* అనగనగ... (బాగోలేదు)
తారాగణం:
శ్రీరాజ్, సాయిరాజ్
ప్రశాంతి, రవిబాబు
‘చిత్రం’ శీను, శ్రావణి, తదితరులు
సంగీతం: రవి వర్మ
సినిమాటోగ్రఫీ: శ్రీ వంశీ
నిర్మాతలు: ఆచంట ఎన్‌విఎస్
వెంకట్‌రాజ్
దర్శకత్వం: శ్రీరాజ్ భల్లా
మినిమమ్ గ్యారంటీ సబ్జెక్ట్ కావటంవల్ల- దెయ్యాలతో సిత్రాలు సేయాలనుకోవటం సహజం. కొన్ని దశాబ్దాలుగా ఎన్ని సినిమాలు చూళ్లేదు. ఏ ఆత్మకి ‘వెరైటీ’ ఉంటుందో? దాన్ని కొన్నాళ్లు చూస్తారు. ఆ తర్వాత్తర్వాత ప్రేక్షకులే అనేకానేక మలుపుల్తో కథలు చెప్పటం ఆరంభిస్తారు. సగటు ప్రేక్షకుడే ఇన్ని ఆలోచిస్తే - వెరైటీ కోసం తాపత్రయపడే కథకుడు ఎంత ఆలోచించాలి? ‘ఆత్మ’ అంటే ఇదే రూట్‌లో నడవాలన్న రూలేమైనా ఉందా? ఓ గెస్ట్‌హౌస్. ఓ హత్య? దాని చుట్టూ అల్లుకున్న కథ? ఆత్మ చుట్టూ ఆవరించిన చీకటిలా.
అసలు కథేంటో? శ్రీ (శ్రీరాజ్) ఒక అనాధ. ఆస్తిపాస్తులకేం లోటు లేదు. కొండవీటి చాంతాడంత లిస్ట్. కానీ ‘శ్రీ’ని ఓ ఆలోచన పట్టి పీడిస్తూంటుంది. రాత్రిళ్లు ఉలిక్కి పడుతూంటాడు. అనుక్షణం భయంతో గడుపుతూంటాడు. ఆఖరికి ఇంట్లో పనివాళ్లు కూడా అతణ్ణి అంతగా పట్టించుకోరు. ఆఫీస్‌లో ‘శ్రీ’ని అంటిపెట్టుకొని ఉండే స్నేహితుడు. అప్పుడప్పుడూ పలకరించి వెళ్లే ప్రియురాలు అంజలి (ప్రశాంతి). అదీ అతడి జీవితం. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు ఉండే శ్రీని ఆ భయానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు ఫ్రెండ్. శ్రీ తండ్రికి ఇద్దరు భార్యలు. ఆస్తిని రెండో భార్యకీ ఆమె కొడుక్కీ కట్టబెట్టడం ఇష్టంలేని మొదటి భార్య.. తన భర్తతో గొడవ పడుతుంది. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఆమె మరణిస్తుంది. ఇది చూసి తట్టుకోలేని ‘శ్రీ’ తన తండ్రిని మెట్ల మీంచి తోసేయటంతో.. తండ్రి మరణిస్తాడు. అలా చిన్నతనంలోనే రెండు హత్యలు చేయటం.. ఆ భయం అతణ్ణి వెంటాడటంతో, అతడి మానసిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కొన్నాళ్లకి - తన పిన్నినీ.. ఆమె కొడుకునీ చేరదీయాలని నిశ్చయించుకుని.. వాళ్లని వెతకటానికి మనుషుల్ని పురమాయిస్తాడు. అక్కడ పిన్ని కొడుకు వెంకట్ (సాయిరాజ్)- ఊళ్లో కనిపించిన వాళ్ల దగ్గర కనిపించినట్టు అప్పులు చేస్తూ బతికేస్తూంటాడు. మొత్తానికి అతగాణ్ణి పట్టుకొని శ్రీ దగ్గరికి చేరుస్తారు. అన్న సంరక్షణలో కాలాన్ని వెళ్లబుచ్చుతూ ఆస్తిని చేజిక్కించుకోవాలన్న వెంకట్ ప్లాన్‌లోకి అతడి గర్ల్‌ఫ్రెండ్ ఎంటరవుతుంది.
శ్రీ తన తమ్ముడి కోసం ఖరీదైన గెస్ట్‌హౌస్ కొంటాడు. ఆ గెస్ట్‌హౌస్‌లో ఏం జరిగింది? శ్రీ భయపడటానికి కారణం ఏమిటి? స్పెషల్ ఆఫీసర్ రవిబాబు గెస్ట్‌హౌస్ మిస్టరీని ఛేదించాడా? ఇత్యాది అంశాలతో సెకండ్ హాఫ్ ప్లస్ క్లైమాక్స్.
కథలో ఎటువంటి ట్విస్ట్ ఉండదు. యధాలాపంగా జరిగిపోతూంటాయి సన్నివేశాలు. భయపెట్టే అంశాలూ లేవు. ఏదో ఉందని భీతిగొల్పే సన్నివేశాలను కూడా సృష్టించలేదు. ఏ కేరెక్టర్‌నీ సరిగ్గా తీర్చిదిద్దే ప్రయత్నం జరగలేదు. అంజలి ఉందీ అంటే ఉన్నట్టు. అంతే. చిత్రీకరణ కూడా అంతంత మాత్రమే. ఇన్ని ప్రహసనాలకు తోడు సంగీతం రొటీన్. ఫొటోగ్రఫీ సాదా సీదాగా ఉంది.
శ్రీరాజ్ భల్లా ఇటు దర్శకత్వాన్నీ.. అటు నటననీ చక్కగా మేనేజ్ చేశాడు కానీ.. నటనలో అంత పరిణితి కనిపించలేదు. స్టెప్స్ బాగానే వేశాడు. రొమాంటిక్ సీన్లలోనూ ఎక్స్‌ప్రెషన్స్ పలకలేదు. శ్రీ తమ్ముడిగా నటించిన సాయిరాజ్ తనదైన స్టైల్‌లో నటించాడు. అతడి నటనలో ఈజీనెస్ బాగుంది. అంజలిగా ప్రశాంతి.. తమ్ముడి గర్ల్‌ఫ్రెండ్‌గా శ్రావణి కొంతవరకూ ఫర్వాలేదు.
* అనగనగ... (బాగోలేదు)
english title:
anaganagaa..
Date:
Friday, November 29, 2013