గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మోడలింగ్‌లో బిజీ బిజీ. యూ ట్యూబ్‌లో 8 లక్షలకు పైచిలుకు హిట్స్ - ఇదీ రితువర్మ కెరీర్ గ్రాఫ్. అనుకోకుండా మోడల్‌గా ఎదిగి.. ‘అనుకోకుండా’ అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా ఉత్తమ నటి అవార్డు అందుకొన్న ‘రితూ వర్మ’ని పలకరిస్తే.. ఎన్నో కబుర్లు. ఎనె్నన్నో ముచ్చట్లు. ‘అనుకోకుండా’ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించినప్పుడు ‘రితు’ని కలవరించని వారు లేరు. సినీ విమర్శకుల ప్రశంసలతోపాటు - ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్న ‘రితు’ మాంఛి టేస్ట్ ఉన్న నటి. హరివిల్లు క్రియేషన్స్‌లో పూరి జగన్నాథ్ శిష్యుడైన సత్య దర్శకత్వంలో ‘నారా కుమారుడు’ సినిమాతో తెరంగేట్రం చేసిన రితు- నవీన్ చంద్ర సరసన వజ్రాంగ్ నిర్మాతగా నిర్మిస్తున్న తాజా చిత్రంలో బబ్లీ గాళ్‌గా కనిపించనుంది. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా పవన్ సాదినేని దర్శకత్వంలో సురేష్‌బాబు సమర్పిస్తున్న ‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’ సినిమాలో మోడల్ గాళ్‌గా యూత్‌ని ఆకర్షించే పాత్రలో నటించింది. కెరీర్ పరంగా అవకాశాలు ఎదురుచూస్తున్నప్పటికీ.. అభిరుచి మేరకు చక్కటి కథాంశాలను మాత్రమే ఎంచుకుంటూ మున్ముందుకు దూసుకెళ్తున్న రితు చెప్పిన కొన్ని కబుర్లు.
‘అనుకోకుండా’ కెమెరా ముందుకొచ్చినప్పుడు -కాస్తంత బెరుకుగా అనిపించింది. కానీ మోడల్‌గా అప్పటికే కొన్ని ఫొటో షూట్స్ చేయటం వల్ల.. దర్శకుల సలహాలూ సూచనల్నిబట్టి ఏ విధంగా నటించాలో అర్థం చేసుకోవటం వల్ల త్వరగానే కెమెరాకి అడ్జస్ట్ అయిపోయా. ఇండస్ట్రీలో నాకిష్టమైన తారలు హేమమాలిని, శ్రీదేవి, మాధురీ దీక్షిత్. ‘నా రాకుమారుడు’ చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పుడు ఎంతో ఆనందించా. నేటి తరం అమ్మాయిల మనసుకు అద్దంపట్టే కేరెక్టర్ అది. ‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’లో కూడా ఆధునిక భావాలు కలిగిన యువతిగా చేస్తున్నా. ఇక లక్ష్యం అంటారా? తెలుగు అమ్మాయిల స్టార్ ఇమేజ్ సాధించి, మంచి నటిగా జాతీయ స్థాయి గుర్తింపు పొందాలని. ఎలాంటి పాత్రలు ఇష్టమంటే? రొటీన్‌గా కాకుండా విభిన్న తరహా పాత్రలేవైనా ఇష్టమే. నటనకు ప్రాధాన్యత ఉండాలి. కథాపరంగా నచ్చిన కథ అయి ఉండాలి- అంటోంది.
రిలీజ్ కాబోతున్న ‘నా రాకుమారుడు’ ‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’ సినిమాల్లో రితు నటనకు మంచి మార్కులే పడుతున్నాయన్న మాట వినిపిస్తోంది. చూద్దాం. త్వరలోనే విడుదలవుతున్న ఆయా చిత్రాల్లో ‘రితూ’ ఏ విధంగా అలరించనుందో?!
గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.
english title:
ritu verma
Date:
Friday, November 29, 2013