తే.గీ. జలములందు మత్స్యంబులు చదలఁ బక్షు
లామిషం బెట్లు భక్షించు నట్లు దివిరి
యెల్లవారును జేరి యనేక విధుల
ననుదినంబును భక్షింతు రర్థవంతు
సందర్భం - పాండవులు ద్యూతపరాజితులై అరణ్యవాసం చేస్తున్నారు. ధర్మరాజు తానే సర్వగతి అని తన వెంటబడి వచ్చిన విప్రులకు తగిన భోజనాదులు సమకూర్చ లేకపోతున్నానని పరమదుఃఖం అనుభవిస్తున్నాడు. అప్పుడతనికి ఊరడింపు కలిగిస్తూ శౌనకుడనే మహర్షి జనకగీతలనే శ్లోకార్థాలను వినిపించాడు. అందులోనిది ఈ పద్యం.
తాత్పర్యము - నీటిలోని చేపలు, ఆకాశంలో పక్షులూ వెదకి వెదకి ఏవిధంగా మాంసాన్ని తింటాయో అదే విధంగా పట్టుదలతో అందరూ చుట్టూ మూగి పెక్కు విధాలుగా ధనవంతుని తింటూ ఉంటారు. కొందరు తమ తమ పబ్బం గడపుకోవడం కోసం ఏదో ఒకటి చెబుతుంటారు. దానం తీసుకోవటం వల్ల వారిలో బద్ధకం, సోమరితనం పెరిగి ఇలా హాయగా జీవితాన్ని గడిపేస్తే పోతుందన్న భావనకు లొంగి ఇలా ప్రవర్తిస్తుంటారు. వీరిని దూరంగా పెట్టాలి.
మహాభారతములోని పద్యమిది ( కూర్పు శలాక రఘునాథశర్మ ) నిర్వహణ: శ్రీపావని సేవా సమితి, హైదరాబాద్