పాత ‘మల్లీశ్వరి’ సినిమాలో ‘అయినా ఒకరి సంగతి నాకెందుకులేమ్మా? ఎవరెట్టా పోతే నాకేం?’ అంటూ మూతి ముడుచుకొనే ముసలావిడ గుర్తుందా? తాజాగా ఈ కొత్త ‘మల్లీశ్వరి’ కూడా అదే మాట అంటోంది. ‘ఎవరెట్టా పోతే నాకేం?’ అంటూ. ఇంతకీ విషయం ఏమిటంటే- మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ - ‘బిగ్‌బాస్-7’ ఎల్లీ అవ్రం ‘అతి’ సన్నిహితంగా ఉంటున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజానిజాలెంతో తెలీదుగానీ.. ఆ మాట ‘కత్రినా’ని అడిగితే మాత్రం ఇలా సమాధానం చెబుతోంది. సన్నీ డియోల్ రాబోయే చిత్రం ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ ప్రమోషన్‌లో భాగంగా ఊరూ వాడా తిరిగేస్తోంటే.. అక్కడక్కడ సన్నీ ఈ ప్రస్తావన తెచ్చాట్ట. అతడే తెచ్చాడో? ఇంటర్వ్యూలో అడిగారో మరి. ‘బిగ్‌బాస్-7’ చూసేంత తీరుబడి ఎక్కడిది? ఆ షోనే చూడనప్పుడు - మీరు చెప్పిన ‘ఎల్లీ’ సరసన నాకెలా తెలుస్తుంది. ఇక న్యూస్ పేపర్లంటారా? చదవను. రూమర్స్ అంటే నాకాట్టే ఇష్టం ఉండదు’ అంటోంది. ఇంతవరకూ బానే ఉంది. ‘ఎవరెట్టా పోతే మనకెందుకు?’ ఇక్కడే అసలు తిరకాసు ఉంది. త్వరలోనే సల్మాన్ ఖాన్ ‘మిస్’ అవ్రంని కథానాయికను చేయనున్నాట్ట. అదీ కొసమెరుపు. మరి ఇండస్ట్రీలోకి ఎంటరవుతున్నప్పుడైనా.. తెలియాలి కదా.
గిట్టుబాటు కావటంలేదు?
కంగనా రనౌత్ పరిశ్రమ మీద విరుచుకు పడుతోంది. అదేమంటే - సమన్యాయం పాటించటం లేదట. షరతులతో కూడిన భిన్నాభిప్రాయాల్ని సైతం వెలిబుచ్చింది. ‘ముద్దు సీన్లలో నటించాలి. కౌగిలింతల్లో మునిగి తేలాలి. వర్షంలో తడిసి ముద్దవ్వాలి. లవ్ సీన్లలో ‘ఇన్‌వాల్వ్’ అయిపోవాలి. ఇక - విలన్ కిడ్నాప్ చేస్తే కన్నీళ్లు పెట్టుకోవాలి. ఇంతాచేస్తే- రెమ్యునరేషన్ విషయానికి వచ్చేప్పటికి - ఎప్పుడూ ‘సెకండ్ థాట్’ వస్తూనే ఉంటుంది. హీరోయిన్లకి అంత ఇవ్వాలా? అని ప్రశ్నిస్తారు. ఇదేం న్యాయం? ఉదాహరణకి - ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ తీసుకుందాం. ఆ సినిమా షారూఖ్ ఖాన్ వల్లనే ఆడిందా? దీపికా పదుకొనె వల్లనే కదా?! ఏ హీరోని కదిలించండి. 30-40 కోట్ల మధ్యనే. అదే హీరోయిన్ సంగతికొస్తే- భారీ బడ్జెట్ సినిమా అయితే 8 కోట్లు ఇవ్వటానికి మొహమాట పడుతూంటారు’ అంటూ సణుగుతోంది. నిజమే సుమా! ఆ విషయం గురించి ఇంతవరకూ ఎవరూ ఆలోచించలేదు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఏదీ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఈ హిమాచల్ అమ్మాయి ‘గ్యాంగ్‌స్టర్ - ఎ లవ్ స్టోరీ’ ‘వో లమ్హే’ ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’ చిత్రాల్తో తనకంటూ ఇమేజ్‌ని తెచ్చుకొంది. తాజాగా ‘రజ్జో’ చిత్రం చేసింది. ‘ప్రొఫెషన్’ అన్న తర్వాత - మనకున్న పరిధిలో నటించాల్సిందే. కెరీర్‌ని ఏ విధంగా మలచుకొంటే- బావుంటుందన్నది ఎవరి ఆలోచనలు వారివి అంటూ ముక్తాయింపు పలికింది. కాబట్టి- ఇకనైనా - కాస్తంత ‘కష్టాన్ని’ చూసి మద్దతు ధర ప్రకటించకపోతే మరిన్ని విసుర్లు వినాల్సి వస్తుందేమో?!