అడవులు, ఈ ‘డైనోసార్స్’ వలె నశించిపోయినప్పటికీ ఈ నగర జీవ వైవిధ్య వనాలలో వాటి ‘నమూనా’లుంటాయి!
రాష్ట్ర రాజధాని నగరంలోను ఇతర నగరాలలోను ‘సతత’హరిత వాటికలను ఏర్పాటు చేయడానికి అధికార ఆర్భాటం జరుగుతున్న సమయంలోనే సహజ హరిత క్షేత్రాలను నిర్మూలిస్తుండడం ‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్- సృష్టిస్తున్న వైపరీత్యం! మన రాష్ట్రంలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల వారు కృత్రిమ ప్రగతిని సాధించడానికి వీలుగా సహజ ప్రాకృతిక సౌందర్య సంపదను పాడుపెడుతున్నారు, మాతృభూమి కోమల శ్యామల చేలాన్ని ఛిద్రం చేస్తున్నారు! లక్షల కోట్ల రూపాయల విలువైన అటవీ వృక్ష సంపదను, పారిశ్రామిక ప్రగతి బట్టీలను ఏర్పాటు చేయడం కోసం, కృతిక నాగరిక విలాస విన్యాసాల కోసం, ధ్వంసం చేస్తున్న దొరతనం వారు వందల కోట్ల రూపాయలను వెచ్చించి ‘కాంక్రీట్’ కట్టడాల మధ్య చిట్టి చిట్టి వనాలను ఏర్పాటు చేస్తారట! ‘ప్రత్యేక ఆర్థిక మండలాల’ పేరుతో తమలపాకుల తోటలను కొబ్బరి చెట్లను వేప చెట్లను మర్రి వృక్షాలను తెగ నరుకుతున్న భీకర దృశ్యాలను మరిపించడానికై నగరాలలో ఇలా ‘పార్కు’లను, జీవ వైవిధ్య క్షేత్రాలను ఏర్పాటు చేసి ప్రజలను మరిపిస్తున్నారు.! వందల గజాలు ‘హరిత ప్రాంతాలు’ తాత్కాలికంగా ఏర్పడుతున్నాయి. వేల ఎకరాల సహజ వనాలు కూలిపోతున్నాయి!! ఇదంతా జరిగిపోతుండడానికి ఏకైక కారణం మన ప్రభుత్వం, మన నెత్తిన రుద్దిన ‘వాణిజ్య ప్రపంచీకరణ’! అడవులను పరిరక్షించే నెపంతో అభ్యుదయాన్ని అడ్డుకోరాదన్న మన ప్రధాని మన్‌మోహన్‌సింగ్ పదేపదే చెబుతున్న మాట! ‘హరిత నియమాల’-గ్రీన్ రెగ్యులేషన్స్-ను అతిగా అమలు జరపరాదన్నది 2011 ఫిబ్రవరి మూడవ తేదీన మన్‌మోహన్‌సింగ్ చేసిన చారిత్రక ప్రకటన..అడవులను వ్యవసాయ భూములను ధ్వంసం చేయరాదన్న సంప్రదాయంపై ఈ మహాభిప్రాయం వాణిజ్య ప్రపంచీకరణ సంధించిన గొడ్డలి!! మనదేశంలో ‘ప్రపంచీకరణ’ను వ్యవస్థీకరించిన సిద్ధాంత కర్తలలో మన ప్రధాని ప్రధముడు...
ఉత్తరఖండ్ వంటి చోట్ల తుపానులు, జల ప్రలయాలు, ఘోర ప్రాణ నష్టాలు జరిగిపోవడానికి పర్యావరణం పాడయిపోవడం కారణమన్న వాస్తవం ఇప్పుడు జగత్ ప్రసిద్ధం!! కానీ గత నెలలో ‘్ఫలిన్’ ప్రలయం ఒరిస్సాలో సృష్టించిన బీభత్సానికి కారణం ‘వాణిజ్య ప్రపంచీకరణ’ అన్న విషయం చాలామందికి తెలీదు. ‘పోస్కో’ అన్న విదేశీయ బహుళ జాతీ య వాణిజ్య సంస్థ వారి పారిశ్రామిక ప్రాంగణం ఏర్పాటు కోసం ఒరిస్సా ప్రభుత్వం వేలాది ఎకరాల అడవులను వ్యవసాయ క్షేత్రాలను ధ్వంసం చేయించింది. జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో ఒకేచోట ఉక్కు ఫ్యాక్టరీని, ఇనుప ఖనిజం తవ్వకాలను, నౌకాకేంద్రాన్ని ఏర్పాటు చేయతలపెట్టిన ‘పోస్కో’ వారి కోసం ఇప్పటివరకు లక్షా డెబ్బయివేల పెద్ద పెద్ద చెట్లను నరికి పారేశారట! ఇది కాక రెండువేలఏడువందల ఎకరాలలోని తమలపాకుల తోటలను-పచ్చనాకులను-్ధ్వంసం చేసేసారు. ఫలితంగా తుపాను తాకిడి నిరోధించే ‘ప్రాకృతిక రక్షణ కవచం’ ధ్వంసమైపోయి అనేక గ్రామాలు ‘్ఫలిన్’ బీభత్స వర్ష ‘జ్వాలల’కు ఆహుతైపోయాయి!! పర్యావరణానికి ప్రధమ శత్రువు, పచ్చదనానికి ప్రబల శత్రువు వాణిజ్య ప్రపంచీకరణ! అయినప్పటికీ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఆర్థిక మండలాల కోసం పచ్చదనాన్ని పాడుచేస్తునే ఉన్నాయని!!
తిరుపతి సమీపంలో ‘అంతర్జాతీయ క్రికెట్ క్రీడా ప్రాంగణం’ నిర్మించడం కోసం బీడు భూములను ప్రభుత్వం కేటాయించవచ్చు! కానీ తిరుమల తిరుపతి దేవస్థానములవారు దశాబ్దుల తరబడి పెంచి పోషించిన అభయారణ్యాన్ని ధ్వంసం చేయాలన్న ఆకాంక్ష ఏలుతున్నవారి ఎదలో ఎందుకు అంకురించిందన్నది అంతుపట్టని వ్యవహారం!! అలిపిరి సమీపంలోని ఈ అరణ్యం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంగణానికి ఆనుకుని ఉందట! ఈ ముప్పయి ఎకరాల అడవిలో నాలుగు లక్షల మహావృక్షాలు బతుకుతున్నాయట! వీటిలో అంతరించిపోతున్న రక్తచందన-ఎర్రగంథం-వృక్షాలు కూడా ఉన్నాయట!! ఇన్ని చెట్లను నరికి వేసి అక్కడ ‘స్టేడియం’ నిర్మించి తీరాలనుకోవడం ప్రపంచీకరణ మాయలో భాగం! ‘న్యాయమండలి’ నిరోధించిన తరువాతనైనా రాష్ట్ర ప్రభుత్వం ‘మాయ’ మత్తునుండి బయటపడాలి! లక్షలాది వృక్షాలను హత్య చేయడం మానాలి..
సంపాదకీయం
english title:
editorial
Date:
Friday, November 29, 2013