రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ‘ప్రొరోగ్’ జగడం నడుస్తున్నది. ప్రొరోగ్ పూర్వాపరాల్లోకి వెళితే... ఈ ఏడాది జూన్ 21న అసెంబ్లీ, కౌన్సిల్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సుమారు ఐదు నెలలు దాటినా ఇంకా ప్రొరోగ్ చేయకుండా అలాగే ఎందుకు ఉంచారు? ఇప్పుడు ప్రొరోగ్ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఎందుకు పట్టుబడుతున్నారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉభయ సభలనూ ప్రొరోగ్ చేయాల్సిందిగా అక్టోబర్ 25న ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అసెంబ్లీ కార్యదర్శికి ఫైలు వచ్చినా స్పీకర్ ప్రొరోగ్ చేయలేదు. ప్రొరోగ్ చేస్తే మళ్లీ సమావేశాలు ప్రారంభించాలనుకుంటే రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించేందుకు తేదీని సూచిస్తూ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి నుంచి ఫైలు అసెంబ్లీకి చేరుకుంటుంది. ఆ ఫైలును అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ ముందు పెడతారు. స్పీకర్ సంతకం చేసిన తర్వాత ఫైలు మళ్లీ అదే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి నుంచి ముఖ్యమంత్రి వద్దకు చేరుకుంటుంది. ముఖ్యమంత్రి ఆ ఫైలుపై సంతకం చేసి రాజ్‌భవన్‌కు పంపిస్తారు. గవర్నర్ కార్యదర్శి ఆ ఫైలును గవర్నర్ ముందు పెడతారు. గవర్నర్ సంతకం చేసి అసెంబ్లీ కార్యదర్శికి పంపిస్తారు. దీంతో గవర్నర్ పేరిట అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇదే పద్ధతిలో ప్రొరోగ్ ఫైలు కూడా వెళుతుంది. అయితే సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత సాధారణంగా నెల లేదా నెలన్నర రోజుల పాటు ప్రభుత్వం ప్రొరోగ్ చేయకుండా అట్టే పెడుతుంది. దీని మర్మం ఏమిటంటే, ప్రభుత్వానికి మళ్లీ అత్యవసరంగా సమావేశాలను ప్రారంభించాలనుకుంటే వెంటనే స్పీకర్‌కు చెబుతుంది. ఈ మేరకు స్పీకర్ ‘బులిటెన్’ విడుదల చేస్తారు. అంతేకాకుండా సమావేశాల గురించి అసెంబ్లీ కార్యాలయం అధికారులు సభ్యులందరికీ ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేస్తారు. ప్రొరోగ్ కాకుండా ఉంటే అసెంబ్లీ ‘లైవ్’లో ఉన్నట్లు కాబట్టి గవర్నర్ వరకూ ఫైలు వెళ్ళదు, నోటిఫికేషన్ విడుదల చేసే అవసరం ఉండదు.
కాగా ఇప్పుడు ప్రొరోగ్ ఫైలుపై ఇంతగా దుమారం ఎందుకు చెలరేగుతుందంటే దీనికి అనేక రాజకీయ కారణాలు ముడిపడి ఉన్నాయి. జూన్ 21న ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత ఏ కారణం చేతనో రాష్ట్ర ప్రభుత్వం ప్రొరోగ్ ఫైలు గురించి ధ్యాస పెట్టలేదు. చివరకు గత నెల 25న ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పీకర్ వద్దకు చేరుకుంది. స్పీకర్ ఆ ఫైలుపై సంతకం చేయకుండా అలాగే పెండింగ్‌లో పెట్టేశారు. ఈ మధ్య కాలంలో దానిపై దృష్టి పడింది. ముఖ్యమంత్రిగా తాను ఉన్నంత కాలం రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకుంటానని చెబుతున్న కిరణ్‌కుమార్ రెడ్డి దీనిని అవకాశంగా తీసుకోవాలనుకుంటున్నారన్న ఊహగానాలు, చర్చ జరుగుతున్నది. రాజ్యాంగం ప్రకారం ఏదైనా చట్టసభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఆరు నెలలలోపు తప్పనిసరిగా సమావేశం కావాల్సి ఉంటుంది. అలా జరగకపోతే ఆ చట్ట సభ రద్దవుతుంది. దీంతో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. ఇప్పుడు అసెంబ్లీకి ఆ గడువు వచ్చే నెల 20వ తేదీతో ముగియనున్నది. ప్రొరోగ్ అయిన తర్వాత, ఎప్పుడు అసెంబ్లీని తిరిగి ప్రారంభించాలనుకున్నా మంత్రిమండలి నిర్ణయం తీసుకుని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫైలు పైన పేర్కొన్న విధంగా వివిధ దశల్లో తిరగాల్సి ఉంటుంది. కాబట్టి అసెంబ్లీని తిరిగి సమావేశపరచకపోతే అసెంబ్లీని రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా రద్దు చేయించి ‘హీరో’ కావాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుండగా, దీనికి స్పీకర్ అడ్డుపడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అధిష్ఠానానికి అనుకూలంగా వ్యవహారిస్తున్నారన్న విమర్శలను స్పీకర్ ఎదుర్కొంటున్నారు. ఈ విమర్శల నేపథ్యలో స్పీకర్ సంతకం చేసి పంపించినట్లు సమాచారం. అయితే ఫైలు రాలేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ్ధర్ బాబు చెబుతున్నారు. ఈ దశలో ప్రొరోగ్ చేయాల్సిన అవసరమే లేదంటున్నారు. మరోవైపు స్పీకర్ సంతకం తర్వాత రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీ్ధర్ బాబు వద్ద ఆగినట్లు తెలుస్తోంది. ప్రొరోగ్ చేయవద్దని ముఖ్యమంత్రిని, గవర్నర్‌ను కోరనున్నట్లు శ్రీ్ధర్ బాబు చెబుతున్నారు. ఈ అంశంపై రాజకీయ ప్రముఖుల అభిప్రాయాలే నేటి ఫోకస్.
రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ‘ప్రొరోగ్’ జగడం నడుస్తున్నది.
english title:
prorogh
Date:
Thursday, November 28, 2013