* ఖర్జూరం (బాగోలేదు)
తారాగణం:
రాజ్ విరాట్, గీతాపల్లవి
సుమన్, చంద్రమోహన్
తా. రమేష్, జూ.రేలంగి
పృథ్వీరాజ్, చిట్టిబాబు, లక్ష్మీప్రసన్న.
కథ, మాటలు: జి.కె.ఆర్.
సంగీతం: రామ్ నారాయణ్
నిర్మాత: జి.కె.ఆర్.
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
సతీష్‌కుమార్ ఎం.వి.
తలమీద ఓ కట్టెతో కొడితే ‘గతం’ మర్చిపోవడం, తిరిగి సినిమా ఆఖరున అలాంటిదే మరో కర్రతో కొడితే మర్చిపోయిన ‘గతం’తిరిగి రావడం కానె్సప్టుతో తెలుగులో ఇదివరలోనే అనేక చిత్రాలొచ్చాయి. ఆ బాపతు జాబితాకు మరో చేరిక ‘ఖర్జూరం’. అయితే వాటికి, దీనికీ ఉన్న తేడే, బిగువైన సన్నివేశాల పొందిక, నటీనటుల సమర్ధవంతమైన నటన. ఈ రెండూ లోపించడంతో ‘ఖర్జూరం’తీయదనం ఏమాత్రం ఆడియన్స్‌కు కలగలేదు. ‘‘తనని తండ్రి తప్ప మరెవరూ కొట్టకూడదు, తాను అభిమానించే స్నేహితులను సైతం ఎవరూ దండించకూడదు’’అన్న మనస్తత్వంలో పెరిగిన మల్లి (రాజ్‌విరాట్) పెరిగిపెద్దై ఆ వూరి ప్రెసిడెంట్ (సుమన్) కూతురు గౌరి (గీతాపల్లవి)ని ప్రేమిస్తాడు. ఆమే ప్రేమిస్తుంది. కానీ వీరిద్దరి స్థితిగతుల అంతరాలు ఆ ప్రేమ ముందుకు సాగడానికి ప్రతిబంధకమవుతుంది సహజంగానే. అది అడ్డుకోడానికి వెళ్లిన ప్రెసిడెంటు మనుషులు చేరుకునేలోగానే వారిద్దరికీ ప్రత్యర్ధైన మరో గూండా తలపై గాయపరచడంతో మల్లి గతాన్ని మరిచిపోతాడు. ఆ స్థాయిలో కాదుగానీ గౌరి కూడా అంతకుముందు జరిగినవి మర్చిపోతుంది. అనంతర వేదనలో, తిరిగి అదే ప్రత్యర్థి తలపై మోదడంతో మల్లికి తిరిగి పూర్వ నేపథ్యం గుర్తుకువస్తుంది. వారిద్దరి కలయికకూ ప్రెసిడెంటూ ఆమోదించడంతో కథ ముగుస్తుంది. అసలు ఇలా ‘‘తలపై బాదడంతో జ్ఞాపకశక్తిపోవడం, తిరిగి అదే ప్రక్రియవల్ల లోపం పూడిపోవడం’’లాంటి విషయాల్లో సహేతుకత ఎంత వుందో అన్నదాన్ని పక్కనపెడదాం. అసలు సినిమాకు ‘ఖర్జూరం’అన్న పేరుకన్నా పక్కన ఉపనామంగా ఇచ్చిన ‘ఇది మల్లిగాడి ప్రేమకథ’ అన్నదే సరిగ్గా సరిపోయింది. పోనీ అలా ఇచ్చిన ప్రధాన నామం ‘ఖర్జూరం’ అన్నదానికి సరియైన న్యాయాత్మకతా చిత్రంలో అంతగా చూపలేదు. ఇక ఇతర అంశాల గుణదోషాల విషయానికొస్తే... అసలు కథానాయకుడు ఏం చేస్తున్నాడు? ఎలా వుండబోతున్నాడు అన్నదానిపై స్పష్టత లేదు. ‘‘ప్రేమ’’అన్నది సినిమాకు కేంద్ర బృందమైనా, అలా ప్రేమిస్తున్నా వాడు ప్రధానంగా ఏదోఒకటి చెయ్యాలిగదా? అదేం లేదు. ఇందులో మల్లిగాడు ఉదయం లేచినప్పటినుంచీ పొలంగట్లపై ఫ్రెండ్స్‌తో తిరగడం, మద్యపానం చేయడం లాంటివే చేస్తాడు. ఇలాంటి స్వభావానికి ‘‘లవ్’’ ఎపిసోడ్ తదితరాలుపెట్టి అవి ప్రేక్షకుల హృదయాల్లో బలంగా నమోదుకావాలి అనుకోడం ఎలా కుదిరేపనో చిత్ర దర్శకుడే చెప్పాలి. అలాగే, కథానాయికకీ, అలా బలమైన ప్రేమలో పడిపోడానికి, లేదా నాయకుని పట్ల ఆకర్షితురాలు కాడానికీ అనువైన నేపధ్యం చూపలేదు. ఇక చిత్రానికి కీలకంగా పెట్టిన ప్రతి నాయకుని ప్రధాన వ్యాపకం కేవలం అమ్మాయిలను రేప్ చేయడమే అన్నట్లు మూడు అలాంటి ప్రయత్న ఘట్టాలు చూపారు. అలా చూపినవీ చాలా వివరణాత్మకంగా.
ఇందులోనే దర్శకుని అభిరుచి తెలిసిపోతోంది. అభిరుచి మాట ప్రస్థావనకొచ్చింది కాబట్టి ఇక్కడో చిన్న ఉదాహరణ. సినిమాలో హాస్యంకోసం అనుకుంటా..! తాగుబోతు రమేష్ పాత్రపై మూత్రవిసర్జన సన్నివేశం, వాదాలూ పెట్టారు. ఇంతకంటే హాస్యానికి అంశమే దొరకలేదా? నాయిక పాత్రధారి ఇప్పటి ట్రెండ్‌కవసరమైన మొహంలో మొరటుతనం వగైరా బానే వున్నా సంభాషణోచ్ఛారణ, భావప్రకటన విషయంలో ఇంకా చాలా అభ్యాసం చేయాలి. ఇదే వ్యాఖ్య కాస్త అటూ ఇటూగా నాయిక పాత్ర ధోరణి గీతాపల్లవికీ వర్తిస్తుంది. హీరో తండ్రి పాత్రధారి చంద్రమోహన్ గొంతు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలాచోట్ల స్వరంలో జీర ఎక్కువైంది. సుమన్ గొంతుకకు డబ్బింగ్ లేకుండా తన స్వరమే ఇందులో ఉపయోగించడం విశేషం. ‘‘నచ్చావే, నినుమెచ్చేలే’’ పాట కొరియోగ్రఫీ బావుంది. చిత్రీకరణపరంగా ‘‘నీతోపాటే నే వస్తున్నా నువ్‌లేకున్నా..’’ బాగుంది. రామ్‌నారాయణ్ అందించిన బాణీలపరంగా ‘‘కాలమా..కాలమా కన్నీటి కథలు నీకిష్టమా...’’ ఆకట్టుకునే రీతిలో ఉంది. కానీ ‘‘కల్లుతాగే కళ్లు తుడిచేయాలి అన్న పదప్రయోగం (పనీపాట లేక.. అన్న పాటలో) చాలా వికృతంగా ఉంది. సినిమాలో ఓ చిన్న పాట...ఎవ్వరురా, ఎవ్వరురా... ఈ కథ రాసినది... అన్న వాక్యాలతో వస్తుంది. పిక్చరంతా చూసిన తర్వాత ప్రేక్షకుడికీ ‘ఎవ్వరురా...ఈ సినిమా తీసినదీ’ అన్న భావనా కలగడం కొసమెరుపు.